[dropcap]చా[/dropcap]లా ఏళ్లకింది సంగతి. ఒక ఊళ్లో ఒక పేద కుటుంబం వుండేది. కుటుంబ యజమాని చాలా మంచివాడు. చాలా శాస్త్రాలు చదివినవాడు. ఎవరైనా అడిగితే మంచీ, చెడ్డా, శకునాలు చెప్తూ వుండేవాడు. ఆయన దగ్గర శాస్త్రాల గురించి నేర్చుకుంటూ ఇద్దరు శిష్యులు కూడా వుండేవాళ్లు. ఆ ఇద్దరు శిష్యులకూ, ఈ భార్యాభర్తలిద్దరికీ ఒక్కొక్కసారి కడుపునిండా భోజనం కూడా వుండేది కాదు. శిష్యులు ఊళ్లోకి వెళ్లి భిక్షమెత్తి తెచ్చేవాళ్లు. ఆ భిక్ష కూడా దొరకని రోజు ఏమి తినకుండానే వుండేవాళ్లు. యజమాని భార్య చాలా గయ్యాళి. భర్తకు ఎక్కువ సంపాదన లేదు. అయినా కొత్త కొత్త చీరెలు కావాలని వేధించేది. కోరిన తిండి దొరక్క ఇంట్లో ఎప్పుడూ గొడవ పెట్టుకుంటూ వుండేది.
యజమాని భార్య గర్భవతి అయ్యింది. ఇప్పుడు గర్భవతి అయిన భార్యకు మంచి తిండి పెట్టాలి. ఆ తర్వాత పుట్టిన బిడ్డనూ పోషించాలి. ఏది దారి అంటూ ఆలోచించసాగాడు. ఒక పక్క మరింత సంపాదించండి అంటూ భార్య పెట్టే పోరు ఎక్కువయింది. ఆయనకు ఏ దారీ దొరకలేదు సంపాదనా మార్గమూ తెలియలేదు. గ్రహశాంతులు చేశాడు. పూజపునస్కారాలు జరిపాడు. ఉపయోగం ఏం కనపడలేదు. చివరకు చేసేదేంలేక భార్యనూ, శిష్యులనూ వదిలేసి ఒంటిగా రాత్రికి రాత్రే ఇల్లొదిలి వెళ్లిపోయాడు.
మర్నాడు ఇంట్లో ఆయన పడుకునే మంచం ఖాళీగా కనుపించింది. సమయం గడిచే కొలదీ ఆయన ఇల్లొదిలి ఎక్కడికో వెళ్లిపోయాడని భార్యకు అర్థమయింది.
“నేనేం చేతునో దేముడా? నేనేం తినాలి? నా కడుపులో పెరిగే బిడ్డకు ఏం పెట్టాలి? నీ శిష్యుల్ని కూడా వదిలేసి ఎక్కడికెళ్లిపోయావు?” అంటూ గోలగోలగా ఏడ్వసాగింది.
ఆమె ఏడ్పు విని జనం పోగయ్యారు. విషయం తెలుసుకున్నారు. ఒక శిష్యుణ్ణి పిలిచి, “ఆయనే మీకు యజమానీ, గురువు కూడానూ. నీవెళ్లి మీ గురువుగారిని వెతికి తీసుకునిరా. రెండువ శిష్యుడు యజమానురాలిని కనిపెట్టుకుని వుంటాడు” అని చెప్పారు. అంతేకాకుండా అందరూ కలిసి తాలా కాస్తా డబ్బు ఇచ్చి ఆమెనూ, ఇంటినీ కనిపెట్టుకుని వుండమని రెండవ శిష్యునికి మరీ మరీ చెప్పారు. అతను సరేనని ఒప్పుకున్నాడు.
కొన్ని రోజులు గడిచాయి. యజమానిగాని, వెతకటానికి వెళ్లిన శిష్యుడు కాని తిరిగిరాలేదు. ఇక్కడ యజమానురాలికి తొమ్మిదవ నెల జరుగుతున్నది. ఏం చెయ్యాలో అని రెండవ శిష్యుడు ఆలోచిస్తూ దిగులుగా వసారాలో కూర్చున్నాడు. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.
ఆ సమయంలోనే ఆ వసారాలోకి ఒక బ్రాహ్మణుడొచ్చాడు. ముఖాన విభూతి పెట్టుకున్నాడు. ఛాతీ మీద యజ్ఞోపవీతం కనపడుతున్నది. చేతిలో ఊతంగా కర్రను పట్టుకుని నడుస్తూ వున్నాడు. ఇంటి తలుపును తట్టసాగాడు.
“మాకే తినటానికి తిండిలేదు. నువ్వెక్కడ మా నెత్తిన ఎక్కుతావు? వెళ్లు వెళ్లు” అంటూ శిష్యుడు ఆ బ్రాహ్మణుణ్ణి కసురుకున్నాడు. యజమానురాలికి ప్రసవం సుఖంగా జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూవున్నాడు.
“నువ్వు ముందు తలుపు తీయ్యి నాయనా. నేనేం భిక్ష కోసం రాలేదు” అన్నాడు బ్రాహ్మణుడు.
“మరెందుకొచ్చినట్లో” అన్నాడు వెటకారంగా శిష్యుడు.
“నన్ను లోపలికి వెళ్లనివ్వు. మంచి జరుగుతుంది” అని నచ్చచెప్పబోయాడు బ్రాహ్మణుడు.
“అరే. చెప్తుంటే నీకాదుటయ్యా. ముక్కూ, ముఖం తెలియని వాడివి వచ్చి చుట్టంలా ఇంట్లో దూరతానంటావు. నువ్వు ముందు బయటకునడువు” అంటూ ఆ బ్రహ్మణుణ్ణి లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు.
“ఒక్కసారి నా మాట విను నాయనా. నేను ఎందుకు చెస్తున్నానో అర్థం చేసుకో. మొండి పట్టు పట్టకు నాయనా” అని బతిమాలసాగాడు.
“మొండిపట్టు పట్టేది నువ్వు” అంటూ ఆ బ్రాహ్మణుణ్ణి బయటకు నెట్టి వేయటానికి ప్రయత్నించాడు శిష్యుడు.
“నన్ను నా పని చేసుకోనివ్వు. ఇప్పుడీ ఇంట్లో ఒక మగ బిడ్డ పుట్టబోతున్నాడు. అతని చేతుల మీద జాతక రేఖలు గీయ్యనివ్వు నన్ను” అన్నాడు.
“అరే ఎంత పిచ్చివాడవు నువ్వు. ఈ సమయంలో అందులో పురుటి నొప్పులు పడే ఆడదాని దగ్గర కెవరన్నా వెళతారా? నువ్వు చెప్పదలచుకున్నది నాతో చెప్పు” అన్నాడు శిష్యుడు.
“నీ వాదన నీదే కాని నా మాట వినిపించుకోవు గదా? సరే విను. ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడు పుడుతూనే దరిద్రుడుగా పుడుతున్నాడు. అతని అదృష్టంలో ఇదే వ్రాసుంది. కాని అతని ఇంట్లో ఎప్పుడూ ఒక బస్తా బియ్యం. ఒక ఆవు ఎప్పుడూ వుంటాయి” అని చెప్పాడు బ్రహ్మణుడు.
“ఇంతే గదా? నీవు చెప్పాలనుకున్న విషయం. ఇది చెప్పటానికే లోపలికి వెళ్లాలనుకున్నావా?” అని శిష్యుడు అంటుండగానే బ్రాహ్మణుడు కర్రను మోగించుకుంటూ బయటకి నడిచాడు. వీధి మలుపులు అదృశ్యమయ్యాడు.
కొంత కాలాం గడిచింది. శిష్యుడు అలాగే తన యజమానురాలినీ, పుట్టిన బిడ్డనూ కనిపెట్టుకుని వున్నాడు. ఒక రోజు దేశాంతరం వెళ్లిన గురువుగారు తిరిగి ఇంటి కొచ్చారు. అతని చేతికిపుడు బంగారు కడియం కూడా వున్నది. అతని వెంట నౌకర్లు, చాకర్లు చాలా సామాన్లు మోసుకొచ్చారు. ఒక రాజుగారు ఈయన పాండిత్యానికి మెచ్చి ఆశ్రయమిచ్చారట. చాలా ధనం కూడా ఇచ్చారని చెప్పాడు.
చుట్టు ప్రక్కలున్న గ్రామాలలో కూడా ఈ సంగతి చెప్పుకున్నారు. ఆయన కదృష్టం పట్టింది. బీదవాడు కాస్తా గొప్ప ధనికుడయ్యాడు అంటూ చాలా మంది వచ్చి చూసి మాట్లాడి వెళ్లారు. ఒకటి రెండు నెలలు సుఖంగా గడిచాయి.
ఒక రోజు ఉదయాన్నే ఇంటి యజమానురాలి గొంతూ, ఏడుపూ వినిపించింది. తలబాదుకుంటూ చెప్పసాగింది. ఏ దొంగ వెధవో వచ్చి నా ఇల్లంతా దోచుకుపోయాడు. ఎట్లా బతకాలి దేవుడా! అంటూ విలపించసాగింది. ఇల్లంతా గుల్లచేశాడు దొంగ. ఒక బియ్యపు బస్తాను ఇంట్లో మిగిల్చాడు. పశువుల పాకలో ఒక ఆవును మాత్రం వదిలి వెళ్లాడు.
యజమాని ధైర్యంగా వున్నాడు. “మన కెంత వరకు ప్రాప్తమో అంతే దక్కుతుంది. ఏం చేద్దాం. మరలా దరిద్రాన్ని అనుభవిద్దాం” అన్నాడు.
తినే తినే విస్తరిని ఎవరో లాగేసుకున్నట్లుగా విలవిలలాడిపోయింది యజమానురాలు. పులి మీద పుట్రలాగా ఆమె మరలా గర్భవతి అయ్యింది. యజమాని వెనుకటిలాగా భయపడ్డాడు. మరలా ఇల్లొదిలి పారిపోయాడు. ఈసారి యజమానురాలు తల బాదుకోలేదు. ఏడ్వలేదు. లోపల్లోపలే బాధపడి ఊరుకున్నది. కాకున్నది కాక మానదు అనుకుని తనకు తనే ధైర్యం చెప్పుకున్నది. ఇది వరకటి లాగానే ఆ శిష్యుడే ఇంటిని కనిపెట్టుకుని వున్నాడు.
శిష్యుడు ఒక రోజు నదిలో స్నానం చేసి ఇంటికొచ్చాడు. లోగడ వచ్చిన బ్రాహ్మణుడే మరలా వచ్చాడు. తలుపును తన చేతి కర్రతో కొట్టి చప్పుడు చేస్తున్నాడు.
అతణ్ణి చూసిన శిష్యునికి చాలా కోపం వచ్చింది. “అరే నీవు మరలా వచ్చావా? ఉత్తమమైన బ్రాహ్మణునికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది కదా?” అన్నాడు.
“అరే సోదరా! కోపమెందుకోయి! ఎవరి పని వారి కుంటుంది. అదృష్టపు రేఖలు గీసే పని నాది. ఈసారి ఇంట్లో ఆడపిల్ల పుట్టబోతుంది. ఆ పిల్ల నుదుటిన భాగ్యరేఖలు గియ్యాలి. అందుకే వచ్చా” అన్నాడు బ్రాహ్మణుడు.
“ఏం వ్రాస్తావో వ్రాయి. కాని నువ్వు లోపలికి వెళ్లటానికి వీల్లేదు. ఇక్కణ్ణుంచే వ్రాయి. నిన్ను మాత్రం లోపలి కడుగు బెట్టనివ్వను” అన్నాడు శిష్యుడు మొండిగా.
“మంచిది. నీకెలా ఇష్టమైతే అలాగే చేస్తాను. ఇప్పుడు పుట్టబోయే ఆడపిల్ల జీవితాంతం పెండ్లి కాకుండానే ఉండిపోతుంది. కాని రోజూ ఆమెను చూడాలని, పెండ్లాడాలని యువకులు వస్తూనే వుంటారు” అన్నాడు బ్రాహ్మణుడు.
“చాలు. ఇది చెప్పటానికేనా ఇంత హైరానపడి వచ్చావు. చెప్పావుగా. ఇక దయచెయ్యి” అంటూ ఆ బ్రాహ్మణుణ్ణి అక్కడ్నుంచి సాగనంపాడు. అతను చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
చాలా రోజులు గడిచిపోనవి. మరలా ఇంటి యజమాని మాత్రం తిరిగిరాలేదు. ఊర్లోని జనం రకరకాలుగా అనుకోసాగారు. దూరంగా వుండి అతను ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నడని ఒకడు. కాదు కాదు అతను సన్యాసుల్లో కలిసిపోయడని మరి కొందరు చెప్పసాగారు. క్రమేణా ఆ మాటలూ మానేశారు. చివరకు అతణ్ణే మర్చిపోయారు. అతని పిల్లలు పెరిగి పెద్దయ్యారు. ఇంట్లో వుండి మంచి చెడ్డలు చూసే శిష్యుడే వారికి విద్యాబుద్ధులూ నేర్పాడు. తండ్రిలాగా కొడుకు కూడా అన్ని శాస్త్రాలూ నేర్చుకున్నాడు. మంచీ, చెడూ, పూజా పునస్కారాలు పద్ధతులూ చెప్పసాగాడు. తనకాళ్ల మీద తానే స్వయంగా నిలబడే స్థితికి వచ్చాడు.
ఒక రోజు శిష్యుడు తన యజమాని కొడుకుతో “నీవు జీవితాంతం ఇంట్లో బియ్యపు బస్తా వుంచొద్దు. అలాగే ఆవునూ పెంచొద్దు” అని చెప్పాడు.
మర్నాడే ఆ యువకుడు తన ఆవును అమ్మేశాడు. ఇంట్లో వున్న బస్తాడు బియ్యాన్ని పేద సాదలకు పంచేశాడు. వెంటనే గ్రామ పెద్ద కబురు పంపించాడు. “మీ ఇంటికి ఒక ఆవును, ఒక బస్తాడు బియ్యాన్ని పంపిస్తున్నాను తీసుకొండి” అని.
నిత్యం యువకుడు ఆవును, బియ్యాన్ని దానం చేస్తూన్నాడు. కాని ఏదో ఒక వైపు నుండి, బియ్యం ఇంటికి వస్తున్నాయి. ఆవు వచ్చి ముంగిట్లో నిలుస్తుంది. అతనికి ఇంట్లో తినటానికి, అవసరాలు తీరటానికీ ఏ ఇబ్బందీ ఉండకుండా సుఖంగా గడిచిపోతున్నది.
యజమాని కూతురు కూడా పెండ్లీడుకు వచ్చింది. శిష్యుడు ఆమెను పిలిచి ప్రతి రోజూ నిన్ను పెళ్లాడుతానంటూ ఎవరో ఒకరు వస్తూ వుంటారు. నీవు “వేయి రూపాయలు ఇస్తేకాని పెళ్లిచూపులు జరగవు” అని గట్టిగా చెప్పు అని సలహా ఇచ్చాడు.
ఆ యువతి అలాగే చేసింది. ప్రతి రోజూ ఎవరో ఒకరు వస్తూనే వున్నారు. వేయి రూపాయలు ఇస్తూనే వున్నారు. చూస్తూండగానే ఇల్లుంతా సిరిసంపదలతో నిండిపోయింది. చాలా ధనవంతులు అయ్యారు.
ఇదంతా చూసి శిష్యుడు చాలా ఆనందపడ్డాడు. తన యజమానే తనకు చదువు నేర్పిన గురువుగారు. ఇన్నాళ్లూ ఆయన కుటుంబానికి తోడుగావుండి నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను. గురువుగారి ఋణం తీర్చుకున్నాను. పిల్లలు ప్రయోజకులయ్యారు. ఇక నేనిప్పుడు ఇక్కడ నుంచి శెలవు తీసుకుని నా ఇంటికి వెళ్లిపోవచ్చుని భావాంచాడు. అలాగే ప్రయాణమయ్యాడు.
గ్రామానికి వెలుపల పొలాల్లో ఎవరో ఒక వ్యక్తి ఆవు కోసం వెతుకుతూ వున్నాడు. అతనే తల మీద బియ్యపు బస్తా పెట్టుకుని నెమ్మది నెమ్మదిగా కర్ర పోటు వేసుకుని తడబడుతూ నడుస్తూ వున్నాడు. దగ్గరగా వచ్చాక తరువాత శిష్యుడు పరీక్షగా చూశాడు. వెనుకటి రోజుల్లో వచ్చి పిల్లల చేతుల మీద భాగ్యరేఖలు వ్రాయాలని చెప్పిన బ్రాహ్మణుడు ఈనాడిట్లా అలసిసొలసి కనపడుతున్నాడు. అతణ్ణి చూచి శిష్యుడు తన నవ్వు ఆపుకోలేక బిగ్గరగా పకపకా నవ్వాడు.
నవ్వే అతణ్ణి చూసి బ్రాహ్మణుడు రొప్పుకుంటూ, విసుక్కున్నాడు.
“నీవు నాకు ఎంతో కష్టాన్ని తెచ్చిపెట్టావు. రోజూ ఒక ఆవును, ఒక బయ్యపు బస్తాను వెతికి తెచ్చి ఇవ్వటానికి నాకు తల ప్రాణం తోకకు వస్తున్నది. అంతేనా రోజూ వేయి రూపాయలు ఇచ్చే పెండ్లి కొడుకును తేవటం కూడా చాలా కష్టంగా వున్నది. ఏం చెయగలను? ” అంటూ ఆ బ్రాహ్మణుడు ఆవును తోలుకుంటూ వెళ్లిపోయాడు.
శిష్యుడు ఆయన వెనకే వెళ్లి “అందరి రాతను రాసే భగవంతునికి కూడా ఎంత కష్టం వచ్చింది? భగవంతుడు మన అదృష్టాన్ని వ్రాస్తాడు. మరలా అతనే వ్రాసిన దాన్ని పూర్తి చేస్తాడు” అన్నాడు.
హిందీ మూలం: శ్రీ అరిగెపూడి రమేష్ చౌదరి
తెలుగు సేత – దాసరి శివకుమారి