జానేదేవ్-19

0
4

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 19వ భాగం. [/box]

[dropcap]“ప్లీ[/dropcap]జ్ కమ్, అర్జంట్” అన్న మెసేజ్ చూసి వసుంధర వాళ్ల ఇంటికి వెళ్లాడు వాసుదేవ్.

“ఏంటి?… అర్జంట్‌గా రమ్మని మెసేజ్ పెట్టావు. ఏం జరిగింది… అసలు రాకూడదనుకున్నాను… పాపం నీలూ…” అని వాసుదేవ్ అంటుండగానే కోపంగా అంది వసుంధర.

“ఏంటి!… నాకన్నా నీలూ ఎక్కువైపోయిందా?” ఇంకా వసుంధర మాట పూర్తి కాకుండా కోపంగా అన్నాడు.

“వసూ!… జెలస్ ముందు పుట్టి తరువాత నువ్వు పుట్టావు… అసలు ఏం జరిగిందో పూర్తిగా వినవా?” అని నీలవేణి అమ్మగారు జానకికి జరిగిన దంతా చెప్పాడు వాసుదేవ్.

గభాలున వాసుదేవ్ చేతులు పట్టుకొని “సారీ దేవ్!… ఐయామ్ వెరీ సారీ.. ఈ రోజు చాలా డిస్టర్బ్‌డ్‍గా ఉన్నాను. ఒకటి గుర్తు పెట్టుకో! నీ విషయంలో తప్ప తక్కిన వాళ్లందరి దగ్గర చాలా… మామూలుగానే… మంచి మనిషిగానే ఉంటాను. నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో, నువ్వు నాకు కాకుండా వేరే వాళ్లు గద్దలా ఎత్తుకుపోతారేమో అని భయం…”

“ప్లీజ్ వసూ!… ఇలాంటి మాటలు నా దగ్గర అనకు…”

“అసలు విషయానికి వస్తాను… నీకు తెలుసుగా మా అక్కలిద్దరూ డాక్టర్లు… వాళ్లు డాక్టర్లను మ్యారేజ్ చేసుకొని ఒకరు న్యూజిలాండ్, మరొకరు యుఎస్‌ఎలో సెటిల్ అయిపోయారు.”

“ఇది అంతా నాకెందుకు చెబుతున్నావు?…”

“ఇప్పటికి చాలా సార్లు చెప్పాను… కాని ఏది తలకెక్కించుకోవు కదా?…. నాన్నగారి, అమ్మ నర్సింగ్‌హోమ్ నేను చూసుకోవాలని ఆశ…”

“వాళ్ల ఆశ నెరవేర్చడం నీ బాధ్యత…”

“నోరు మూసుకో!… నేను ఒక్కదానిని నర్సింగ్ హోమ్ చూసుకోవాలని… కాదు… అల్లుడు కూడా డాక్టరు కావాలని అనుకుంటున్నారు.”

“వసూ!… నా మాట విను… పాపం వాళ్ల నెందుకు బాధపెడతావు?”

“దేవ్!” కోపంగా అరిచింది…

కంగారుగా అటు ఇటు చూసి “మీ అమ్మ, నాన్నగారు రాగలరు…” అన్నాడు.

కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ అంది… “వాళ్లు యుఎస్‌ఎ వెళ్లారు… అక్క డెలివరీకి. నెల వరకు రారు… వెళ్లే ముందు… బాంబు పేల్చారు… యుఎస్‌ఎలో డాక్టరు మ్యాచ్‌ని అక్క చూసిందట…”

“కంగ్రాట్స్ వసూ! హాయిగా ఆ డాక్టరుని చేసుకొని బ్రహ్మాండంగా సెటిల్ అయిపో.”

“నిన్నూ!… అని గభాలున లేచి దబదబా రెండు దెబ్బలు వేసి…. “నన్ను ఇలా ఏడిపించడం నీకు బాధగా లేదూ…” అంది.

“ఎందుకు లేదు… బాధగానే ఉంది… తాడూ బొంగరం లేని నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం?”

“నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర లేదు దేవ్.”

“ఇప్పుటు అలానే అనిపిస్తుంది… తరువాత బాధపడతావు.”

“నిన్ను పెళ్లి చేసుకోకపోతే చనిపోయే చివరి నిమిషం దాక బాధపడతాను దేవ్!…”

“వసూ!… ఈ మేటర్ ఇక్కడితో ఆపు చేద్దాం. ఎందుకంటే… మీ పేరంట్స్‌ని బాధపెట్టడం నాకిష్టం లేదు…”

“వాళ్లని బాధపెట్టడం ఇష్టం లేదు… ఓ.కే… మరి నన్ను బాధపెట్టడం నీకు ఇష్టమా?… సరే!… నాకు ఒక్క దానికే సమాధానం సూటిగా చెప్పు…”

“అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా? లేదా?… నన్ను…నన్ను ప్రేమిస్తున్నావా లేదా?… ఈ రోజు తేలిపోవాలి… చెప్పు దేవ్” అంది.

“అసలు ఇలా ఎందుకు అడుగుతున్నావు?… కొన్ని విషయాలు కొంత వయసొచ్చాక అమ్మా, నాన్న… తో చెప్పడం… ఎప్పడైనా నా మనసుకి కష్టమైన విషయం ఫోను చేసి మరి నీతోనే చెబుతుంటాను… ఎన్నో సార్లు నిన్ను చిరాకు పడ్డాను… కోపడ్డాను… కాని వెంటనే మరిచిపోతాను… నేను ఒకటి మాత్రం చెప్పగలను… యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్…”

వసుంధర మొఖం సంతోషంతో నిండి పోయింది… మరు నిమిషం అంది.

“యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే సరిపోదూ… ఐ లవ్ యు అని చెప్పు దేవ్ ” అంది.

కొంచెం చిరాగ్గా అన్నాడు “ఇప్పుడే కాదు ఎప్పుడూ నీతో చెబుతున్నాను… ఐ లవ్ యు చెప్పడానికి చాలా సమయం ఉంది… నీ బాధ భరించలేక చెప్పాననుకో!…. ఒక వేళ మీ పేరెంట్స్ మ్యారేజ్‍కి ఒప్పకోలేదనుకో, నిన్ను ఎత్తకెళ్లి పెళ్లి చేసుకుంటాననుకోకు… వాళ్లని బాధ పెట్టే హక్కు నాకు లేదు… ప్రేమ ఫెయిల్ అయిందని దేవదాసు అయ్యే నేచర్ నాది కాదు…”

“చాలు దేవ్!… చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూన్నాను…. ఏది సీరియస్‍గా తీసుకోవు. చివరికి ప్రేమని కూడ చాలా తేలిగ్గా తీసిపారేస్తావు.”

“సారీ వసూ!… నిన్ను బాధ పెట్టినట్టున్నాను…. మరి నేను వెళ్లనా?… ”

“ఒక్క దానిని బోజనం చేయాలి ….? కంపెని ఇవ్వచ్చుకదా ? ”

“ష్యూర్!…” అన్నాడు.

 భోజనం అయినాక ఇంటికి బయలు దేరాడు వాసుదేవ్!…

“ఒక్క దానిని… అప్పుడప్పుడు రావచ్చు కదా?…”

“ వీలయినప్పుడల్లా వస్తుంటాను కాని ఎవరినైనా తోడు ఉంచుకోలేకపోయావా?…”

“ఎవరు వస్తారు?… అందరికీ పరీక్షలు… పేరంట్స్ వాళ్లని విడిచిరారు… పోనీ నువ్వే ఇక్కడ ఉండొచ్చు కదా?…”

“నేనా?… ఎందుకు?… నువ్వే మా ఇంటికి రావచ్చు కదా?… అక్కా నీలూ ఉన్నారు…”

“ఎగ్జామ్స్ చదువు కోవాలి… తరువాత వస్తాను. “ఓ.కే” అని నాలుగడుగులు వేసి గభాలున వెనక్కి వచ్చి… వసుంధర కళ్లలోకి చూసి…. “ వసూ!… అనవసరంగా లేని పోనివి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు… ఒక్కటి మాత్రం చెప్పగలను…”

“ఏంటది?”

“యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్” అని గబగబా అడుగులు వేసాడు.

మోటారు బైక్ బయలుదేరింది..

పైక్ కనబడేంతవరకు చూస్తూ ఉండిపోయింది.

“నాకు తెలుసు దేవ్! …. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు…. నేనంటే నీ కిష్టం…”

“నీ మొద్దు బుర్రకి అర్థం కావడం లేదు… ఆరు నూరయినా, నూరు ఆరయినా నువ్వు నా వాడివే!… పక్కలో బల్లెంలా నీలూ వచ్చింది… నీ మీద ఆశలు పెట్టుకోకూడాం…. మనది చైల్డ్‌హుడ్ నుంచి ఉన్న ప్రేమని చెప్పాను…. ” అని మనసులో అనుకొంది వసుంధర.

***

మోటారు బైక్ వెళ్లి పోలీసు స్టేషను ముందు ఆగింది. గబగబా నడిచి లోపలికి వెళ్లాడు దేవ్.

“నమస్తే ఎస్సైగారు” అన్నాడు.

“అ… ఏంటి?… ఎప్పుడు పడితే అప్పుడు అత్తారింటికి వచ్చనట్లు వచ్చేస్తావు…. నువ్వు ఎన్ని సార్లు వచ్చినా కిడ్నాప్ అయిన వాళ్లు పరిగెత్తుకొని వచ్చేస్తారనుకుంటున్నావా?”

వస్తున్న కోపాన్ని దిగమింగి “ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందేమో అని వచ్చానండి!… ఆడపిల్లలు.. పేరంట్స్ చాలా వర్రీ అవుతున్నారు…”

ఫకాలున నవ్వాడు…. “ఆడపిల్లలు కాబట్టే కిడ్నాప్ అయ్యారు… దేశంలో చాలా మంది పేరెంట్స్ బాదపడుతున్నారు…. వీళ్లొక్కరే కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు” అన్నాడు ఎస్సై.

“వాళ్ల బాదను అరికట్టే పని మీదే కదండి?… మీరున్నారన్న భరోసా తోనే ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుంటారు… కాని తమ పిల్లలు రోజులు గడుస్తున్నా దొరక్కపోవడంతో భయంతో తల్లడిల్లితున్నారు…. మీరు ఈ విషయం సీరియస్‌గా తీసుకొని అవసరం అయితే మీరు ఎస్‌పి గారితో మాట్లాడి త్వరగా పిల్లలు ఎక్కడున్నారో కనుక్కోండి.”

 “బాగుంది… చాలా బాగుంది… నువ్వు నాకు సలహా ఇవ్వడం… ఇన్నాళ్లు ప్రజలు పోలీసులను చూస్తే భయపడేవారు… కానీ…. ఇప్పుడు మాకు సలహాలిస్తున్నారు…. మా పని మేము చేస్తున్నాం…. నువ్వేదో లీడరులా ఫీల్ అయిపోకు” అన్నాడు.

“నేను అలా అనుకంటే ఇక్కడకు వచ్చే వాడని కాను. మీరు దయుంచి తొందరగా కిడ్నాపర్లను పట్టుకోండి… మీ డిపార్టమెంట్ అనుకుంటే క్షణల్లో పట్టుకోగలదు.”

ధనలున కుర్చీలోంచి లేచాడు ఎస్సై… “ఊరుకున్న కొలది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు…. పోనీ ఒక పని చెయ్యి…. ఆ కిడ్నాపర్లను మీరే పట్టుకోండి… మా పని సుళువవుతుంది.”

“ఇదే మాట నేను ఎస్‌పి సార్ గారిని అడుగుతాను…. ఆయన మీలాగే చెబితే అప్పుడు మేమే కిడ్నాపర్లను వెతికి పట్టుకుంటాం” అని గబగబా బయటకు అడుగులు వేయసాగాడు వాసుదేవ్.

“ఏంటోయ్!…. నీకు మతి గానిపోయిందా? ఆగు… ఆగు… పిలుస్తుంటే వెళ్లిపోతున్నావు….” అంటూ, ‘ఏమిటి? కొంపదీసి ఎస్‌పి గారిని వెళ్లి కలవడు కదా? కలిసినా… ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యాలి’ అని తనలో అనుకున్నాడు ఎస్సై.

***

“పవిత్రా!… అందరం కలసి తిరుపతి వెళదామంటున్నారు నాన్నగారు…” అంది సుమిత్ర.

“ష్యూర్ అమ్మా!…” అంది.

***

అనుమానం ఉన్న ప్రదేశాలన్నీ మోటారు బైక్ మీద తిరగసాగాడు వాసుదేవ్.

సాయిపల్లవి, ఫ్రండ్స్ దొరకకపోవడంతో మనసులో ఏమూలో భయం ఏర్పడింది వాసుదేవ్‌కి…

***

పవిత్ర ఎంతకి గదిలోనుండి బయటకు రాకపోయేటప్పటికి కంగారుగా అటు ఇటు తిరగసాగింది సుమిత్ర.

“ఏంటి సుమిత్ర… ఒకటికి పదిసార్లు పవిత్ర గది దగ్గరకు వెళ్లి వస్తున్నావు…. రాత్రికే తిరుపతి ప్రయాణం… అన్నీ సర్దేసేవా?” అన్నాడు నిరంజనరావు.

“సర్దాను కాని ఇంత వేళయినా పవిత్ర లేవలేదు ఏమిటండి… ఆఫీసు వాళ్లతో కలిసి సోషన్ సర్వీస్ అని అవుట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఓల్డేజ్ హోమ్‌కి వెళ్లారు…. వాళ్ల ఎండి రామ్ లాల్ గారు దత్తత తీసుకున్నారట… ఎంత మంచి మనసండి అతనిది… రెండు రోజులు బాగా తిరిగారు కదండి… అలసిపోయినట్లుంది… అన్నట్లు ఆశ్రమానికి దగ్గరలోనే ఫామ్ హౌస్ ఉందట… అక్కడ స్టాప్ అందరికి బాగా ఎరేంజ్మెంట్స్ చేసారట ”

“ఎంత ఎరేంజ్‌మెంట్స్ ఉన్నా ఇంట్లోలా ఉండదు కదా? అందులోకి పవిత్ర… కష్టపడే మనస్తత్వం… అలసిపోయి ఉండి ఉంటుంది… అన్నట్లు వాసుదేవ్ ఎక్కడ? ప్రొద్దున్నుంచి కనబడనే లేదు” అన్నాడు.

“వాడు తెల్లారిగట్లే వెళ్లాడు… సాయి పల్లవి దొరకలేదని తెగ బాధపడిపోతున్నాడు…. ఆ తల్లిదండ్రుల బాధ చూడలేకపోతున్నాం…” అంది.

“తల్లిదండ్రులకు ఉన్న ఒక్కగానొక్క కూతురు కనిపించకపోవడం ఎంతో బాధ… ఏ బాధలైనా మనిషి భరించవగలడు కాని…. కళ్లముందు కనబడే కూతురు కనిపించకపోవడం కన్నా వేరే బాధ ఏం ఉంటుంది?…” అన్నాడు.

“అవునండి” అని ఏదో గుర్తు వచ్చిన దానిలా గబగబా పవిత్ర గది దగ్గరకు వెళ్లి తలుపు మీద చెయ్యి వేసి నెట్టింది… గడియ వేసి ఉంది…

కంగారుగా అంది – “ఎప్పుడూ పవిత్ర తలుపు గడియ పెట్టదు. అలా కంగారు పడకపోతే… తలుపు కొట్టు… టైము కూడ చాలా అయింది…”

“పవిత్రా… పవిత్రా తలుపు తీయమ్మా” అని తలుపు మీద చేత్తో తట్టసాగింది…

తలుపు తీసి ఎదురుగా ఉన్న పవిత్రని చూసి షాకైయ్యింది సుమిత్ర.

తెల్లవార్లు ఏడ్చినట్లు బాగా ఉబ్బిపోయి, ఎర్రబడ్డ కళ్లు, లంఖణాలు చేసిన దానిలా నీరసంగా ఉన్న ముఖం…

“ఏంటమ్మా అలా ఉన్నావు? ”

“ఏం లేదమ్మా… కాసేపు పడుకుంటాను.”

“వంట్లో బాగుండ లేదా?” అంది.

కంగారుగా అంది్ – “బాగానే ఉందమ్మా.”

“బాగుంటే అలా ఉన్నావు ఏమిటమ్మా? ” అని గభలున ఏదో ఆలోచన మనసులో మెదిలి… “ప్రదీప్‌కూ నీకు మధ్య ఏమైనా గొడవ జరిగిందా? చెప్పు తల్లి ప్రదీప్ చాలా మంచోడు కాని….”

నీరసంగా అంది… “అమ్మా! ప్లీజ్! అదేం కాదు… నేను… నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను…. నన్ను కాసేపు పడుకోనీయ్!…” అని తిరిగి తలుపు గడియవేసుకుంది…

ఆశ్చర్యపోయింది సుమిత్ర..

ఎప్పుడు పవిత్ర ఇలా లేదు… ఏదో జరిగింది. తను కంగారుపడి… ఆయన్ని కంగారు పెట్టకూడదు. పవిత్ర లేచాక తనతో చెబుతుంది. తన దగ్గర దాపరికాలు లేవు పవిత్రకి…

తిరుపతి వెళ్లడానికి బట్టలు, కావలసినవన్నీ సర్దుతూనే ఉంది కాని సుమిత్ర మనసులో పవిత్ర అలా ఉందేమిటని ఆలోచిస్తుంది. చివరికి ఉండలేక భర్తతో అంది.

“ఏమండీ!… పవిత్ర ఎప్పుడూ ఇలా లేదు… నా మనసు ఎందుకో కీడు సంకిస్తుంది. అసలు కారణం ఏమిటో మనతో చెప్పకుంటే, ఆ సమస్యకి పరిష్కారం మనకు తోచినది చెప్పేవాళ్లం కదండి? తనలో తను బాధపడితే ఎలాగండి?” అంది..

“సుమిత్రా! నువ్వు చెబుతునమ్నావు కదా సుమిత్ర ఎప్పుడు ఇలా లేదని?… అది చిన్న పిల్ల కాదు. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తుంది. ఎంతో ఒత్తిడి ఉంటుంది… ఆ విషయం మనకు ఏం చెబుతుంది? చెప్పినా మనకు అర్థం కాదని తెలుసు… అనవసరంగా కంగారు పడకు సుమిత్రా” అన్నాడు.

“అంతేనంటారా? అలా అయితే పరవాలేదు” అంది.

గదిలో నుండి వచ్చిన పవిత్ర తండ్రి పక్కనే కూర్చొని గభాలున వంగి తండ్రి ఒళ్లో మొఖం పెట్టి “నాన్నా! కొంచెం సేపు ఇలా పడుకోనా?” అంది.

ఒక్క నిమిషం ముందు కంగారుపడి మరు నిమషం…. “పడుకో తల్లి… ఎంత సేపు కావాలన్నా పడుకో… నాన్నగా ఒక్క మాట చెప్పనా తల్లీ” అన్నాడు.

“చెప్పు నాన్నా…”

“నువ్వేంటో నాకు తెలుసు… నువ్వు చేస్తున్న జాబ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఎదురైతే ఇంతగా వర్రీ అవుతున్నావెందుకమ్మా… జీవితానికి సంబంధించి ప్రాబ్లమ్ ఎదురైనప్పుడు ఆ మనిషి తప్పకుండా బాధ పడతాడు. కాని నువ్వెందుకు తల్లీ అంతలా వర్రీ అవుతున్నావు” అన్నాడు నిరంజనరావు అభిమానంగా తల మీద చేయ్యి వేసి సవరిస్తూ…

గభాలున తండ్రి చెయ్యి పట్టుకొని “సారీ నాన్నా… నేను… నేను… ఇప్పుడు ఏం చెప్పలేను…” అంది.

అప్పుడే హాలులోకి వచ్చిన సుమిత్ర ఎదురుగుండా దృశ్యాన్ని చూసి కంగారుగా వచ్చి ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చొని “ఏం జరిగింది తల్లి… అలా డీలా పడిపోయావు ?… చెప్పమ్మా” అంది కంగారుగా

“సుమిత్రా!… అనవసరంగా కంగారుపడకు. తనకి చెప్పాలనిపించినప్పు చెబుతుంది… పెద్దదయింది… తన సమస్యను తను పరిష్కరించుకోగలదు….” అన్నాడు.

ఒడిలో పడుకున్న పవిత్ర చిన్నగా నవ్వింది. “మీరు చెప్పింది కరక్ట్ నాన్నా!… నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను… కరక్టుగా సమస్యను పరిష్కరించానా? లేదా అన్నది నాకు తెలియదు… నా మనసుకి ఏది కరక్ట్ అనిపిస్తే అలా చేస్తాను…”

“ఆ పని చేయ్యి పవిత్రా… నువ్విలా ఉంటే నేను చూడలేకపోతున్నాను” అంది.

“నాకు టైమ్‌ని పొడిగించడం ఇష్టం లేదమ్మా. రిలీఫ్ కావాలి!… అన్నట్లు నేను తిరుపతి రాలేనమ్మా సారీ!… ప్లీజ్!… మీరు వెళ్లండి ” అంది.

“అదేంటమ్మా” అంది కంగారుగా సుమిత్ర…

“అమ్మా! అర్థం చేసుకో” అంది…

“సరే!… ఇంకోసారి వెళదాం లే సుమిత్రా… వాసుదేవ్ కూడ రాడేమో!… కోచింగ్ క్లాసస్ స్టార్ట్ అయ్యాయి నాన్నగారూ అన్నాడు”

“అయితే ప్రయాణం కేన్సిల్ చెయ్యండి” అంది కంగారుగా అంది సుమిత్ర.

“అమ్మా!… ఆ పని చేయవద్దు టిక్కెట్ల రిజర్వేషన్, రూములు బుకింగ్… అన్నీ ఎంతో కష్టపడి నాన్న చేసారు… మీరిద్దరూ వెళ్లండి… ప్లీజ్ అమ్మా!… మీరెళ్ళకపోతే నాకు బాధగా ఉంటుంది” అంది పవిత్ర.

“అవును సుమిత్రా… మనిద్దరం వెళ్లి మొక్క తీర్చుకుందాం… అసలు మనం తీరుపతి ఎందుకు వెళదాం అనుకున్నాం చెప్పు? మన బిడ్డలు క్షేమంగా ఉండాలి, వాళ్ల భవిష్యత్తు బాగుండాలనే కదా? మనం వెళ్లకపోతే ఎలా చెప్పు?” అన్నాడు.

అయిష్టంగానే తిరుపతి ప్రయాణానికి ఆంగీకరించింది సుమిత్ర.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here