మనసులోని మనసా-48

1
3

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

జీవితంలో మనం ఎన్నిటినో ప్రేమిస్తాం. ఆరాధిస్తాం.

ప్రేమించడానికి మనుషులో, మనవారో అయి వుండనక్కరలేదు.

ఒక చెట్టునో, పిట్టనో, రంగులు మార్చే ఆకాశాన్నో, ఒక శిథిలాలయాన్నో – ఇలా ఎన్నింటినో ఇష్టపడి ఆరాధిస్తాం. అభిమానిస్తాం.

నోరు లేని ఈ ప్రకృతి మనతో మౌనంగా సంభాషిస్తుంది. మనసుని సేద తీరుస్తుంది.

అలా నేను ప్రేమించిన మా ఆఫీసు బిల్డింగ్ గురించి నేను చెప్పబోతున్నాను.

అవునండి. అదే మా ఎర్రమంజిల్ ఆఫీసు బిల్డింగ్.

ఆ బిల్డింగ్‌ని త్వరలో తెలంగాణా ప్రభుత్వం కూల్చివేయబోతున్న విషయం విని నాకు చెప్పలేని బాధ కల్గింది.

ఒక రాత్రంతా నిద్ర పట్టలేదు.

కన్నీళ్ళు కూడా వచ్చాయి.

కారణం దాదాపు ముప్పయ్యేళ్ళు ఆ బిల్డింగుతో మాకు సహవాసం వుంది. మా జీవని ఐదు సంధ్యలూ అక్కడే నడిచేయి. సంవత్సరం, ఆరు నెలలూ సర్వీసు అటూ యిటూగా వేరే ప్రాంతాల్లో నడిచినా, అన్ని పొద్దులూ ఆ బిల్డింగ్‌లోనే గడిచాయి.

చిన్నప్పుడు ఒకసారి ఆ బిల్డింగ్ ముందు నుండి వెళ్ళాను. అదే మొదటిసారి రావడం!

చలికాలం! నగరం మీద మంచుతెరలు స్పష్టంగా కనిపించేవి. అందరూ స్వెట్టర్లు వేసుకుని, మంకీ క్యాప్స్ పెట్టుకుని ఇరానీ హోటల్స్ ముందు చా బిస్కట్స్ తింటుంటే చిత్రంగా చూశాను. ఎక్కడ చూసినా ఉర్దూ మాట్లాడేవారే! మరో దేశం వచ్చిన భ్రాంతి!

పీట మీద కూర్చున్నట్లున్న రిక్షాలో కూర్చుని పంజగుట్ట రోడ్డు మీదుగా వెళ్తుంటే ఎత్తయిన కొండ మీద ప్రభలా నిలబడి వున్న ఆ బిల్డింగ్ దర్పంగా కనిపించింది.

ఆ రోజు ఆగస్టు పదిహేనో, జనవరి ఇరవయ్యారో గుర్తులేదు కానీ ఆ బిల్డింగ్ అంతా దీపాలతో అలంకరించారు. ముందు ఒక పెద్ద తోట – దానికి యిరువైపులా పైకి వెళ్ళడానికి బాట. నేను కన్నార్పకుండా దాని వైపు చూశాను. భవిష్యత్తులో నేనక్కడే వుద్యోగం చేస్తానని కలలో కూడా వూహ లేనే లేదు.

    

విశాలంగా వున్న రోడ్లు, ప్రతి యింటికీ తోట వున్న భవంతులు, చల్లటి గాలులూ, నాకా చాలా థ్రిల్‌గా అనిపించింది. అంతవరకు నేను చూసిన నగరాలు రెండే రెండు. ఒకటి నేను పుట్టిన కాకినాడ, రెండు మా నాన్నగారు ఎక్కువ కాలం సర్వీస్ చేసిన గుంటూరు. మిగతావన్నీ పల్లెటూర్లే. అప్పటికి నేను మద్రాసు చూడలేదు.

1980ల్లో నేను ఆ బిల్టింగులోకి ఒక ఉద్యోగిగా ప్రవేశించాను. హైదరాబాదులో ఉద్యోగమనగానే నాకు రెక్కలు వచ్చేయి. చాలా మంది ఉగ్యోగినులు వుంటారు. చిన్న వూళ్ళల్లో లేడీ స్టాఫ్‌లా బిక్కుబిక్కుమంటూ ఓ మూలకి వుండనక్కర లేదు. నక్కి నక్కి బ్రతకనక్కరలేదు. ఒక టాయిలెట్టు స్త్రీల కోసం లేని ఆఫీసులు చూశాను. స్త్రీలంటే గౌరవం లేని స్టాఫ్‌ని చూశాను. అప్పుడు చిన్న వయసేమో చాలా ఆవేశంగా ఉక్రోషంగా వుండేది.

మాట్లాడితే భారతదేశపు ఔన్నత్యం చెప్పి ఊదరగొట్టేవారే గాని స్త్రీలకి ఒక టాయిలెట్ వుండాలన్న ఇంగితం వున్నవారే లేరు. మాట్లాడితే అమెరికాని ఆడిపోసుకునేవారే గాని అక్కడ ఇలాంటి విషయాల్లో ఇచ్చిన ప్రాధాన్యత, అడుగడుగునా 50 కిలోమీటర్ల దూరంలో కట్టిన రెస్ట్ రూమ్స్‌ చూసి ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి మన దేశంలో అలాంటి ఏర్పాట్లు చేసారు!

విశాలమైన ఆ బిల్డింగ్‌లోకి ప్రవేశించడానికి దానికి దారే తెలిసేది కాదు. కొన్ని రోజులు నేను పనిచేసే సెక్షన్‌లో ఒక స్నేహితురాలి కొంగు పట్టుకుని బయటపడేదాన్ని. మొత్తం పది పదిహేను దారులు ఆ బిల్డింగ్‌లోకి ప్రవేశించడానికి వుండేవి. అందులో మా రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ కూడా వుండేవి.

మా చీఫ్ ఇంజనీరు, డెప్యూటి చీఫ్ ఇంజనీరు ఛాంబర్స్‌కి ఫైల్స్ తీసుకుని వెళ్ళాలంతే దాదాపు అర కిలోమీటరు దూరం నడవాల్సిందే.

ఆఫీసు పర్పస్ కోసం కొన్ని గదుల్ని పార్టిషన్స్ పెట్టి మార్చినా మొత్తంగా ఆఫీసు చాలా దర్జాగా అనిపించేది.

మా ఆఫీసులో తరచూ కోర్టు సీనులు షూటింగ్ ముందు పక్క జరుగుతుండేవి. అలానే జీవిత, గొల్లపూడి మారుతీరావు, కోదండరామిరెడ్డి – ఇంకా చాలా మంది వస్తుండేవారు.

మేం లేడీ స్టాఫ్ నూట యాభయి మంది దాక వుండేవాళ్ళం. మాకొక లేడీస్ లంచ్ రూమ్ వుండేది.

అందులో లేడీస్ కోసం కట్టిన టాయ్‌లెట్స్ టాంక్ చిన్నదవడంతో వాటర్ ప్రాబ్లమ్ వచ్చేది. దాని కోసం వెళ్ళి డి.సి.ఇ. గారితో చెబుదామంటే చాలామంది ఉద్యోగినులు సిగ్గుతో మెలికలు తిరిగిపోయి రావన్నారు. మాలాంటి కొంతమంది (బొత్తిగా సిగ్గులేనివాళ్ళం) వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది.

నగరం గొప్పదయినా ఆఫీసు డైరక్టరేట్ ఆఫీసయినా కొంతమంది పల్లెటూర్ల నుండి వచ్చిన స్టాఫ్ వింతగా ప్రవర్తించేవారు.

మొత్తానికి ఆ ఆఫీసు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినా మాకు మొత్తంగా సంతోషాన్నే యిచ్చింది. అక్కడే మా పిల్లలు పుట్టడం, చదవడం, పెళ్ళిళ్ళు కావడం – ఇలా ఎన్నో అనుభూతుల్ని చూశాం.

ఇప్పుడు నగరం పూర్తిగా మారిపోయి కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. అందచందాలు పోయాయి. చెరువులు బహుళ అంతస్తుల భవనాలయిపోయాయి. రాను రాను వచ్చిన ఆఫీసర్లు తమ స్వార్థమే చూసుకోవడం వలన ముందున్న తోట ఎండిపోయింది.  ఇప్పుడు మెట్రో స్టేషన్ వచ్చి బిల్డింగ్ ఎలివేషన్‌ని కనుమరుగు చేసేసింది.

తోట ముందు కూరగాయల మార్కెట్ వెలిసి బిల్డింగ్‌ని చిన్నబుచ్చేసింది. మెయిన్‌టెనెన్స్ లేక బిల్డింగ్ శిథిలావస్థకి చేరింది.

పక్కనే వున్న ఎర్రమంజిల్ కాలని నిమ్స్‌కి ఇచ్చే నిమిత్తమని ముందే కూల్చేసారు. సర్వీసంతా అందులో వున్న ఉద్యోగస్థుల కుటుంబాలు పెంచిన నిలువెత్తు చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికి పోగులు పెట్టారు. నగరానికి నడిబొడ్దున వున్న ఆ స్థలాల మీద రాజకీయ నాయకుల కన్ను పడి ఆ అందం ఛిద్రమయింది.

1870లో నవాబు సఫ్దర్ జంగ్ ముషీర్‍వుద్దౌలా ఫక్రూల్ మాలిక్ కట్టిన… అంటే దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ కట్టడం ఇప్పుడు చరిత్రలో కలిసిపోతున్నది.

ఎర్రం అంటే పర్షియన్ భాషలో ‘స్వర్గం’ అని అర్థమట! ఆ స్వర్గం ఇప్పుడు అదృశ్యమై పోతున్నది.

ఎన్నో అనుభూతులు మిగిల్చిన ఆ కట్టడానికి నా కన్నీటి నివాళి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here