పునరాగమనం

0
3

[dropcap](నే[/dropcap]పథ్యం: చందన, ధీరజ్, ధన్వంతరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కథలు – ‘నిర్ణయం’, ‘ప్రెజెంటేషన్’ కథలలో జరిగిన విషయాల తర్వాత… డాక్టర్ ధీరజ్ హాస్పటల్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఒక మెడికల్ కంపెనీ చేసిన మందుకి అనుకూలంగా ప్రెజెంటేషన్ చేయనందుకు చందన అతనిని తిడుతుంది. ‘కంపెనీ హాస్పిటల్‌కి వచ్చే విరాళం – నీ వల్లే పోయింద’ని గట్టిగా అరుస్తుంది.  అందుకని అతడు రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత… కొన్ని నెలలకి…)

“ఇస్ మోడ్ సే జాతే హై!”

సంజీవ్ కుమార్, సుచిత్రాసేన్ కొండల మధ్య పచ్చిక బయళ్ళలో పాడుతున్న దృశ్యం. ‘ఆంధీ’ సినిమా. కిషోర్, లత గొంతులతో ఓ గంట సేపు ఆ పాట పియానో మీద నేర్చుకున్నాడు యూట్యూబ్ వీడియో చూస్తూ.

“పత్థర్ కీ హవేలీ కో శీషే కె ఘరోందోం మేఁ…” ఈ మాటల అర్థం ఏమిటో!

హఠాత్తుగా మెదడులో ఏదో తీగ తెగినట్లు, ఎవరో క్రూరంగా పరిహసించినట్లు…

టక్‍మని పాట వీడియో ఆపేసి, పియానో ముందు నుంచి లేచి నిల్చున్నాడు ధీరజ్.

అంత పెద్ద యింట్లో హాల్లో ఒక్కడే.

యమన్ రాగపు సంగీత ధ్వనులు ఆగిపోయి ప్రేమగీతం మూగబోయి ఓ భయంకర నిశ్శబ్దం ఆవరించింది.

కొన్ని రోజుల క్రితం ఆమె వెళ్ళిపోయింది, ఇద్దరు పిల్లల్ని తీసుకుని.

“ఎన్నిసార్లు ఎన్ని జాబ్స్ పోగొట్టుకుంటావ్. ఎంత కాలం ఇలా? వుయ్ హావ్ టు గో”

“నీ ఏజ్ వాళ్ళు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. తెలివితేటలుండి ఏం లాభం, వేపకాయంత వెర్రీ, అంతులేని గర్వం వున్న తర్వాత! కట్టుకో!  బిల్స్ అన్నీ. మొత్తం ఏభై వేలు… కరెంట్‌కీ, నీళ్ళకీ… పిల్లల జీతాలకి, పుస్తకాలకి మరో ఏభై వేలు. మళ్ళీ నీ మైండ్ బాగయ్యేదాకా రాను. లేక మావాళ్ళు పొమ్మనే దాకా…”

విశాలి తిట్టి తిట్టి మరీ వెళ్ళిపోయింది. పిల్లలు కూడా ముఖం ముడుచుకున్నారు.

“బై! డ్యాడీ!”

విస్కీ గడగడా తాగేశాడు.

డబ్బు సంపాదించడమే ముఖ్య లక్ష్యం అని పెట్టుకుంటే ఎందుకు సంపాదించలేం? హెల్ విత్ ఆల్ దిస్!

ముందు మరో వుద్యోగం మరో హాస్పిటల్ చూసుకోవాలి. డబ్బు… డబ్బు… అంతే.

ఈ క్రూరమైన సినికల్ ప్రపంచంలో తనని తాను అమ్ముకుని, వేలం వేసుకుని తియ్యటి మాటలలో చీట్ చేసి డబ్బు సంపాదించడం ఒకటే మార్గం.

మనీ! నాట్ వాల్యూస్. ఇదే తన జీవిత లక్ష్యం ఇప్పుడు.

పియానో మెట్ల మీద ఒక్కసారి బ్లాక్ కీస్ అన్నీ నొక్కి ఒక అపస్వరం ఖంగుమని మోగించాడు.

ఒక్క ఫోన్ కాల్ అంతే.

చందన ఎప్పటికీ కాదనదు. ఆమె వద్దంటే భరణీ గ్రూప్ హాస్పిటల్ డైరక్టర్ తన ఫ్రెండే కదా – లేకపోతే ఎపోలో లోనో లేక కేర్ లో ఎక్కడో ఒక హాస్పిటల్‌లో ఎలాగైనా తనకి జాబ్ దొరుకుతుంది.

కాని ముందు, ముందుగా చందనని అడగాలి. సెల్ తీసి కాంటాక్ట్స్‌లో సిహెచ్‌ఎన్ నొక్కుతుండగానే, ఆమె ఫోటో, నంబర్ ప్రత్యక్ష్యం అయ్యాయి స్క్రీన్ మిద.

కాలింగ్ బెల్ గట్టిగా మోగింది.

లేచి కూర్చున్నాడు.

మళ్ళీ మోగింది. విశాలి వచ్చేసిందా, లేక ఇంకెవరైనా…

ఫోన్ నెంబర్ డయల్ చేయలేదు.

వెళ్ళి తలుపు తెరిచాడు.

***

ఇద్దరు అమ్మాయిలు తెల్లకోట్లలో భుజాన హేండ్ బ్యాగ్స్‌తో భయం భయంగా నిలబడి వున్నారు. ముప్ఫై ఏళ్ళ లోపే వుంటారు. జూనియర్ డాక్టర్స్ లాగానే వున్నారు.

“ఎక్స్‌క్యూజ్ మీ సార్, సారీ టు డిస్టర్బ్ యూ! నేను డాక్టర్ వాసంతి. ఈమె మా కొలీగ్ శర్మిష్ట. మేం ధన్వంతరీ మల్టీ స్పెషాలిటీలో మెడికల్ డిపార్ట్‌మెంటులో రెసిడెంట్స్‌గా పని చేస్తున్నాం సర్!”

“ఓ. నో ప్రాబ్లమ్. కమిన్!”

లోపలికి రమ్మని సోఫాల వైపు చూపించాడు!

మనసు లోపల వీళ్ళకి ఆతిథ్యం ఎలా ఇయ్యాలి, లోపల ఏమీ లేదు. కాఫీ డికాషన్ కాని, పాలు కాని… అసలు వంట రాని హౌస్‌కీపింగ్ రాని వ్యక్తి తను.

“సర్! మీరంటే మాకు చాలా గౌరవం సర్. ఇప్పుడు మాకు ఒక సీరియస్ క్లినికల్, డయాగ్నోసిస్ సమస్య వచ్చింది. మీరుంటే మాకెంతో బావుంటుంది అని వచ్చేశాం. ఇది వరకు మీరుండేవారని, సమస్యలు క్షణంలో తీరిపోయేవని మేడం చెప్పారు!”

“మేడం అంటే చందన!”

తను ఆ రోజు ‘ప్రెజెంటేషన్’ మెడికల్ కంపెనీకి అనుకూలంగా చేయలేదని అరిచినప్పుడు తనే కోపంగా రిజైన్ చేసి వచ్చిన సంఘటన ఈ చిన్న డాక్టర్లకి తెలుసా?

సోఫాలో వారికెదురుగా కూర్చుని నవ్వాడు మెల్లగా. “నేనక్కడ ఇప్పుడు లేను గదా! ఎలా చెప్పగలను. అయినా ప్రాబ్లెం ఏమిటో చెప్పండి. సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు బింకంగా.

ఇది మాత్రం తనకి వచ్చిన విద్య, వ్యాధి నిర్ణయం, క్లిష్ణమైన కేసులకి పరిష్కారం. ఇది తనకి బాగా వచ్చిన, నచ్చిన టాలెంట్. తాగిన మత్తు వదిలిపోయింది. డిప్రెషన్ ఎక్కడికో పోయింది.

“కేసు వివరాలు చెప్పండి. కాని, నేనక్కడ స్టాఫ్‌లో పని చేయనిదే నా మాట ఎవరు వింటారు?”

“మేడం మీతో మాట్లాడతానన్నారు సార్!”

“కేస్ చెప్పండి.”

“ముప్ఫై అయిదేళ్ళవాడు సార్, కడుపు నొప్పితో వచ్చాడు. సిటి స్కాన్‌తో సహా అన్ని పరీక్షలు చేశాం. ఎండోస్కోపీ, అల్ట్రా సౌండ్, బ్లడ్ టెస్ట్, యూరియా, క్రియోటొన్, గ్లూకోజ్ సోడియం, పొటాయిషమ్ అన్నీ అన్నీ నార్మల్!”

“మీరు చెప్పినదాని బట్టి  చూస్తే ఇది ‘సబ్ ఎక్యూట్ ఇంటెస్టైనల్ అబ్‌స్ట్రక్షన్’ (ప్రేగులలో ఏదో అవరోధం వుండడం) వల్ల అనిపిస్తోంది. ఎక్స్‌రేలో కాని టి.బి. సూచనలు ఏమన్నా వున్నాయా!”

“లేవు సార్! అన్నీ నార్మల్! కానీ అతనికి ఆపరేషన్ చేసి ప్రేగుల్లో ఏముందో చూడాలని సర్జన్ రావు గారు అన్నారు. మేడమ్ – ఎందుకో అది అవసరం లేదనిపిస్తోంది అంటారు!”

ధీరజ్ కొంచెం సేపు ఆలోచించాడు. “ఏం పని చేస్తాడతను?”

“సార్, చాలా బీదవాడు సార్. చెత్త డబ్బాలు, కాయితాలు ఏరుకోవడం ఇదే పని. మేడం ఇంటి దగ్గర గుడిసెల్లో వుంటాడట! ఇప్పటికే అతనికి చాలా ఖర్చయింది. ఎంత తక్కువ ఛార్జ్ చేసినా ఇంకా ఎక్కువే అయింది అతనికి. ఆపరేషన్ అవసరమా అని మేము ఆలోచిస్తున్నాం! అప్పుడు మేడమ్ అన్నారు, ‘ధీరజ్ వుంటే సమస్య క్షణాలలో పరిష్కరించేవాడు!’ ” కొద్దిగా నవ్వారు వాళ్ళు.

“ఇప్పుడున్న ఫిజీషియన్ మూర్తిగారు కూడా ‘లేపరాటమీ’ ఒక్కటే మార్గం అన్నారు”

ధీరజ్ లేచి నిల్చుని అటు యిటు తిరగసాగాడు.

‘నేను చెప్పను. ఎందుకు చెప్పాలి! నేనక్కడ ఉద్యోగం చేయడం లేదు. నా పద్ధతులు నచ్చక, నా ప్రిన్సిపుల్స్ నచ్చక నన్ను అవమానించి అరిచి వెళ్ళగొట్టిన చోట నేను, వుద్యోగం మానేసిన చోట ఎందుకు సలహాలివ్వాలి?’

అతని మనసులో మంటలు మండుతున్నాయి. ఇంకా ఎంత కాలం తనని, తన తేలివితేటలని వాడుకుంటారు? వాళ్ళకి తన తెలివితేటలు కావాలి. తనకి కావలసింది – తప్పదు.. డబ్బు… డబ్బు… డబ్బు. ఇది లేకపోతే గడ్డిపోచలా కూడా విలువ ఇవ్వడం లేని ఈ ప్రపంచం మీద ఎందుకో అర్థం లేని ఆవేశం, కసి! ఎందుకు చెప్పాలి?

మళ్ళీ ఏదో గిల్ట్. అపరాధ భావం. ఆ పేషెంట్‌కి ఏం చేయలో తనకి తెలుసు. ఏ టెస్ట్ చేయాలో తనకి తెలుసు. ఆపరేషన్‌ అయితే అవసరం వుండదు. తన విలువలకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడా?

కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది.

అదే సమయంలో ఆ రెసిడెంట్ డాక్టర్ అమ్మాయి పోన్ కూడా మోగింది.

ఆ అమ్మాయి లేచి నిల్చుని, భయంగా గౌరవంగా “ఎస్ మేడమ్! ఇక్కడే వున్నాం!” అంది.

ధీరజ్ లేచి వెళ్ళి తలుపు తీశాడు.

… ఎప్పుడయినా అదే జలదరింపు. ఓ గడిచిపోయిన మోహపు బాధాకరమైన జ్ఞాపకం. మళ్ళీ అదే థ్రిల్! కానీ తనది కాని వస్తువుని చూసిన నిర్లిప్తత మళ్ళీ.

ఎర్రటి పూవులున్న నీలిరంగు అంచుతో కంచి పట్టుచీర, ఘుప్పుమనే పెర్‌ప్యూమ్ వాసన, తలలో మల్లెపులు, చెవుల మెరిసిన వజ్రాల దుద్దులు, మెడలో కూడా వజ్రాల హారం, కాటుక కళ్లు, నీలి మస్కరా, ఫ్రెష్‌గా తల స్నానం చేసి విరబోసి వదిలేసిన జుట్టు… చందన.

తడబడ్డాడు. వెనకాల డ్రైవర్ యూనిఫారంలో.

“నమస్తే డాక్టర్ సాబ్! లోపలికి రావచ్చా” నవ్వుతోంది.

తేరుకుని “ఓ! నమస్తే! కమిన్ కమిన్” అన్నాడు.

ప్రేమ ఎంత మధురం. అది విఫలమైనా తీయగా వుంటుంది. దారులు వేరైనా అప్పుడప్పుడూ కనబడి కత్తితో కోస్తూనే వుంటుంది. ప్రియురాలు కఠినమైనా, వ్యాపారవేత్త అయినా, ప్రేమ మాత్రం నీళ్ళు జల్లిన గులాబీపువ్వులా పరిమళాలు వెదజల్లుతూనే వుంటుంది అంధకారంలోనయినా, పట్టపగలైనా సరే.

“హౌ ఆర్ యు ధీరజ్! సారీ! ముందు చెప్పకుండా వచ్చాను” అంది డాక్టర్ చందన సోపాలో కూర్చుంటూ.

“ఏంటీ ఏదో అనుకుంటూ పాటలు వినేస్తున్నావ్! ఆత్రేయ పాట హమ్మింగ్ చేస్తున్నవా?”

ఉలిక్కిపడ్డాడు. “నీకేమన్నా టెలీపతి వుందా?”

“లేదు. నీ బెడ్‌రూమ్ నుంచి ఆ పాటే వస్తోంది. ఆపడం మర్చిపోయినట్లున్నావు. యూట్యూబ్ మ్యూజిక్‌లో తన నెక్స్ట్ పాట అదే.

రెసిడెంట్ డాక్టర్ అమ్మాయిలు అర్థం కానట్టు చూశారు. వాళ్ళు నవ్వరు. అర్థం అయినా కానట్టు వుంటారు.

చందన అంది “ధీరజ్! ఈ కేసు అని కాదు, ఇలాంటి సమస్యలు మా హాస్పిటల్‌లో రోజూ వస్తూనే వున్నాయి. నువ్వు తప్ప మాకే ఫిజీషియన్ మీద నమ్మకం కలగడం లేదు.”

చెక్ బుక్, కాయితం తీసింది.

“ఇదిగో ఎపాయింట్‌మెంట్ ఆర్డర్, నీ షరతుల మీద, నీ ప్రిన్సిపల్స్‌తో, నీకు నచ్చినట్టు పని చేయచ్చు. టైమ్‌కి హాస్పిటల్‌లో వుంటే చాలు. నీ జీతం నువ్వే రాసుకో! అర్జెంటుగా మా ధన్వంతరీలో జాయిన్ కావాలి. ఓ.కె.?”

ఒక్కసారి మనసంతా తేలికపడి, తల మీద బరువు తీసేసినట్లు అనిపించింది అతనికి.

డబ్బులోని శక్తి అది. అది లేనివాడు ఎంత నిస్సహాయంగా ఫీలవుతాడో, వున్నవాడు దాని గురించి చింత లేనివాడూ అంత శక్తిమంతంగా ఫీలవుతాడు. అడవిలో పులులు ఆహారం కోసం వేటాడినట్లు, కాంక్రీట్ జంగిల్‌ సమాజంలో మనిషి డబ్బు కోసం వేటాడాలి అవునన్నా కాదన్నా. ఇది నిజం.

కాని పైకి బింకంగా అన్నాడు.

“చందనా, ఇది రెండోసారి. మరి నా పద్ధతులు నీకు నచ్చనప్పుడు మళ్ళీ మళ్ళీ గొడవలు రావచ్చు. నేను నా పని చేసే పద్ధతి మార్చుకోలేను  అని నీకు తెలుసు. ఎలా…”

“నో ధీరజ్! మళ్ళీ మళ్ళీ మొదటికి రాకు. నువ్వు నా ఫ్రెండ్ అని కాదు, నీ సర్వీసెస్ నాకు అవసరం” నవ్వింది. ఎక్కువ మాట్లాడుతానేమో అనే భయం ఆమె కళ్ళల్లో. “నువ్వు మాతోనే వుంటున్నావు. నీ మీద గౌరవం, నమ్మకంతోనే నేను స్వయంగా వచ్చాను!” అంటూ చుట్టూ చూసింది. “ఇంట్లో ఎవరు లేరా? పిల్లలు, భార్యా ఎవరూ…”

“లేరు!” నవ్వాడు. “కాని, ఇప్పుడు ఇక వస్తారు! ఆ కాయితం ఇయ్యి!”

తీసుకుని చకచకా చదివి సంతకం పెట్టేశాడు.

“థ్యాంక్స్ మేడమ్ డైరక్టర్!”

కనీసం ఈ అమ్మాయిల ముందు సరిగా ప్రవర్తించాడు తను. “థాంక్యు మీ ఆశయాల ప్రకారం పని చేస్తాను! రేపటి నుంచి వస్తాను.”

“డయగ్నోస్టిక్ మెడిసిన్ చీఫ్‌గా నీకు ఆఫీసు, వీళ్ళిద్దరూ నీకు అసిస్టెంట్స్‌గా వుంటారు.” లేచి నిల్చుంది చందన.

ఆమె ముఖం కూడా ఇప్పుడు తుఫాను దాటి తీరాన్ని చేరినట్లు అలసట, సంతోషంలో వుంది.

డాక్టర్ వాసంతీ, డాక్టర్ శర్మిష్టా కూడా రిలీఫ్‍గా నవ్వారు.

“ధీరజ్ సార్, మరి ఈ పేషంట్ కడుపు నొప్పికి లేపరాటమీ ఆపరేషన్ అని సర్జన్ త్వరపెడుతున్నారు. ఏం చేయాలి?”

ధీరజ్ లేచి నిల్చుని చిన్నగా నవ్వాడు.

“నో సర్జరీ. వెళ్ళి వెంటనే బ్లడ్ టాక్సిక్ మెటల్ స్క్రీనింగ్ (అంటే ప్రమాదకరమైన లోహాల ప్రమాణాలు ఏమన్నా వున్నాయా అనే పరీక్ష) చేయించండి. ఆ తర్వాత యూరిన్ పారిఫిరినోజన్‌కి పంపండి.”

శర్మిష్ట ఒక్క జంప్ చేసినట్లు గాలి లోకి ఎగిరి తల పట్టుకుంది!

“సా…ర్! ఇది తట్టనే లేదు మాకు సార్, పార్‍ఫిరియా… కాని అది చాలా అరుదైన జబ్బు కదా”

వాసంతి అంది “సార్ తెలిసిపోయింది. లెడ్ లేక ఆర్సెనిక్. అతను చెత్తడబ్బాలు, పెయింట్ డబ్బాలు కూడా ఏరుకుంటూ ఉంటాడు. ర్యాగ్ పికర్! లెడ్ పాయిజనింగ్… మేడమ్ అంత బీదవాడిని ఎడ్మిట్ చేయడం గొప్ప వింతే!”

ధీరజ్ నవ్వాడు. “గుడ్! రేపు తెలిసిపోతుంది మరి. నేను అప్పుడు ట్రీట్‌మెంట్ ఇస్తాను.”

“బై ధీరజ్! రేపు పొద్దున్న కలుద్దాం!”

అందరూ వెళ్ళిపోయినాక, ఇప్పుడు నిశ్శబ్దం శ్రావ్యంగా అనిపించింది.

రేపటికి కావల్సిన శుభ్రమైన ప్యాంటు, షర్ట్, వైట్ కోటు, టై అన్నీ వెదికి చూసుకుని, రెడీగా పెట్టుకున్నాదు.

ఈసారి యూట్యూబ్‌లో “అదే నీవు, అదే నేను” పాట మొదలయింది.

***

డాక్టర్ ధీరజ్, చీఫ్ కన్సల్టెంట్, డయాగ్నోస్టిక్ మెడిసిన్ (వ్యాధి నిర్ణయ నిపుణుడు) అని బోర్డు మళ్ళీ వెలసింది ఓపి కారిడార్‍లో చివరగా. లైట్ బ్లూ కలర్ గోడలు, గంధం రంగు మహాగని టేబుల్ మీద కావల్సిన వైద్య పరికరాలు, స్టెతస్కోప్, బిపి ఏపరేటస్, పల్స్ ఆక్సీమీటర్, గ్లూకామీటర్, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ అన్ని అందంగా శుభ్రంగా అమర్చారు. ఏసి కంప్రెసర్ మెత్తని చప్పుడుతో రూమ్ అంతా చల్లదనాన్ని సౌకర్యంగా వ్యాపింప చేసింది.

అతను కుర్చీలో కూర్చోగానే అందరు మళ్ళీ హర్షధ్వానాలు చేశారు.

“డాక్టర్ ధీరజ్ పునరాగమనం మనందరికీ చాలా సంతోషం. వైద్య సేవలు అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగిన వ్యక్తి అతను” చందన క్లుప్తంగా స్వాగత ఉపన్యాసం చెప్పింది.

“ఏవీ రిపోర్టులు?” అన్నాడు ధీరజ్.

ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన డాక్టర్ వాసంతి… ల్యాబ్‌కు పరుగెత్తింది.

‘సార్ మీన్స్ బిజినెస్! నో డిలే! ఏదీ ఆలస్యం కాకూడదు!’ శర్మిష్ట కూడా ల్యాబ్ వైపు వేగంగా కదిలింది.

అందరూ ధీరజ్‌ని రూమ్‍లో వదిలి వెళ్ళిపోయినాకా, అతను లేచి నిల్చున్నాడు. కిటికిలోంచి హాస్పిటల్ లాన్స్, చందన ఇష్టంగా పెంచిన గులాబీతోటలో పూలు, ఉదయపు నీరెండలో మెరుస్తున్నాయి.

“సార్! పార్‌ఫిరిన్ నెగటివ్!” అంది వాసంతి.

“ఓ.కె. నేను అనుకోలేదు కూడా!”

శర్మిష్ట వచ్చింది. “కంగ్రాచ్యులేషన్స్ సార్. టాక్సిక్ స్క్రీనింగ్ ఎమర్జెన్సీగా బైటి థైరో ల్యాబ్స్ నుంచి తెప్పించాం. లెడ్ లెవెల్స్ చాలా హై. 40 µg. ఆర్సెనిక్, క్యాడ్మియం, ఐరన్ అన్నీ నార్మల్. ఇటీజ్ లెడ్ పాయిజనింగ్!”

“వౌ! గ్రేట్!” అన్నాడు.

“శర్మిష్టా! ఇప్పుడు ఏం మందులు ఇవ్వాలో నీకు తెలుసు కదా!”

“ఎస్ సర్! డి పెన్సిల్లామైన్, సక్కీమెర్ రెండూ దొరుకుతున్నాయి. డి పెన్సిల్లామైన్ ఇద్దాం. లెడ్ లెవెల్స్ 40 µg వున్నాయి. ఇవాళే మొదలుపెడదాం!”

ఉత్సాహంగా అంది శర్మిష్ట – “ప్రాబ్లెమ్ సాల్వ్‌డ్ సార్!”

***

ఓ నెల తర్వాత…

“థ్యాంక్యూ ధీరజ్! నీ మీద నమ్మకం వుంచినందుకు బ్రిలియంట్‌గా మొదటి కేసే పరిష్కరించావ్. కంగ్రాట్స్! ఆపరేషన్ అవసరం లేకుండా లెడ్ పాయిజనింగ్‌కు విరుగుడు డి పెన్సిల్లామైన్ అతనికి ఇచ్చాం. కడుపు నొప్పి తగ్గింది. బ్లడ్ లెవెల్స్ తగ్గాయి. లెడ్ అయిదు మైక్రో గ్రాములకి పడిపోయింది. అతన్ని డిశ్చార్జి చేస్తున్నా. ఓకే?” అంది చందన ఫోన్‌లో.

“ఓకే మేడమ్!”

“మేడమా?”
“ఔను. ఇక్కడ నువ్వు బాస్‌వి. నేను సబార్డినేట్‌ని” నవ్వాడు.

“సరే, నెలకి రెండు చాలా, ఇంకా కావాలా? స్వంత ఇల్లే గదా! విశాలి వచ్చేసిందా?”

“వచ్చేసింది. కాని, రెండు లక్షలు చాలవు చందనా!”

“మరి…?”
“ఫిక్స్‌డ్ శాలరీ, ప్లస్ నేను సాల్వ్ చేసిన కేసులకి ఫీజ్ అదనంగా ఇస్తే…” మొహమాటంగా అన్నాడు.

నవ్వుతోంది ఫోన్‌లో.

“ఓకే. ఓకే. కొంచెం తెలివితేటలు ముదిరినట్లున్నాయి. నో ప్రాబ్లెం.” నవ్వు ఆపి, “బోనస్‌గా నేను కూడా కావాలా…”

ఎప్పుడూ అంతే! కవ్విస్తుంది.

“చందనా? జోకింగ్”

“నువ్వో మూర్ఖుడివి. కోటి రూపాయలిచ్చినా వద్దంటావు. నన్ను కూడా ఆ రోజుల్లో వద్దనుకుని వెళ్లి పోయావు. నీకు డబ్బు విలువా తెలియదు. మనుషుల విలువా తెలియదు. ఆ రోగులూ మందులూ తప్ప! ఓకే, పాస్ట్ మళ్లీ వద్దు. బీ వాట్ యూ ఆర్! అదే నీ ఆకర్షణ మరి! నీ పునరాగమనం మాత్రం మాకెంతో సంతోషం… హ్హ హ్హ హ్హ…”  ఇంకా నవ్వుతోంది. “నీ పేరు చూడగానే ఈరోజు ఇరవై మంది ఎపాయింట్‌మెంట్స్ కోసం కాల్స్ వచ్చాయి. బై!”

ధీరజ్, రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.

మెల్లగా, ఐపాడ్ ఆన్ చేసి యియర్ ఫోన్‌లు చెవిలో పెట్టుకున్నాడు.

“అదే నీవు… అదే నేను…” తనకిష్టమైన ప్రేమ పాట మళ్ళీ మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here