[dropcap]మా[/dropcap]ట అంటే
నరం లేని నాలుక మీదుగా సాగుతూ
నోటి గుండా శబ్దించే ధ్వని కాదు.
మాట అంటే
కొన్ని అక్షరాల కలయికో
కొన్ని పదాలను పేర్చిన వాక్యమో అస్సలు కాదు.
కల్లాకపటము లేకుండా
పరవశంతో పలికే మాట
నిన్ను ఘనస్థితికి చేర్చుతుంది.
కఠినత్వం కలబోసిన మాట
నీ ఘనస్థితిని సైతం
హీనస్థితికి దిగజారుస్తుంది.
మాటకు రాగం కడితే పాటవుతుంది
మాట అణ్వాయుధానికి మించిన అస్త్రమవుతుంది.
ఎదుటి మనిషిపై
నువ్వు ఎక్కుపెట్టిన తూటాకూడా
కొన్ని సార్లు పేలకుండా తుస్సుమంటుందేమో కాని
పరుశంగా మాట్లాడే మాట మాత్రం గురి తప్పక
మనస్సును చిధ్రం చేస్తుంది.
మాట అంటే
అంతరంగాన్ని తట్టిలేపే అనురాగమే కాదు
అంతరాల్ని సృష్టించే అగాధం కూడా.
మాట అంటే
భావప్రకటనకు వారది మాత్రమే కాదు
భాషను పరిమళింపజేసే సుగంధ ద్రవ్యం కూడా.
మాట అంటే
విషాన్ని హరించే అమృతమే కాదు
విద్వేషాల్ని రగిల్చే నిప్పు కణం కూడా.
మాటతో మురిపించి మైమరిపించడమే కాదు
వాడే వాడి వాక్యాల్ని బట్టి
వేటాడి వేధించడము తెలుసు.
మాట అంటే
నమ్మకానికి పెట్టని కోట
అదే మాట వక్రీకరిస్తే
నగిసీలు పూసిన నయవంచన
పరుషమైన మాట ముందు
పదునైన అస్త్రాలు కూడా దిగదుడుపే.
కత్తులతో కుత్తుకలు తెగ్గోస్తే
నెత్తుటి ధారలు మాత్రమే స్రవిస్తాయి
మాట ప్రయోగిస్తే
మనస్సులే కాదు
వాటి ఆలంబనగా సాగే
బలహీనమయ్యే బంధాలు
కూడా బలపడతాయి.
మాట సవ్యమైతే ఆకాశాన్ని అందుకుంటావు.
అపసవ్యమైతే అదఃపాతాళానికి జారిపోతావు.