[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]
దృశ్యం-13
(Flash back)
[dropcap][వె[/dropcap]నక నుండి తుపాకులు పేలుతున్న శబ్దాలు. మధ్య – మధ్యన కుక్కలు అరుస్తున్న ధ్వనులు కూడా వినవస్తుంటాయి…]
డా. నసీర్ : (స్వగతం) అబ్బా! ఎంత చలిగా ఉంది. ఈ ఏడు శ్రీనగర్‌లో మంచు చాలా హెచ్చుగానే కురిసింది… (కాంగడీ చూసి) ఈ నిప్పు కూడా చల్లారిపోతోంది… నఫీసా, షాహానా పడుకుండి పోయుంటారు… (కుక్కల అరుపులు) ఈ కుక్కలు మరీను… (నవ్వుకుని) మంచు వాన కురిసిన ప్రతిసారీ ఆగేక, ఆ మంచులో పొర్లి ఎలా ఆనందిస్తాయో…
(ముఖం పైన కోమలమైన భావం వెల్లివిరుస్తుంది)
అమ్మ సరిగ్గానే చెప్తుంది. ఇవి మంచును మేనమామ అనుకుంటాయని… అందుకే సంతోషంతో వెఱ్ఱెక్కిపోతాయి…. మంచుమామయ్య వచ్చిన సంతోషంతో… (నవ్వేసి) హ! హ! హ! మంచు మామయ్య… (అప్పుడే తలుపుమీద ఎవరో టకటకమని కొట్టిన ధ్వని వస్తుంది)
ఇంతటి మంచు కురుస్తున్న రాత్రిలో ఎవరొచ్చి ఉంటారు చెప్మా? (పెద్ద గొంతుకతో) ఎవరదీ?
గుల్లా : నేను… తలుపు తియ్యండి… గుల్లాని!
(డాక్టరు తలుపు తెరుస్తాడు. ఓవర్ కోటు తొడుక్కున్న గుల్లా ప్రవేశిస్తాడు)
డా. నసీర్ : (అశ్చర్యంగా) అరే గుల్లా… ఎక్కడ చచ్చేవిన్నాళ్లూ?
గుల్లా : (కాస్తంత తడబడినా, ధైర్యంగా) డాక్టరుగారూ! కాస్త మర్యాదగా మాట్లాడండి…
డా. నసీర్ : అరే! ఇప్పుడు నేనేమన్నానని?…
(అతడి ఓవర్ కోటు వంక చూపులు మరల్చి) ఈ ఓవర్ కోటులో ఏం దాచిపెట్టావురా?…
గుల్లా : ఏంటా? (తుపాకీ తీసి చూపించి) ఇదీ!
డా. నసీర్ : (మహా గాభరా పడుతూ) ఏయ్! ఏయ్! ఇది ఎ.కె.పార్టీ సెవెన్! (సంబాళించుకుని) అరే నేను హాస్యానికన్నానంతే! రా! రా! లోపలికి రా… నువ్వు మా పిల్లవాడివే… ఎక్కడున్నావిన్నాళ్లూ?
గుల్లా : నేను పోరాట దళాల్లో చేరిపోయాను. అన్నిరకాల ఆయుధాలూ ప్రయోగించడంలో ట్రైనింగు తీసుకున్నాను. అంతేకాదు, ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ తెప్పించే దారిలో నడుస్తూ ప్రాణాలయినా త్యాగం చేస్తానని ప్రమాణం చేశాను కూడా!
డా. నసీర్ : (ఒక రకమయిన భావంతో) చాలా మంచిపనే చేశావు… నీలాటి యువకుడు ఇలాగే చేస్తాడని అందరూ అనుకునేదే కదా!
గుల్లా : (ఓపిక లేనట్లు చాలా అసహనంగా) చాలా రాత్రయింది… నేను వెళ్లాలి… కానీ…
డా. నసీర్ : (గుండెదడ హెచ్చవుతూండగా) కాని… కానీ ఏంటో?
గుల్లా : మీతో మనసులో మాట ఒకటి చెప్పాలని వచ్చేను!
డా. నసీర్ : అలాగే… చెప్పు!
గుల్లా : నెత్తిమీద కత్తి వేలాడుతోంది… కాని, చచ్చిపోయే ముందు నికాహ్ చేసుకోవాలనుకుంటున్నాను…
డా. నసీర్ : తప్పకుండా! ఎందుకు కూడదు? నీలాటి హుషారయిన కుర్రాడికి, అమ్మాయిలకేం కొదవ?…
గుల్లా : (మధ్యలోనే ఆపి) అమ్మాయిని ఎంచుకున్నాను.
డా. నసీర్ : (అతడి భుజంపైన ‘శభాష్’ అని చరిచి) అదీ మాట! సరే! ఈ కబురు చెప్పినందుకే నీ నోరు తీపి చేస్తానుండు! కాస్తంత పటిక పంచదార తెస్తానుండు! (వెళ్తారు)
గుల్లా : అమ్మాయెవరిని అడగరూ?
డా. నసీర్ : (ఆగి వెనక్కి తిరిగి) అవును ఎవరు?
గుల్లా : మీ అమ్మాయే షాహనా! (స్వగతంలో) తనని పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుండీ నేను కంటున్న కల. ఇంతదాకా నేను బలహీనుడిని… అందుకే చెప్పలేకపోయాను.
డా. నసీర్ : (తనని తను సంబాళించుకుంటూనే, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అభినయిస్తూ) అరే వా! ఆఁ! సరే… ఎందుక్కాదు… ఏం బెంగపడకు నువ్వు?…
గుల్లా : సరే, ఇక మీరు ఎలా అంటే అలా! కావాలంటే రేపే నికాహ్ జరిపించవచ్చు.
డా. నసీర్ : (గాభరాపడుతూ) చూడు! ఇన్నేళ్లూ నువ్వు ఈ ఇంట్లో పిల్లవాడిగా ఉంటూ వచ్చావు… ఇక ఇప్పుడేమో ఈ ఇంటికీ అల్లుడివే కాబోతున్నావు… అందుకే నాకు… నాకు ఒక్క వారంరోజులు గడువియ్యి చాలు… నేనేవో కొన్ని…
గుల్లా : సరే అయితే, వచ్చే జుమ్మేరాత్ (గురువారం) నాటికి వస్తాను. జుమ్మా (శుక్రవారం) రోజున… నికాహ్?
డా. నసీర్ : సరే.. సరే… అలాగే…
గుల్లా : సరే నేవెళ్తాను… ఖుదా హాఫిజ్…
డా. నసీర్ : ఖుదా…
(గుల్లా వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. డా. నసీర్ ఆశ్చర్యచకితుడయినట్లు అక్కడే నిల్చుండిపోయి, అతడిని చూస్తూ ఉంటారు).
Flash back సమాప్తం.
(సశేషం)