సూపర్ 30 : అతిశయోక్తి సుమా!

2
3

[box type=’note’ fontsize=’16’] “వొక తృప్తినిచ్చే సినెమా అనుభవం కోసం కాకపోయినా, వొక మంచి సబ్జెక్ట్ కోసమైనా చూడవచ్చు దీన్ని. మానెయ్యమని అయితే చెప్పను” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘సూపర్ 30’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

ఇది బయోపిక్కుల సీజను. ఈ ప్రసార సాధనాల కారణంగా మనకి చాలా మంది మహానుభావుల గురించి ముందే వివరంగా తెలుసు. లేదూ బయోపిక్కు చూసిన తర్వాత అయినా తెలుసుకునే అవకాశం వున్నది. ఉదాహరణకి మల్లేశం టెడ్ టాక్ ఇదివరకే చూసినవారున్నారు. లేదూ సినెమా చూసిన తర్వాతైనా చూసిన వారున్నారు. నేనైతే తర్వాతే చూశాను. ఇంతకు ముందు అరుణాచలం మురుగునాథన్ వీడియో చూసి చాలా ప్రభావితుడినయ్యాను. అతనిమీద బయోపిక్కు తీస్తున్నారని తెలిసి సంతోషించాను కూడా. Padman వచ్చింది. వ్యాపార చిత్రం లా. అయినా నచ్చింది. ఆ విధంగా అది చాలా యెక్కువమంది ప్రేక్షకులను చేరినందుకు. ఇప్పుడు ఈ చిత్రం సూపర్ 30 రాజస్థాన్ (Kota) లోని ఆనంద్ కుమార్ అనే వ్యక్తి బయోపిక్కు. ప్రతి యేటా IIT-JEE (ఇప్పుడు పేరు మారింది) ఫలితాలు వచ్చినప్పుడు ఆనంద్ కుమార్ బేచిలో యెంతమందికి ర్యాంకులు వచ్చాయి అన్నది కూడా వార్తగా వస్తుంది. అతని గురించి క్లుప్తంగా వ్రాస్తారు. ఇప్పుడు అతని బయోపిక్కు అంటే సహజంగానే నాలో కుతూహలం కలిగింది.

మధ్యతరగతి కుటుంబంలో రాజేంద్ర కుమార్ (వీరెంద్ర సక్సేనా) అన్న పోస్ట్‌మాన్ కొడుకుగా ఆనంద్ కుమార్ (హృతిక్ రోశన్) చాలా తెలివైన కుర్రాడు. దొంగచాటుగా తనది కాని కాలేజి లైబ్రేరిలో విదేశీ మేథ్ జర్నల్స్ చదువుతుంటే అక్కడి లైబ్రేరియన్ కంటపడి, అవమాన పడి గెంటివేయబడతాడు. ఆ తర్వాత అదే జర్నల్ లో అతను వ్రాసిన వో వ్యాసం అచ్చు కావడం అతని తెలివితేటలు, ప్యాషన్, పట్టుదల తెలుపుతాయి. అతనికి కేంబ్రిజ్ లో చదువుకోవడానికి అనుమతి కూడా లభిస్తుంది. కాని ఆర్థిక కారణాలు, తండ్రి అకాల అకస్మాత్ మరణం వీటి కారణంగా ఆ కలలకు పగ్గం వేసి తల్లి చేసిన అప్పడాలను సైకిల్ మీద అమ్ముతూ వుంటాడు. ఒకరోజు తనలాంటి మరో మేధావి కంటపడటం, అతను ఆనంద్ కుమార్ కి తన కోచింగ్ సెంటర్ లో టీచర్ గా నియమించడం జరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు, ఊరట అనంతరం అతను కొన్ని సామాజిక వాస్తవాలను గమనించడం జరుగుతుంది. ధనిక, అగ్రవర్ణ తరగతులనుంచే టాపర్లు వస్తున్నారు కాని మిగతావారికి ఈ చదువు కలలో కూడా దూరమే. సామాజిక అసమానతలు పోవాలంటే చదువు యెంత ముఖ్యమో, అది అందరికీ అందడం అంతకంటే ముఖ్యం. ఈ యెరుకతో తన ఉద్యోగాన్ని కాదనుకుని, కోటాలోనే వో పాడుబడిన బంగళాని తీసుకుని అందులో 30 మంది నిమ్న వర్గ యువతను నిశ్శుల్కంగా చదువు చెప్పడం మొదలు పెడతాడు. ఇలాంటి నిర్ణయం వ్యాపారం చేసుకుంటున్న కోచింగ్ సెంటర్ వర్గాల కంటికి కంటకమే కాబట్టి అతన్నీ, ఆ పిల్లలనూ అణిచివేయడానికి కుట్రలు జరుగుతాయి. ఇప్పుడున్న ఈ స్థితికి ఆనంద్ కుమార్ ఎలా రాగలిగాడు, అతని పోరాటం ఎలాంటిది అనంది మిగతా కథ.

చిల్లర్ పార్టీ, క్వీన్ లాంటి గొప్ప చిత్రాలు అందించిన వికాస్ బహల్ సామర్థ్యం ఇక్కడ కాస్త పలుచనబారినట్లు అనిపిస్తుంది. బహుశా ఇది తీసే సమయంలో కొన్ని వివాదాలలో చిక్కుకోవడం ఆ మానసిక పరిస్థితుల ప్రభావం కావచ్చు. చిత్రం గొప్పగా లేకపోయినా ఆ సబ్జెక్ట్ బలం మీద సినెమా గుర్తుండి పోతుంది. ఆనంద్ కుమార్ గా హృతిక్ యెప్పటిలానే మంచి నటన అందించాడు. అజయ్ అతుల్ ల ద్వయం మంచి నేపథ్య సంగీతం, మంచి పాటలు అందించింది. అమితాభ్ భట్టాచార్య వ్రాసిన పాటలు అంతే బాగున్నాయి. వీరెంద్ర సక్సేనా, పంకజ్ త్రిపాఠి ల గురించి కొత్తగా యేం చెబుతాం గాని, కొత్త కుర్రాడు నందిశ్ సింఘ్ హృతిక్ అన్నగా చిన్న పాత్రే అయినా బాగా చేశాడు.

అనయ్ గోస్వామి చాయాగ్రహం కొన్ని చోట్ల చాలా బాగుంది. అద్భుతమైన స్టిల్ల్ ఫొటోగ్రఫీల్లాంటివి. కాని అనవసరమైన సినెమేటిక్ డ్రామా కారణంగా కొన్నిచోట్ల పలచనబారుతుంది.

వికాస్ బహల్ క్వీన్ లో మనం ఊహించనంత గొప్ప కథనం ఇచ్చాడు. ఆ పాత్ర, ఆ సంఘటనలు అన్నీ మన సినెమాకు కొత్తే. కాని నిజజీవితంలో హీరో అయిన ఆనంద్ కుమార్ కథను తీసుకున్నప్పుడు అతడు సునాయాసంగా గొప్ప కథను ఇవ్వవచ్చు, కాని అలా జరగలేదు. వొక హిందీ వ్యాపార చిత్ర లక్షణాలన్నీ మనల్ను వెక్కిరిస్తాయి. హృతిక్ నటనలో, నిజాయితీలో నమ్మకం వుంది. కాని ఆ సెంటర్ నడపడం కోసం దుస్తులతో సహా అన్నీ అమ్ముకున్న ఆ కుటుంబం, హృతిక్ ను మాత్రం రోజుకో చొక్కాలో చూపించడం వగైరా చిరాకు కలిగిస్తుంది. మరో పక్క ఆ ముప్పై మంది పిల్లల్ని చూడండి. వొక నిజ జీవిత చిత్రణకు సరిపడా సామాను వారు. తెరను అక్షరాలా వెలిగిస్తారు వారు. పీరియడ్ సినెమా గా చూసినా చాలా అశ్రధ్ధ కనిపిస్తుంది. మచ్చుకి వొకటి. మొదటి సారి పిల్లలు ఎంట్రెన్సు ఫలితాలు వచ్చినప్పుడు హృతిక్ వొక గోడకానుకుని నిలబడి వుంటాడు. ఆ గోడ మీద 100/108 ఫోన్ నెంబర్లతో ప్రభుత్వ సేవల పోస్టరు కనిపిస్తుంది. ఆ విధంగా కూడా మనం సినెమాలో పూర్తిగా లీనమవ్వడానికి లేకుండా అడ్డం పడుతుంటాయి ఇలాంటివి.

సరే, వొక తృప్తినిచ్చే సినెమా అనుభవం కోసం కాకపోయినా, వొక మంచి సబ్జెక్ట్ కోసమైనా చూడవచ్చు దీన్ని. మానెయ్యమని అయితే చెప్పను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here