దారి తప్పిన వయసు

0
3

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ప్రచురణార్హమైన కథలని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన శింగరాజు శ్రీనివాసరావు. [/box]

[dropcap]నం[/dropcap]దు ఆవేశంతో ఊగిపోతున్నాడు. అవమానంతో భగభగ మండిపోతున్నాడు. ఎందుకిలా… తనకేమి తక్కువ… తనను కాదంటుందా… ఎంత పొగరు… చూడాలి… దాని అంతు చూడాలి. రేపే తేలుస్తాను. ఒప్పుకుంటుందా. బ్రతికిపోతుంది. లేదంటే అంతే. మనసులో అనుకున్నాడు.

నందు అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఆనందకుమార్, డిగ్రీ మూడవ సంవత్సరం చదివే సాదాసీదా తెలివి తేటలున్న కుర్రాడు. ఇతను ఇంటర్‌లో ఉన్నపుడు తన సహ విద్యార్థిని కౌముది మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పే ధైర్యం అతనికి అప్పట్లో లేకపోయింది. మంచి మార్కులు వచ్చి, ఎంసెట్‌లో ర్యాంకు వచ్చి కౌముది బి.టెక్‌లో చేరింది. నందు బి.ఎస్.సి.లో చేరాడు. కానీ ఆమె మీద ప్రేమను వదులుకోలేక ఆమె కాలేజికి దారిలో కాచుకుని వుండి పలకరిస్తుండేవాడు. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కౌముది. నందును ఒక క్లాస్‌మేట్ మాత్రమే అనుకుని పలకరించేది.

ప్రతి రోజు ఆమెను కలవడం, మాట్లాడడం, ఆమె నుంచి విముఖత రాకపోవడంతో ఆమె కూడా తనను ప్రేమిస్తుందని అనుకోవడం అలా ఆరు నెలలు గడచిపోయాయి. ఒక రోజు ఉండబట్టలేక తన మనసులో భావాన్ని బయటపెట్టాడు నందు. ఉలిక్కిపడ్డ కౌముది వెంటనే స్పందించి తన కటువంటి ఉద్దేశం లేదని క్లాస్‌మేట్‌వు కనుక మాట్లాడుతున్నానని చెప్పింది. కానీ నందు తన ప్రయత్నం మానలేదు. విషయం నందు స్నేహితుల దాకా వెళ్ళింది. వాళ్ళు కూడా అతనికి సపోర్టు చేశారు. చివరిసారిగా నాలుగు రోజుల క్రితం కౌముదిని కలిశాడు నందు.

***

“కౌముది. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ. నువ్వు లేకుండా బ్రతుకలేను. నా మాట కాదనకు” బ్రతిమలాడాడు నందు.

“ఏంటి నందు ఇది. ఎంత చెప్పినా నీ మొండి నీదేనా. నాకు నీ మీద అలాంటి భావాలు లేవు. జస్ట్ ఫ్రెండ్. అంతే”

“ఫ్రెండ్‌ని బాయ్ ఫ్రెండ్‌గా చేసుకోలేవా?”

 “సారీ…”

“కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కౌముది. ఇక నా వల్లకాదు. నువ్వు గనుక ఒప్పుకోకపోతే…”

“ఏం చేస్తావ్… చంపేస్తావా. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా డాడీకి చెప్తాను. ఈ రోజు దాకా పోనీలే ఫ్రెండువు కదా అని ఊరుకున్నాను. నువ్వు లిమిట్స్ దాటి చాలా ముందుకెళుతున్నావు. ముందు డాడీకి చెప్పి, తరువాత పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను.”

“కౌముదీ. నా సహనాన్ని పరీక్షించకు. ఆఖరిసారి అడుగుతున్నాను. ప్రేమిస్తావా లేదా.”

“ప్రేమించనుగాక ప్రేమించను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మారావా సరి. లేదా నీ బ్రతుకు కటకటాల పాలే” విసురుగా పోబోయింది కౌముది.

చెయ్యి పట్టి లాగి చెంప ఛెళ్ళుమనిపించాడు నందు. బిత్తరపోయింది కౌముది.

“సారీ… సారీ… నువ్వు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. ఆవేశంతో కొట్టాను. ప్లీజ్ కౌముది. ఒక్క క్షణం ఆలోచించు, నాలాగా నిన్ను ప్రేమించేవాడు దొరకడు. కానీ నీకంతగా ఇష్టం లేకపోతే సరే. నా దురదృష్టమనుకుంటాను. నాకు నీ స్నేహం కావాలి” కౌముది కాళ్ళ మీద పడ్డాడు నందు.

కౌముది ముఖం జేవురించింది. అక్కడి నుంచి రుసరుస వెళ్ళిపోయింది. అలాగే కూలబడిపోయాడు నందు.

***

నందు చాలా సంతోషంగా ఉన్నాడు. తను మారిపోయానని అనుకుంటున్నది కౌముది. ఫోన్ చెయ్యగానే వస్తానన్నది. ఈ రోజుతో తన కసి తీరిపోతుంది. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదు. యస్. అవును. అంతే…

“ఏరా ఇంకా రాలేదా” అడిగాడు నందు స్నేహితుడు సంతోష్.

“వస్తుందిలేరా. మనమే చెప్పిన టైమ్ కంటే ముందుగా వచ్చాము” బదులిచ్చాడు మరో స్నేహితుడు మదన్.

ఒంటరిగా వస్తే తను అనుకున్న పని వర్క్ అవుట్ కాదేమోనని తన ఇద్దరు స్నేహితులను కూడ తోడు తెచ్చుకున్నాడు నందు.

ఇంతలో స్కూటీ శబ్దం వినిపించి అటు వైపు చూశారు. కౌముది వస్తోంది. అలర్ట్ అయ్యారు ముగ్గురు.

“రా నీ కోసమే చూస్తున్నాను” నందు గొంతులో వెటకారం.

“అవునా. ఏమిటి విశేషం. ఒంటరిగా రమ్మన్నావు. నాతో ఏదో మాట్లాడాలి అని చెప్పావు. మరి నువ్వెందుకు వీళ్ళిద్దరినీ తోడేసుకుని వచ్చావు” నిలదీసినట్టుగా ఉంది కౌముది మాట.

తడబడ్డాడు నందు.

“అబ్బే అదేం లేదు కోముది. నేను రమ్మనలేదు. వాళ్ళే నన్ను ఫాలో అయివచ్చారు. అంతే ” మాటల్లో తడబాటు.

“పర్వాలేదు. ఇంతకూ విషయమేమిటి? అందులో పర్సనల్‌గా మనిద్దరి మధ్య”

“మన మధ్య ఘర్షణ తరువాత నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండాలనుకున్నాను. నీ మీద వున్న ఫీలింగ్స్‌ను చంపేసి మామూలుగా ఉందామని చాలా ట్రై చేశాను కౌముది. కానీ నా వల్లకాలేదు. ఆ విషయం నీకు చెప్పి మాట్లాడాలంటే నువ్వు రావు. అందుకే మారిపోయినట్లుగా ఇన్నాళ్ళు నటించి ఇక్కడికి నువ్వు వచ్చేలా చేశాను. చివరి సారిగా అడుగుతున్నాను. నా ప్రేమను అంగీకరించు” నందు ముఖం వికృతంగా మారింది.

“అంగీకరించకపోతే” రెట్టించింది కౌముది.

“నాకు దక్కని అందం ఇంకొకడికి దక్కకూడదు. ఏ అందం చూసి నీ వెంట పడ్డానో ఆ అందాన్ని యాసిడ్ పోసి మాడ్చిపారేస్తాను” ఒక్కొక్క మాట వత్తి పలికాడు నందు.

కౌముది అనుకొని ఆ సంఘటనకు బిత్తరపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు.

“ప్లీజ్. కౌముది. వాడు నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడి మాట కాదనకు” అంటూ బ్రతిమలాడుతూ కౌముది దగ్గరకు వచ్చారు సంతోష్, మదన్.

“ఏయ్ చెప్పేది మీకు కాదు. వెధవ సోది. ఇందుకేనా నన్ను రమ్మన్నది. అయితే సరే నేను వెళుతున్నాను. ఏం చేస్తారో చేసుకోండి” అని పరిగెత్తబోయింది కౌముది.

అంతే ఒక్కసారిగా మందుకురికి ఆమె రెండు చేతులు పట్టుకుని వెనుకకు విరిచి కట్టేశారు వాళ్ళిద్దరూ.

“నాకు తెలుసే, నువ్వు ఒప్పుకోవని. అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చాను. ఇప్పుడు నిన్ను మేం ముగ్గరం కలసి రేప్ చేసినా అడిగే దిక్కు లేదు. కానీ నేనలా చేయను. ఏ అందం చూసి నేను మనసు పడ్డానో ఆ అందాన్ని నీకు లేకుండా చేస్తాను” పళ్ళు పట పట కోరుకుతూ ముందుకు రాసాగాడు నందు.

బిక్కచచ్చిపోయింది కౌముది. ఎలా… ఇప్పుడెలా… తప్పించుకోవడం ఎలా… మనసులో ఆలోచనలు పరుగెత్తుతున్నాయి.

“నువ్వు ఎంత ఆలోచించినా, గింజుకున్నా ఊరి చివర ఉన్న ఈ చోటికి ఎవరూ రారు. ఆఖరిసారి అడుగుతున్నాను. నా ప్రేమను అంగీకరిస్తావా… లేదా.”

“నువ్వు నన్ను చంపినా సరే నేను ఒప్పుకోను” ఖరాఖండీగా చెప్పింది.

“అరేయ్ దాన్ని గట్టిగా పట్టుకోండిరా” అని సంచిలోని బాటిల్‌ను వెలుపలకు తీశాడు నందు.

ఇంతలో స్కూటీ శబ్దం కావడంతో పక్కకు తిరిగి చూశాడు. అంతే అతని కాళ్ళు, చేతులు చల్లబడ్డాయి. తన చెల్లెలు అనిత, ఆమె వెనుక ఎవరో ముసలావిడ. ఎవరో కాదు కౌముది వాళ్ళ బామ్మ నాగరత్నమ్మ.

“ఓరేయ్ అన్నయ్యా కొంచెం సేపాగరా. ఇంకొక బాటిల్ కూడా తెచ్చాను. ముందు దీన్ని ఆ సంతోష్ గాడి కిచ్చి నా ముఖం మీద పొయ్యమను. తరువాత నువ్వు కౌముది మీద పొయ్యచ్చు” అంటూ నందు చేతికి బాటిల్ ఇవ్వబోయింది అనిత.

“ఎందుకొచ్చావు నువ్విక్కడికి? ఎవరు చెప్పారు నీకీ అడ్రస్? సంతోష్‌కు నీకు ఏమిటి సంబంధం?” ప్రశ్నల వర్షం కురిపించాడు నందు మనసులో భయపడుతూనే.

“సంతోష్‌కు నాకు ఏమిటి సంబంధం అన్నావు కదా, నీకు, కౌముదికి వున్న సంబంధం లాంటిదే. వాడు కూడా నన్ను చూసి, నువ్వు కౌముదిని పెట్టినట్టే నన్ను కూడా టార్చర్ పెట్టాడు. ముక్క చీవాట్లు పెట్టాను. ఆవేశంతో చెప్పాడు నీ వేషాల గురించి. నేను గనుక వాడి ప్రేమకు ఓ.కే చెప్పకపోతే, నువ్వు కౌముదిని ఏం చెయ్యాలనుకున్నానో నన్నూ అదే చేస్తానన్నాడు. అప్పుడు నాకు అనుమానము వచ్చింది నీ మీద. అప్పటి నుంచి నిన్ను ఫాలో అయ్యాను. నీ దురదృష్టం మొన్న నువ్వు నీ సెల్‌లో మీ ఫ్రెండ్స్‌కు ఇచ్చిన మెసేజ్‌లను డిలీట్ చెయ్యడం మరచిపోయావు. అవి నా కంటపడ్డాయి. భయమేసింది. కౌముది కూడా నాలాంటి అమ్మయే కదా. కాపాడాలి అనుకున్నాను. నీ సెల్‌లో నుంచి ఆమె నెంబరును నోట్ చేసుకుని తనతో మాట్లాడాను. ఏం చెయ్యాలో పాలుపోక ఇద్దరమూ కలసి బామ్మకు జరిగినదంతా చెప్పాము. ఆమె ఇచ్చిన సలహా ప్రకారం చిన్న పథకం వేసి నీ మాటలు నమ్మినట్లుగా నటించి ఇక్కడికి వచ్చింది కౌముది. కొంచెం సమయం తోసుకుని మేము ఇలా వచ్చాము” అర్థమయేటట్టు వివరంగా చెప్పింది అనిత.

అంతా విని కోపంతో ఉడికిపోతున్నాడు నందు. ఇప్పుడతని మెదడులో కౌముది గురించిన ఆలోచన కంటే, తన మిత్రుడు సంతోష్ తన చెల్లెలి పట్ల అలా ప్రవర్తించడం తను తట్టుకోలేకపోతున్నాడు. వాటిని చంపెయ్యాలన్నంత ఉక్రోషంగా ఉన్నాడు నందు.

“ఎంత మోసం చేశావురా సంతోష్. నువ్వు నా చెల్లెలిని ప్రేమిస్తావా. ఎంత ధైర్యంరా నీకు” అంటూ ఆవేశంగా వెళ్ళి సంతోష్ చొక్కా పట్టుకున్నాడు నందు. ఈ హడావిడిలో అతని చేతిలో సీసా కింద పడి పగిలిపోయింది. అవేవీ పట్టలేదతనికి.

“ఇందులో తప్పేమున్నది బ్రో. నువ్వు కౌముదిని ప్రేమించంగా లేనిది, నేను అనితను ప్రేమిస్తే తప్పేమిటి. నువ్వే నాకు మార్గదర్శివి తెలుసా” అంటూ నందు చేతిని విదిలించికొట్టాడు సంతోష్.

ఇదే అదనుగా వెళ్ళి బామ్మ పక్కన చేరింది కౌముది.

నందుకు తల తిరిగి పోతోంది. ఏదో అనుకుంటే. ఇదేమిటి ఇలా జరిగింది. పోయి పోయి అగ్నిగుండంలో వేలు పెట్టాను. ఇప్పుడేం చెయ్యాలి. ఈ కథంతా వెళ్ళి అనిత అమ్మా, నాన్నలకు చెబితే… అమ్మో… భయమేసింది నందుకు. ఆలోచనలో పడ్డాడు.

“ఏం నందు. పథకం పారలేదని దిగులు పడుతున్నావా. చూడు మమ్మల్ని నాశనం చేయడానికి మీరెలా స్నేహితులను రెచ్చగొడతారో, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మా ఆడపిల్లలం కూడా అలాగే ఆలోచిస్తాము. ఐకమత్యం మీలోనే కాదు, మాలోనూ వుంది. ఇంకో విషయం నాకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సహాయము కావాలసి వచ్చినా ముందు మా బామ్మను అడిగి సలహా తీసుకుంటాను. ఆమె అనుభవం నా పాలిట వరం. నీ గురించి ఎప్పుడో చెప్పాను, బామ్మ నన్ను ‘జాగ్రత్తగా వుండు. అతను ఏ మాటలు చెప్పినా నమ్మకు. నీ జాగ్రత్తలో నీవు ఉంటే అంతనేమీ చేయలేడ’ని చెప్పింది” అంటూ బామ్మ భుజం మీద చెయ్యవేసింది కౌముది.

“మీరు చాలా అదృష్టవంతులు కౌముది. మీకు సలహాలు చెప్పడానికి, మీ బాగోగులు చూసుకోవడానికి అమ్మ, నాన్నలే కాదు మీ బామ్మ కూడా ఉంది. ఆమె నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ మాకా అదృష్టం లేదు. మా బామ్మను మా నాన్న వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అమ్మా నాన్నా ఇద్దరూ ఉద్యోగాలకు వెళతారు. మా గురించి అసలు పట్టించుకోరు. అడిగినప్పుడల్లా ఎంత డబ్బు కావలంటే అంత ఇస్తారు వీడికి. అందుకే వీడు ఇలా తయారయ్యాడు. మంచి, చెడు చెప్పే పెద్ద వాళ్ళు వుంటే వీడిలా తయారవకపోను” వచ్చే కన్నీటి బలవంతంగా ఆపుకుంది అనిత.

“బాధపడకమ్మా. ఇందులో ఎవరి తప్పు లేదు. లోకమంతా ఇలాగే తగలడింది. పెద్దవారు ఇంట్లో వుంటే అడ్డమనుకుంటున్నారు గానీ. ఎంత పెద్ద ఆపో అర్థం చోసుకోలేక పోతున్నారు ఈ తరం వారు. మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడుతానుగా” అంటూ అనితను సముదాయిచింది నాగరత్నమ్మ.

ఇంతలో హఠాత్తుగా ఊడిపడ్డారు నందు తల్లిదండ్రులు. వాళ్ళను చూసి నోట మాట రాలేదు నందుకు. షాక్‌ల మీద షాక్‌లు తట్టుకోలేక పోతున్నాడు.

వస్తూనే నందు చెంప చెళ్ళు మనిపించాడు నందు తండ్రి.

“ఏందిరా ఇది. బామ్మగారు ఫోన్ చేసి విషయం చెప్పేసరికి మా పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది. ఎంత నీచానికి దిగజారావురా. ఛీ.” అని మరో సారి చెయ్యి చేసుకోబోయాడు.

“ఆగవయ్యా పెద్దమనిషీ. తప్పు నువ్వు చేసి, పిల్లవాడి మీద చెయ్యి చేసుకుంటావేమిటి… తగ్గు… తగ్గు… ” అంటూ హుంకరించింది నాగరత్నమ్మ.

అర్థం కాక ఆమె వైపు చూశాడు నందు తండ్రి.

“పిల్లలను దండించే ముందు మన తప్పు మనం తెలుసుకోవాలి. కోట్ల సంపాదించి పెడితే చాలు పిల్లలు సుఖపడతారని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారే తప్ప, వారి నడవడిక ఎలా వున్నది? సంస్కారంగా ప్రవర్తిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా? లేదే. ఇంతకు ముందు వారయితే వారి ఇళ్ళల్లో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల లాంటి పెద్దవారు వున్న మూలాన తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, వారు పిల్లలను చేరదీసి ఇది మంచి, ఇది చెడు, ఇలా నడవాలి, ఇలా మాట్లాడడాలి అని చెప్పేవారు. తప్పు చేస్తే దగ్గరకు తీసుకుని నేర్పుగా వారి తప్పును సరిదిద్ది మంచి మార్గంలోకి నడిపించేవారు. మరి ఈ రోజుల్లో పెద్దలు ఇంట్లో ఉంటే అడ్డం. అందుకే వృధ్ధాశ్రమాలకు పంపించి వేస్తున్నారు. పిల్లలను కార్పోరేట్ స్కూళ్ళల్లో పడేస్తున్నారు. మనిషికి, మనిషికి మధ్య వుండే అనుబంధాన్ని చేజేతులా పాతి పెడుతున్నారు. ఇంత తప్పులు మీరు చేసి అభం శుభం తెలియని పిల్లల మీద నిందలు వేస్తున్నారు. ముందు మీరు మారండి. తరువాత పిల్లలను దండించండి. వాళ్ళు నీళ్ళలాంటి వాళ్ళయ్యా. ఏ పాత్రలో పోస్తే ఆ రూపులో వుంటారు. అయినా పెద్ద వారు ఇంట్లో వుంటే మీకు కలిగే ఇబ్బంది ఏమిటో నా కర్థం కావటం లేదు. వాళ్ళ ఏమి అడిగారయ్యా అంత ముద్ద, ఓ చిన్న పలకరింపు అంతేగా. మీకు జన్మనిచ్చి, మీ కోసం కష్టపడి మిమ్మల్ని ఇంత వారిని చేస్తే మీరు వాళ్ళ పట్ల చూపే కృతజ్ఞత ఇదేనా. రేపు మీరు కూడా ముసలి వాళ్ళయితే, మీ బిడ్డలు కూడా మిమ్మల్ని ఇలాగే చేస్తే మీ గతేమిటి? ఒక్కసారి ఆలోచించడి. మీరెప్పుడూ యవ్వనంలో వుండరు. మీకు వయసొస్తుంది. మీరేం చేశారో మీ విషయంలో మీ పిల్లలూ అదే చేస్తారు. ఆ మాట మరచిపోకండి” ఆమె మాటల్లో ఆవేదనతో కూడిన ఆవేశం తొంగి చూసింది.

నందు తండ్రి మ్రాన్పడి పోయాడు. తను ఎంత తప్పు చేశాడో తెలుసుకున్నాడు. అవును ఆమె మాటలు నగ్నసత్యాలు. పెద్దవారు ఇంట్లో వుంటే ఎంత ప్రయోజనమో ఆమె చెప్పేటంత వరకు తెలుసుకోలేక పోయినందుకు సిగ్గుతో తలవంచుకున్నాడు. తన తల్లి పట్ల తను ఎంత నిర్దయగా ప్రవర్తించాడో తలచుకుంటే తన మీద తనకే అసహ్యం వేసింది అతనికి.

అటు నందు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా అయిపోయింది. వయసు చేసిన తొందరపాటుతో తనెంతటి అకృత్యానికి పాల్పడబోయాడో అతనికి తెలిసి వచ్చింది. తను తప్పు చేసి, సంతోష్‌ను నిందించాడు. అతని వివేకం మేలుకుంది.

“సారీ నందూ… నన్ను క్షమించు. దీని కంతటికీ సూత్రధారులు బామ్మగారు, అనిత. వారు వేసిన పథకం ప్రకారమే మేమంతా ఈ నాటకం ఆడాము. నిన్ను మార్చాలని, మీ బామ్మను ఇంటికి రప్పించాలని ఇలా చేశాము. నీలో ఆవేశం తప్ప, ఆలోచన లేదని గ్రహించి ఇంతా చెయ్యావలసి వచ్చంది. నీ చెల్లిని నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తను నీకెంతో నాకూ అంతే. మనకు కౌముది కూడా అంతే. చదువుకునే రోజులలో మన ధ్యాస చదువు మీదే వుంచాలి కాని ఇలాంటి పనికిమాలిన వాటి మీద కాదు. మన యువతే ఇలా పెడ దారి పడితే సమాజం ఏమవుతుందో ఆలోచించు. ఆకర్షణకు, ప్రేమకూ తేడా తెలుసుకో. ఇక వెళ్ళి కౌముదికి క్షమావణ చెప్పు. ఇక నుంచి మనమందరమూ మంచి స్నేహితులం. యువతరమంటే ప్రేమలో పడి కొట్టుకునేవారు కాదు నవ సమాజ నిర్మాణం కోసం ఇటుకలు పేర్చే కూలీలని లోకానికి తెలియజేద్దాం” అంటూ నందు చేతిలో చేయి వేశారు సంతోష్, మదన్.

తలవంచుకుని కౌముది వైపు నడిచాడు నందు.

“వాడిని కాదమ్మా క్షమించాల్సింది మమ్మల్ని. తల్లిదండ్రులుగా మా బాధ్యతను గుర్తుచేశారు మీ బామ్మ. అంతేకాదు కొడుకుగా నేనెంత అపరాధం చేశానో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అవనసరంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన మా కుటుంబాన్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించాలి” అంటూ నాగరత్నమ్మ కాళ్లమీద పడ్డాడు నందు తండ్రి.

“తప్పులు చేయటం మానవ సహజం. అవి తెలుసుకుని దిద్దుకుంటే చాలు మన మధ్య క్షమాపణ లెందుకు నాయినా. అందరమూ ఒకే కుటుంబం. పదండి” అంటూ ముందుకు కదిలింది నాగరత్నమ్మ.

అందరూ ఆమెను అనుసరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here