మనసులోని మనసా-49

2
4

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఇ[/dropcap]ప్పుడు మనం నెట్ పుణ్యమా అని ఎన్నెన్నో సినిమాలు చూస్తున్నాం. మన భాషేమిటి – ఎన్నెన్నో పరాయి భాషల సినిమాలు, దేశ విదేశాల సినిమాలు చూసే అవకాశం మనకు కల్గింది. అక్కడి సంస్కృతులు, ఆలోచనా విధానాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు మనకి అర్థమవుతున్నాయి.

‘చూసే వారికి చూసినన్ని మహాదేవా’ అని మన ఓపిక, మన సరదా!

కాని చిన్నతనంలో మనం సినిమాకి వెళ్ళేటప్పుడు కాని, వెళ్ళేక గాని యిచ్చిన థ్రిల్ యీ మాధ్యమాలు యివ్వలేవని, యివ్వడం లేదని నా అభిప్రాయం.

నా చిన్నతనంలో అంటే అయిదారు సంవత్సరాల వయసప్పుడు  నేను చూసిన మొదటి సినిమా గుర్తు లేదు కాని సినిమాకి వెళ్ళేటప్పుడు చేసే హంగామా మాత్రం బాగా గుర్తుంది.

అప్పుడు మా నాన్నగారు ఒంగోలులో పనిచేసేవారు. మా నాన్నగారి స్వస్థలం కూడా ఒంగోలే. ‘వచ్చే సోమవారం మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాను’ అని మా నాన్నగారు ప్రకటించగానే మా మొహాలు మతాబుల్లా వెలిగిపోయేయి. ముఖ్యంగా మా అక్కా, నేనూ స్నేహితుల్లా మసిలేవాళ్ళం. మిగతావారు నాకంటే బాగా చిన్నవారు కావడంతో వారితొ పంచుకునే మాటలేమీ వుండేవి కావు.

మా యింట్లో అంటే అమ్మమ్మ గారింట్లో మేము కొన్ని పాళ్ళు ఎక్కువ హాస్యప్రియులం కావడం వలన నేను అక్కని ఏదో ఒకటి చెప్పి నవ్వించేదాన్ని. బహుశా మా పెద్దలు క్రమశిక్షణ పేరుతో మమ్మల్ని నిరంకుశ ధోరణిలో చూడడం వలన మేము కనిపెట్టిన దారి హాస్యం కావచ్చు.

సినిమా పేరు చెప్పగానే మేం ఉబ్బితబ్బిబ్బయ్యేవాళ్ళం.

రేపు వెళ్తాం అనగా మేం ఏ ఫ్రాకులు వేసుకోవాలో తర్జన భర్జన పడి సెలెక్టు చేసుకునేవాళ్ళం. దాని తాలూకు రిబ్బన్లు అవీ ఒక చోట పెట్టుకునేవాళ్ళం. వీలయితే పనిమనిషికి, పక్కవాళ్ళకి, ఇంటి వోనరు గారమ్మాయి, మా పక్కనే టీచర్ ట్రెయినింగ్ అవుతున్న అన్నయ్యలకి – ఇల్లిల్లూ తిరిగి చెప్పి వచ్చేదాన్ని. వాళ్ళందరూ, “అబ్బో, వెరీ గుడ్, మమ్మల్ని తీసుకెళ్తావా వస్తాం” అని నవ్వేవారు.

మా అమ్మగారు రాగానే, “అలా ఒట్టి చేతుల్తో ఎందుకెళ్ళావ్, మెడలో డప్పు తగిలించుకుని తిరగలేకపోయావా?” అని కసిరేది.

అంత చిన్న డోసులు నా మీద పని చేయవు కదా!

మా నాన్నగారి ప్రక్కన పడుకుని ఆ సినిమా వివరాలు అడిగేదాన్ని.

ఆ ముందు రోజే కోటయ్య ఒంటెద్దు బండికి చెప్పి రమ్మని అమ్మ పంపించేది.

మేం మా యింటి దగ్గర్లో వున్న కోటయ్య దగ్గర కెళ్ళి “మేం రేపు సినిమాకి వెళ్తున్నాం. నువ్వు సాయంత్రం నాలుగ్గంటల కల్లా రావాలి!” అని చెప్పేవాళ్ళం. వాళ్ళింటి ముందు అరుగు మీద చుట్ట కాలుస్తూ కూర్చున్న కోటయ్య ‘అట్టనేలే!’ అనేవాడు.

‘అట్టనే అంటే కాదు, నువ్వు తీరుబడిగా వస్తే సినిమా సగం అయిపోతుంది. నీ ఎద్దు అసలే కుంటింది. ఈడ్చుకుంటూ నడుస్తుంది’ అనేవాళ్ళం మేము.

“సర్లెమ్మా, పొండి. వస్తాగా!” అనేవాడు కోటయ్య పొగ గాలిలో వదులుతూ.

మేం దూరంగా జరిగి ముక్కులు మూసుకుని ‘నిజంగా రావాలి మరి, మర్చిపోతే బాగుండదు’ అని ఒట్టేయించుకున్నంత పనిచేసి యింటికి వచ్చేసేవాళ్ళం. కాని లోపల కోటయ్య బండంటే దిగులే మాకు. రెండు సార్లు అలానే సగం రీలయిపోయే వరకు బండి నడుస్తూనే వుంది.

మర్నాడు అంటే సినిమాకి వెళ్ళే రోజు అమ్మ రెండు మూరలు కదంబమాల తెచ్చుకోమని మాకు చెప్పేది.

మళ్ళీ పరుగు!

పూలదండ కొనుక్కుని తిరిగి వచ్చేటప్పుడు అమ్మ చెప్పకపోయినా మళ్ళీ కోటయ్య దగ్గరకి పరిగెత్తి, “ఇదిగో పూలు కూడా కొనుక్కున్నాం. నువ్వు వస్తావుగా! మరిచిపోకు” అని ఒకటికి రెండుసార్లు హెచ్చరించి యింటికి వచ్చేవాళ్ళం.

అమ్మ స్నానాలు చేయించి జడలు వేసి, పూలు పెట్టి షూ వేసి తయారుచేసేది. ఇక బండి కోసం పడిగాపులు.

దూరంగా గంటలు మోగించుకుంటూ వస్తున్న కోటయ్య బండిని చూడగానే పరమ సంతోషం!

ఎగిరి గంతేసి పరిగెట్టుకుని వెళ్ళి అమ్మకి చెప్పి బయల్దేరమని కంగారు పెట్టేసేవాళ్లం.

అమ్మ మరచెంబులో మంచినీళ్ళు తిసుకుని ఒక చిన్న టవల్ పెట్టుకుని ఇంటికి తాళాలు వేసి వచ్చేది. అంతసేపు మా పనమ్మాయి ముకుందిని మాతో వుండేది.

మమ్మల్నందర్ని బండెక్కించి బండి కదిలాక వెళ్ళిపోయేది. ఇక కోటయ్యతో మా నస ప్రారంభమయ్యేది. ‘తొందరగా వెళ్ళు’ అంటూ బండిలో కూర్చుని గోల చేసేవాళ్ళం.

“ఉండండి పిల్లకాయలూ, ఇది గుర్రం కాదు, ఎద్దు తల్లుల్లారా!” అనేవాడు కోటయ్య ఎద్దుని అదిలిస్తునే.

“నోర్ముయ్యండి. ఇంకా టైముందిలే” అని అమ్మ కసిరేది. అయినా ఆ టైంలో అమ్మకి మేం భయపడేవాళ్ళం కాదు. ఆ ఉత్సాహం అలాంటింది.

“పిల్లకాయలు కదమ్మా, సినిమా అంటే వుసారు!” అని కోటయ్య కూడ నవ్వేవాడు.

ఇక బండి థియేటరుకి చేరగానే నాన్న ఆఫీసు నుండి అటే వచ్చి టిక్కెట్సు తీసుకుని బయట నిలబడి వుండేవారు.

నాన్నని, నాన్న చేతిలో టిక్కెట్సు చూడగానే చెప్పలేని హుషారు వచ్చేసేది.

“ఒరేయ్, వచ్చేసేవురా!” అని బండి దూకి అమాంతం – మా నాన్న దగ్గరికి పరుగు తీసేదాన్ని.

మా అమ్మగారు కళ్ళెర్ర జేసినా నేను నాన్నని చిన్నప్పుడు అలానే పిలిచేదాన్ని. నాన్న కూడ నన్ను ఎప్పుడూ ‘ఓరేయ్!’ అనేవారు.

ఇక సినిమాలో మమ్మల్ని మధ్యలో కూర్చోబెట్టి అమ్మానాన్నా సెక్యూరిటీ గార్డుల్లా అటూ యిటూ కూర్చునేవారు.

ఇది మా పెళ్ళిళ్ళయ్యేవరకూ అలానే కొనసాగింది.

అప్పటి సినిమాలు మృష్టాన్న భోజనాల్లా వుండేవి. అడుగడుగునా వీనుల విందు చేసే పాటలు, కుటుంబ కథలు, కన్నీళ్ళు, నవ్వులు, కళ్ళార్పకుండా చూసేవాళ్ళం.

తర్వాత సినిమాల సంగతి చెప్పాలంటే – మా కాకినాడే!

కాకినాడలో పుట్టినందుకు నాకు కొంత గర్వగానూ, మరి కొంత సంతోషంగానూ వుంటుంది.

ఆ రోజుల్లో ఆంధ్రాలో అత్యంత నాగరికతా, అందము వున్న నగరం కాకినాడ. పేరలల్ రోడ్స్, రెక్టాంగులర్ రోడ్ సిస్టమ్, డచ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద చర్చిలు, నగరాన్ని రెండు భాగాలుగా విడదీసే ఉప్పుటేరు (బాక్ వాటర్స్), కోటయ్య కాజాలు – అన్నిటికన్నా ఒకే వీధిలో వున్న సినిమా థియేటర్స్ కాకినాడకి ప్రత్యేక ఆకర్షణ.

కొత్త సినిమా వస్తే అక్కడ చేసే హడావిడి అంతా యింతా కాదు. రాత్రి పెట్రోమాక్స్ దీపాలతో ఒక పెద్ద ఊరేగింపు సాగేది.

“ఏం సినిమా కావాలోయ్!” అంటే మిగతావారు ఆ సినిమా పేరు చెప్పి అరిచేవారు.

ఇక సినిమా థియేటర్స్ వీధికి వెళ్తే పెళ్ళి సందడే!

తండోపతండాలుగా సినిమా ప్రేక్షకులతో ఆ వీధి దేదీప్యమానంగా వెలుగుతుండేది.

ఒక థియేటర్‌లో టిక్కెట్లు దొరకకపోతే మరో థియేటర్‌కి పరుగులు!

పెద్దవాళ్ళు పర్మిషనిస్తే మేం సినిమాకి వెళ్తున్నామంటే పది పన్నెండు రిక్షాలు మా వీధంతా బారులు తీరేవి. మా దొడ్డమ్మ గారి పిల్లలు, మా మావయ్యగారి పిల్లలు, మేం యిలా బోల్డుమంది గ్యాంగ్!

మా ఇద్దరి అక్కయ్యల మధ్య నేను చిన్నదాన్ని కావడంతో మధ్యలో కూర్చోమని పెద్దవాళ్లు ఎక్కించేవారు. వాళ్ళిద్దరికీ కొంచెం నిక్కు, బడాయి ఎక్కువ. వీధి మలుపు తిరగగానే వాళ్ళు “క్రింద కూర్చోవే, మాకు సీటు చాలడం లేదు” అనేవారు.

నేను ఏ భేషజాలకీ లొంగని దాన్ని కాబట్టి గబుక్కున క్రింద కూర్చునేదాన్ని. ‘ఎక్కడ కూర్చున్నా అందరం థియేటర్‌కే చేరతాం కదా’ అనే సిద్ధాంతం నాది.

మా నాన్నగారికి మాచర్ల ట్రాన్స్‌పర్ అయ్యేసరికి నాకు ఆరు సంవత్సరాల వయసుంటుంది. మా యింటి పక్కనే టూరింగ్ టాకీసు. మాకు సినిమాలన్నీ ఫ్రీ. ఇక నా పంట పండింది. ప్రతి డొక్కు సినిమా అక్కడ చూసేసాను. పాత పాత పాటలన్నీ వినేసాను. రీలు రీలుకి ఇంటర్వల్లే. మా రన్నర్స్ మాకు ఇంటి నుండి కుర్చీలు తెచ్చి వేసేవారు. పాములు వస్తాయని అమ్మానాన్న కాళ్ళు పైన పెట్టుకుని కూర్చోమనేవారు. నాన్న టార్చిలైటు తెచ్చి తరచూ చుట్టూ చూస్తుండేవారు. నాకు చూడాలనిపించినప్పుడల్లా పరిగెత్తి నిలబడి ఆ సన్నివేశం చూసి వచ్చేస్తుండేదాన్ని.

హైదరాబాద్ వచ్చేక నేను నా ఫ్రెండు (కొలీగ్) కలిసి రామారావు మీద పిచ్చితో కొన్ని సినిమాలు మొదటి రోజే క్యూలో నిలబడి, వర్షంలో గొడుగులు వేసుకుని నిలబడి మరీ టిక్కెట్లు సంపాదించి చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఆ సంగతి చెబితే నవ్వుతారు మమ్మల్ని చూసి.

ఎలా చూసినా, ఏం చూసినా అప్పటి ఆ థ్రిల్ – ఇంట్లోకి టి.వి. వచ్చాక సుదూరంగా పారిపోయిందని – రిమోట్ చేతిలో పట్టుకుని ప్రకటనులు వచ్చే కాస్త టైంలో మరో సినిమా చూసే ఈ పిల్లలకి అర్థం కాదు గాక – కాదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here