రిబ్బన్ : ముడులు జారుతూ, కడుతూ

0
4

[box type=’note’ fontsize=’16’] “సినెమా స్క్రీన్‌‌ప్లే కొంత నిరాశ పరిచినా సబ్జెక్ట్ కారణంగా చూసేలా వుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషిరిబ్బన్‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

ఈ వారం ముసురు బయటకు వెళ్ళనివ్వలేదు. నెట్ లో యేదన్నా సినెమా చూద్దామంటే కల్కి కేక్లాఁ నటించిన రిబ్బన్ కనిపించింది. కల్కి చేసే సినెమాలూ, వాటిలో ఆమె నటనా నిరాశ పరచవు కాబట్టి ఇది చూసాను. కల్కి నిరాశ పరచలేదు, కాని సినెమా స్క్రీన్‌‌ప్లే కొంత నిరాశ పరిచినా సబ్జెక్ట్ కారణంగా చూసేలా వుంది.

క్లుప్తంగా కథలోకొద్దాం. శహానా (కల్కి కేక్లాఁ) కరణ్ (సుమీత్ వ్యాస్) భార్యా భర్తలు. ఆమె వొక కార్పొరేట్ ఆఫీసులో మేనేజరుగా మంచి గుర్తింపు పొందుతుంది. అతను కన్స్ట్రక్షన్ లో పని చేస్తుంటాడు. అలాంటప్పుడు ఆమె గర్భం దాల్చింది అని తెలుస్తుంది. తను మాతృత్వానికి సిధ్ధంగా లేదు, ముంబై నగరంలో ఖర్చులు, ఇల్లూ కారూ వగైరాలకోసం తీసుకున్న అప్పులు, చెల్లించాల్సిన నెలసరి వంతులు, తన కెరీర్ కు ఆటంకమయ్యే అదనపు ఇంటి, పాప బాధ్యతలూ ఆమెకు అబార్షన్ గురించి ఆలోచించేలా చేస్తాయి. నేను చూసుకుంటాను అని ధైర్యం ఇచ్చి ఆమెను ఒప్పిస్తాడు. ఆషి అన్న పాప పుడుతుంది. మూడు నెల్ల శలవు తర్వాత తిరిగి ఆఫీసుకెళ్ళిన శహానా కు అంతా తారుమారు కనిపిస్తుంది. ఆమెను తన స్థానం నుంచి కింది స్థానానికి బదిలీ చేస్తారు, ఆడవారు అందునా చిన్న పిల్ల గల ఆడవారు పెద్ద బాధ్యతలు కావలసినంత సమయం ఇచ్చి శ్రధ్ధ పెట్టి చేయలేరనే నెపంతో. ప్రసవానంతరం ఇదొక ఎదురు దెబ్బ అయితే ఇంటిదగ్గర పాపను చూసుకోవడానికి పెట్టుకున్న ఆయాతో మరో సమస్య వస్తుంది. ఒకరోజు అనుకోకుండా మధ్యాహ్నం ఇంటికెళ్ళేసరికి ఆయా భర్త, ముగ్గురు పిల్లలు ఇంట్లో గోల గోల చేస్తూ వుంటారు ఆషిని పక్కన వదిలేసి. ఇవన్నీ భార్యా భర్తలిద్దరూ ముంబై లాంటి పట్టణంలో పనిచేస్తూ వుంటే మనం వూహించగల సన్నివేశాలు. ఆ ఆయాని మానిపించి, పాప ను క్రెష్ లో పెడతారు. కరణ్ కి యేడాదిన్నర పాటు లోనావాలా లో ప్రాజెక్ట్ మీద పనిచెయ్యడానికి వెళ్ళాల్సి వస్తుంది. ముంబైలో శహానా వొక్కతే పాపను చూసుకుంటూ పనిచేసుకోవాల్సి వస్తుంది. చూస్తుండగానే మూడేళ్ళు గడిచి పాప స్కూల్ కెళ్ళడం కూడా మొదలవుతుంది. ఇక్కడిదాకా కాస్త స్లోగా నడిచిన కథ కొత్త పరిణామాలతో మన ఆసక్తిని గట్టిపరుస్తుంది. రోజూ వచ్చే స్భిబు అనే బస్సతను రాకపొయ్యేసరికి ఆ రోజు పాపను బస్ యెక్కించడానికి కరణ్ వెళ్ళాల్సి వస్తుంది. లిఫ్ట్‌లో వెళ్ళగానే పాప గౌనెత్తి మరి నా చాక్లెట్టో అంటుంది. తల్లిదండ్రులిద్దరికీ షాక్. పాపను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ముట్టరాని చోట ముడుతున్నది షిబు అని చెబుతుంది. స్కూల్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళు సరిగ్గా స్పందించరు. కరణ్ తన ఉద్యోగం మానేసి ముంబైలోనే వుండాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరి తలలూ వేడెక్కి వున్నాయి. అది దెబ్బలాటకు దారి తీస్తుంది. అందరితో పాటే భర్త కూడా భార్య మీదే బాధ్యత మోపుతాడు. బయట తల్లిదంద్రుల మధ్య దెబ్బలాట, లోన పాప బిక్కు బిక్కు మంటూ.

కల్కి నటన యెప్పట్లా గొప్పగా వుంది. సుమీత్ వ్యాస్ కూడా బాగా చేశాడు. స్కూల్ లో కమిటీ మీటింగులో ఆ కమిటీ సభ్యులతో కల్కి, కరణ్లు గొడవ పడతారు. గోల గోలగా వుంటుందా దృశ్యం. అందరి మధ్యా భయం భయంగా ఆషి (బేబి కియారా సోని). ఆ పాప నిజంగానే భయపడిందా, అలా నటించిందా అన్న ఆశ్చర్యం కలగక మానదు. అంత బాగా చేసిందా పాప. రాఖీ శాండిల్య దర్శకత్వం పర్లేదు. ఒక స్త్రీ తన కెరీర్ ను ఎంచుకున్నప్పుడు ఆ సంస్థ, ఇతర సంస్థలు ఎలా చూస్తాయి, ఇంటి బాధ్యతలు ఆమెను ఎలా వెనక్కు లాగుతాయి, కుటుంబంలో కూడా ఆమె ఎలా మాట పడాల్సి వస్తుంది ఇవన్నీ బాగానే చూపినా ఇంకాస్త లోతుగా పరిశీలించాల్సిన, చర్చించాల్సిన విషయాలు వున్నాయి. అయినా వ్యాపార చిత్రాల నడుమ ఇలాంటివి సాహసించి తీసినందుకు మెచ్చుకోవాల్సిందే. విక్రం అంలాది చాయాగ్రహణం బాగుంది. ముఖ్యంగా స్టాటిక్ షాట్స్‌లో. కావలసిన మిజాన్సెన్ ను అమర్చుకుని ఫోకస్ చెప్పడం మీద పెట్టాడు. చిరాకు అనిపించేది కెమెరా నడుస్తున్న పాత్రను వెబడించినప్పుడు. కల్కి విషయంలో ఆమె శరీర భాష కారణంగా నప్పినా, కరణ్ విషయం లో ముఖ్యంగా చివర్లో సరిగ్గా లేదు. గొడవపడి బయటికెళ్ళిపోయిన కరణ్ మెదడు శాంతించి, తన తప్పు తెలుసుకుని (పడుకున్న శహానా భుజమ్మీద చేయి వేయడం ద్వారా తెలపడం) ఇంటికి వస్తాడు. తన తాళం చెవితో తలుపు తీసి, అది అలాగే తీసి వుంచి లోపలికెళ్ళి, బెడ్రూంలో పడుకున్న భార్యా కూతుర్ల పక్కన పడుకుంటాడు. కెమెరా అతన్ని అనుసరించాలి కాబట్టి అతని చేత తలుపు బార్లా తెరిచే వుంచే బదులు, అక్కడ కట్ చేసి మరో షాట్ లోకి వెళ్ళొచ్చి. బ్రెవిటి అలా కాదు సాధించేది. బ్రెవిటి మాటకు వస్తే లోనావాలా కు కరణ్ వెళ్ళిపోయాక శహానా వొక్కతే పాపను చూసుకోవాల్సి వస్తుంది. పాపను క్రెష్ లో వదిలి తను పనికి వెళ్ళాలి. కారులో పక్కన పాపను కూర్చోబెట్టుకుని తను నడుపుతూ వుంటుంది. పాపేమో యేడుస్తూనే వుంటుంది. కారు నడుపుతూనే పాపను శాంత పరచడానికి ఆమె రకరకాల విన్యాసాలు చేస్తుంది. కారు వెనుక సీటు నుంచి షూట్ చేసిన ఈ దృశ్యం ఆ పాత్రలిద్దరూ యెదుట రహదారిని చిత్రీకరిస్తుంది. ఇలాంటి వొక పది దాకా బలమైన సన్నివేశాలున్నాయి. అన్నీ ఆ తల్లి కూతుళ్ళ నటన వల్ల సగం పండితే, సగం రాఖి శాండిల్య వల్ల కూడా.

యెలాగూ ఈ చిత్రం లో చాలా స్పృశించని అంశాలున్నాయి. బాసు భట్టాచార్య వొక ట్రిలజి తీసినట్టు యెవరన్నా ఈ కథను ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here