ఆమని-8

0
5

[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 8వ భాగం. [/box]

[dropcap]”ఆ [/dropcap]మాట నువ్వు ముందే చెప్పొచ్చుగా. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పనిలో పెట్టాలో వద్దో ఆలోచించుకుంటారు. చదువుకునే వయస్సులోని పిల్లల్ని పనుల్లో పెట్టుకోవడమూ నేరమే. తల్లిదండ్రులకు చెప్పకుండా, మరెవరికీ చెప్పకుండా తీసుకెళ్ళడానికి అతనెవరు? పంపడానికి నువ్వెవరు?” అంటూ చకచకా ఎస్.ఐ.కి ఫోన్ చేసింది.

హుటాహుటిన అతనొచ్చాడు.

“వారం రోజుల నుంచీ ఆడపిల్లల జాడ తెలియకపోతే ఇప్పటివరకూ మీరేం చేస్తున్నారండీ? ఏ చర్య తీసుకోకుండా ఎందుకున్నారు? గిరిజనులకు అండా, దండా లేదనే మీరంతా నిర్లక్ష్యంగా వున్నారు” అన్నది గట్టిగా.

“వీళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే ఎంక్వైరీ మొదలుపెట్టం మేడం. సాక్ష్యాలు దొరకలేదు. ఇప్పుడు సాక్ష్యం దొరికింది గనుక వెంటనే నేరస్థుడిని పట్టేసుకుంటాం” అంటూ వెళ్ళిపోయాడు.

పాములని గిరిజనుడే ఒకడున్నాడు. పనీపాటా చేయకుండా సోమరిగా తిరుగుతూ ఎక్కడ రూపాయి దొరుకుతుందా అని నక్కలాగా కాచుకుని వుంటాడు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. వాళ్ళ పద్ధతిలో అడిగేటప్పటికి తాను ఆ ఆడపిల్లల్ని ఎవరికప్పజెప్పాడో చెప్పేశాడు. పోలీసులు వెళ్ళి వాళ్ళను పట్టుకున్నారు. ఇలాంటి పిల్లల్ని పదిమందిని పోగుచేసి తర్ఫీదు ఇచ్చి వ్యభిచార వృత్తిలోకి దింపటానికి కొత్తగా పురుడు పోసుకొన్న ముఠా ఒకటి ప్రయత్నిస్తున్నది. స్వర్ణభారతి నగర్‌లో అంతా కాయకష్టం చేసుకునే వాళ్ళుండే ప్రాంతంలో ఒక మాదిరి ఇల్లు తీసుకుని వీళ్ళనక్కడ వుంచారు. ఇక్కడే వుంచి వృత్తిలోకి దింపడమా లేక వేరే ప్రాంతానికి తరలించడమా తర్వాత ఆలోచిద్దామనుకున్నారు. అన్ని వ్యాపారాల్లోకీ ఇది శ్రమ తక్కువ, రాబడి ఎక్కువ అనే భ్రమలో పడిపోయారు. కొత్తగా ఈ వ్యాపారంలో కంటూ అడుగుబెట్టి అనుభవం లేకపోవడం వలన వెంటనే దొరికిపొయ్యారు. ఆడపిల్లలందర్నీ ఎవరి ప్రాంతాలకు వాళ్ళను పంపేశారు.

గుత్తికొండ ప్రాంతపు ఈ గిరిజన ప్రాంతపు ఆడపిల్లల తల్లిదండ్రులైతే స్నేహలత కాళ్ళ మీదే పడ్డారు ఏకంగా.

“మీరు పట్టించుకోబట్టే మా పిల్లలు క్షేమంగా మాకు దొరికారు. మీరు చేసిన ఉపకారం ఈ జన్మలో మర్చిపోం. మీ ఋణం తీర్చుకోలేమమ్మా” అంటూ కన్నీళ్ళు కార్చారు.

“వసతి గృహం నుంచి ఎందుకు అలా వెళ్ళిపోయారు?” అని అడిగితే, “టీ.వీ. సీరియల్ తీస్తున్నారు. దాంట్లో యాక్ట్ చేయటానికి మీలాంటి గిరిజనుల పిల్లలే కావాలి. గుంటూరు కొచ్చి హోటల్ రూమ్‌లో సెలక్షన్ చేసుకుంటున్నారు. అందరికీ తెలిస్తే చాలామంది మేమూ వస్తామంటారు. మీకు ఛాన్స్ రాకపోవచ్చు. ఎవరికీ చెప్పకుండా వచ్చెయ్యండి. నేను సెలెక్ట్ చేయిస్తాను. షూటింగ్ అయిపోయాక మరల హాస్టల్‌కెళ్ళి చదువుకో వచ్చు అని ఆశపెట్టారు. అది నిజమని నమ్మి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళాము” అన్నారు పిల్లలు.

“ఎవరో ఏదో చెపితే వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవరికీ చెప్పకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా వెళ్ళటం చాలా పొరపాటు. మొదటి తప్పుగా భావించి మిమ్మల్ని వదిలివేస్తున్నాం. ఇకనైనా బుద్ధిగా చదువుకోండి.”

“మీ పిల్లలకి మీరు జాగ్రత్తలు చెప్పండి. దీంతో భయపడి పిల్లల చదువులు మాన్పించొద్దు. వసతి గృహాల్లో ఇంకెప్పుడూ పొరపాట్లు జరగవు. ఇంకొక విషయం.. మీ ఏరియాలో మీరంతా చిన్న చిన్న గుంపులుగా వుంటున్నారు. గిరిజన సమితిలో మీరంతా మీ పేర్లు నమోదు చేయించుకోండి. ప్రభుత్వం తరఫు నుంచి అందే సహాయ సహకారాలు అప్పుడే పొందగలుగుతారు. మీలో ఎవరూ సోమరిగా వుండొద్దు. కష్టపడి పని చేయండి. అటవీ ప్రాంత పరిధిలో వుంటున్నారు కాబట్టి అటవీ సంపదను కాపాడాలి.

ఇక్కడ ఏయే ఔషధుల మూలికల మొక్కలు సాగు చేయచ్చో పరిశోధనలు చేయిస్తున్నాం. ఆ రిపోర్టులు రాగానే ఆయా మొక్కల్ని మీకందరికీ సరఫరా చేస్తాం. వాటిని సాగులోకి తేవాలి. మీకూ పని దొరుకుతుంది, ఆదాయమూ పెరుగుతుంది. మీరంతా కలిసి ఒక సంఘంలాగా వుండండి. సంఘబలంతో అధికారులతో మాట్లాడి మీక్కావలసిన పనులు సాధించుకోండి.

అన్నలు చెప్పారనో, మరెవరో ఏదో చెప్పారనో ప్రభుత్వ వ్యతిరేక పనులకు పాల్పడవద్దు. కష్టపడి పనిచేసి ఉత్పత్తి నెక్కువ సాధించేడంపై దృష్టి పెట్టండి. లాభాలు కూడా పొందండి. నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడకు వస్తూనే వుంటాను. నేను చెప్పినవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. త్వరలోనే ఇక్కడ ప్లాంటేషన్ పనులు మొదలవుతాయి. మీరు పండించిన వాటిని అమ్ముకోవటానికి మార్కెట్ సౌకర్యామూ మేమే కల్పిస్తాం. పశువుల్ని పెంచుకోండి. వాటి కొనుగోలుకు ఋణం ప్రభుత్వమే ఇస్తుంది. ప్రతి పిల్లనూ, పిల్లవాడినీ చదివించుకోండి. వెనుకటిలాగానే దరిద్రంలో వుండిపోవద్దు. కష్టపడండి. బ్రతుకుని సౌకర్యవంతంగా మార్చుకోండి. సుఖంగా వుండొచ్చు” అని చెప్పి వచ్చేసింది.

***

రాత్రి భోజనాలకు కూర్చున్నారు స్నేహలతా, ఆమె అమ్మానాన్నా.

“కోటప్పకొండ వెళ్ళినప్పుడు మోకాలు చిక్కబట్టింది. ఇప్పటికీ అప్పుడప్పుడూ నొప్పి కలుక్కుమంటునే వున్నది. అమరావతి గుళ్ళో దర్శనం ఇబ్బదేం లేకుండానే అయిపోయింది. రెండు చోట్లా నీ గురించే దణ్ణం పెట్టుకున్నాను స్నేహలతా” అన్నది తల్లి.

“అలాగే దేముడు నీ మాట వింటాడులే. నన్ను సుఖంగానే వుంచుతాడు. కొద్దిరోజులాగు. విజయవాడ కనకదుర్గమ్మ గుడికీ, కొండవీడు కోటా చూట్టానికీ పంపుతాను. దూరాలిష్టపడవు. గుడి తప్పితే మరో చోటికి పోవటానికి ఇష్టపడవు. లేకపోతే ఆంధ్రాలో చాలా ప్లేసెస్ కెళ్ళి చూడొచ్చు. నాన్నగారూ మీకేమైనా ఇంట్రెస్ట్ వుంటే అమ్మనూ తీసుకెళ్ళచ్చు. కొల్లేరు సరస్సు, నాగార్జున సాగర్, హార్స్‌లీ హిల్స్ వగైరా.”

“ఇవన్నీ చాలావరకూ చూసిన వేనమ్మా. నా రిటెన్ వర్క్ పూర్తి కావచ్చింది. ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. అమ్మ ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు.”

స్నేహలత ఫోన్ రింగయ్యింది. కిషోర్ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ తీసుకుని తన రూమ్‌లో కొచ్చేసింది.

“నువ్వు మరలా కనిపించావనీ, నిన్ను చూచి చాలా సంతోషపడ్డాననీ సౌందర్య ఫోన్ చేసింది. సౌందర్య అన్నట్టుగా ఎప్పుడూ మీ అమ్మానాన్నల్ని మాత్రమే వెంటేసుకుని తిరుగుతారా? మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, స్నేహలతా! ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి జీవితాన్ని బలి పెట్టుకునే వారుంటారా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంత బాధ కలుగుతుందో మాటల్లో వర్ణించలేను. గుర్తొచ్చినప్పుడల్లా గుండెను తూట్లు పొడిచే వేదనను మోస్తూ తిరుగుతున్నాను స్నేహలతా! ఇలా మీరు ఒంటరిగా మిగిలిపోవటానికి కారణం నేనే కదా? నా నేరాన్ని బాగా పెద్దది చేసి నన్ను నేరస్థుడిగా మిగిలిపోయేటట్టు చేస్తున్నారు స్నేహలతా. మీరెంతో తెలివిగలవాళ్ళు. మనసునెందుకు మార్చుకోరు? ఒక ఫూల్ కోసం, వాడు చేసిన ఫూలిష్‌నెస్‌కు మీరు బలి కావటమేంటి స్నేహలతా? ఆలోచించండి. ఈ అసమర్థుడి గురించి ఆలోచిస్తూ పండంటి మీ జీవితాన్ని అడవిగాచిన వెన్నెల్లా చేసుకుంటున్నారు. ప్లీజ్! స్నేహలతా. సరియైన దారిలోకి రండి. మీ ఎదురుగా నన్ను మరింత సిగ్గుపడేవాడిలాగా చెయ్యొద్దు. మీ జీవితం గురించి, సౌందర్య హెల్త్ గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి పని మీద కూడా కాన్‌సన్‌ట్రేషన్ చెయ్యలేకపోతున్నాను. కొన్నాళ్ళు శెలవు పెట్టి ఆంధ్రా వచ్చేద్దామా అన్పిస్తున్నది. జీవితంలో నేను ఎవర్నీ ఇంతగా ప్రాధేయపడలేదు” అన్నాదు కిషోర్ బాధనణచుకుంటూ.

“ఎమోషనల్ అవకండి కిషోర్! అది నాకున్న బలహీనత అనుకోండి. నా చేతగానితనమే అనుకోండి. మనసునంత తేలిగ్గా అటూ ఇటూ డైవర్ట్ చేసుకోలేను నేను. మనసు లేని చోట పెళ్ళేంటి? ప్రేమ లేని చోట కాపురమేంటి? నా గురించి ఆలోచించడం తగ్గించండి. ఇప్పుడు నేను కనిపించాను కాబట్టి ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్ళు మీ దారిన మీరు హ్యాపీగానే వున్నారుగా. అలాగే వుండండి. నా గురించి ఆలోచించడం మానేయండి. విధి వ్రాత అనుకుని నేను బ్రతికేస్తున్నాను. ఇంతకీ పిల్లలేం చేస్తున్నారు? పడుకున్నారా? వాళ్ళమ్మ కోసం పేచీ పెట్టుకుంటూనే వున్నారా?”

“టాపిక్‌ను డైవర్ట్ చేయకండి స్నేహలతా. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఆలోచించండి. ఇంకెలా చెప్తే మీకర్థమవుతుంది?ఎలా అయితే మీరు అర్థం చేసుకుంటారు స్నేహలతా? మీ పేరెంట్స్ నన్నెన్ని విధాలా తిట్టుకుంటూ వుండి వుంటారో కదా? నా వలన ఆ పెద్దవాళ్లకు ఎంత బాధ కలిగిందో? నేనేం చేస్తే వాళ్ళ బాధ తీసెయ్యగలను…”

“మీరు మరీ అంతగా బాధ పడాల్సిన అవసరం లేదు. నాకేదో కొరతగా వున్నదన్న ఫీలింగ్ నాకేమీ లేదు. నా యవ్వన కాలంలో నాకు లభించిన స్నేహం, ప్రేమ, ఆ అనుభూతులు నా జన్మకు సరిపడా లభించాయి. ఆ జ్ఞాపకాలతో, ఆ జ్ఞాపకాల తోడుగా నేను జీవితాంతం గడిపేయగలను. మీరింకేం ఆలోచించద్దు.”

“ఆలోచించకుండా ఎలా వుండగలను స్నేహలతా? నా తోటి వ్యక్తిని, నా ప్రేమ భాగస్వామిని నట్టేట వదిలి పెట్టి నా మట్టుకు నేను ఒడ్డుకొచ్చి సుఖంగా వుండటం న్యాయమేనా? నా భాగస్వామి కూడా నా వెనకాలే ఒడ్డు చేరుకుంటుందనుకున్నాను గాని తన జీవన పడవను అక్కడే ఆపేసి నాకిక్కడే బాగుంది, ముందుకు రానంటే దాన్నేమనుకోవాలి? అవివేకమా? ఒడ్దుకొస్తే నీ జ్ఞాపకాలు కరిగిపోతాయి, ఇక్కడే వాటిని ఆస్వాదిస్తూ వుండిపోతానంటే ఎలా వుంటుందో అలా వుంది మీ వాదన.”

“మీ మిసెస్ హెల్త్ పట్ల, పిల్లల చదువుల పట్ల, మీ బాధ్యతల పట్ల దృష్టి పెట్టండి. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడొచ్చా అన్నారు, ఈ టాపిక్ అయితే వద్దు. మామూలుగా మాట్లాడితే ఓకే.. సరే, వుంటాను. బై” అంటూ ఫోన్ పెట్టేసింది.

సుమబాల కాల్ వెయింటింగ్‌లో వున్నది. ఫోన్ రింగ్ చేసింది.

“హాయ్! స్నేహలతా! ఎలా వున్నవు? మా సుల్తాన్‌పూర్‍లో అందరూ, ముఖ్యంగా సత్సంగ సభ్యులూ, గుడి దాతలూ నీ పేరే జపిస్తున్నారంటే నమ్ము. నువ్వు చెప్పిన దేవతా వనం విషయం వాళ్ళ మనసుల్లో పాతుకుపోయింది. ఆ చెట్లన్నింటినీ తెప్పించుకుని, నాటించి వనలక్ష్మి అక్కడే స్థిరనివాసంగా వుండేటట్లు చూసుకోవాలని ఆశపడుతున్నారు. గుడి దాతలైతే ఇంకాస్త పొలమూ, తోటలోని చెట్ల కవసరమయ్యే నీటి మోటారు అన్నీ సమకూర్చుతానంటున్నారు. వారు ఇంటికొచ్చి నాతో ఈ విషయాలన్నీ చెప్పారు. ‘మంచి స్నేహితురాలిని, ఆపై అటవీశాఖాధికారినీ తీసుకొచ్చి మాకు పరిచయం చేశారు. పైగా ఎన్నో విషయాలను చెప్పించారు’ అంటూ నీ మంచితనంలో, నీ తెలివితేటల్లో నాకూ భాగం పంచుతున్నారు. అరవింద్, సేవంతికా ఇద్దరూ నిన్ను బాగా గుర్తు చేసుకుంటున్నారు. వింటున్నావా నేను చెప్పే మాటలు? బోర్ కొట్టిస్తున్నానా?” అంది.

“ఛ. ఛ. అదేం లేదు. నువ్వు చెప్పే ప్రతీ అక్షరం శ్రద్ధగా వింటున్నాను. నాకు మాట్లాడే ఛాన్స్ ఎప్పుడిస్తావా అని చూస్తున్నాను. నేనే మీ అందరికీ థాంక్స్ చెప్పుకోవాలి. నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. ఆ మాటలకు విలువిచ్చి మొక్కలు నాటే పనికి పూనుకున్నారంటే చాలా చాలా థాంక్స్ సుమా. పిల్లలకి నా ముద్దులు. మీ శ్రీవారికి నా నమస్కారాలందజేయి. మొక్కల్ని బాగా పెంచండి. పెరిగిన తర్వాత మరోసారి చూడ్డానికి వస్తాను” అంది. ఇంకాసేపు మాట్లాడితే తన పెళ్ళి ప్రస్తావన తప్పకుండా తెస్తుంది సుమబాల. తన దగ్గరేం సమాధానం లేదు. ఆ విషయమాలోంచి, “ఇక వుంటాను సుమబాలా” అంటూ ఫోన్ పెట్టేసింది.

***

ఆ రోజు ఆఫీసులో కూర్చుని వున్నది స్నేహలత. ఆమెను కలవడానికి ఎవరో ఆడవాళ్ళు వచ్చారని సబ్ సెక్షన్ అటెండర్ వచ్చి చెప్పాడు. లోపలికి పంపించమంది. నలుగురైదుగురు ఆడవాళ్ళు గుంపుగా వచ్చారు.

“దండాలమ్మా…”

“నమస్కారం. ఎవర్ని కలవాలని వచ్చారమ్మా?”

“తమర్నేనమ్మా. మావాళ్ళు మిమ్మల్ని గురించి చానా మంచిగా చెప్పుకుంటే ఇని వచ్చాం. మాగ్గూడా మీ సాయం కావాలమ్మా.”

“మీ ఇబ్బందేంటో అది చెప్పండి ముందు. వీలవుతుందా లేదా అని నేనాలోచిస్తాను.”

“మాకొక ఊరంటూ లేదు. ఒక ఇల్లంటూ లేదమ్మా. ఎక్కడ పొట్ట నిండితే అక్కడే మకాం పెడతాం. ఎక్కువగా అడవి అంచుల్లోనే వుంటాం. మా మగోళ్ళు చిన్నా పెద్ద జంతువుల్ని ఏటాడుకొస్తారు. మేం ఆడాళ్ళం ఊరురా తిరుగుతూ కతలు చెప్పుకుంటూ వుంటాం. ఆ కతలు విన్నవాళ్ళు డభ్భో, బట్టలో ఇస్తే తీసుకుపోతాం. సాయంకాలానికల్లా మళ్ళీ అడవి అంచులో వున్న ఇళ్ళ కెళ్ళిపోతామమ్మా.”

“కథలంటే ఏం కథలు చెప్తారు?”

“బాలనాగమ్మ కత, పల్నాటి ఈర చరిత్ర, బొబ్బిలి రాజుల కత ఇల్లాంటి కతలు చెప్పుకుంటూ తిరుగుతాం. మాలో ఒకరు పాట పాడతారు, ఒకరు వాయిద్దెం వాయించుతారు. మరొకరు కత చెపుతారు. ఇలా కొంతమందిమి కలిసి తిరుగుతూ వుంటాం. మాకేమీ సరుకొచ్చిగాదు తల్లీ, మా పెద్దోళ్ళు చెప్పే కతల్నే ఇని గుర్తెట్టుకుంటాం. మాకెలాగూ సదువు లేదు. మా పిల్లకాయలకూ అక్షరమ్ముక్క నేర్పిద్దామమ్టే, ఎక్కడుండాలి? ఎక్కడ సదివిపించాలి? తమలాంటోళ్ళు పూనుకుని మాగ్గూడ ఇళ్ళు కట్టించి ఇస్తే అందులోనే పడి వుంటాం. పెద్దోళ్ళం పని పాటలు చేసుకుంటాం, పిల్లల్ని బడికీ పంపుకుంటాం. ఆ పున్నెమేదో మీరే కట్టుకోండి తల్లీ. మీ మీద ఆశతోనే వచ్చాం.”

“మీ మగవాళ్ళు జంతువుల్ని వేటాడటం కాకుండా ఇంకేమైనా పనులు చేయగలరా?”

“అడవుల దగ్గరగా వుండేటోళ్ళం గదమ్మా. వెదురు చీల్చి తట్టలూ, బుట్టలూ, తడికెల లాంటివి అల్లగలమని చెప్పారు. తమరే పని చెప్పినా చేసేత్తామండీ.”

“ముందు మీకొక చోట స్థిరంగా కాపురముండాలి. ఈ రోజుల్లో ఎక్కడో మీ లాంటివారు తప్పితే అందరికి స్వంత ఇళ్ళూ, స్వంత ఊర్లూ వుంటున్నాయి. మీరు ఏ కులమని చెప్పుకుంటూ వుంటారు?”

“మేం బుడిగె జంగాల మండీ. మే వాయించే తంబూరా కొక బుడిగె వుంటుందండీ. బుడిగె వున్న తంబూరాను వాయిస్తు, పాడుతూ, కతలు చెప్తూ వుంటాం కాబట్టి మా పెద్దవాళ్ళు మనం బుడిగె జంగాలమని చెప్పారండీ.”

‘బుడిగె జంగాలమని వీళ్ళకు వీళ్ళు అనుకుంటున్నారు. కాని ప్రభుత్వపరంగా కుల ధృవీకరణ పత్రం అంటూ ఏం లేదు. ఏ రకమైన ప్రభుత్వ సాయం పొందటమూ వీళ్ళకు తెలీటం లేదు. పెద్దవాళ్ళు పాడుతుంటే, చెపుతుంటే విని గుర్తు పెట్టుకొన్న వినికిడి జ్ఞానమే కాని వీళ్ళ భాషకు ఒక లిపి అంటూ లేదు. అడవి జంతువుల్ని వేటాడి చంపి, ఆ ఒలిచిన చర్మంతో తయారు చేసుకున్న వాయిద్యం వాళ్ళ చేతుల్లో వున్నది. కుటుంబమంతా కథలు చెప్తూ తిరుగుతారనుకుంటా. ఈ రోజుల్లో ఇలాంటి కథల కసలు ఆదరణే కరువువవుతున్నది. అందుకేనేమో వీరు సంచార జీవనం మానేసి, స్థిరనివాసం పట్ల మొగ్గు చూపుతున్నారు. అప్పుడే పిల్లలకు చదువు సంధ్యలూ, పెద్దవాళ్ళకు సరైన వ్యాపకమూ సాధ్యపడుతుంది. కొన్ని కుటుంబాలు కలిసి ఒక గుంపుగా వుండటం వీళ్ళకలవాటు. ఇప్పుడా గుంపులన్నీ కలిపి, ఒక సముదాయంగా ఏర్పడాలి. వీళ్ళకొక సమితి ఏర్పడాలి. కొన్ని చోట్ల ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. వీళ్ళను ఇంకా చైతన్యపరచం చాలా అవసరం’ అనుకున్నది స్నేహలత.

“మీలాంటివాళ్ళు మన రాష్ట్రమంతటా అక్కడక్కడా వున్నారమ్మా. మీ కందరికీ కలిపి ఒక కులం అంటూ వుండాలి. ఆ కుల ధృవీకరణ పత్రం పొందిన తర్వాత ఒక్కొక్కటిగా చెయ్యటం సాధ్యమవుతుంది.  ఆ కులమనేది మిమ్మల్ని గుర్తించడనైకి మాత్రమే. ఎక్కువ కులంగానో, తక్కువ కులంగానే చూడ్డానికి కాదు. ఇప్పటికిప్పుడు మీకు అన్నీ సమకూర్చాలంటే సాధ్యపడదు. సమయం పడుతుంది. నేనీసారి ముఖ్యమంత్రి గారి దగ్గరకెళ్ళినప్పుడు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధతో మాట్లాడుతాను. వారు కూడా మీకు న్యాయం చేస్తారు. ఒక్కొక్కటిగా ఇల్లూ, పిల్లల చదువు, ప్రభుత్వ సాయమూ అన్నీ అందుతాయి. మీకు న్యాయం జరిగేవరకూ నేను ముఖ్యమంత్రిగారితోను, ఇతర అధికారులతోను మాట్లాడుతునే వుంటాను. మీరు పాడే పాటల్ని, చెప్పే కథను ప్రభుత్వం ప్రోత్సహించేటట్లుగా కూడా చూస్తాను. అయితే మీరంతా వెదురు చీల్చి బుట్టలూ, తట్టలూ, తడికెలూ అల్లుతామంటున్నారు. ఆ వెదురుతోనే ఈ కాలనికి పనికి వచ్చేటట్టుగా పూలబుట్టలూ, పండ్లబుట్టలూ లాంటివి కూడా అల్లండి. జంతువుల్ని చంపవద్దు. వేటాడటం నేరం. అలా వేటాడినట్లు తెలిస్తే శిక్ష పడుతుంది. మిగతా వ్యవసాయ పనులు అలవాటు చేసుకోండి. అడనిని నమ్ముకున్నట్లే భూమినీ నమ్ముకోండి. ఆడా, మగా అందరూ పనులు చేయటానికి అలవాటు పడండి. పనులు చేసుకుంటే ఆకలితో వుండరు. మీరు అడవిలో తిరిగేవాళ్లు. అక్కడి మొక్కలతో, చెట్లతో మీకు బాగా అనుభవం ఎక్కువ. ఏ ఆకు పసరు దేనికి పూతగా పని చేస్తుందో, ఏ మూలిక విషానికీ, ఏ రోగానికీ విరుగుడుగా పనిచేస్తుందో బాగా గుర్తుపెట్తుకోండి. ఎక్కువగా ప్రజల రోగాలను నయం చేసే మొక్కల్ని అటవీశాఖ తరఫున పెద్ద ఎత్తున పెంచుదాం. ఆ పనంతా మీరే చెయ్యొచ్చు. మీరే అమ్ముకోవచ్చు. ఇంకేమైనా తయారు చేసినా అమ్ముకునే సౌకర్యం కల్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరున్న చోటుకు సమీపంలో పాఠశాలలుంటే అక్కడికి పిల్లల్ని పంపించండి. చదువు చాలా ముఖ్యం.  కొంత శ్రమ పడైనా చదివించాలి. వెళ్ళి రండి” అంటూ వాళ్ళను పంపించివేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ జతి వాళ్ళు అక్కడక్కడా గుంపులు గుంపులుగా వుండి వుంటారు. రాష్ట్ర సమస్య కాబట్టి ముఖ్యమంత్రి గారే దీన్ని సాల్వ్ చేయవలసి వుంటుంది. వీరందరినీ సమీకరించి, పెద్ద ప్రయత్నం చేస్తే కాని వీళ్ళ సమస్య పరిష్కారం కాదు. ఎవరో ఒకరు గట్టిగా పూనుకుంటే గాని, ఎన్నో శాఖల అనుమతులతోనే ఇది సాధ్యపడుతుంది. ఆ పని నేనే ఎందుకు చేయగూడదనిపించింది. డిపార్ట్‌మెంట్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ డీటెయిల్స్ ఏమన్నా దొరుకుతాయేమో కనుక్కోవాలనుకుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here