తిరుమలేశుని సన్నిధిలో… -22

0
4

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

[dropcap]వై[/dropcap]ష్ణవ సంప్రదాయంలో పన్నిద్దరు ఆళ్వారులున్నారు. అందులో ఆలయాన్ని కూడా ఒక ఆళ్వార్‌గా భావిస్తారు. దానినే కోయిల్ ఆళ్వార్ అంటారు.

కోయిల్ అంటే కోవెల – ఆలయం. ఆలయంలో నిత్యపూజాదికాలు నిరంతరం జరుగుతాయి. భక్తుల రాకపోకలతో ఆలయంలో అపరిశుభ్రత కలిగే అవకాశం హెచ్చు. అలాంటి ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంలో ఏడాదిలో కనీసం నాలుగుసార్లు ఈ అభిషేక కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పేర నిర్వహిస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా 1978-81 మధ్య కాలంలో వ్యవహరించిన శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ తమ గ్రంథం ‘తిరుమల చరితామృతం’లో ఈ తిరుమంజన సేవ ప్రారంభ వివరాలు ఉటంకించారు:

“కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని 19 అక్టోబరు 1544లో అంటే 475 సంవత్సరాల క్రితం మొదటిసారి జరిపించినట్లు శాసనం ఉంది. వంగీపురం నారాయణ శెట్టి అనే తిరుపతి వర్తకుడు బ్రహ్మోత్సవానికి ముందు – తన ఖర్చుతో గర్బాలయం, శయనమండపం, స్నపన మండపం, మొత్తం గోడలు, కప్పుతో సహా గోకించి, శుభ్రం చేసి కడిగించి – దాని పై గంధం, కర్పూరం ముద్దలు గోడలకు పూశాడు. దీని వలన ఆలయం లోపల గాలి పరిశుభ్రంగా, క్రిమికీటకాలు రాకుండా ఉండి శుభ్రతకు సానుకూలమవుతుంది.”

ఈ తిరుమంజనం ఇప్పుడు కూడా ఈ గర్భాలయ శుద్ధి మంగళస్నానం అనే అర్థంలో జరుగుతోంది. పూర్వకాలంలో ఇది చాలా పెద్ద ఎత్తున జరిగేది. క్రీ.శ.1535 నాటికి ఏటా తిరుమలలో పది బ్రహ్మోత్సవాలు జరిగేవి. ప్రతి బ్రహ్మోత్సవానికి  ముందు ఈ తిరుమంజనాలు జరిగినట్లు శాసనాలు చెబుతాయి. 1535లో వడ తిరువేంకట అయ్యన్ అనే భక్తుడు విరాళమిచ్చాడు. నారాయణ శెట్టి స్వామివారికి పాలు, తేనె, పెరుగు, నెయ్యి, 100 అరటిపండ్లతో కలిపి పంచామృతం చేయడానికి విరాళాలు అందించాడు. తిరుమంజనం తర్వాత 51 ఇడ్లీ పడి నివేదన చేసేవారు.

ప్రస్తుతం ఈ సేవను ఆర్జిత సేవగా రూపొందించారు. భక్తులు పాల్గొనవచ్చు. ఇది మంగళవారం నాడు నిర్వహిస్తారు. మంగళవారం నాడు తమిళనాడు ప్రాంతం నుండి భక్తులు తరలిరారు. జనసమ్మర్దం తక్కువ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పండుగలకు ముందు వచ్చే మంగళవారం ఇది జరుపుతారు. ఆ రోజు యథావిధిగా సుప్రభాతం, విశ్వరూప సందర్శనం, తోమాలసేవ, కొలువు, అర్చన, మొదటి గంట నైవేద్యం, శాత్తుమొఱ – అదే వరుసలో పూర్తి చేస్తారు.

ఎలా చేస్తారు?

ఇదొక పెద్ద ప్రశ్న.

ఆనందనిలయంలోని మూలవిరాట్టు మీద శిరస్సు నుండి పాదాల వరకు పెద్ద వస్త్రాన్ని కప్పివేస్తారు. విగ్రహంపై దుమ్ము పడకుండా ఈ జాగ్రత్త తీసుకొంటారు. ఇలా వేసే వస్త్రాన్ని ‘మలై గుడారం’ అంటారని శ్రీనివాస వైభవ గ్రంథంలో మిత్రులు జూలకంటి బాలసుబ్రహ్మణ్యం వివరించారు. అక్కడికి సమీపంలో వున్న ఉత్సవ విగ్రహాలు, సాలగ్రామాలను అర్చక స్వాములు బంగారు వాకిటి ముందున్న గంటా మండపం వద్దకు మోసుకొస్తారు. భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం మాత్రం  గుడారం లోపలే వుంచుతారు. దీనిని బయటకు తీసుకురాకూడదు. ఒక్కొక్కసారి ఉగాది ఉత్సవ సందర్భంలో దానిని బయటకు తెచ్చినప్పుదు మూలమూర్తితో బంగారు తీగతో లేదా పట్టు దారంతో అనుసంధానం చేస్తారు.

గంటా మండపంలోకి చేర్చిన విగ్రహాల చుట్టూ తెరకట్టి ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఆలయం లోపల వాడే దీపాలు, గంగాళాలు, గిన్నెలు, పీఠాలు, సహస్రకలశాభిషేకానికి వాడే చెంబులు, స్వామివారి వాహనాలు, తిరుచ్చులు – అన్నింటినీ శుభ్రపరుస్తారు. అదొక వేడుక. అదొక మహత్తర సంప్రదాయం. సంక్రాంతికీ, దీపావళికీ ముందు గృహస్థులు ఇళ్ళల్లో బూజులు దులిపి, సున్నాలు కొట్టి, క్రిమికీటకాదులను తొలగించే బృహత్తర కార్యక్రమం చేపడుతారు కదా. మరి లక్షలాది మంది భక్తుల తొక్కిడితో కిక్కిరిసిన ఆలయాన్ని పరిశుద్ధం చేయడానికి ఇలాంటి తిరుమంజనం అవసరం. అందుకే సంవత్సరానికి నాలుగుసార్లు చేపడతారు.

ఆలయ సిబ్బంది ఉత్సాహం:

ఈ తిరుమంజన కార్యక్రమాన్ని రాములవారి మేడలో వుండే అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమ దంగదాదుల విగ్రహాలకు కూడా ఏకాంతంలో చేస్తారు. ఆలయం మొత్తం శుద్ధి చేయడమే దీని లక్ష్యం. అందుకే ఆనంద నిలయం నిత్యం స్వామి కటాక్ష వీక్షణ సుగంధాలతో పరిమళ భరితం అవుతుంది. విగ్రహాలను అభిషేకానంతరం శుభ్రంగా తుడిచి పట్టువస్త్రాలు అలంకరింపజేస్తారు.

గర్భాలయం లోపల అర్చకులు, పరిచారకులు, ఏకాంగులకు మాత్రమే ప్రవేశం గాన వారే ఈ విధులు పూర్తి జేస్తారు. కులశేఖర పడి (తొలి గడప) నుండి దేవస్థానం సిబ్బంది ఆనందోత్సాహాలతో భక్తియుతంగా శుభ్రం చేస్తారు. గర్భాలయం లోపల గోడలకు, పై కప్పులకు అంటుకున్న ధూళి, బూజును, కర్పూరం వెలిగించడం వల్ల కలిగిన మసిని అర్చకాదులు గోకుతారు. శీకాయ నీళ్ళతో రుద్ది కడుగుతారు.

గర్భాలయం వెలుపలి కార్యక్రమాన్ని సిబ్బంది మొదలెడతారు. శీకాయ, వాషింగ్ సోడా కలిపిన వేడి నీళ్ళతో రబ్బరు ట్యూబులు పిచికారీ చేస్తుండగా కడిగి పరిశుభ్రం చేస్తారు. ఇదొక సంతోష వాతావరణంలో జరుగుతుంది. కార్యనిర్వహణాధికారి మొదలు చిన్న ఉద్యోగి వరకు ఒంటినిండా సుగంధ ద్రవ్యాలు నిండగా ఆనందోత్సాహంతో తిరుగుతారు. స్వామి సేవలో ఇదొక భాగ్యం.

ఇతర ఆలయాలు:

కేవలం ఆనంద నిలయంలోనే కాదు, ఆలయం లోపల వున్న వరదరాజస్వామి ఆలయం, వకుళమాత మందిరం, రామానుజుల సన్నిధి, యోగనారసింహస్వామి ఆలయం, విష్వక్సేనుల సన్నిధి, గరుడాళ్వారు సన్నిధి, తాయారు సన్నిధి – అన్నింటినీ పరిచారకాదులు శుభ్రం చేస్తారు.

రంగనాయక మండపంలోని బంగారు, వెండి వాహనాలను తుడిచి మెరుగులు పెడతారు. ఇలా చేయడం వల్ల వాటి కాంతి అలానే మెరుస్తూ భక్తులకు నయనానందకరంగా వుంటుంది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ముఖ్యోద్దేశం అదే. లేకపోతే చిలుము పట్టి వాహనాలు కాంతి విహీనం అవుతాయి. మన పెద్దలు ఏ ఉత్సవాన్ని ఏర్పరిచినా అందులొ శాస్త్రీయత వుండి తీరుతుంది.

పరిమళ భరితం:

శుభ్రం చేయడం ఒక ఎత్తు. రెండో ఎత్తు పరిమళం పూత. ఇదొక సంరంభం. కురాళం – అంటే  6 x 6 అడుగుల చతురస్రాకారం గల మఖ్‌మల్ వస్త్రాన్ని వెండి తట్టలో కార్యనిర్వాహకులు పట్టుకొంటారు. ఇది మూలమూర్తిపై ఏ విధమైన ధూళి పడకుండా వుండేందుకు తీసుకునే చర్య. ఇదే సమయంలో జియ్యంగారు పరిమళ ద్రవ్యాల వెండిగిన్నెను పట్టుకొంటారు. దేవస్థానాధికారులు, జియ్యంగారు ముందు నడవగా ఆ పరిమళాన్ని పరిమళపు అర నుండి భద్రచామరాది రాజ లాంఛనాలతో ఆలయం లోపలికి తీసుకురావడానికి ప్రదక్షిణ పూర్వకంగా నడుస్తారు. ధ్వజస్తంభం చుట్టూ తిరిగి వచ్చి ఈ కురాళాన్ని, పరిమళాన్ని గర్భాలయంలోని అర్చకులకు అందిస్తారు.

అర్చకస్వాములు కురాళం వస్త్రాన్ని విగ్రహం పై భాగంలో కడతారు. జియ్యంగారు తెచ్చిన పరిమళాన్ని అర్చకులు, పరిచారకులు ఆలయం గోడలకు పూస్తారు. మిగతా ప్రదేశాలు, ఆలయాలలో కూడా ఈ కార్యక్రమం అదే సమయంలో ఇతర ఉద్యోగులు నిర్వహిస్తారు.

బంగారు వాకిలి దాకా ఇతర ఉద్యోగులు, సేవకులు పరిమళాన్ని నింపుతారు. పరిమళం ఎలా తయారు చేస్తారు?

సుద్దపొడి, శ్రీ చూర్ణం, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ గడ్డ పెద్ద పెద్ద సైజులలో ముందు రాత్రి గంగాళాల నిండా కలిపి వుంచుతారు. ఇదొక పలచని లేహ్యంగా తయారయి ఉంటుంది.

మర్నాడు ఉదయం దీనిని గోడలకు పూస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కొనసాగుతుంది. వంటశాలలలో కూడా ఇలా చేస్తారు. ఆ తర్వాత ఆలయంలో పూతలు పూసిన పరిమళ ద్రవ్యాన్ని శుభ్రంగా  నీటితో కడుగుతారు. నేలను శుభ్రం చేస్తారు.

అంతా పూర్తి కాగానే కులశేఖరపడి తెరలు వేసి అర్ఘ్యాది ఉపచారాలు చేసి కర్పూర హారతి సమయంలో తెర తీస్తారు. అప్పుడు ఆర్జిత సేవల భక్తులకు దర్శనం కలుగుతుంది. అదొక దివ్యానుభూతి. ఈ సేవకుడు దానికి అర్హుడయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here