నీలమత పురాణం – 35

1
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

పూజయత్పృథివీం దేవం గోయుగం సురభి హయమ్।
బలదేవం మహాదేవం వామదేవం దివాకరమ్॥

ఓషధీషాం నిషానాథం పర్జన్యేన్ద్రో ప్రచేతసమ్।
రామం సలద్రప్రణం సీతాం శేషం చ ధరణీధరమ్॥

[dropcap]క[/dropcap]శ్మీరాదేవికి ఋతుస్రావం ఆరంభవమవడంతోటే కశ్మీరులో మరో రకమైన సంబరాలు ఆరంభమవుతాయి. ఋతుస్రావం పూర్తయిన తర్వాత కశ్మీర గర్భవతి అవుతుంది విత్తులు నాటే సంబరాలు మొదలవుతాయి.

ఇది అనేక ప్రాచీన నాగరికతలలో గమనించవచ్చు. విత్తనాలు నాటటాన్ని స్త్రీ గర్భవతి అవడంతో పోల్చడమన్నది సర్వసాధారణం. పంటలను పండించి ఆహారాన్ని అందించి పోషిస్తుంది కాబట్టి భూమి స్త్రీ అయింది. భూదేవిగా పూజలందుకుంటోంది. ఒక తల్లి పిల్లవాడిని కనిపెంచి పోషించి పెద్ద చేసినట్టు భూదేవి మనుషులకు కని పెంచి పోషించి పెద్ద చేసి, మరణం తర్వాత వారిని అక్కున చేర్చుకుంటుంది. అందుకే భారతీయులు భూదేవిని మాతగా కొలుస్తారు. అత్యంత గౌరవంతో చూస్తారు.

వ్యవసాయానికి అనుకూలమైన ఋతువులు రావడంతోటే భూమి దున్నటం ప్రారంభమవుతుంది. స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇతర పరివార జనంతో భూమాతను పూజించాలి. జోడెద్దులను పూజించాలి. ఆ తరువాత ఎవరెవరిని పూజించాలో ఒక పెద్ద జాబితా ఉంటుంది. ఆవు, గుర్రం, బలదేవుడు, మహాదేవుడు, వామదేవుడు, సూర్యుడు, చంద్రుడు, ఓషధీషుడు, పర్జన్యుడు, ఇంద్రుడు, ప్రచేతసులు, రామ, లక్ష్మణ, సీత శేషులకు, బ్రహ్మ, కశ్యపుడు, అగ్ని, వాయువు, ఆకాశం వంటి వారందరినీ ప్రతి ఒక్కరినీ వేర్వేరుగా పూజించాలి.

ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.

ఇక్కడ కశ్మీరులో పూజించాల్సిన దేవుళ్ళ జాబితా చూస్తుంటే ఇది కశ్మీరుకు ప్రత్యేకమైన జాబితా కాదు, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనయినా పూజించే దేవుళ్ళు వీరే. దేశం నలుమూలలా వాడవాడలా పూజలందుకునేది వీళ్ళే. అంటే, ఇప్పుడు కొందరు మేధావులు వాదిస్తున్నట్టుగా కశ్మీరుకూ భారతదేశంలోని ఇతర ఏ ప్రాంతాలకీ ధార్మికంగా ఎలాంటి తేడా లేదన్నమాట. కశ్మీరు ఆవిర్భావమే విష్ణువు, మహాదేవుడు ఇద్దరూ పూనుకుంటే అయింది. కశ్మీరును పార్వతితో సమానం అన్నారు. కశ్మీరు అణువణువునా శివుడి ఆనవాళ్ళు లభిస్తాయి. కశ్మీరు శివమయం. అంటే ధార్మికంగా, కశ్మీరుకూ, భారత్‌లోని ఇతర ఏ ప్రాంతానికీ తేడా లేదు. అంతే కాదు, పూజా విధానాలలోనూ తేడా లేదు. సంబరాలు జరుపుకోవడంలోనూ తేడా లేదు. కానీ కొందరు తెలివైన మేధావులు కశ్మీరు భారత్‌లో అంతర్భాగం ఎప్పుడూ కాదని, మొఘలులు వచ్చి రాజ్యం చేయడం ఆరంభించిన తరువాతనే కశ్మీరుకి దేశంలో ఇతర భాగాలతో సంబధం ఏర్పడిందని వాదించటం కనిపిస్తుంది. తెలిసీ తెలియకుండానే ప్రతి ఒక్కరికీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే స్వేచ్ఛ లభించడంతో ఇలాంటి ఆధారాలు లేని అసంబద్ధమయిన వాదనలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలె భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీరీ ప్రజలను జాతీయ జీవన స్రవంతిలో భాగం చేసినప్పటి నుండి ఇలాంటి అర్థం పర్థం లేని వాదనలూ, తెలిసీ తెలియని ఆవేశ ప్రదర్శనలు అధికం అయ్యాయి. కానీ కశ్మీరు ఆవిర్భావం నుంచీ భారతదేశంలో అంతర్భాగమే. కశ్మీరుకు పేరు వచ్చిందే కశ్యపుడి నుంచి. కశ్యపుడు పైకి ఎత్తిన భూమి కశ్మీరు. కశ్మీరు మడుగులో దాగిన జలోద్భవుడనే రాక్షసుడిని సంహరించి ప్రజలను కాపాడమన్న ఆహ్వానాన్ని అందుకుని కశ్యపుడు కశ్మీరుని ఏర్పాటు చేశాడు. అందుకోసం అటు శివుడిని, ఇటు విష్ణువును మెప్పించాడు. వారి సహాయంతో సతీ సరోవరంలోని నీటిని వెడల నదిపి, జలోద్భవుడి సంహారానికి కారకుడయ్యాడు. ఫలితంగా కశ్మీరు భూమి ఏర్పడింది. ఈ భూమిలో ఒక్కో దేవత ఒక్కో నది రూపం ధరించి ప్రవహిస్తోంది. ఇదంతా కశ్మీరు ఆవిర్భావానికన్నా ముందు నుంచి ధార్మికంగా, మానసికంగా భారతదేశంలో అంతర్భాగమన్నది స్పష్టం చేస్తుంది.

నిజానికి భారతదేశంలో రాజులు వేరయినా, రాజ్యాలు వేరయినా ప్రజలంతా ధార్మికంగా, మానసికంగా వేర్వేరు కాదు. ఈ భావన పూలదండలో దారంలా ఈ దేశ ఐక్యతకు కారణమయింది. కశ్మీరు ప్రత్యేకం ఎప్పుడయిందంటే ఆర్టికల్ 370 ఏర్పాటయిన తరువాత. అది కశ్మీరు ప్రజలను భారత్‌లో విలీనమవకుండా అడ్డుపడింది. భారత్‌తో కలవటం తాను చేసిన గొప్ప సేవ అనీ, తాము ప్రత్యేకం అన్న భావనను పెంచింది. అది లేకపోతే ఈనాటికి కశ్మీరు కూడా భారత్ లోని అనేక ఇతర రాష్ట్రాలలో ఒకటిగా మిళితమైపోయి ఉండేది.

కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ 370 తొలగించడం చారిత్రక ఆవశ్యకత మాత్రమే కాదు, ధర్మకార్యం కూడా. కశ్మీరు ప్రజలు కానీ, కశ్మీరు రాజులు కాని తాము ప్రత్యేకం అని చారిత్రకంగా ఏనాడు గిరి గీసుకుని కూర్చోలేదు. కశ్మీరుకు చెందిన బౌద్ధ భిక్షువులు అనేకులు ఇతర దేశాలలో బౌద్ధం ప్రచారం చేశారు. ఉదాహరణకు కుమార జీవుడు. చైనా, జపాన్‌లలో బౌద్ధం విస్తరణకు అతనే కారకుడు (చూ. ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, మొదటి కథ). దక్షిణ భారతంలో బౌద్ధానికి విస్తృతిని పెంచిన నాగార్జునుడు కశ్మీరులో చదువుకున్నవాడే. శంకరాచార్యులు, రామానుజాచార్యులు కశ్మీరును శారదా నిలయంగా భావించారు. శంకరాచార్యులు కశ్మీరులో శారదా పీఠం స్థాపిస్తే, రామానుజులు శ్రీభాష్య రచనకు సరస్వతీ ప్రేరణ లభించింది ఇక్కడే. సమస్త భారతదేశంలో నిశ్శబ్ద ధార్మిక విప్లవం ప్రారంభం కాకముందే కశ్మీరులో లాల్‌దేవి (లల్లేశ్వరి) అందుకు బీజం నాటింది. కబీరు, మీరాబాయి, అక్క మహాదేవి, అన్నమయ్య లాంటి వారంతా లల్లేశ్వరి అడుగుజాడలలో నడిచినవారే. అంతే ఇటీవలి కాలంలో వరకూ కశ్మీరుకూ భారత్‌లోని అన్ని ప్రాంతాలతో ధార్మికంగా, భౌతికంగా, మానసికంగా అత్యంత సన్నిహిత సంబంధాలుండేవన్న మాట. ఇప్పుడు మళ్ళీ ఆ సంబంధాలకు ప్రతిబంధకం తొలగి వారధి నిర్మితమయిందన్న మాట.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here