[dropcap]వే[/dropcap]గుచుక్క పొడుపుతో, తొలికోడికూతతో
భానుడి తొలికిరణం ధరణిని తాకే సమయాన
ఏరువాక పూసి, ఆశల వ్యవసాయ సాగుమడి లోనికి
కర్తవ్య దీక్షాయోధుడై
పాడిఆవుల పాదాల గిట్టల గుర్తులో,
కోటిఆశలు నింపుకుని
నీ హృదయాన్ని దుక్కుమడి చేసుకుని
హలం కొర్రు చాళ్ళ అంచున కష్టాన్ని పరుచుకుని
అవని దుక్కుమడి గర్భాలయంలో
రక్తాన్ని స్వేదంగా మార్చి,
రెప్పల అంచును కన్నీరు చారలు దాచుకుని
నీ హృదయ ఆశల ఆరుమడిని నమ్ముకుంటే
ఆరుగాలం కష్టపడినా, కన్నీటితో నాగటి చాళ్ళను తడిపినా
చినుకుచుక్క కంట పడలేదు
కన్నీటిచుక్క కంటిగట్టు దాటలేదు
అయినా ఆశ చావక హలాన్ని నమ్ముకుంటె
ధుర్భిక్షం వెక్కిరించింది
అనావృష్టి పలకరించింది
ప్రకృతి వికృతంగా వికటాట్టహాసం చేసింది
పకృతి పగబట్టి ప్రతీకారం తీర్చుకుంది
కష్టాన్ని పెట్టుబడిగా పెట్టినా, కన్నీటితో హలాన్ని తడిపిని,ఆశల ఎరువు వేసినా..
రక్తకన్నీరే గానీ, పంట కంట పడలేదు
హాలికుడి ఇంట, వంట కంట పడలేదు, పొయ్యలో పిల్లి లేవలేదు..
హాలికుడి గర్భశోకం గంగమ్మ చెవిచేరలేదు
ఆలమందల గిట్టల శబ్ధాలలో, ఆశల గీతం వింటూనే ఉన్నాడు
తన కంటి కాన్వాస్ పై బీడువారిన వరిమడి చిత్రాలెన్నో గీస్తూనే ఉన్నాడు
హాలికుడి గర్భశోకం, కతలు, వెతలు
కన్నీటి చారలు గంగమ్మ కంటపడలేదా
రైతుబతుకులో మెతుకు తినే భాగ్యంలేదా
రైతు జీవనయానం నిండా, అతుకుల బతుకులు, గతుకుల వెతలూ
వ్యవసాయం సాయం చేయకపోయినా, తన జీవన చిత్రాన్ని నాగటి చాళ్ళలో వెతుకుతూనే ఉన్నాడు
ఆశల మేఘం కోసం, శోకతప్త హృదయంతో, నమ్మకాల ఆశలబాటలో బాటసారిలా హాలికుడు నడుస్తునే ఉన్నాడు
హలంచేత బట్టి, చెర్నాకోలు జుళిపించలేక, నిరాశవాద అలజడలును కన్నీటి చిత్రాల్లో భద్రంగా దాచుకుని
ఆశావాదం ముఖమంతా పూసుకుని, గరళకంఠుడిలా,శివుని మూడోకన్నులోని
అగ్ని కెరటాల భగభగలను భరిస్తున్న భోళాశంఖరుడెే భూమి పుత్రుడు.