[dropcap]బృం[/dropcap]దావనానికి మధుర దగ్గరే, ఉంటే గింటే ఒక రెండు మూడు కోసులుంటుంది. గోపికలు తమ దగ్గర జున్నూ, వెన్నా, పాలూ, పెరుగూ ఎక్కువ ఉన్నప్పుడు జట్లు జట్లుగా కలిసి బృందావనంలో పొద్దున్నే బయలుదేరి మధ్యాన్నం కల్లా వచ్చేసే వాళ్ళు.
రాత్రంతా కృష్ణుడితో ఆటా, పాటలతో గడిపి, కొద్దిసేపు నిద్రపోగానే అత్త వొచ్చి నిద్దర లేపితే, పొద్దున్న లేచి పాలు పితికి, చల్ల చేసి ఎక్కువ ఉన్న చల్లా, పాలూ, నెత్తినబెట్టుకుని వెంకట నర్సమ్మ మధురకి బయలుదేరింది. స్వతహాగా, కాస్త భయస్తురాలూ, బిడియం ఎక్కువ వున్నదీ కావటం వల్ల పక్కింటి చుక్కమ్మని తోడు తీసుకుని బయలుదేరింది. చుక్కమ్మ తన ఇంట్లోని పాలూ, పెరుగూ కూడా తీసుకుని బయలుదేరింది. మధ్యలో తినటానికి ఉంటాయని, మొక్కజొన్న పొత్తులూ, నేరేడు పళ్ళూ, కంది కాయలూ, తీసుకుని బయలుదేరారు.
ఇద్దరి మనసుల్లో ఉన్నది ఒకడే. వాడినే తలుచుకుంటూ, వాడిని గూర్చి పాడుకుంటూ వెళుతున్నారు.
“వీక్షే కదా దేవదేవం, సాక్షాన్మదనకోటి సౌందర్య భావ్యం వీక్షే కదా దేవ దేవం” అంటూ నర్సమ్మ పల్లవిస్తే, “సంచరదధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం” అంటూ చుక్కమ్మ ఆ రాసమండల నట శేఖరుణ్ణి ప్రస్తుతించింది. ఇద్దరూ, వాడి తూపుల వాడి, వాడి, వేడి బాణాలకి ఓర్వక, ఆ శృంగార శిఖరాన్ని, “వేణు గాన లోలుని గన వేయికనులు కావలెనే” అంటూ ప్రస్తుతిస్తూ వెళుతూ ఉంటే మధురా నగరం వచ్చింది.
నగరం శబ్దాలకి వారికి తెలివి వచ్చింది కానీ మనసుల్లో ఉన్నవాడు వదలకుండా కూర్చున్నాడు.
మామూలుగా అయితే, “పాలూ, పెరుగూ, వరహా” అంటూ అరుస్తూ తిరుగుతారు గోప కాంతలు.
ఆరోజున, మనస్సులో నిండిన మనమోహనుణ్ణి వదలలేక, వాడు తప్పక ఇంకేమీ ఆలోచనలు రాక, వెంకట నర్సమ్మ “కృష్ణుడు, వరహా, కృష్ణుడు, వరహా” అని అరిచింది.
“అత్తా, అత్తా” అంటూ చెయ్యి పట్టుకుని కదిలిస్తున్న చుక్కమ్మ మాటలు వినిపించుకోకుండా, నర్సమ్మ కృష్ణుడే మనస్సులో తిరుగుతూ ఉంటే, వాణ్ణే మళ్ళీ మళ్ళీ తలుస్తూ, ఆనంద బాష్పాలు రాలుస్తూ, తనని తాను మర్చిపోయి “కృష్ణుడు,వరహా, కృష్ణుడు, వరహా” అంటూ ఆ మధురా నగర వీధుల్లో అరిచింది. చుక్కమ్మకి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. సరే అని నర్సమ్మతో పాటే తిరిగింది.
మధురాపురంలోని జాణలు ఈ అవకాశాన్ని వదులుతారా? బిలబిల్లాడుతూ మేడలు దిగి, చకచకా నడిచి, “ఆగు, ఇదుగో అమ్మాయీ, ఇటురా” అంటూ పిలిచారు. ఎదురుకుండా జనాలు రావటంతో, వెంకట నర్సమ్మ లోకంలో పడింది. మేడదిగిన ఒక మధురవాణి, “ఇదిగో, వరహా, కృష్ణుడిని ఇయ్యి” అంది. నెత్తి మీద ఉన్న కుండలు దింపమని చుక్కమ్మకి సన్నచేస్తే, చుక్కమ్మ పట్టుకుంటే, ఇద్దరూ కలిసి నెత్తి మీదవి అన్నీ దింపారు.
“చెప్పమ్మా, పాలు కావాలా, పెరుగు కావాలా” అంది వెంకట నర్సమ్మ.
“కృష్ణుడు కావాలి” అన్నది ఆ మధుర వాణి మళ్ళీ కొద్దిగా కోపంతో. చుట్టూ చేరిన తన స్నేహితురాళ్ళు ఉత్సుకతతో చూస్తున్నారు.
“కృష్ణుడేమిటి, నాదగ్గర పాలు, పెరుగు ఉంటాయిగానీ” అన్నది నర్సమ్మ.
“నాకదేమీ తెలీదు. నువ్వు కృష్ణుడు వరహా అని అరిచావు, నేను వరహా ఇచ్చాను. నాకు కృష్ణుణ్ణి ఇవ్వు” అన్నది మధురవాణి.
“నేనెక్కడ కృష్ణుడు వరహా అని అరిచానూ” అని కొద్దిగా గట్టిగా అన్నది నర్సమ్మ.
“అరవలేదూ, కావాలంటే నీ స్నేహితురాలిని అడుగు” అన్నది మధురవాణి.
చుక్కమ్మ వైపు చూసింది నర్సమ్మ. “నువ్వు కృష్ణుడువరహా అనే అరిచావు, నేను నిన్ను హెచ్చరిస్తున్నా నువ్వు తన్మయత్వంలో ఉండి నా మాట వినలేదు” అన్నది చుక్కమ్మ.
“అర్థమైందా, ఇప్పుడు నా వరహా తీసుకున్నందుకు నాకు కృష్ణుణ్ణి ఇవ్వు” అన్నది మధురవాణి.
వెంకట నర్సమ్మ ఇబ్బందిలో పడిపోయింది. అసలే బిడియం గలది అయ్యేటప్పటికి ఏమి చెయ్యాలో తోచక తికమక పడిపోయింది. ఇంతలో మధురవాణి మిత్రబృందం అందరూ “ఇదుగో, నా వరహా కూడా తీసుకో, నాకు కూడా కృష్ణుణ్ణి ఇయ్యి” అంటూ వరహా నాణాలు చేతిలో పెట్టబోతుంటే, నర్సమ్మకి ఏడుపు వచ్చినంత పని అయ్యింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని “కృష్ణా” అంటూ గట్టిగా అనుకుని కృష్ణుడికి తనని తాను కైంకర్యం చేసుకుంది. “ఈ సర్వం నీదే కదా, నువ్వే, నీ ఇష్టం వచ్చింది చెయ్యి” అని సమర్పణం చేసింది.
పక్కనున్న చుక్కమ్మ ఇదంతా చూస్తూ ఉంది కానీ ఏమి చెప్పాలో అర్థం కాలేదు. చటుక్కున ఆమెకి ఒక ఉపాయం తోచింది. “ఆ వరహాలన్నీ ఇటు ఇవ్వండి, కృష్ణుణ్ణి నేను ఇస్తాను” అని అన్నది చుక్కమ్మ. దిగ్భ్రాంతురాలైంది వెంకట నర్సమ్మ. “ఎలా ఇస్తావే” అంటూ ఉన్న నర్సమ్మని “చూడు” అని చెప్పి మధురాపుర మందయానలు ఇచ్చిన వరహాలు అన్నీ తీసుకుని నడుముకి ఉన్న సంచీలో వేసింది చుక్కమ్మ.
పక్కన తాము తెచ్చుకున్న సంచీలోంచి నేరేడు పళ్ళు తీసి అందరికీ ఒక్కటొక్కటీ ఇచ్చింది.
“ఇది సరే, కృష్ణుడు ఏడీ” అని అన్నది మధుర వాణి
“వీడే కృష్ణుడు, సరిగ్గా చూడండి”
“ఇది కృష్ణుడు ఎల్లా అవుతుందీ?”
“కృష్ణుడు, నల్లగా వుంటాడు, అందరికీ సుఖం కలిగిస్తాడు, అవును కదా?”
“అవును”
“మరి ఈ నేరేడు కృష్ణుడు కూడా నల్లగా వున్నాడు, తిన్న అందరికీ సుఖం కలిగిస్తున్నాడు కదా?”
“మోసం, మరి కృష్ణుడు ఆడతాడు, పాడతాడు కదా, ఏదీ ఈ నేరేడు కృష్ణుడు ఆడడే, పాడడే?”
“అవును, మీరిచ్చిన ఒక్క వరహాకి, మా బృందావన సుందరుడూ, మదనమోహనుడూ, రాసలీలా వినోదుడూ, హల్లీసక ప్రవర్తకుడూ అయిన మా వాడిని మీకు ఇస్తామా, కోటానుకోట్ల వరహాలు ఇచ్చినా వాడి కడగంటి చూపునైనా కొనలేరే, అటువంటి వాడిని కొనుక్కుందామనే? ఆశకి కూడా అంతు ఉండాలి. అసలు అటువంటి వాణ్ణి కొందామనే ఆలోచన ఎలా కలిగింది మీకు, నిజంగా వాడు కావాలంటే, నేను ఇక్కడే ఉంటాను. కోటి వరహాలు తీసుకురండి, వాణ్ణి తీసుకు వస్తాను.”
“కోటి వరహాలా?”
“మరి, మన్మధ మన్మధుడిని మారు బేరంలో కొట్టెయ్యాలనా? వేల మంది ఋషులు కూడా పొందలేని వాణ్ణి ఒక్క వరహా ఇచ్చి ఎలాగొలా పొందేయాలనా?”
“మరి”
“చాలు చాల్లే పొండమ్మా, అన్నీ దండగ బేరాలు, పొండి”
“మా వరహా?”
“కృష్ణుడి రంగు చూసారు కదా? అంత అత్యంత విలువైన దానిని చూపించినదానికి చెల్లు, వెళ్ళండమ్మా?”
ఇంకేమీ చేయలేక, మధురవాణీ, తన స్నేహితురాళ్ళూ, ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు.
చుక్కమ్మని కావిలించుకుంది వెంకట నర్సమ్మ. “నా పరువు నిలబెట్టావు, ఇంకా ఎంత అవమానాల పాలు అయిపోతానో అని భయపడ్డాను?” అని వెంకటనర్సమ్మ బాగా పొగిడింది చుక్కమ్మని.
సాయంత్రం అన్నీ అమ్మి వెనక్కి వస్తూ “మనం మోసం చేశామేమో కదా?” అంది వెంకట నర్సమ్మ.
“చూడత్తా, నిన్ను మోసం చేద్దామని చూశారు వాళ్ళు, నేను కూడా గాభరా పడ్డాను. కానీ ఆక్షణంలో కృష్ణుడు పూనినట్టు అనిపించింది.”
“నిజమా, నేను ఆ క్షణంలో కృష్ణా అని గట్టిగా అనుకున్నా, వెంటనే నీ మాట విన్నాను. సరేకానీ ఆ డబ్బులు నాకొద్దు”
“నాకూ వొద్దు”
“మరి”
“మరి”
“కృష్ణుడికి ఏమన్నా కొందాము”
“ఏం కొందాం”
“అంగీ?”
“వేణువు.”
“అవును, మనం ఇచ్చినదాన్ని ముద్దుపెట్టుకుంటే మనల్ని ముద్దుపెట్టుకున్నట్టే”
మధుర నించి వచ్చిన కొత్త వేణువుతో కృష్ణుడి పాట ఇంకా బావుందని అందరూ మెచ్చుకున్నారు. వెంకట నర్సమ్మా, చుక్కమ్మా మురిసిపోయారు.
విక్రేతు కామా కిల గోప కన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తిహి
దధ్యాదికం మోహ దశా దవోచద్గోవింద. దామోదర మాధవేతి – అని బిల్వమంగళ ఠాకూరు కృష్ణ కర్ణామృతంలో అన్నాడు. మనం పాడుకుని మురిసిపోతున్నాము. ఇంకేం కావాలి?.