[box type=’note’ fontsize=’16’] “కథ యేమిటి, సినెమా యేం చెబుతుంది అని కాకుండా వొక చిత్రకళను ఆస్వాదించినట్టు ఈ సినెమాని చూసి/విని ఆస్వాదిస్తే గుర్తుండిపోయే చిత్రం ఇది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘జజ్మెంటల్ హై క్యా?’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
ఈ వారం కంగనా రనావత్, రాజ్ కుమార్ రావు లు నటించిన “జజ్మెంటల్ హై క్యా” చూశాను. నాకు విడివిడిగా ఇద్దరూ ఇష్టమైన నటులు. ఇక కలిసి నటించిన సినెమా చూడకుండా యెలా వుంటాను? దర్శకుడు కోవెలమూడి ప్రకాశ్. నాకు కొత్త పేరు. ఇప్పుడే నెట్లో చూసి తెలుసుకున్నాను దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకని. గుర్తు పెట్టుకోతగ్గ పేరు.
ఆనవాయితీగా ముందు కథ కొంత చెప్పుకోవాలి. ఈ చిత్రానికి అది అనవసరం. వొక దర్శకుడు తాను indulge అయ్యి తీయాలనుకున్న చిత్రానికి కథ వొక సాకు మాత్రమే. ఇలాంటి అనుభవమే కొన్నాళ్ళ క్రితం నాకు jaggaa jaasoos లో కలిగింది. ఇది వివరించడం కష్టం. కాని ప్రతి ఫ్రేము, ప్రతి సీనూ సాక్ష్యంగా నిలుస్తుంది. సరే కథ వద్దు అనుకున్నా కొంత చెప్తాను. బాబి గ్రేవల్ బాట్లీవాలా (కంగనా రవావత్) పంజాబి పార్సీ దంపతుల బిడ్డ. చిన్నప్పుడే తల్లిదండ్రుల గొడవల మధ్య పెరగడం వల్ల వొక మానసిక వ్యాధితో (acute psychosis) పెరిగి పెద్దవుతుంది. ఆమెకు కడుపులోంచి మాటలు వినిపిస్తుంటాయి (ఇంగ్లీషులో నైతే మెదడులో లేదా తలలో అని అంటారు, కాని అది ఇతరులు. ఇక్కడ స్వయంగా ఆ వ్యాధిగ్రస్తురాలు కాబట్టి కడుపు/పొట్ట లోంచి వినిపిస్తున్నాయంటుంది). అంకల్ అక్కడికీ అంటాడు కడుపులోంచి మాటలు రావు వాయువు వస్తుంది అంతే. ఇలాంటి వ్యాధిగ్రస్తురాలు కథ చెబుతున్నప్పుడు అది విభిన్నంగా వుండాలి కదా. అలాగే వుంది. ఆమె ఇంట్లో కేశవ్ (రాజ్ కుమార్ రావ్), రీమా (అమైరా దస్తూర్) లు అద్దెకుండడానికి వస్తారు. ఈ జంట వచ్చినప్పటినుంచీ బాబి అతని ఆకర్షణలో పడుతుంది. అప్పటినుంచీ వాళ్ళ జీవితంలో వాళ్ళకు చిరాకు కలిగించే స్థాయి వరకూ తొంగి చూస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో గేస్ బండ పేలిపోయి ఆ అగ్ని ప్రమాదంలో రీమా చనిపోవడం, పోలీసుల దృష్టిలో బాబీ, కేశవ్ లు అనుమానితులు కావడం జరుగుతుంది. రెండేళ్ళ తర్వాత ఇంగ్లండులో వున్న తన కజిన్ మేఘా (అమృతా పురి) ఇంటికి వెళ్ళిన బాబీ మళ్ళీ అక్కడ కేశవ్ ని మేఘా భర్తగా చూడడం; అక్కడినుంచి వొక సస్పెన్సు చిత్రంలా మారుతుంది.
వొక తెలుగు దర్శకుడు హిందీ లో తీశాడు అని బాధపడాలా, హిందీలో నైనా వొక విభిన్న చిత్రాన్ని ఇచ్చాడని సంతోషించాలా తెలీదు. ఈ ప్రకాశ్ గుర్తుపెట్టుకోవాల్సిన పేరే. నిజంగా సైకోటిక్ వ్యాధి లక్షణాలు అవీ సరిగ్గా చూపించాడా అన్నది వొక సైకియాట్రిస్టు చెప్పగలడు. కాని ఆ వంకతో నటికి స్వేచ్ఛతో నటించడానికి వీలు చిక్కింది. దర్శకుడిని ఫ్రిట్జ్ లాంగ్ మెట్రొపోలిస్ లాంటి ప్రయోగాలు చెయ్యడానికి వీలు చిక్కింది. అతనికి సపోర్టుగా చాయాగ్రాహకుడు పంకజ్ కుమార్ తెరంతా రంగులతో నింపేశారు. వొక వ్యాధిగ్రస్తురాలి ప్రపంచం బహుశా అలా చిత్ర విచిత్రంగానే వుంటుందేమో. అలాంటి వాళ్ళ మాటలూ చేష్టలూ వీటితో పాటు అంతరంగపు ఆలోచనలను కూడా ఊహించి చూపించాడు. ఇక కంగనా విచిత్ర వేషధారణకు వస్తే ఆమె హీరోయిన్ కావాలనుకుంటున్న మనిషి. కాని ప్రస్తుతం దక్షిణ భారతీయ చిత్రాల హిందీ డబ్బింగుకి డబ్బింగు ఆర్టిస్టుగా పనిచేస్తుంటుంది. ఆ క్రమంలో తను ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది. ఫొటోషాప్ సాయంతో ఆ ఒరిగినల్ ఫొటోలలో తను కనిపించేలా చేసుకుంటుంది. ఇక ఇలాంటి మనిషి వేషధారణ వెనుక ఆమె మనస్తత్వం అర్థం అయ్యాక యేదీ అసహజం అనిపించదు. మరో పక్క రాజ్ కుమార్ రావు చాలా బాగా చేశాడు. సినిమా మొత్తం కంగనా ఆక్రమించేసినా అతని నటన కంగనా నటన కంటే వో మెట్టు పైనే వుందనిపించింది నాకు. 2019 లో మనం చూస్తున్న ఈ సినెమాలో నాయిక బాల్యం బహుశా 80/90లలో వుండి వుంటుంది. కాబట్టి ఆ మేజిక్ కోసం ఆర్ డీ బర్మన్ ని వాడుకోవడమూ బాగుంది. హుసేన్ దలాల్, జిమి షేర్గిల్, సతీశ్ కౌశిక్ లు కూడా బాగా చేశారు. అర్జునా హరజాయీ, రచితా అరోడా, తానిష్క్ బాగ్చీ, డేనియల్ జార్జ్ ల సంగీతం కూడా సినెమా మూడ్ కు తగ్గట్టుగా వుంది.
కథ యేమిటి, సినెమా యేం చెబుతుంది అని కాకుండా వొక చిత్రకళను ఆస్వాదించినట్టు ఈ సినెమాని చూసి/విని ఆస్వాదిస్తే గుర్తుండిపోయే చిత్రం ఇది.