నవ్వేజనాసుఖినోభవంతు – 3: కళా‘రోదన’

0
4

[box type=’note’ fontsize=’16’] ‘నవ్వేజనా సుఖినోభవంతు!’ శీర్షికన భావరాజు పద్మిని గారు సంచిక పాఠకులకు అందిస్తున్న హాస్యరచనలివి. ఈ రచనలో దబదబా గడగడలాడించే కళాకారుల వల్ల జరుగుతున్న కళా‘రోదన’ గురించి వివరిస్తున్నారు. [/box]

[dropcap]స[/dropcap]ద్యో గర్భము, సద్యో జననము అన్న విషయాలని మనం పురాణాల్లో చూసాము. ఇటువంటివే నేటి ఇన్స్టంట్ ఫుడ్స్ కూడా. ఫుడ్ విషయంలోనే కాదు, ఇప్పుడు ఏవైనా త్వరత్వరగా జరిగిపోవాలి. అనుకోగానే ముంగిట్లో వాలాలి. కార్పరేట్ విద్యాసంస్థల ఫలితాల్లా, సభ్య సమాజంలో మన ప్రతిభ మారుమ్రోగిపోవాలి. పిల్లల్ని ఏవైనా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి క్లాసుల్లో వెయ్యగానే, నెల తిరక్కుండానే ప్రదర్శన ఇప్పించేసి, అలా ఇప్పించిన వాటిని సామాజిక మాధ్యమాలలో గుప్పించేసేలా, తల్లిదండ్రులను మెప్పించెయ్యాలి. అలాంటి దబదబా గడగడలాడించే కళాకారుడికే మనుగడ… మిగితా వారికి కటకట.

‘హు. ‘టాలెంట్’ కి ఎంకరేజ్మెంట్ లేదిక్కడ!’ అన్న డైలాగ్ ను ఇదివరలో సినిమాల్లో చూసి, నవ్వుకునే వాళ్ళం. ప్రేక్షకులేమైపోయినా పర్వాలేదు కాని, మేము మడుసులం కనుక, మా కలాపోసనను తాపత్రయంతో కలిపి, ఒలకబోసే దాకా మేము నెట్ ఆపము, అని ప్రతిజ్ఞ చేసే వారిని ఇప్పుడు చూస్తున్నాము.

సరిగ్గా ఇటువంటి రిఫైన్ కాని ఫైన్ ఆర్ట్స్ అన్నిటికీ వేదికగా ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ వంటివి మారాయి. సమ్యూల్, స్టార్ మేకర్ వంటి పాటల ఆప్స్ దెబ్బకి, అందరూ గాయకులు అయిపోయారు. టిక్ టాక్ వంటి ఆప్‌ల పుణ్యమా అని అందరూ నటీనటులు అయిపోయారు. ప్రభుదేవా బల్బు పెట్టడం, పేడ తొక్కడం, పిడకలు కొట్టడం వంటి జన బాహుళ్యానికి సులభమైన డాన్స్ కిటుకులు చెప్పాకా, అమ్మలక్కలు, అన్నలయ్యలు అంతా న్యూ ఇయర్, కిట్టి పార్టీల్లో, టీవీ షో లలో కదం తొక్కి, పూనకం వచ్చినట్లు ఊగిపోతూ డాన్సర్లు అయిపోయారు. అప్పనంగా దొరికిన ఫేస్బుక్ గోడల పుణ్యమా అని, అప్పుతచ్చుల అక్షరాలు, వరుసకు పది పొరపాట్లు దొర్లే పదాలు పేర్చేసి, వాటికి తవికలని శీర్షికలు పెట్టేసి, తప్పులెంచి సరిదిద్దబోయే మాలాంటి వాళ్ళను నిర్దయగా దునుమాడేసి, ‘పరస్పర లైక్, కామెంట్ సహాయ పధకం’ క్రింద కొంత కవిదండును వెనకేసుకుని, ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా జీవిస్తూ, ఎంతోమంది కవిరచయతా రచయిత్రులు రాత్రికి రాత్రే పుడుతున్నారు. ఇక మొబైల్ కెమెరాలను వాడేసి, ఎక్కడబడితే అక్కడినుంచి లైవ్ ఇచ్చేసి, అందరూ దర్శకులైపోయి, సిత్రాలు చూపిస్తున్నారు.

ఒకరోజున ఉదయాన లేవగానే మొబైల్ తీసి చూసాను. తళుక్కున మెరిసిందో వీడియో. ‘అరె, ఈ అమ్మాయి అడపా దడపా కవితలు రాసేది కదూ, ఇదివరలో… పాట పాడినట్టుంది, విందాం.’ అని తీసానా… ఆహా, శృతి, లయ, సాహిత్యంలో ఒత్తులు పోల్లులూ ఏమీ లేకుండా ఎంత శ్రవణ విదారకంగా పాడుతోందనుకున్నారు? పైగా డోలుకు మద్దెల తోడు లాగా, ఆమె కూడా ఇంకో మొక్కజొన్న పొత్తు జుట్టు రంగు రంగూన్ రాజా పాడుతున్నారు. ‘దొందూ దొందే’ సామెత గుర్తొచ్చింది. ఇటువంటి విపరీతాలు కలియుగంలో జరగనున్నాయని, బ్రహ్మం గారో, నోస్టర్డామసో చెప్పారో లేదో తెలీదు కాని, వెంటనే ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.

నరసాపురంలో నా బారసాలకి మా బామ్మని పాట పాడమన్నారట. వియ్యాలవారు, నలుగుర్లో అడిగినా, మా బామ్మ మొహమాట పడకుండా, ‘నాది బొంగురు గొంతు, నేను పాడితే గాడిదలు వస్తాయి’ అని నిర్మొహమాటంగా చెప్పిందట. అయినా వారంతా బలవంత పెట్టడంతో, రెండు లైన్లు పాడగానే, అసలే మా నరసాపురంలో గార్ధబాలు ఎక్కువేమో, మా బామ్మ పాటకు పులకించిన ఓ గాడిద, ఆరున్నొక్క రాగంలో తనూ శృతి కలిపిందట ! అది విన్నవారంతా, మా బామ్మతో సహా నవ్వులే నవ్వులు.

అప్పుడు మా బామ్మది తన పస తెలిసిన జ్ఞానం, వీరిది వస ఎక్కువ పోసిన అజ్ఞానం. అప్పట్లో బొంగురు గొంతులు బాన్, ఇప్పుడు బొంగురు గొంతులదే నిషాన్. పొద్దుటే ఇంతటి శరాఘాతంతో నా క్రియేటివిటికి విఘాతం కలిగాకా, నేను నా మనసుకు రెండు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించుకుని, లోలోపలే కుమిలిపోవాల్సి వచ్చింది. అయినా బుద్ధి వస్తేగా, అవధరించండి, మరో వైపరీత్యం.

కుంచె పట్టుకు లక్షణంగా బొమ్మలేసుకుని, ఫేస్ బుక్‌లో పెట్టే ఓ ముద్దుగుమ్మ, కవితలు కూడా బాగానే రాస్తుంది. అంచేత ఆమెపై నమ్మకం కలిగి, రెండు కళలను బానే నిభాయించింది కనుక, మిగతావి బానే ఉంటాయన్న భరోసాతో ఆమె పెట్టిన ఒక వీణ వీడియో తీశాను. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి ‘వర వీణా మృదు పాణీ’ అని ఎలుగెత్తి పాడిన ముచ్చట గుర్తుకొచ్చింది. దెబ్బకు నా సంగీత పరిజ్ఞానం ఆ కళామతల్లి దెబ్బకు కకావికలమైపోయి, పైన సా, కింద రీ, అని పాడుకుంటూ, ఏది ఎటుందో మర్చిపోయి, వారం రోజులు వాపోయాను. అయినా అజ్ఞాన నేత్రం తెరుచుకుంటేనా?

మళ్ళీ ఇదే బుట్టబొమ్మ, టిక్ టాక్‌లో ‘నాకు నటన రాదు సుమీ’ అన్న డిస్క్లైమర్ తో ఒక వీడియో పెట్టింది. కనీసం ఆ హెచ్చరిక చూసైనా నాకు బల్బు వెలగాలా? ఉహు… వీడియో తీశాను. మెడ పట్టేసిన వాళ్ళు తల అటు, కళ్ళు ఇటూ తిప్పి, సైగలు చేసినట్లు, కృష్ణగారు డాన్స్ రానందున చేతులు బిగపట్టి గెంతులు గెంతినట్టు, లేడీ రోబోట్ లాగా రెండు మూడు సంకేతాలు చూపింది. క్రింద 222 కామెంట్లు! ‘సూపర్ సిస్టర్, వాహ్వా, చంపేశారు, యు ఆర్ గ్రేట్ మేడం తో పాటు… రొటీన్ గా ‘గుడ్ మానింగ్ మేడం, టిఫిన్ తిన్నారా సిస్టర్’ వంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇక వాటి దెబ్బకి ఆవిడ యెగిరి ఫ్యాన్ ఎక్కేసి, రోజుకో డ్రెస్సు వేసుకుని, షో కేసులో బొమ్మలా, కీ ఇచ్చిన లోలకంలా మెడ చేతులూ విచిత్రంగా ఆడిస్తూ, రోజుకో వీడియో పెట్టసాగింది. విధి బలీయం. ‘ఋణానుబంధ రూపేణ… ఫేస్బుక్, వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్’ అని ఊరికే అన్నారుటండీ? ముందు జన్మలో చేసిన పాపాలకు ఇలా పరిహారం చెల్లించవలసిందే.

ఇంతటితో నేను మడికట్టుకు కూర్చుంటానని మీరు అనుకోకూడదు. ఎందుకంటే మీరు తెలివైన వారు కదా! పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఆకర్షించే ఒక భామిని, ఓ రోజున స్టార్ మేకర్‌లో పాట పాడిన వీడియో పెట్టింది. ఆవిడ ముక్కుతో పాడిన పాట సుమారుగా ఉన్నా, ఆవిడ వీడియోలో చూపే హావభావాలు, వలపు తొలకరులు ఒలకబోస్తున్నాయి. కాసేపు ‘ఛీ, పో, నాకు సిగ్గు’ అన్నట్లు సిగ్గు పడుతోంది, కాసేపు కళ్ళతో మరులు కురిపిస్తోంది. ఏకాంతంలో వెల్లడించాల్సిన భావాలను పాట ద్వారా బాహాటంగా ప్రదర్శించడం ఏమిటో నాకు కాసేపు అర్ధం కాలేదు. సరేలే అనుకుని వదిలేసా. మర్నాడు ‘నేను డాన్సర్‌ని తెలుసా’ అంటూ డాన్స్ వీడియో పెట్టింది. అది కుమ్ఫూ, కరాటే, కూచిపూడి తో కలిపి కొట్టిన కాక్ టైల్ లాగా ఉంది. తీన్ మార్‌కి, బెల్లీ డాన్స్‌కి పుట్టిన భావదరిద్రంలా ఉంది. ఎవరో చప్పున అననే అనేసారు, ‘మరికొంత సాధన అవసరమేమో, కాళ్ళు చేతులు విసిరేస్తున్నారు,’ అని. ‘అంటే నేను చాలా మంచి డాన్సర్ నండి, కాని నాకు ప్రస్తుతం జలుబు చేసింది,’ అని బదులిచ్చిందా భామామణి. ‘నీకు జలుబు కాదు తల్లోయ్, మాకు వాతం కమ్మేటట్టు ఉంది, నీ నాట్యం దొంగల్తోల’ అనుకున్నాను మనసులో.

ఇవి సరిపోవన్నట్టు, ఫేస్బుక్ లైవ్‌లు, వాచ్ పార్టీలు తయారయ్యాయి. ఓ రోజు పనెక్కువ ఉండడంతో అర్ధరాత్రి దాకా పని చేస్తూ ఉన్నానా. ‘మీ ఫలానా ఫ్రెండ్ లైవ్ ఇస్తున్నాడు, చూసి తరించిపో’ అన్నాడు ఫేస్బుక్ వాడు. ఆ ముచ్చట ఏవిటో చూద్దును కదా, నా పుణ్య వశాన, సదరు ఫ్రెండ్ దయ్యాలు లేవని నిరూపించే కార్యక్రమాన్ని ఆ రోజే పెట్టుకున్నాడట! ఎంచక్కా స్మశానానికి వెళ్లి, ఓ సమాధి మీద సెటిలయి అర్ధరాత్రి లైవ్ పెట్టాడు. ‘చూసారా, ఇక్కడ ఎటువంటి దెయ్యాలూ లేవు, ఈ సమాధులు చూడండి, వీళ్ళంతా ఎంత ఉల్లాసంగా, ప్రశాంతంగా నిద్ర పోతున్నారో,’ అని కామెంటరీ కూడా చెబుతున్నాడు. ‘వారి నాయనో, దేవుడో… ఇదేమి లైవ్ తండ్రోయ్, ఓరి నీ ధైర్యం సంతకెళ్ళ! శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం’ అని హనుమాన్ చాలీసా చదువుకుంటూ నిద్రపోయే ప్రయత్నం చేసాను. ‘వాచ్ పార్టీలంటే, ఇలా మొహం వాచేలా ఉంటాయా?’ అనుకుంటూ, ఆ షాక్ నుంచి తేరుకోడానికి మూడు రోజులు పట్టింది.

ఇది సోషల్ మీడియాలో దుర్గతి అనుకుంటే, ఒకసారి సమరోత్సాహంతో ఒక ఆలయంలో జరుగుతున్న పిల్లల వీణావాదన ప్రదర్శనకు ఒకరి ఆహ్వానంపై వెళ్లాను. పిల్లలంతా సంప్రదాయ బద్ధంగా అలంకరించుకుని ఉన్నారు. వెనుక వాళ్ళ టీచర్ 32 పొరల మేక్ అప్‌తో, నడుముకు భారీ వడ్డానంతో బొద్దుగా, ముద్దుగా ఉంది. పిల్లలు ‘హరివరాసనం’, ‘బ్రహ్మమురారి’ వంటి సులువైన పాటలను క్లిష్టంగా వాయించడం మొదలుపెట్టారు. అన్నీ అపస్వరాలే, తప్పుల తడకలే, ప్రేక్షకులు కకావికలం అయిపోతున్నారు. నేనూ వైణికురాలినే కావడంతో కొన్ని వీణలకు అసలు తీగలే లేకపోవడం గమనించాను. అదే విషయాన్ని వాళ్ళ టీచర్‌ను అడిగినప్పుడు, ‘ఆ ఎవరు చుస్తారండి, వెనుక ఉన్న పిల్లలు చెయ్యాడిస్తే చాలు. ఇరవై మంది పిల్లలతో ప్రదర్శన అన్నాను, అదీ ముఖ్యం’ అంది. అంటే కలరింగ్‌కే తప్ప, కళకు విలువ లేదన్నమాట ! లలిత కళలను త్రికరణశుద్ధిగా ఆచరించటం ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని విన్నాను. కాని, ఇలా ‘పేరుకోసం ప్రయాస’తో అవకతవకగా అఘోరించడం ద్వారా ప్రేక్షకులను నేరుగా కైలాసానికి పంపే ప్రక్రియ కూడా ఉందని అప్పుడే తెలుసుకున్నాను.

నవ్వుతానికి చెప్పిన పై అంశాలన్నీ పక్కన పెడితే, ఏ కళలోనైనా 90% ప్రావీణ్యం వచ్చేవరకు అసలు ప్రదర్శనకే అనుమతించేవారు కాదట నాటి గురువులు. మరిప్పుడో ఈ అరకొర కళలతో చేసే కలాపోసనతో చేసేదంతా కళారాధన కాదు, నిశ్చయంగా కళా ‘రోదనే’. అయినా ఈ శంకరాభరణం శంకర శాస్త్రి గారి ముచ్చట్లు ఎవరికీ కావాలి చెప్పండి? ఇప్పుడంతా స్పీడు, జెట్లు, రాకెట్లు, కనికట్లు… వీటితో పంచి పెట్టే ఇక్కట్లు. పై కథలను పాఠ్యపుస్తకాలకు ఎక్కించి, ‘ఇదిగో ఆవిడలాగా ఏ మీట పడితే అది నొక్కకండర్రా, ఏ ప్రదర్శనబడితే దానికి వెళ్ళకండర్రా, కళారోదకులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త !’ అని ప్రస్తుత తరానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను అజ్జక్షా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here