నిన్న… నేడు… రేపు…

0
3

[dropcap]హై[/dropcap]దరాబాదులో ఏదో పని ఉందని మా బంధువులబ్బాయి మా ఇంటికి వచ్చాడు. పలకరింపులయ్యాకా, స్నానానికి వెళ్ళాడు. ఈ లోపు అతని ఫోన్ మ్రోగసాగింది. “సమయం లేదు మిత్రమా… శరణమా రణమా” అన్న డైలాగ్ రింగ్ టోన్‌గా వినిపిస్తోంది.

ఈలోగా, “టైమ్ అయిపోతోంది నాన్నా” అంటూ స్కూలుకి దింపమని పిల్లలు గొడవ!

పిల్లల్ని దింపి వచ్చేసరికి అతను టిఫిన్ తింటున్నాడు. మళ్ళీ ఫోన్ మ్రోగింది. అదే డైలాగ్ వినిపిస్తోంది. అతను నెంబరు చూసుకుని, కాల్ కట్ చేశాడు. టిఫిన్ తిని, కాఫీ తాగి “వెళ్ళొస్తాను, సాయంత్రం కలుస్తాను” అని చెప్పి బయటకి నడిచాడు.

అతను వెళ్ళి పావుగంట అయినా ఆ డైలాగ్‌‍లోని ‘సమయం లేదు’ అన్న మాటలే మనసులో పరిభ్రమిస్తున్నాయి.

సమయం! కాలం! టైమ్! వక్త్! జమానా! ఇలా ఏ భాషలో పలికినా కాలమనేది కంటికి కనబడకుండా మన జీవితాలని ప్రభావితం చేస్తుంది. అదేంటి గడియారం కనిపిస్తుందిగా అని కొంతమంది అడగవచ్చు. గడియారం కాలాన్ని సూచిస్తుందే గాని స్వయంగా కాలం కాదు!

కాలం భౌతికవాదులకీ, ఆధ్యాత్మికవాదులకీ ముఖ్యమైనదే.

కాలం ఒక ప్రమాణం. కాలాన్ని భౌతిక శాస్త్రవేత్తలు నాల్గవ డైమెన్షన్‌గా పరిగణిస్తారు. కాలం అనంతం, మన సౌలభ్యం కోసం గతం, వర్తమానం భవిష్యత్తుగా విభజించుకున్నాం అంటారు వేదాంతులు.

కాలం విలువైనది, గడచిన కాలం తిరిగిరాదు, కాబట్టి కాలం విలువ తెలుసుకుని మసలుకోవాలని అంటారు మరికొందరు.

విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు – ఎవరికైనా సమయం చాలా కీలకం. ఏమీ లేనివాడి దగ్గర కూడా బోలెడు సమయం ఉంటుందని విజ్ఞులు చెబుతారు.

ఏ పనైనా సరైన సమయంలో చేయాలని కొందరంటే, ఆలస్యం అమృతం విషమని మరికొందరంటారు.

నాకు టైమ్ లేదు అని కొందరంటే – ఎవరికీ టైమ్ ఉండదు, సమయం కల్పించుకోవాలి అని ఇంకొందరు అంటారు.

నా ఆలోచనల్లో నేనుండగా మా ఆవిడ ఎఫ్.ఎమ్. ఆన్ చేసింది.

“ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నంద నందనా” అనే పాట వినబడింది.

కాలానికి మంచి చెడూ ఉండవు.. కాలం ఒక సాక్షి మాత్రమే అంటారు ఆధ్యాత్మికవాదులు.

సరే, నాలాంటి సామాన్యులు మాత్రం కష్టాలు కలకాలం ఉండవు, మంచి రోజులొస్తాయి అని ఊరట చెందుతారు.

ఆ పాట వింటుంటే నాకు మరో పాట మనసులో మెదిలింది. ‘స్టేషన్ మాస్టర్’ సినిమాలోని “పరుగులు తీసే వయసుంటే” అనే పాటలో “ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం…. డెఫినెట్లీ… దూసుకుపోయే ధైర్యం ఉంటే… ఓడక తప్పదు కాలం” అని సిరివెన్నెల రాశారు. సంగీతం చక్రవర్తి సమకూర్చగా, బాలు, సుశీల పాడారు.

కష్టాల్లో ఉన్నప్పుడు కాలం తొందరగా గడిచిపోవాలని, సుఖాలలో ఉన్నప్పుడు కాలం నిలిచిపోతే బాగుండునని చాలామంది భావిస్తారు. కష్టమైనా సుఖమైనా ఏదీ ఎల్లకాలమూ ఉండదు. “And this, too, shall pass away” అన్న నానుడి అందరికీ తెలిసిందే.

‘రంగుల రాట్నం’ సినిమాలోని “కలిమి నిలవదు లేమి మిగలదు కలకాలం ఒక రీతి గడవదు” అన్న పాటలో “ఎవరు కులికినా ఎవరు కుమిలినా ఆగదు కాలం ఆగదు” అని భుజంగరాయ శర్మ గొప్పగా రాశారు (గానం: ఘంటసాల బృందం, సంగీతం ఎస్. రాజేశ్వరరావు, బి. గోపాలం).

“యే వక్త్ నా ఠహరా హై… యే వక్త నా ఠహరేగా… యూంహీ గుజర్ జాయేగా ఘబరానా కైసా” అనే ఓ మోటివేషనల్ సాంగ్ స్కూల్లో ఎన్.సి.సి. ఉన్నప్పుడు వినేవాళ్ళం. ఎంత మంచి భావమో!

‘కేరింత’ సినిమా టైటిల్ సాంగ్ “రైట్ నౌ మొదలైంది మా కథ”లో “కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు, తనతో పయనం ఒకటేలాగా ఉండదు… ఓ యా ఓ ఓ… ఏ నిమిషంలో ఏమౌవుతుందో ఊహకే అందదు” అని రామజోగయ్య శాస్త్రి రాశారు. మిక్కీ జే మేయర్ సంగీతం కూర్చగా, హరిచరణ్ పాడారీ పాటని.

కాలం ఆగిపోతే బాగుండు అనుకునేవారికి సమాధానం – ‘ప్రేమాభిషేకం’ సినిమాలో దాసరి రచించిన “ఆగదు ఏ నిమిషం నీ కోసము ఆగితే ముందుకు సాగదు ఈ లోకము” అనే పాట. ఇది ఎవర్‌గ్రీన్ హిట్. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.

కాలం ఎవరికోసమూ ఆగదని తెలిసినా, “కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా… జరిగే వేడుకా కళ్లార చూడవమ్మా” అంటారు గీత రచయిత సాయి శ్రీ హర్ష. ‘పెదరాయుడు’ సినిమాలోని ఈ గీతాన్ని ఏసుదాస్ మరియు కె.ఎస్.చిత్ర పాడారు. సంగీతం కోటి అందించారు.

***

జీవితం సుఖంగా గడవాలంటే వర్తమానంలో జీవించడం చాలా ముఖ్యం. గతం గడిచిపోయినది, భవిష్యత్తు ఇంకా రానిది. మనకి ఉన్నది వర్తమానమే.

‘వక్త్’ అనే సినిమాలో “ఆగే భీ జానే నా తూ, పీఛే భీ జానే నా తూ” అనే పాట ఈ విషయాన్నే చెబుతుంది. “ముందు ఏముందో నీకు తెలియదు, వెనుక ఏముందో నీకు తెలియదు. ఏమున్నా ఉంటే, అది ఈ క్షణమే, దాని ఒడిసిపట్టు” అంటారు ఈ పాటలో గీత రచయిత సాహిర్ లూథియాన్వీ. ఈ పాటకి రవి సంగీతం అందించగా ఆశాభోంస్లే పాడారు.

‘భోలా భాలా’ అనే సినిమాలో ఒక చక్కని పాట ఉంది. “కల్ తక్ మైఁ అకేలా థా… ఆజ్ జమానా సాథ్ హై… వక్త వక్త్ కీ బాత్ హై సమఝేనా…” అని ఈ పాటని ఆనంద్ బక్షీ రాశారు. ఆర్.డి.బర్మన్ సంగీతంలో కిషోర్ కుమార్ పాడారు. “నిన్నటి దాకా నేను ఒంటరిని, ఇప్పుడు కాలం నా తోడుగా ఉంది” అంటున్నారు గీతరచయిత! అద్భుతమైన భావన!

***

రేపనేది ఎలా ఉంటుందో తెలియదు… అందుకని అన్నీ నేడే ఆస్వాదించాలని కొందరనుకుంటారు. ‘పాండురంగ మహత్యం’ సినిమాలో కథానాయకుని మైకంలో ముంచే సన్నివేశంలో “ఆనందమూ… ఓ ఆనందమిదేనోయి సఖా” అనే పాటలో “ఉన్నది నేడు… మరి రేపనుమానం” అంటూ ఆనందాన్ని నేడే అనుభవించమంటుంది నర్తకి. సముద్రాల జూనియర్ రాసిన ఈ పాటకి టివిరాజు సంగీతం, గానం పి.సుశీల.

కొందరు తమ పనులని రేపు చేయచ్చులే అని వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదాలు వేయడం వల్ల తమ లక్ష్యానికి దూరంగా వెళ్ళిపోతారని అంటారు చంద్రబోస్ ‘చూడాలని ఉంది’ సినిమాలో. “ఓ మారియ… ఓ మారియ… ఓ మారియ… ఓ మారియ/రేపన్నది మాపన్నది పనికిరాదులే… ఓ మారియ/ప్రతీరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా/చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు/అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు..” అంటారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్ పాడారీ పాటని.

శ్రమించి విజేతగా నిలిస్తే “నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది” అంటారు సిరివెన్నెల ‘వేదం’ సినిమా కోసం రాసిన “పద పద పద” అనే పాటలో. “నీతో నువ్వే కలహిస్తూ నిత్యం నిన్ను నువ్వే గెలిపిస్తూ/సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు” అంటారు. లక్ష్యం దిశగా సాగమని ప్రోత్సహించే ఈ పాటని బెన్నీ దయాళ్, దీపు, గీతామాధురి పాడారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి.

“హర్ ఘడీ బదల్ రహా హై రూప్ జిందగీ/ఛాఁవ్ హై కహీ హై ధూప్ జిందగీ/హర్ పల్ యహాఁ జీ భర్ జియో/ జో హై సమా/కల్ హో నా హో” అంటూ ఒక అద్భుతమైన గీతం రాశారు జావేద్ అఖ్తర్ ‘కల్ హో నా హో’ సినిమా కోసం. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించగా సోనూ నిగమ్ పాడారు. “ప్రతి క్షణం జీవితం దాని స్వరూపాన్ని మార్చుకుంటుంది. కొన్నిసార్లు నీడ, కొన్నిసార్లు ఎండ! ఇక్కడ ప్రతి క్షణం, మనసుకు అనుగుణంగా జీవించు. రేపు అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు” అంటారు.

***

ప్రేయసీప్రియులకీ, కొత్త దంపతులకి కాలం తెలియదు. తోటి వారి సమక్షంలో ఆ క్షణం అలా స్తంభించిపోతే బాగుండు అనుకుంటారు.

“కాలం ఇంత సుదీర్ఘమని తెలియదు నీ కోసం నిరీక్షిస్తుంటే తప్ప” – అన్నారు డా. సినారె ‘మార్పు నా తీర్పు’లో.

“నిన్న మొన్న నీదే ధ్యానం/నేడు రేపు నీదే గానం” అంటారు ప్రియుడు ‘చూపులు కలసిన శుభవేళ’ సినిమాలోని పాటలో. రాజన్ నాగేంద్ర సంగీతం. గానం బాలసుబ్రహ్మణ్యం, జానకి.

“ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను” అని పాడుతుంది ప్రేయసి ‘గులాబి’ సినిమాలో. సిరివెన్నల గీతానికి శశిప్రీతమ్ సంగీతం. గానం సునీత. అప్పట్లో ఒక ఊపు ఊపిన పాట ఇది.

“నిలువదు నిమిషం… నువు ఎదురుంటే/కదలదు సమయం… కనబడకుంటే/నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా/కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా/పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా…” అంటాడు ప్రియుడు ‘శుభాకాంక్షలు’ సినిమాలో “గుండె నిండా గుడి గంటలు” అనే పాటలో. సాహిత్యం సిరివెన్నెల. సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్.

‘లగేరహో మున్నాభాయ్’ సినిమాలో “పల్ పల్ పల్ పల్ హర్ పల్ హర్ పల్ కైసే కటేగా హర్ పల్” అనే పాటలో “ఈ క్షణం ఎలా కరుగుతుంది? నా హృదయంలో అలజడి ఉంటే ఈ క్షణం ఎలా గడుస్తుంది? సఖా, రాత్రి గడిచిపోకుడదనీ, తెల్లవారకూడని అంటాను. జీవితమంతా ఈ క్షణంలోనే స్తంభించిపోతే బాగుండు! రాత్రి గడవకూడదు, వేకువ రాకూడదు” అనుకుంటుంది ప్రియురాలు. స్వానంద్ కిర్కిరే రాసిన ఈ గీతానికి శంతను మోయిత్రా సంగీతం సమకూర్చగా సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్ పాడారు.

‘వినాయకుడు’ సినిమాలో “సరదాగా ఈ సమయం చేసేనా మనతో పయనం/నీ జతలో ఈ నిశిలో నా అడుగే ఏ దిశలో/తెలిసేన చివరికైనా చెలిమేదో చేరువౌనా” అనే పాటలో పాట కాలాన్ని కూడా తమతో నడమంటారు ప్రేమికులు. వనమాలి రచించిన ఈ పాటని ఉన్నికృష్ణన్, చిత్ర పాడారు. శామ్ ప్రసన్ సంగీతం సమకూర్చారు.

‘సమ్మోహనం’ సినిమాలో “ఊహలు ఊరేగే గాలంతా/ఇది తారలు దిగివచ్చే వేళంటా” అనే పాటలో “ఈ సమయానికి తగుమాటలు ఏమిటో/ఎవ్వరినడగాలట/” అనుకుంటారు ప్రేమికులు. “చాలా పద్దతిగా భావం తెలిసి/ఏదో అనడం కంటే/సాగే కబుర్లతో కాలం మరిచి/సరదా పడదామంతే” అని నిర్ణయించుకుంటారు.  సిరివెన్నెల గీతాన్ని హరిచరణ్, కీర్తన ఆలపించారు. సంగీతం వివేక్ సాగర్ అందించారు.

ప్రేమ విఫలమైన ఓ ప్రియురాలు “వక్త్ నే కియా సితమ్/తుమ్ రహె నా తుమ్, హమ్ నా రహె హమ్” అని పాడుతుంది ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో. “కాలం గొప్ప అన్యాయం చేసింది/ నువ్వు నువ్వు కాదు, నేను నేను కాదు/కాలం గొప్ప అన్యాయం చేసింది” అంటూ “మనం దారి తెలియకుండానే ముందుకెళుతున్నాం, మనకేం కావాలో తెలియకుండానే వెతుకున్నాం” అంటుందామె. కైఫీ అజ్మీ రాసిన ఈ గీతాన్ని గీతాదత్ పాడారు. ఎస్.డి.బర్మన్ సంగీతం అందించారు.

‘అంతరిక్షం 9000 kmph’ సినిమాలో “సమయమా/అదేమిటంత తోందరేంటి ఆగుమా/సమయమా/మరింత హాయి పోగుజేయనీయుమా” అని పాడుకుంటారు ప్రేమికులు. అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ గీతాన్ని హరిణి, యాజిన్ నిజార్ పాడారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు.

‘శీరీ ఫర్హాద్’ అనే సినిమాలో “గుజరా హువా జమానా, ఆతా నహీ దొబారా” అనే పాటని లతా మంగేష్కర్ పాడారు. ఎస్.మొహిందర్ సంగీతం అందించిన ఈ పాటని తావిర్ నక్వీ రాశారు. “గడచిపోయిన కాలం ఎన్నడూ తిరిగిరాదు, ఇది శాశ్వత వీడ్కోలు! ఆనందం ఉన్నది కొద్ది రోజులు మాత్రమే, కన్నీళ్లు జీవితాంతం! ఒంటరిగా ఉండి, మనం కలిసి గడిపిన సమయం తలచుకుంటూ ఏడుస్తున్నాను” అంటుంది ప్రియురాలు.

***

బంధాలు సడలి, జీవితంలో నా అనుకున్నవాళ్ళు దూరమైనప్పుడు కథానాయకుడు కాలాన్ని నిందిస్తూ “ఓ… కాలమా ఇది నీ జాలమా” అని ప్రశ్నిస్తాడు హిట్లర్ సినిమాలో “ఎందరిని ఏ దరికి చేర్చినా/సంద్రాన ఒంటరిగా మిగలదా నావా” అనే పాటలో. జేసుదాస్ గళంలోని ఆర్ద్రత ఈ పాటని ఓ క్లాసిక్‌గా మార్చింది. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల.

***

ఇలా ఎన్నో పాటలు సమయాన్ని మరిపిస్తాయి. మనసుని మురిపిస్తాయి.

ఒక్కోసారి గతంలో చేసిన తప్పిదాలకు వర్తమానంలో బాధపడతాం.

“జిందగీ ఇతనా లంబీ భీ నహీ హై జితనా హమ్ సోచ్‍తే హైఁ. సాల్ గుజర్ జానే కే బాద్ పతా చల్తా కిత్నా ఖోయా హై, కిత్నా కుఛ్ పా సక్తే థే…” అంటారు నానా పటేకర్ ‘దస్ కహానియాఁ’ సినిమాలో. “జీవితం మనం అనుకున్నంత సుదీర్ఘం కాదు. ఏళ్ళు గడిచేసరికి తెలుస్తుంది… మనం ఏం పోగొట్టుకున్నామో… ఏం పొంది ఉండి ఉండచ్చో…” అని అర్థం. ఎంత వాస్తవం కదా!

అందుకే కాలానికి విలువివ్వాలి, మనుషులని గౌరవించాలి. అప్పుడే ‘కాలం నిలిచిపోతే బాగుండు’ లేదా ‘త్వరగా గడిచిపోతే బాగుండు’ అని కాకుండా వర్తమానాన్ని ఆస్వాదించగలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here