[box type=’note’ fontsize=’16’] “స్నేహంలో సమభావన ఉండాలి. చాలాసార్లు ఆధిక్యతలు, అసూయలకు తావు ఏర్పడి స్నేహాలు మనస్తాపాన్ని, నిరాశను మిగులుస్తాయి” అంటున్నారు జె. శ్యామల ‘మానస సంచరరే-21: జీవితం.. ఓ స్నేహగీతం!’ కాలమ్‌లో. [/box]
[dropcap]బ[/dropcap]స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏవో వస్తున్నాయి కానీ కాసింత ఖాళీ బస్ కోసం నా నిరీక్షణ. బస్టాప్‌లో జనం బాగా ఉన్నారు. కాలేజీ పిల్లలు, ఉద్యోగస్తులు.. వగైరాలు.. బస్ కోసం చూస్తూనే, ఎవరికీవారు స్నేహితులతో కబుర్లలో.. అందరి చేతుల్లో మొబైల్.. అవును, అందరికీ మొదటి నేస్తంగా మొబైల్ మారిపోయిన రోజులివి. పుస్తకాన్ని మించిన నేస్తం లేదన్నది గతం మాటగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ పుస్తకాలను కూడా మొబైల్లోనే చదివేస్తున్నారు. మొబైల్లో ఫ్రెండ్స్‌తో చాటింగులు కొంతమంది. ఎప్పుడు కలుద్దాం, నన్నక్కడ దిగమంటావా? చట్నీస్‌లో తినేసి, అట్నుంచి అటు మూవీకి పోదాం, .. రంజిత్‌గాడు ఎల్లుండి వస్తున్నడట, ప్రోగ్రామ్ ప్లాన్ చెయ్‌రా.. ఎటు చూసినా స్నేహ రాగాలాపనలు. అందుకే ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి’ అన్నారు. బస్ వచ్చేసింది. హమ్మయ్య. నాకో సీటు దొరికింది. జీవితంలో వివిధ దశల్లో ఎందరెందరో స్నేహితులవుతారు. ఉద్యోగకారణాలో, ఇతర కారణాలో వారు దూరం కావచ్చు. కానీ మనసుకి మాత్రం సమీపంగానే ఉంటారు.
ఖలీల్ జిబ్రాన్ స్నేహం గురించి ఈ కోణానికి సంబంధించి విలువైన మాట చెప్పాడు.. ‘సుదూరంగా ఉన్న మిత్రుడు కొన్నిసార్లు సమీపాన ఉన్న మిత్రుడి కంటే దగ్గరవుతాడు. పర్వతం తనవద్దే నివసించేవారికంటే, ఆ దారిన ప్రయాణించే వారికి ఎక్కువ స్ఫూర్తినిచ్చినట్లు’ అని.
స్నేహం రంగురూపులెరుగనిది. జాతి, మతాలెరుగనిది. పేద, ధనిక తేడాలు తెలియనిది. మనుషుల మధ్యే కాదు, ఎన్నెన్నో జీవులు వాటివాటి స్థాయిల్లో స్నేహానుభూతిని కలిగి ఉంటాయి. ‘బాలమిత్రుల కథ’ లో మనసు కవి ఆత్రేయగారి పాట గుర్తుకొస్తోంది.
“గున్నమామిడి కొమ్మమీదా గూళ్లు – రెండున్నాయి..
ఒక గూటిలోన రామచిలకుంది.. ఒక గూటిలోనా కోయిలుందీ..
చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది..
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది.
పొద్దున చిలుకను చూడందే, ముద్దుముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలుక ఊగదు కొమ్మ ఊయలా..
ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూరూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా
చిలకా, కోయిల చేసిన చెలిమి
ముందుతరాలకు తరగని కలిమి..
ఎంత చక్కటి పాట..
‘ట్రూ ఫ్రెండ్‌షిప్’ పేరుతో విలియమ్ సొ కలాస్ ఓ మంచి పోయమ్ అందించాడు.
ది ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఫ్రమ్ ది స్టార్ట్
ఈజ్ దట్ స్పెషల్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్
ఏ ఫీలింగ్ ఫ్రమ్ డీప్ డౌన్ ఇన్ సైడ్
ఏ ఫీలింగ్ దట్ నో వన్ షుడ్ హైడ్
ఏ ఫ్రెండ్ ఈజ్ వేర్ త్రూ గుడ్ అండ్ బ్యాడ్
దే మేక్ యు హ్యాపీ వెస్ యు ఆర్ శాడ్
దే బ్రెటెన్ అప్ యువర్ డార్కెన్ డే
జస్ట్ బై ది సింపుల్ థింగ్స్ దే సే..
అవును.. నిజమైన స్నేహితుల మాట చందనంలా మనసుకు హాయి కలిగిస్తుంది. బంధువులను మనం ఎంచుకోలేమేమో గాని, స్నేహితులను ఎంచుకునే అవకాశం మనకు ఉంది. ‘స్నేహితం’ అనే మాటలోనే ‘హితం’ దాగి ఉంది. మంచి స్నేహితులు ఉండటం గొప్ప వరం. స్నేహితుల్ని ఎలాసంపాదించుకోవాలి అంటే మనం స్నేహంగా ఉండటం ద్వారానే అంటాడో మహనీయుడు.
మనిషికి బాల్యంలోనే స్నేహానుబంధాలు మొదలవుతాయి. ఇరుగు, పొరుగున ఉండే తోటిపిల్లలతో ఆడుకోవటం అనేది పాఠశాలకు వెళ్లక ముందు నుంచే మొదలవుతుంది. అలా ఊహా తెలియని వయసు లోనే మొదలయ్యే స్నేహం బడికి వెళ్లినప్పటినుంచి మరింతగా పెరుగుతుంది.
బడికి వెళ్లినా, బడినుంచి వచ్చేసినా మనసంతా మిత్రులే. దోస్తులు.. అందులోమళ్లీ జిగ్రీ దోస్తులు..
యే దోస్తీ హమ్ నహీ తోడెంగే
తోడెంగే దమ్ మగర్
తేర సాథ్ నా ధోడెంగే…
తేరీ హార్, మేరీ హార్
సున్ యె మేరే యార్
తేరా గమ్, మేరా గమ్
మేరీ జాన్, తేరీ జాన్
ఏసా అప్‌న ప్యార్
ఖానా పీనా సాథ్ హై
సారీ జిందగీ..
స్కూలు చదువులు ముగిసిన తర్వాత మిత్రులు కొంతమంది దూరమయినా, కాలేజీలో మళ్లీ కొత్త స్నేహితులు దొరుకుతారు. బాల్యం నుంచి కౌమారానికి మారిన ఆ దశలో మరింత బలమైన స్నేహబంధాలేర్పడతాయి. తమ ఆలోచనలను, ఆశయాలను, అనుభూతులను తమ స్నేహితులతోనే స్వేచ్ఛగా పంచుకుంటారు. తమను అర్థం చేసుకోగల ఏకైక వ్యక్తి స్నేహితుడే అని నమ్మే వయసది. కాలేజీలో దీర్ఘకాలం గడిపి మళ్లీ చదువు ముగిసి కాలేజీకి వీడ్కోలు పలకవలసి వస్తే ఆ మిత్రుల గుండెల్లో తీయని బాధ.. ఆ పరిస్థితికి అద్దంపట్టే మంచి పాటను చంద్రబోస్ గారు ‘స్టూడెంట్ నెంబర్ వన్’ చిత్రంలో అందించారు..
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిశాము
చదువులమ్మ చెట్టునీడలో
వీడలేమంటు.. వీడ్కోలంటు
వెళ్లిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో
వుయ్ మిస్ ఆల్ ది ఫన్
వుయ్ మిస్ ఆల్ ది జాయ్
వుయ్ మిస్ యు..
నిజమే.. వీడ్కోలు ఎప్పుడూ బాధాకరమే.
అయితే కాలేజీ రోజులే ఏ మనిషికయినా కీలకమైనవి. మంచి వైపు నడిపినా, చెడువైపు లాగినా అక్కడే జీవితం మలుపు తిరిగేది. అందుకే పెద్ద వాళ్లు ‘చెడ్డ సావాసాలు చేయొద్దు’ అని హెచ్చరిస్తుంటారు.
మిత్రుల ప్రభావం మనిషి మీద ఎంతగానో ఉంటుంది. ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారు. వీరు వారవుతారు అని కూడా అంటారు. సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలు.. వగైరా చెడు అలవాట్లు ఈ దశలోనే మొదలవుతాయి. సరదాగా, ‘హీరో’చితమనుకుంటూ మొదలు పెట్టే ఈ అలవాట్లు జీవితాన్ని పెడతోవ పట్టిస్తాయి. అంతేనా… అమ్మాయిలు, అబ్బాయిల స్నేహాలలో.. స్నేహమేదో, ఆకర్షణ ఏదో అవగాహన లేని స్థితి. స్నేహమంటూ మొదలు పెట్టి ఆపై ప్రే’మంట’లకు ఆహుతయ్యేదెందరో. కొంతమంది ప్రేమాయలో పడి చదువు చెట్టెక్కించి, ఎందుకూ కొరగాకుండా తయారవుతారు. ఈ కాలపు పిల్లల స్నేహాల తీరు చూస్తుంటే ఎటువైపు పయనిస్తున్నారు? అనిపిస్తుంది. స్నేహితురాలి గురించి, పరోక్షంలో మరొకరితో – దానికీ, దీనికి.. అది, ఇది.. అని మాట్లాడటం, పరస్పరం మాట్లాడుకునేటప్పుడు కూడా ఏరా, ఏమే అని పిలుచుకోవటం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఆ చనువుకు హద్దులే కనిపించవు. దానికి, దీనికి అనే బదులు పేరు ఉపయోగించవచ్చు, లేదా ‘ఆమె’ అనొచ్చు. కానీ అలా అనటంలేదే.. ఇదెక్కడి సంస్కృతి! ఫ్రెండ్‌షిప్ డే అంటూ చేతులనిండా బ్యాండ్లు తగిలించుకోవడం, సరదాల్లో తేలిపోవటం ఇప్పటి ట్రెండ్. డబ్బులున్న బంగారు పిచ్చుకలతో స్నేహం చేసేవాళ్లూ ఎంతోమంది ఉన్నారు. వాళ్లతో స్నేహం చేయడం గొప్ప అనుకుంటారు. ఎంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్‌ను మెయిన్‌టైన్ చేస్తే తనకంత ప్రిస్టేజి అని డబ్బున్న పిల్ల లనుకుంటారు. అమ్మాయిలు, బాయ్ ఫ్రెండ్ పర్స్ ఖాళీ చేయడం గురించితరచు వింటుంటాం. అయితే అలా అని అందరినీ ఒకే గాటన కట్టలేం. స్నేహానికి చక్కని నిర్వచనంలా ఉండేవారూ కొంతమందైనా ఉంటారు. స్నేహం చేయడం తేలికే, దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. కడదాకా నిలబడే నిజమైన స్నేహితులు తక్కువే.
ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
డే బై డే… డే బై డే… కాలం ఒడిలో డే బై డే…
పయనించే ఓప్పే ఫ్రెండ్‌షిప్‌రా.. అంటూ
వాడిపోనిది స్నేహమొక్కటే
వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనేలేనిది ఫ్రెండ్‌షిప్ ఒక్కటే
యిచ్చినా నష్టమొచ్చినా
మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే
కాలేజి స్నేహం ఎపుడూ అంతం కానిదే..
నిజంగా అలాంటి స్నేహితులు ఉంటే జీవితం ధన్యమే.
‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్’ అని ఇంగ్లీషు సామెత. అక్కరకొచ్చేవాడే అసలైన మిత్రుడని దీని భావం. అయితే స్నేహితుల మధ్య డబ్బు ప్రసక్తి ఉండకపోవడమే మంచిది. అది తెలిసే తన ఆర్థిక చిక్కుల గురించి స్నేహితుల ముందు ప్రస్తావించరు కొంతమంది. ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవలసింది ఏమంటే నిజమైన మిత్రుడు, చెప్పకుండానే అతడి ఇబ్బంది అర్థం చేసుకుని సాయపడతాడు. మహాభాగవతంలో కృష్ణుడు, కుచేలులు ఇందుకు చక్కతి ప్రతీకలు. కుచేలుడు తానెంత దారిద్ర్యంలో ఉన్నా, మిత్రుడైన కృష్ణుడికి చెప్పుకోవడానికి ఇచ్చగించడు. కానీ భార్య కోరిక మేరకు అందుకు సిద్ధమపడతాడు. కాని మిత్రుణ్ణి వట్టి చేతులతో కలవడమెలా? ఇంట్లో ఉన్న గుప్పెడు అటుకులనే ఉత్తరీయానికి కట్టుకుని వెళతాడు కుచేలుడు. శ్రీకృష్ణుడు బాల్యమిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించి మర్యాదలు జరిపి, అటుకులను ఆప్యాయంగా తిని, అతడు అడగకుండానే కుచేలుడికి ఐశ్వర్యం ప్రసాదిస్తాడు. అదీ స్నేహమంటే. ఇక భారతంలో అయితే కర్ణ దుర్యోధనులను గమనించవచ్చు. దుర్యోధనుడు తనకు అంగరాజ్యమిచ్చి, క్షత్రియ హెూదాను కట్టబెట్టి, గౌరవాన్ని పెంచటంతో కర్ణుడతనికి అనుంగు స్నేహితుడవుతాడు. దుర్యోధనుడిది అన్యాయపక్షమైనా, స్నేహధర్మానికి కట్టుబడే కర్ణుడు తుదివరకు దుర్యోధనుడి తరఫున ఉండి, యుద్ధం చేసి అసువులు బాస్తాడు. రామ, సుగ్రీవులను, రామ, విభీషణులను కూడా స్నేహానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. దైవాన్నే సర్వస్వంగా భావించే భక్తిపరాయణులు దైవాన్ని సఖుడుగానూ భావిస్తారు. అందుకే కృష్ణ శతక కర్త..
నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడా
నీవే గురుడవు దైవము
నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణా.. అన్నాడు.
గతంలో స్నేహం తమ ఊరి వరకో, తమ రాష్ట్రం వరకో, తమ దేశం వరకే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రపంచమంతా ‘వెబ్’లో చేరిన తర్వాత స్నేహ సంబంధాలు ఎల్లలు లేనివయ్యాయనే చెప్పాలి. సాంఘిక మాధ్యమాలు ఎక్కువవటంతో పరిచయాలు, స్నేహాలు కొల్లలుగా పెరిగిపోతున్నాయి.
ఫేస్‌బుక్, వాట్సాప్ వచ్చిన తర్వాత స్నేహసంబంధాలకు అంతే లేదు. దీంట్లో ఎంత మేలు ఉందో, అంతకంటే ఎక్కువ కీడు కూడా ఉందని జరుగుతున్న ఘటనలు తెలియజేస్తున్నాయి. నమ్మిన స్నేహం నట్టేట ముంచుతోంది. గతంలో కలం స్నేహాలుండేవి. ఆడ, మగ తెలియకుండా ఉత్తరాలతో స్నేహాలు కొనసాగించడం, ఫొటోలడిగినా, వేరు ఫొటోలు పంపి మోసం చేయడం, చివరకు కలుసుకున్న సమయాన అదంతా కల్ల అని తెలిసి కుమిలిపోయిన కథలెన్నో జరిగేవి.
స్నేహంలో సమభావన ఉండాలి. చాలాసార్లు ఆధిక్యతలు, అసూయలకు తావు ఏర్పడి స్నేహాలు మనస్తాపాన్ని, నిరాశను మిగులుస్తాయి. ఉదారంగా ఉన్నట్లు ప్రవర్తించి, ఆ పైన కించపరిచే ధోరణి ప్రదర్శించి నొప్పించే తీరు కూడా గర్హనీయమైంది. అవసరార్ధం చేసే స్నేహాలు, స్నేహాలే కావు. కొన్నిసార్లు స్నేహాలు ఒకరు దాన్ని సీరియస్‌గా మనసుకెక్కించుకోవటం, మరొకరు దాన్ని లైట్ తీస్కునే పద్ధతిలో ఉండటం కూడా జరుగుతుంటుంది. కొంత మంది కాలక్రమంలో మారిపోతుంటారు. పాత స్నేహితులను పక్కన పెట్టేస్తుంటారు. ఒకవేళ కలుసుకున్నా ఒకప్పటి మాధుర్యం కొరవడుతుంది. పెదాలమీది మాటలేకానీ మనసుపెట్టి మాట్లాడేది ఉండదు. ఆప్యాయత వేరు, ఆసక్తి లేదా క్యూరియాసిటీ వేరు. చాలామందిలో క్యూరియాసిటీయే తొంగిచూస్తుంటుంది.
మనిషికో స్నేహం
మనసుకో దాహం
లేనిదే జీవం లేదు,
జీవితం కానేకాదు.. అన్న పాటలోని మాటలో ఎంతో నిజం ఉంది.
ప్రపంచం మొత్తం స్నేహబంధంపైనే ఆధారపడి ఉంది. వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, ఊళ్ల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య స్నేహసంబంధాలు తప్పనిసరి. అందుకే ప్రధానులు, అధ్యక్షులు, విదేశాంగ మంత్రులు వివిధ దేశాల పర్యటనలు చేసి, దేశానికి స్నేహధనాన్ని సంపాదించే ప్రయత్నం చేసేది.
స్నేహబంధమూ.. ఎంత మధురమూ
చెరిగిపోదు.. తరిగిపోదు జీవితాంతము…
ఇందుకు సాక్ష్యంగా బాపు, రమణల స్నేహం చెప్పుకోవచ్చు. కడదాకా కలిసి ఉన్న స్నేహమూర్తులు. బాపు తీసిన ‘స్నేహం’ చిత్రం ఎంత బాగుంటుందో ఓ అంధబాలుడు, ఓ కుంటిబాలుడు.. వారి మధ్య పరిమళించిన స్నేహం.. అందులో ఓ మధురమైన పాట గుర్తిస్తోంది..
నీవుంటే వేరే కనులెందుకు.. నీకంటే వేరే బతుకెందుకు
నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే.
స్నేహితులను పోగొట్టుకోవడమంత బాధ మరొకటుండదు. ఆరోజు.. అవును. నాన్న లోకాన్ని వీడి కొన్ని నెలలయిందేమో. ఓ రోజు నాన్న మిత్రుడు రామారావుగారు వచ్చారట.. మిత్రుణ్ని కలుసుకోబోతున్నానన్న కొండంత ఆనందంతో. కానీ కళ తప్పిన ముఖంతో అమ్మ కనిపించేసరికి ఆయనకు నోట మాట రాలేదట. విషయం తెలుసుకుని భారంగా వెనుదిరిగారట. అమ్మ చెపుతుంటే మనసు చెమ్మగిల్లింది.
ఆలోచనలో ఉండగానే కండక్టర్ స్టాప్ పేరు అరవడంతో ఉలిక్కిపడి లేచాను.
బస్ దిగానో, లేదో
‘దోస్త్ మేరా దోస్త్
తూ హై మేరి జాన్
వాస్తవంగా దోస్త్
నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో
మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం..’
పాట వినిపిస్తున్నాడు పల్లీల బండివాడు.
స్నేహం గురించి ఆలోచనలు చేస్తూ ఇల్లు చేరగానే.. వాట్సాప్ ఒక చేదు నిజాన్ని చెప్పింది. లక్ష్మి.. కె.బి.లక్ష్మి రేణిగుంటలో రైల్లో హఠాత్తుగా మరణించిందన్న సందేశం.
నమ్మశక్యం కాని వార్త. ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఎప్పుడూ గలగలసాగే గోదారిలా ఉండే లక్ష్మీ కన్ను మూయటమేమిటీ? వారం కిందటే కదా మాట్లాడాను. నువ్వెందుకు ఇంకా కథల పుస్తకం పబ్లిష్ చేయలేదంటూ ప్రేమగా కోప్పడింది. అందుకు ఏంచేయాలో చెప్పింది. ఎన్‌డబ్ల్యుఎమ్ఐ సమావేశాలకు కోల్‌కతా, ముంబయి, అహ్మదాబాద్, ఢిల్లీ.. వెళ్లినప్పుడు తను, నేను కలిసి గడిపిన కాలం కళ్లముందు మెదిలింది. మరణానికి ఎవరూ అతీతులు కారు అన్నది కఠోర సత్యం. సస్పెన్స్ కథలు, కాకరకాయలు అంటాం కానీ జీవితాన్ని మించిన సస్పెన్స్ కథ మరొకటుండదేమో. ఏ రోజు కా రోజు సస్పెన్సే. లక్ష్మి.. భాగ్యలక్ష్మి కావొచ్చు కానీ నాకు, ఆమె విద్యాలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, ఆనందలక్ష్మిగా చిరపరిచితురాలు. తను ఉన్నచోట ఒక ఉత్తేజం, ఒక ఉల్లాసం. ఎప్పుడూ నవ్వుల్ని, ఆనందాన్ని పంచే లక్ష్మి. ‘సంతోషం కలిగితే పదిమందికి పంచు, సంతాపం కలిగితే నీలోనే దాచు’ అన్న పాలసీ తనది. తనను తాను ప్రేమించుకోవడం, జీవితాన్ని అమితంగా ప్రేమించడం, నచ్చినట్లుగా బతకడం లక్ష్మి లక్షణాలు. స్నేహమంటే లక్ష్మికి ప్రాణం. ఇంటికి సైతం ‘స్నేహ నికుంజ్’ అని పేరు పెట్టుకుంది. స్ఫూర్తిదాయకంగా, లైవ్లీగా బతికిన స్నేహలక్ష్మిని తలచుకుంటూ ఉండగానే అమెరికా శ్యామల ఫోన్ చేసింది. ‘ఇండియా వస్తున్నాను, మృణాళిని నువ్వు, నేను కలుసుకుని బోల్డు కబుర్లు చెప్పుకుందామని’. ఇంకేముంది మళ్లీ మా హ్యాపీ డేస్ అదే మా కాలేజీ రోజుల తీపి జ్ఞాపకాలు మనసు కడలిలో అలలై ఉవ్వెత్తున పడి లేస్తుండంగానే నిద్రాదేవి ఎప్పుడు నాతో చెలిమి చేసిందో తెలిస్తేనా.