తిరుమలేశుని సన్నిధిలో… -23

0
4

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

వేద పాఠశాల

[dropcap]వే[/dropcap]దాలను ఋగ్యజుర్సామాధర్వణ వేదాలు (నాలుగు) విభజించి క్రమంగా వేదవ్యాస మహర్షి తన శిష్యులకు బోధించారు. అంతేకాదు పంచమవేదంగా మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు త్రికాలవేది. ధర్మాన్ని ఆచరించడానికి, వేద విజ్ఞానం అభివృద్ధి పరచడానికీ ఇతిహార పురాణాలు చదవాలని ఆయన నిర్దేశించారు.

తిరుమల తిరుపతి దేవస్థానముల కర్తవ్యంలో భాగమే వేద పరిరక్షణ. వేదాలు అంతరించి పోకుండా కాపాడటం దేవస్థానం బాధ్యత. అందుకుగా శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా వందల గంటల రికార్డింగ్ చేసి భద్రపరిచారు. వాటిని సి.డి.ల రూపంలో వెలువరించారు.

వేద పాఠశాల ఆవిర్భావం:

బ్రహ్మాండంలో అతి పవిత్ర స్థలం వేంకటాచలం. “వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తి కించన వేంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి” అన్నారు పెద్దలు. శ్రీ వేంకటేశ్వరుడు నారాయణగిరిపై తొలిగా పాదం మోపాడు. నాలుగు వేదాలని నాలుగు గొలుసులుగా భావన చేసి ఆనందనిలయునికి అన్నమాచార్యుడు ఊంజల సేవ చేశాడు. అందుకే తిరుమలలో స్వామి వారికి నిత్యం వేద పారాయణ జరుగుతుంది.

ఆ కార్యక్రమంలో భాగంగా స్వామి వారి సంకల్పబలంతో ఒక వేద పాఠశాలను తిరుపతిలోని గోవిందరాజస్వామి కళ్యాణమండపంలో ప్రారంభించారు. అది తారక నామ సంవత్సరం మాఘ మాసం. ఆంగ్ల సంవత్సరాలలో 1884 ఫిబ్రవరి. అప్పటి దేవస్థాన పరిపాలకులు మహంత్ భగవాన్ దాస్, ప్రయాగ్ దాస్‌లు, పురిశై రంగాచార్యులు, ఆనందన్ పిళ్ళై అనే ఇద్దరు వేద పండితులు ఈ పాఠశాలను సభక్తికంగా ప్రారంభించారు.

స్వామివారి సేవలో వేదాలు, ఆగమాలు, దివ్య ప్రబంధాలు హిందూ ధర్మానికి రక్షణ కవచాలు. అలాంటి వేదాలను అధ్యయన, అధ్యాపనాలు కావించేందుకు ఆయా శాఖలలోని నిష్ణాతులైన వేద పండితులను నియమించారు. ప్రారంభదశలో కృష్ణ యజుర్వేదం, వైఖానసాగమం, దివ్య ప్రబంధం – అనే మూడు శాఖలతో బోధన మొదలైంది.

అభివృద్ధి పథంలో…:

పాఠశాల ప్రారంభించిన తర్వాత సంస్కృతభాషా పరిజ్ఞానం యొక్క ఆవశ్యకతను గుర్తించారు. అందుకుగా ఆయా శాఖలలో విశేష పాండిత్యం సంపాదించుకోవడానికి ప్రాచ్య కళాశాలను ఆరంభించారు. శాస్త్రం, తర్కం, వ్యాకరణం, అలంకారాదులలో శోధన మొదలెట్టారు. ఎందరో పండితులు ఈ కళాశాల ఆధిపత్యం వహించారు. ఆ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు యావదాంధ్ర దేశంలో ప్రఖ్యాతి గడించారు. ఒకప్పుడు గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో వున్న ఆ ప్రాచ్య కళాశాలను కపిలతీర్థం రోడ్డులోని భవనాలలోకి (రేకుల షెడ్లు) మార్చారు. ఆ షెడ్లకు ‘డబ్బా రేకుల కాలేజి’గా పేరు వచ్చింది. తర్వాత దాని కెదురుగా పరిపాలనా భవనం వచ్చింది. 2006 ప్రాంతంలో విశాలమైన ప్రాచ్యకళాశాల భవనాలు వెలిశాయి. సముద్రాల నాగయ్య, కె.యస్.ఆర్.దత్త, సుదర్శనాచార్యుల వంటి పెద్దలు కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. సముద్రాల లక్ష్మయ్య వంటి పండితులు అధ్యాపకులుగా పనిచేశారు. గౌరి పెద్ది సుబ్బరాయశర్మ అక్కడే అధ్యాపకులుగా పనిచేస్తూ అన్నమాచార్య సంకీర్తనల పరిష్కరణకూ, ప్రచురణకు విశేష కృషి చేశారు.

తిరుమలకి చేరిన పాఠశాల:

వేదాధ్యయనం జరిగి ప్రదేశంలో ఇతర లౌకిక విద్యల బోధన సబబు కాదని భావించారు. అవి స్వామి వారి కైంకర్యానికి సంబంధించినవి కాబట్టి తిరుమలలో స్వామి సన్నిధిలో ఉంటే బాగుంటుందని నిర్ణయించారు. 1954 విద్యా సంవత్సరం నుండి వేద పాఠశాల తిరుమలలోని ఆలయంలో రంగమండపంలోకి మార్చారు. రంగమండపంలో వేదం నేర్పేవారు. సంపంగి ప్రాకారంలో దివ్యప్రబంధం నేర్పించేవారు. కళ్యాణ మండపంలో ఆగమశాస్త్రం చెప్పేవారు. ఈ మూడింటిని ఒకే చోట చేర్చాలని 1958లో తిరుమలలో పడమటి మాడ వీధిలో వసంత మండపం వెనుక ఒక స్వంత భవనం కట్టారు. అప్పటి నుండి ప్రాచ్యకళాశాలతో సంబంధం తెగిపోయి స్వతంత్ర సంస్థగా కుదురుకుంది.

1950-60 సంవత్సరాల మధ్య వేద పాఠశాలలో వేదాలలో ఋగ్వేద సామ వేదాలు బోధించారు. ఆగమ విబాగంలో పాంచరాత్రాగమం నేర్పించారు. శాస్త్ర విభాగంలో సంస్కృత ప్రవేశ పరీక్ష మొదలెట్టారు. 1954లో విద్యార్థుల సంఖ్య 30. 1962వ సంవత్సరానికి అది మూడు వందలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా వేద పాఠశాల ప్రమాణాలకు గుర్తింపు లభించింది.

1989-90 ప్రాంతంలో వేద విభాగంలో శుక్ల అధర్వణ వేదాలు, ఆగమ విభాగంలో శైవాగమం, వైష్ణవాగమాలతో బాటు, పూర్వం ప్రారంభమైన కృష్ణ యజుర్వేద స్మార్తాలకు అదనంగా పౌరోహిత్య విభాగంలో ఋగ్వేద స్మార్తం, శుక్ల యజుర్వేద స్మార్తాలు ప్రారంభించారు. 1988 సంవత్సరంలో పౌరోహిత్య విభాగంలో వైఖానస స్మార్తం కూడా చేర్చారు.

నరసింగాపురానికి:

1981 సంవత్సరంలో వేద పాఠశాలను తిరుపతికి సమీపంలోని నరసింగపురానికి మార్చారు. మళ్ళీ 1987వ సంవత్సరంలో కళ్యాణి డ్యామ్‌ వద్దకు తరలించారు. 1992 ఆగస్టు 5న శాశ్వతంగా ఈ పాఠశాలను తిరుమలలోని ధర్మగిరి ప్రాంతానికి మార్చారు. దాదాపు ఐదువేల మంది విద్యార్థులు ఇప్పటివరకు ఈ గురుకులాశ్రమంలో అధ్యయనం చేశారు.

20 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఇక్కడ ప్రవేశం. ఆపై బడిన వయసు వారికి వేద విశ్వవిద్యాలయంలోనూ, రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠంలోనూ కోర్సులు లభిస్తాయి.

ఉపరాష్ట్రపతి సందర్శనం:

2005-2010 మధ్య ఈ వేద పాఠశాలకు ప్రిన్సిపాల్‍గా శ్రీరామమూర్తి వ్యవహరించారు. గవర్నరు, రాష్ట్రపతి తదితర ప్రముఖులు తిరుమల విచ్చేసినప్పుడు ఈ పాఠశాలకు రావడం ఆనవాయితీ. 2019 మే నెలలో ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ పాఠశాలను సందర్శించి వేదాధ్యయన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సేవ్ వేదా ప్రాజెక్ట్:

భారత ప్రభుత్వం పులుల సంరక్షణకై సేవ్ టైగర్ ప్రాజెక్టు నెలకొల్పింది. 2008 సంవత్సరంలో ధర్మగిరిలో జరిగిన అఖిల భారత వేద సదస్సులో మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి ఇలా అన్నారు: “పులులు అంతరించిపోతున్నట్లే వేద పండితులు కూడా క్రమక్రమంగా మరుగు అవుతున్నారు. అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ధార్మిక సంస్థలు వేదాలను రక్షించాలి” అని హెచ్చరించారు.

వేదం చదవడం, వేదం బోధించడం కొనసాగాలి. అందుకే దేవస్థానం వేద విజ్ఞాన సంస్థ (వేదిక్ హైయ్యర్ స్టడీస్) ద్వారా వేద పండితులకు నెలసరి ఫించను సౌకర్యం కలిగిస్తోంది. వేదం నేర్పే గురువులకు, శిష్యులకు వేతనం, ఉపకార వేతనం అందిస్తోంది.

వివిధ వేద పాఠశాలలు:

దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలలు ఇవి:

  1. వేద విజ్ఞాన పీఠం – ధర్మగిరి (తిరుమల)
  2. కీసరగుట్ట
  3. చిలుకూరు
  4. ఐ. భీమవరం
  5. విజయనగరం
  6. నల్గొండ
  7. కోటప్పకొండ

ఇందులో చేరే అభ్యర్థులకు ఉపనయనం జరిగి ఉండాలి. ఈ ప్రవేశాలు జూన్ నెలలో ఏటా జరుగుతాయి. వేద విద్యార్థుల పేర మూడు లక్షల రూపాయలు, ప్రబంధ/ఆగమ/స్మార్త విద్యార్థులకు లక్ష రూపాయలు చొప్పున చేరగానే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. కోర్సు పూర్తికాగానే వడ్డీతో సహా ఆ మొత్తాన్ని విద్యార్థికి ఇస్తారు.

కోర్సుల వివరాలు వ్యవధి
I ఎ. ఋగ్వేదం (సాకల శాఖ)

బి. యజుర్వేదం (కణ్వ శాఖ)

సి. కృష్ణ యజుర్వేదం (తైత్తరీయ శాఖ)

డి. సామవేదం (కౌతుమ శాఖ)

ఇ. సామవేదం (జైమినీయ శాఖ)

12 సంవత్సరాలు

5వ తరగతి చదువు

వయస్సు – 12 సంవత్సరాలకు పైన

II ఎ. కృష్ణ యజుర్వేదం (మైత్రాయణీయ శాఖ)

బి. అధర్వణ వేదం (శౌనక శాఖ)

7 సంవత్సరాలు

7 సంవత్సరాలు

III ఎ. దివ్య ప్రబంధం

బి. వైఖానసాగమం

సి. పాంచరాత్ర ఆగమం

డి. చాత్తాద శ్రీ వైష్ణవాగమం

ఇ. శైవాగమం

ఎప్. తంత్రసారాగమం

జి. ఋగ్వేద స్మార్తం (అశ్వలాయన)

హెచ్. శుక్ష యజుర్వేద స్మార్తం (ప్రాకార)

ఐ. కృష్ణ యజుర్వేదం (ఆపస్తంభ)

జె. వైఖానస స్మార్తం

8 సంవత్సరాలు

7వ తరగతి చదువు

14 సంవత్సరాల వయసు పైబడిన వారు

 

 

వేద పాఠశాల ఫోన్ నెంబరు:

0877-2263081

ఈ విధంగా వేదాధ్యయన బోధన దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here