నటుడు

1
3

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన జి.నరసింహమూర్తి. [/box]

[dropcap]దే[/dropcap]శమే కాదు, కళారంగం కూడా పుణ్య భూమే ప్రసాదరావుకి. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఉత్తమ కళాకారుడుగా తనకో ప్రత్యేక స్థానముంది. ఎందరో కళాకారులు, కళారంగానికి అనేక కారణాలతో దూరమైనా ప్రసాదరావు మాత్రం దానినే పూజిస్తూ బతుకుతున్న సౌమ్యుడు.

భౌతిక, సామాజిక పోకడల్ని పిండి కళ అనే పాదరసంతో పుటం పెట్టి రససృష్టి చేయబడిందే ‘నటుడు’ నామధేయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షకుల్ని ఉర్రుతలూగిస్తున్న సరికొత్త సాంఘిక నాకటం. దాని  రచన, దర్శకత్వం అందులోని ప్రధాన పాత్ర యావత్తూ పరిపక్వత పొందిన ప్రసాదరావే!

అటువంటి గొప్ప విలువలతో కూడిన నాటకం మరో గంటలో ఆ సిటీలో దేశవ్యాప్తంగా మంచి పేరున్న కళాభారతి వేదికపై ప్రదర్శింపబడబోతోంది.

నాటకంలో వెన్నెముకలాంటి పాత్రలో ప్రసాదరావు నటించలేదు, జీవించాడన్నదే వేలాది మంది ప్రశంసలు. మరి కొందరు ‘నటుడు’ నాటకం ‘అమాణం’ అన్నారు.

గ్రీన్ రూం కళాకారులతో ఇజీ గాలేదు. పాత్రధారుల హృదయాల్లో ప్రవేశించిన పాత్రల సంఘర్షణతో బిజీగా ఉంది.

మరో అయిదు నిముషాల్లో ప్రసాదరావు గ్రీన్ రూం కెళ్లేందుకు సిద్దపడుతున్నాడు. నాటకాన్ని తిలకించేందుకు, కొందరు పేరు మోసిన సినీకళాకారులు కూడా రాబోతున్నట్టు అతనికి తెలిసింది.

ప్రసాదరావుతో పాటు అతని భార్య శ్యామల ఆ నాటకంలో అతని భార్యగా నటించడం వలన నాటకానికి మరింత సహజత్వం కలిగిందని కొందరి అభిప్రాయం.

ఇంతలో సెక్యూరిటీ గార్డు లోనికొచ్చి గ్రీన్ రూం తలుపు కాస్త వెనక్కి నొక్కి “సార్! యెవరో వొకతను ప్రసాదురావుగారితో మాట్లాడాలంట, బయటున్నారు” అనే మరో ప్రశ్నకు దొరక్కుండా వెళ్లిపోయాడు.

అది విన్న ప్రసాదరావు, ఎవరో అభిమానులొచ్చుంటారని రూంలోంచి  బయటకొస్తే ఎవరూ కనిపించలేదు. ఎవరి పనుల మీద వాళ్లు అక్కడ తిరుగుతున్నారు తప్ప తన కోసం నిరీక్షిస్తున్న వారెవ్వరూ లేరక్కడ.

అతను మరో అయిదడుగులు ముందుకొచ్చి పరిశీలించి చుట్టూ చూస్తుండగా, అక్కడికి కొంచెం దూరంలో ఓ చెట్టు నీలినీడలో నిలబడ్డ యువకుడు చెయ్యెత్తి ఊపుతూ తన వేపుకి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తన కోసం వచ్చిన వ్యక్తి అంత దూరంగా వెళ్లి నుంచోవడమేంటి? వచ్చిన వ్యక్తి తననే అక్కడకి రమ్మన్నట్టు సైగ చేయడమేమిటి? అవతల వ్యక్తి సభ్యత నచ్చక పోయినా, స్వాత్వికుడైన ప్రసాదరావు తనని పిలుస్తున్న వ్యక్తి వేపు నడిచాడు. ప్రసాదురావు ఆ వ్యక్తిని సమీపించి, అతని ముఖంలోకి ఓ సారి చూశాడు. అతనికి నోటంట మాట రాలేదు. ఆశ్చర్యం! ఆనందం!!

అవతల ఆ యువకుడు తొణకలేదు. ప్రసాదరావు ముఖంలోకి కర్కశంగా చూశాడు ఎవరో దోషిని చూసినట్టు.

ప్రసాదరావు గుండెలో ఆప్యాయత, ఆనురాగత!

“బాబూ! చిన్నోడా… రాఘవా!”  అంటూ ప్రేమగా దగ్గరగా తీసుకోబోయాడు ప్రసాదరావు.

రాఘవ ఓ అడుగు వెనక్కేసి ఆ అవకాశమివ్వలేదు

“వొరేయ్ నాన్నా! ఈ మూడు సంవత్సరాలూ యేమైపోయావ్రా? ఈ నాన్న నెలా మరిచి పోయావ్రా?” పితృ ప్రేమ అతణ్ణి వివశుణ్ణి చేస్తుంది.

కాని అదంతా రాఘవకి నటనలా అనిపిస్తుంది. అతనికి తండ్రి మీద నమ్మకం ఏనాడో పోయింది. ఇక అతణ్ణెంత మాత్రం నమ్మే ప్రసక్తే లేదన్న నిర్ణయానికొచ్చేశాడు.

“పేపర్లో చూశాను ఈ వేళ ఇక్కడ మీ నాటకం ఉందని” అన్నాడు రాఘవ చాలా ముక్తసరిగా.

“అయితే నువ్వీ సిటీలోనే ఉంటున్నావా బాబూ?” అడిగాడు ప్రసాదరావు.

“యెక్కడ ఛస్తే మీకెందుకు కనిపారేసిం తర్వాత?”

“రాఘవా!”

“నాటకాల మీదున్న ప్రేమ కనిపారేసిన వాళ్ల మీద యెందుకుంటుందిలే!”

“యేమిట్రా ఆ మాటలు?”

“మరింకేం అనాలి? తాతగారు మీకిచ్చిన వాటా నాటకాల కోసం హారతి కర్పూరం చేసేశారు. కాని మీ అన్నదమ్ములు తమ కొచ్చిన వాటాలతో తమ ఆస్తుల్ని పెంచుకుని కోటీశ్వరులైనారు. వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో పెద్ద చదువులు చదివించారు. కాని మేము మాత్రం దుమ్ము కొట్టకుపోయి దీనంగా చావలేక బతుకుతున్నాం.”

“కళాకారుడిగా నాకు కొన్ని ధర్మాలూ, ఆశయాలూ ఉన్నాయి.”

“కాదు, ఉన్నవల్లా పనికిమాలిన పిచ్చి భ్రమలు.”

ప్రసాదరావు గతంలోకెళ్లాడు. అప్పట్లో తాను చేస్తున్న ప్రభుత్వోద్యోగానికి నాటకకళపై గల అభిమానంతో రిజైన్ చేశాడు. తన తండ్రి ఇచ్చి వాటాను నాటకాల కోసమే ఖర్చు చేశాడు. నాటకాల్ని భుజాన మోస్తునే జిల్లాలూ రాష్ట్రాలూ తిరిగాడు. ఫీజు కట్టలేనందున కాలేజీ నుంచి కొడుకు బయటకు పంపబడ్డాడు.

తండ్రి నాటకాలేస్తూ సంపాయించి తనను చదివించలేడని పెద్దకొడుకు నటరాజ్ విసుగెత్తి యింట్లోంచి వెళ్ళిపోయి బొంబాయిలో ఓ హోటల్లో ప్లేట్లు కడిగే ఉద్యోగం చేసుకుంటున్నట్టు ప్రసాదరావుకి చూచాయగా తెలుసు.

కనీసం కన్నకూతురు రాగిణిని గొప్ప అభినేత్రిగా తీర్చిదిద్దాలని తపించాడు. కూతుర్లో గల కళామతల్లిని ఆరాధించడం తన అదృష్టమనుకున్నాడు. తనలో కళను కొడుకులు అందుకోలేకపోయినా కూతురు సమర్థవంతంగా ఆ పని చేస్తున్నందుకు తృప్తి పడ్డాడు.

ఆమె ఇతర నాటక సమాజాల్లో వేలాది మైళ్లు ప్రయాణాలు చేసింది. తోటి మగ కళాకారుల మధ్య, ఇరుకు గదుల్లో ప్రయివసీ లేకుండా, అలసటతో నిద్ర కరువైనందుకు ఒళ్లు మరిచి నిద్రపోయిన రోజులు అంతులేనన్ని.

ఆమె ప్రతిభకొద్దీ టీవి యాంకరైంది. తర్వాత టీవీ నటిగా, సినీనటిగా వెలుగులోకొచ్చింది. ఇంకా ముందుకెళ్లాలంటే తన నటనొక్కటే చాలదని అర్థమయింది. తన పవిత్రమైన ఆడతనాన్ని ఆహుతి చేసుకుంది.

ఊబిలో పడిపోయిన కూతుర్ని తల్లి శ్యామల తెలివిగా బయటకు లాగింది గాని తర్వాత అన్ని దారులూ ముసుకుపోయాయి. వయస్సు ముదరక ముందే జీవితాన్ని ఓ గట్టుకు చేర్చాలి గనుక, చాలా మంచి సంబంధమని ఒకటొస్తే పెళ్లి అయిపోయిం తర్వాత తెలిసింది. జైలు కేసుల్లోంచి విడుదలయ్యిన ఓ లగేజ్ క్యారేజీ డ్రయివరని.

రాగిణి మొగుడు శాడిజంలో ముదిరిపోయాడు. ఓ కళాకారిణిగా సృజనాత్మకంగా సంస్కారయుతంగా సున్నితంగా బతికిన తనకు భర్తతో సుఖం లేదు. మనిషిగా గౌరవం లేదు. హింసా కాసారంలో ఆమె ఇప్పుడు ఓ హంస.

కొత్త కొత్త వికృత హింసల్తో కట్టుకున్న భార్యల్ని నిలువుగా అడ్డంగా కోసిపారేసే క్రిమినల్ భర్తలున్నారని ఈ సమాజంలో చాలా మందికి అర్థం కాదు. అందుకే రాగిణి తల్లిదండ్రుల దగ్గర బతికేందుకు మధ్య మధ్య పుట్టింటికి వచ్చేయడం చాలాసార్లు జరిగింది.

తల్లిగా, ఆడదానిగా శ్యామల తన కూతురు అనుభవిస్తున్న నరకం తెలుసు. కాని దానికి పరిష్కారం తన దగ్గర లేదు.

భార్య పుట్టింటికి వచ్చీ రావడంతోనే, అల్లుడు కడివేడు కాలకూటాన్ని కడుపులో పెట్టుకొని ఆదర్శ భర్తలా, అమృతమూర్తిలా నటిస్తూ ప్రసాదరావు ముందు నటిస్తాడు భార్యను తనతో పంపమని. అల్లుడు ఓ ఆడదాన్ని కేవలం తన శరీర సుఖాల కోసం, ఇంట్లో చాకరీ కోసం వాడుకునే మొసలి అని ప్రసాదరావుకి తెలీదు.

తన భార్య నాటకాల్లో పాత్రలు అందజేసిన, స్వేచ్ఛా విజ్ఞాతా బాగా ఆకళింపు చేసుకున్నది గనుక ఏదో  ఓ రోజున ఉక్కు పంజరాన్ని ముక్కులు ముక్కలు చేసి శాశ్వతంగా వెళ్లిపోతుందన్న అనుమానమొచ్చింది భర్తకి.

పెందలాడే పథకరచన చేశాడు. సమయం కోసం సాధువులా స్వీయనటన ప్రారంభించాడు. ఆ వేళ వినాయక చవితి.

“రాగిణీ! పండగ కదా బూరెలు వండు” అన్నాడు.

గాస్ స్టవ్ పెట్టే కర్ర టేబిల్ని రిపేరు చేయించాలనే నెపంతో స్టౌవ్‌ని కింద పెట్టించి వంటలు చేసుకోమన్నాడు.

భర్త చాలా సుముఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఆడమనసు అమాయకమైనది!

బూరెల మూకుడులో పోసిన నూనె సలసలా కాగుతోంది. ఆమె చుట్టూ ప్రేమలోలకబోస్తూ తిరుగుతున్నాడు మొగుడు. రాగిణి తన పనిలో లీనమైంది. అతని ఎర్రబడ్డ ముఖంలోంచి చెమట్లు వేడెక్కిన నూనెలోంచి వేడి ఆవిర్లు పోగలు.

అతను చిర్రున ముందుకొచ్చాడు. గురి చూసి లాగి తన్నాడు మరుగుతున్న వేడి నూనె బూర్లె ముడుకును!

ఆమె కెవ్వుమంది. అప్పటికే ఆమె కేక బయట ప్రపంచానికి తెలియకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు

ఆమె విలవిలలాడింది. అతనిలోని దుర్మార్గం తృప్తిగా, పకపకా నవ్వుకుంది. ఆమె ముఖం బొబ్బలు తేరింది. రెండు నెలలు బాధ పడింది. ఆ తర్వాత ఆమె ముఖాన్ని ఆమె గుర్తు పట్టలేనంతగా నల్లగా వికృకంగా మారిపోయింది. తల్లిదండ్రులనూ, బయట ప్రపంచాన్ని మరచిపోయింది. సగం చచ్చి బతుకుతున్న తల్లిదండ్రులను తాను చచ్చిపోయి ఇంకా బాధ పెట్టదలచుకోలేదు. తానే ఓ బలమైన పంజరాన్ని సృష్టించుకుని అందులో బందీ అయిపోయింది. రాగిణి ఎందరో అత్మీయిలూ అభిమానులు ఉన్నా యెవ్వరూ లేని ఏకాకైపోయింది.

కారణం? అసమర్థుడైన తన తండ్రి!

అందుకే అందుకే రాఘవకు తండ్రి అంటే కసి కోపం!

***

‘గ్రీన్ రూంలోంచి బయటకెళ్లిన భర్త ఇంకా రాలేదేం’ అనుకుంటూ శ్యామల బయటకొచ్చింది. అతను లేడు. చుట్టూ పరికించింది. కాస్త దూరంలో భర్త. పక్కనే మరో యువకుడు. ఏం జరిగుంటుంది? గబగబా అక్కడికెళ్లింది.

చూస్తే ఎప్పుడో ఇల్లు విడిచివెళ్లిపోయిన చిన్న కొడుకు రాఘవ!

మాతృ ప్రేమతో “బాబూ! రాఘవా!” అంటూ కొడుకు తల నిమిరుతూ దగ్గరకు తీసుకుంది.

రాఘవ తల్లిని కింది నుంచి పైకి ఓసారి పరికించి “చూస్తూంటే కడకు నిన్ను కూడా ఈ నాటకాల అడుసులోకి లాగేసినట్టున్నాడు ఈ నట చక్రవర్తి” అన్నాడు కొంత వేదనతో, కొంత వెటకారంతో.

శ్యామల కొడుకునలా మాట్లాడవద్దని చూపుల్తోనే వారించింది.

“కళామతల్లి ఒడిలో బతికే అదృష్టం అందరికీ కలగదు” అన్నాడు ప్రసాదరావు.

“అయితే ఓ కళాకారుడైన మీ వొడిలో బతుకుతున్న మేమంతా యెవరం?”

“జీవితం ఓ నాటకమైతే అందులో నటించే పాత్రధారులు” తాత్వికంగా సమాధానమిచ్చాడు ప్రసాదరావు.

“కాదు, మీరు గాలిమేడల్లో బతికే ఊహా జీవులు. మీ భార్యాబిడ్డలు మాత్రం జీవచ్ఛవాలు. వాళ్ల మేధస్సూ, మోటివ్సూ ఎవరికీ అక్కర్లేదు. ముఖానికున్న రంగు తీసేసిన తర్వాత వాళ్లు సమాజానికి అవసరం లేదు. రంగస్థలం మీదున్నంత సేపూ చెవులు బద్దలయ్యే చప్పట్లు, రంగస్థలం దిగిన తర్వాత వారి రోదనలు యెవరికి అక్కర్లేదు” ఆవేశంగా ఊగిపోయాడు రాఘవ.

“రాఘవా! ఆవేశమొద్దు. చూడు నా యెదుట ఆకాశాన్నంటే కళాభారతి. అందులో వేదికనెక్కే అదృష్టం వెయ్యిమంది కళాకారుల్లో ఏ ఒక్కడికో కలుగుతుంది. నటుడుగా నా నిజ జీవితమిలా తెల్లారిపోతే సంతోషం.”

“మీరు కళామతల్లికి సేవ చేస్తున్నామనుకుంటున్నారే గాని, తిరిగి ఈ కళారంగమే మిమ్మల్ని ఏదో రూపాన మీద పడి మింగేస్తుందని తెలుసుకోలేక పోతున్నారు.”

“మేం ఈ సమాజానికి అద్దంలాటి వాళ్లం.”

“కాని అందులో మీరు కనిపించరు. సరికదా మీ కష్టాలూ, కన్నీళ్లూ, వేదనలూ, వ్యథలూ బయట ప్రపంచానికి అక్కర్లేదు.”

“కళామతల్లినే సర్వస్వంగా భావించి, సేవ చేస్తూ, పూజిస్తూ ఆ తల్లి ఒడిలోనే ఆఖరి శ్వాస పీల్చుకోవాలని తహతహలాడుతున్న ఆశావహులం బాబూ!” అన్నాడు ప్రసాదరావు సమర్పణ భావంతో.

“మీరు విధేయతతో వినమ్రులై సేవ చేస్తే అపురూపమైన కళారంగాన్ని విమర్శిస్తున్నానని బాధగా ఉందా నాన్నా? నేడు ఈ దేశంలో అనేక ఉత్తమ కళాకరాలూ, నిస్వార్థ కళాసేవకులకూ లభిస్తున్న ప్రతిఫలం ఏమిటి? కళాప్రపంచంలో ఓ చవక బారు చీప్ శాలువా అంతేగా? కళాప్రపంచంలో అగ్ని శిఖలా వెలిగిన తర్వాత ఆ నటుడు ఉన్నాడో చచ్చాడో యెవరికీ తెలియదు. ప్రపంచంలోని బాధలన్నిట్ని తన భుజాన మోస్తూ ఎక్కడో తాను చేరిన దీవిలో ఏకాంతంగా ఏకపాత్రాభినయం చేసుకుంటూ ఆలనా పాలనా లేకుండా కడు దయనీయంగా నిష్క్రమిస్తాడు అంతేగా?” రాఘవ తన మాటల్ని పిడుగుల్లా కురిపిస్తున్నాడు.

“నాయనా రాఘవా! నువ్వు అనుభవించని అనుభవాలను విశ్లేషించి విషం పూస్తున్నావు… నేను స్వయంగా అనుభవించిన అనుభవాల్ని సమన్వయపరుచుకొని అమృతం పూస్తున్నాను. కళారంగం నుంచి కాసులు పోగు చేసుకోవాలనుకునే కంటే, ఏ నటుడైనా కాసిని ఆశీస్సులో, అభినందనలలో కోరుకుంటాడు. ఉన్నతమైన కళని ద్వేషించడమో దానిని దోషిగా నిందించడమో నా కంఠంలో ప్రాణముండగా జరగదు. జరగనివ్వను” తన మనస్సులోనిది చెప్పాడు ప్రసాదరావు.

తండ్రి కొడుకుల మధ్య సంభాషణా, అందులో సంఘర్షణా తల్లిగా, భార్యగా శ్యామల సహనంతో ఓర్చుకుంది.

ఓ పక్క తనదైన పరిశీలనా శక్తితో ఎదిగిన తెలివైన కొడుకు. మరో పక్క తన సర్వస్వం సమర్పించుకుని కళాయజ్ఞంతో మండుతున్న కట్టుకున్న భర్త.

“మీ కళా హృదయాన్ని, కళా సంస్కారాన్ని ఈ జనం గుర్తిస్తారో లేదో తెలియదుగాని, అటువంటి గొప్ప నటుడికి కొడుకయ్యినందుకు గర్వించాలో, గాలి కొదిలేసినందుకు యేడ్వాలో తెలీడం లేదు… మీ పెద్ద సంతానంగా అన్న బొంబాయిలో ఓ హోటల్లో ఎంగిలి గిన్నెలు ఎత్తుతున్నాడు. తన భార్య తన చేతుల్లోంచి ఎక్కడ జారిపోతుందోనన్న భావంతో కట్టుకున్న వాడే అక్కను కురూపిని చేసి పారేస్తే, ఇక ఏ దిక్కు లేక అతనితోనే ఓ జీవచ్ఛవంలా బతుకుతోంది…. నిలకడగా ఎక్కడైనా నాలుగు రోజులు పని చేసి పొట్ట నింపుకుందామంటే తెలిసిన వాళ్లంతా నువ్వో గొప్పకళాకారుడి కొడుకువి. నీకేమి పనివ్వలేం అంటూ సాగనంపుతారు. ఎటు పోవాలో ఎక్కడ బతకాలో తెలీక ఇలా రోడ్లంటా ప్లాట్‌ఫాంల వెంటా తిరుగుతున్నాను… ఇక కొడుకుగా నటించే ఓపిక నాలోనూ నశించింది నాన్నా… ప్రాణముండగా మీకు మళ్లీ నేను కనిపించను నాన్నా, కనిపించను” అంటూ తండ్రికీ, తల్లికీ నమస్కరించి చీకటి వెలుగుల చదరంగంపు లోతుల్లోకి క్షణాల్లో మాయమైపోయాడు.

మర్నాడు ఉదయం అన్ని వార్తా పత్రికల్లోనూ- “ప్రఖ్యాత రంగస్థల నటుడు శ్రీ ప్రసాదరావుగారు, గత రాత్రి కళాభారతిలో ‘నటుడు’ అనే నాటక ప్రదర్శన ఆఖరి సీనులో మరణించే ఘట్టంలో నటిస్తూనే రంగస్థలం మీదే కన్ను మూశారు” అన్న వార్త అప్పటికే చాలా మైళ్లు దూరంలో ఉన్న రాఘవ కంట పడింది గాని, అది చూడనట్టు అది తనకు సంబంధం లేని అంశంగా అద్భుతంగా నటించేసుకున్నాడు ఓ నటుడు కొడుకు రాఘవ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here