[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 6వ భాగం. [/box]
[dropcap]”మ[/dropcap]నం మన దేశములోనే ఉన్నామా?
మనకు స్వాతంత్రమొచ్చిందా??
అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి???
ఎలా ఉంటుంది?
ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన తెల్లవారు వదిలి వెళ్ళిపోవడమే స్వాతంత్ర్యమా? మరి అంతకు ముందుగా వచ్చి తిష్ట వేసిన ముస్లింలు పోయి తెల్లవాళ్ళు వచ్చినప్పుడు వచ్చిందేమిటి?
ఇప్పుడు తెల్లవాళ్లు పోగానే స్వతంత్ర్యం అంటున్నామేంటి?
వారు వెళ్ళి భారతావనిని చీల్చారెందుకు?
…… పసిది ఆకలికి ఉగ్గపడితే గుండె తరుక్కుపోతుంది.
పక్కనున్న మరో తల్లి తన స్తన్యాన్నిస్తది.
తోటి వాని కాలికి ముల్లు దిగితే మన ప్రాణం విలవిలలాడుతుంది…
పక్కింటి వారు చస్తే ఆ పూట అన్నం తినం, వెంట ఉంటూ బాధ పంచుకుంటాం. ఎందుకు?”
అని ఓ క్షణం ఆగి
“నేను వేసినవి మీకు పిచ్చి ప్రశ్నలుగా కనిపించవచ్చు. మనసున్న వెధవ వేసుకునే అనామకపు ప్రశ్నలు. కానీ మాష్టారూ వాటికి సమాధానం దొరికితేనే – ఇలాంటి పరిస్థితులకు సమాధానాలు దొరుకుతాది. కాదాంటారా? అని బిగుసుకొని పోతూ కనిపించాడు అబ్రహం.
“ఏయ్, ఎందుకలా ఆవేశపడతావు? అంత స్పందన మీలాటి వాళ్ళకుంటే ఎలాగయ్యా? మనస్సు మరీ చికాకవుతది” అన్నాడు దశరథం.
“మాష్టారు కుడిచేతి చిటికెన వేలుకు ఎవరి పొరపాటు వలననో కొంచెం దెబ్బ తగిలితే ఇది మైనారిటీల పట్ల జరుగుతున్న అమానుషం, అన్యాయం అన్ని గగ్గోలు వినిపిస్తుందిక్కడ. అక్కడ కుడిచేతినే పూర్తిగా తెగనరికినా ఆ వార్త వాళ్ళ వాళ్ళకు చేరదు. మాది మాకు కావాలి, కావాలి అని చీల్చుకొని వెళ్ళినాక – మిగిలి ఉన్న సర్వసత్తాక స్వతంత్ర భారతంలోని స్థితి ఇది. ఇదంతా ఏమిటి? అని అడిగేకంటే- అసలిలాంటిదేందుకు? అనుకోవడంలో తృప్తి ఉంటుంది” అని ఓ క్షణం ఆగి
“మాష్టారూ నా అన్నవాళ్ళను ఇంకా ఎందర్ని చంపుకుందాం?
ఎందురు బిడ్డల్ని బలిపశువులుగా అప్పగిద్దాం??
అన్ని ధర్మాలకూ పెద్ద పీట వేసిన మనం-
ఎంతకాలం మన ధర్మాన్ని వదిలేదాం? మనం మొదట భారతీయులం – we are Indians అన్న భావన లేని బలవంతపు జాతీయత ఎందుకు?” అన్నాడు.
నిజంగా అబ్రహం కళ్ళు నిప్పు కణాలలాన్నాయి.
దవడ కండరాలు అదోలా బిగుసుకొని చిత్రంగా కదులుతున్నాయి…
నుదుట తడి పొడిగా ఉంది చెమట.
“మాష్టారూ!
నేను చిన్నవాణ్ణి, తెలీనివాణ్ణి-
అందుకే ఆవేశపడవద్దు అంటున్నారు.
ఆవేశపడను-
కానీ-
మీరు అసలిదేమిటి? దీనికి పరిష్కారం ఎలా? అని మనస్సు పెట్టి ఆలోచించండి” అని-
“సార్ అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు-
వేటకెళ్ళారు-
ఏడు చేపలు తెచ్చారు-
ఎండబెట్టారు.
ఓ చేప ఎండలేదు.
ఈ కథను వినికిడి తెల్సిననాటి నుంచి వ్యక్తిత్వం ప్రారంభమైందాక విన్నాను-
కశ్మీరులోని మైనారిటీల బాదలు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా – ఇంకా కూడా
వినాల్సిందేనంటారా?
ఈ దేశాన్ని ఏలుతున్న పాలకులు ‘బదిరు’లా?
కాదు కదా అని ….
‘బ్రష్టుల పాలిట పడ్డ దేశమిది-’”
కళ్ళనిండా కమ్ముకొని ఉన్న నీటిని తుడుచుకొని
“మాష్టారూ! భూస్వాములకు – పేదలకూ – యజమానులకు – కార్మికులకు విబేధాలు పొడచూపడం సహజం గుణం- ఉన్నదాన్ని పొగట్టుకొనకుండా తెలివిగా పని చేయించుకోవాలని చూడడం యజమానుల సహజ గుణం.
ఇది కలిమి లేముల పొరాటం – మనిషికి చరిత్ర అంటూ మొదలయిన నాటి నుంచీ ఇది ఉంది. కొత్తకాదు –
దీనికి పూర్తి పరిష్కారాన్ని ఈ పృథ్విలో కనుగొన్న ఒకే ఒక వ్యక్తి మహనీయుడు ‘కారల్ మార్క్సు’. మనిషి చేసే శ్రమకు విలువను ప్రతిపాదించి ‘నీ పనితననానికి విలువ ఇది – ఆ విలువ మేరకు నీకు ఫలితం రాలేదూ?’ అంటే
‘నీ శ్రమ’ – ‘నీ శక్తి’ దోపిడికి గురి అవుతునట్లు అని విడమరిచి చెప్పాడు.
దీన్ని ఇలా వదిలేస్తే –
కన్నీరులో ఉన్న మైనారిటీలు హిందువులు.
మన దగ్గర నుంచి పాకిస్తాను అడిగి సాధించుకున్నట్లు-
కాశ్మీరులోయ లోని హిందువులకు తమ హక్కుగా కొంత భూబాగాన్ని కోరుకొనవచ్చుగదా? వారు చెప్పిన న్యాయమే గదా!
పైన జరిగింది న్యాయం అయినప్పుడు ఇదీ న్యాయమే గదా!
ఈ భావన స్వతంత్రం వచ్చాక వచ్చిందని విన్నాక అదేదో కనిపించక బిక్కచచ్చిపోయిన క్షణాన ఇన్ని సంవత్సరాల అణగారినతనం నుంచి ఈ భావన పుట్టింది. ‘జీలమ్’ నదికి తూర్పు ఉత్తర బాగాల నుంచి శ్రీనగర్, అనంతనాగ్, బాడ్‌గాం, కుప్వారా జిల్లాల పరిధిలో సాయంగా కాశ్మీరు లోయలోని 40% భూభాగాన్ని యూనియన్ టెరిటరీగా బారత రాజ్యాంగ పరిధిలో ప్రకటించి ఆ ప్రాంతాన్ని వారి నివాసయోగ్యంగా (మైనారిటీలకు) అప్పగిస్తే తప్ప-
ఈ జీవన మరణ పోరాటానికి విముక్తి దొరకదని వారి భావన.
ఇక మాష్టారూ !
అక్కడి పరిస్థితులను కూలంకుషముగా పరిశీలిస్తే మనసుపెట్టి గమనిస్తే వారి కోరికను అర్థమూ పరమార్దమూ ఉన్నదని…
జమ్మూ కాశ్మీరు భూభాగములో
ప్రస్తుతం-
ఏడులక్షల పై చిలుకు కాశ్మీర హిందువులున్నారు-
అక్కడ వారు సూర్యోదయంలో బితుకు బితుకుమంటూ బ్రతుకు ప్రారంభిస్తున్నారు.
సూర్యాస్తమయం అయ్యాక-
భయంతో గుబులు గుబులుగా
ప్రతి క్షణాన్ని గమనిస్తూ బ్రతుకీడుస్తున్నారు.
న్యాయానికది మనసున్న మనిషి బ్రతకాల్సిన బ్రతుకు కాదు.
వారి ముఖాన ఎంతటి సంతోష కరమైన రోజునా మనసు నుంచి వచ్చిన మందహాసం చూడం, పట్టుమని రెండు గంటలు ఆదమరిచి నిద్రించే కుటుంబం లేదు.
తిన్నది ఒంటపట్టదు.
‘భయం’ తప్ప మరో భావన మనస్సుకు రాని దశ-
అసలింత కాలం అక్కడే-
ఆ మెంటల్ టార్చర్‌తో ఎలా బ్రతకగల్గుతున్నారో?
తీవ్రవాదం పేరిట వెలసిన రకరకాల ముఠాల ద్వేషాగ్ని పాశవికతకు – దాదాపు రెండున్నర లక్షల మంది జనం- అన్నీ వదలి తల దాచుకునేందుకు చిందర వందరగా పారిపోయారు.
వారి ధర్మాలు స్థిరాస్తులూ నాశనమయినాయి.
ఇక మిగిలి ఉన్నది ఉన్నవారు” అని ఆగి లేచాడు.
“ఇక్కడ ఉన్న తీవ్రవాదులు ఎన్ని ముఠాలో తెలుసా మాస్టారూ? నూటా అరవై పైన –వీటిలోని వాటికి పాకిస్తాన్‌కు వత్తాసు. దాని వత్తాసు తెల్సుగదా- వీళ్ళలో ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా పంచాయీతీ వచ్చినా బలి పశువులు వీళ్ళే.
ఒకసారి ఓ అవ్వను వివరాలు అడిగాను – బావురమని ఏడ్చింది పసిదానిలా- ఎంత దయనీయంగా ఉందో ఆ ఏడుపు చెప్పలేను. ఇంత ఏడ్చింది, కాని మాష్టారూ, పెదవి విప్పి ఒక్కమాట చెప్పలేదు. ఆవిడ కంటి నుంచి నీరు అంతగా జారలేదు. అంతకు ముందు ఎప్పుడో అవి ఇంకిపోయి ఉంటాయి.
మాష్టారూ దాదాపు నాల్గువేల మంది జమ్మూ గుడరాలలో శరణార్థులుగా మిగిలి దయనీయమైన స్థితిలో- మరణ మృదంగం చప్పుడు వింటూ- చావుకు అతి చేరువుగా ఉన్నారు. ఇక – కొందరు మాత్రం భయంతో అనుక్షణం వేగలేక- బ్రతుకు పై విరక్తి కల్గినా చావలేక మతాన్ని మార్చుకున్నారు. ఇదంతా మనకు గర్వంగా పాలిస్తున్న మన గౌరవనీయిలైన నేతలకు తెల్సు. ఇందులో రహస్యమేమీ లేదు.
అక్కడి హిందువులు ఈ మధ్యన ఒకసారి ఒక విన్నపాన్ని రాష్ట్రపతికి పంపారు.
దాన్నే ప్రతిపక్షాలలో ఉన్న నిష్ణాతులకు ప్రభుత్వానికి కూడా పంపారు.
అదేమంటే-
కాశ్మీరు లోయలో మిగిలి ఉన్న కాశ్మీర పండితులకు సర్వసత్తాక పౌరహక్కును ప్రసాదించి (న్యాయంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి అడ్డమైన వానికీ ఇస్తున్నదదే), వారికి బ్రతికేందుకు కనీస రక్షణ కల్గించాలని ఈ బాధ్యతను కాశ్మీరు ప్రభుత్వానికి దాఖలు చేయక బారత ప్రభుత్వమే తీసుకోవాలనీను-
ఇది అసలు కోరికేనా? అనిపిస్తుంది మనకు” అని
“ఏది ఏమైనా సార్! మనకు చరిత్ర ముందు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి వస్తుంది.
‘కాశ్మీర్’ హిందువుల నుంచి వచ్చిన ఏ పోలికేక అయినా-
‘కమ్యూనలిజం’ నుంచి వచ్చింది మాత్రం గాదు.
ఆత్మ రక్షణ నుంచి వచ్చిన ఆర్తనాదం.
మరి –
ఇక్కడున్న నూట ఇరవై ఏడు దేవాలయాల తలుపులు శాశ్వతంగా మూసి వేయబడి ఉన్నాయి. జేగంటల ధ్వని మూగపోయింది. ఇంత దీపారాధన లేదు.
చివరకు-
ఏడు నుంచి ఎనిమిది వందల గ్రామాలకు సైతం పేర్లును త్రీవ్రవాదులు మార్చిపారేశారు.” అంటుండగా కాఫీ వచ్చింది.
కప్పు తీసుకున్నాడు తప్ప తాగలేకపోయాడు. ప్రక్కన పెట్టి “మళ్ళా వస్తాను సార్” అని నమస్కరించి వెళ్ళిపోయాడు.
‘కాఫీ’ అయినా త్రాగి వెళ్ళరా అందామనిపించిది కాని అనలేకపోయాడు.
ఒకే అధికారం క్రిందా ఒకే సమాజంలో …
“కాఫీ త్రాగాకా ఆలోచనల్లోకి వెళ్ళండి” అంది విజయ
“పరధ్యానం కాదమ్మా, బ్రతుకు సరళిలోని భిన్నత అర్థంగాక ఇలా కూర్చుడిపోయాను.”
“ఇంకొక కప్పు త్రాగుతావా నాన్నా” అంది విజయ.
“అక్కరలేదు” అన్నాడు అదోలా చూసి.
(ఇంకా ఉంది)