[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా మీరట్ సినిమా ‘డియర్ అండ్ బేర్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘డియర్ అండ్ బేర్’
[dropcap]2[/dropcap]004లో సీడీల్లో సినిమాలుగా ప్రారంభమై వంద కోట్ల టర్నోవర్‌తో వర్ధిల్లిన మీరట్ పరిశ్రమ మాలీవుడ్ – 2009 కల్లా మూతబడే పరిస్థితికొచ్చింది. కొన్నాళ్ళు మూతబడింది కూడా. కారణం తాము నిర్మించి సీడీల ద్వారా అందిస్తున్న సినిమాలు పైరసీకి గురి కావడం. దీంతో ఏం చేయాలో తోచలేదు. కళాకారులు, కార్మికులు పనుల్లేక కూర్చున్నారు. మీరట్ కేంద్రంగా తీస్తున్న హర్యాన్వీ సినిమాలకి సీడీలకి సరిపోయేంత మార్కెట్ మాత్రమే వుంది. థియేటర్ ప్రదర్శనలకి సినిమాలు తీసేంత మార్కెట్ లేదు. అయినా మాలీవుడ్‌ని మూత పడేయదల్చుకోలేదు. 35 ఎంఎం కాకపోతే 16 ఎంఎంలో సినిమాలు తీద్దామని నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో సినిమా నిర్మాణం డిజిటలీకరణ వూపందుకోలేదు. ముడి ఫిలిం ఉత్పత్తి అప్పటికి ఆగిపోలేదు. కనుక 16 ఎంఎంలో సినిమాలు తీయాలన్న నిర్ణయం మాలీవుడ్‌ని కాపాడింది.
అలా ‘నట్ఖట్’ అనే లో- బడ్జెట్ సినిమాని 16 ఎంఎంలో నిర్మించి, నాల్గు ప్రింట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల్ని బతిమిలాడుకుని విడుదల చేశారు. దీనికి మంచి వసూళ్లు రావడంతో 16 ఎంఎం లోనే సినిమాలు తీయడం మొదలెట్టారు. అయితే విరివిగా కాదు. క్రమంగా ముడి ఫిలిం కనుమరుగై డిజిటల్ చిత్రీకరణలు ప్రారంభమవడంతో డిజిటల్లోనే పెద్దతెర సినిమాలు తీయడం మొదలెట్టారు. ఇలా తీసిందే ‘డియర్ అండ్ బేర్’ అనే యానిమేషన్ ఫాంటసీ. ఇది రాణీ ముఖర్జీ నటించిన ‘మర్దానీ’ని మించి మార్కెట్లో హిట్టయ్యిది.
చిన్న మార్కెట్‌కి సరిపోను బడ్జెట్లో తీయాలంటే గ్రాఫిక్స్‌ని గొప్పగా చూపించలేరు. బాలీవుడ్/హాలీవుడ్ రేంజిలో పోస్టర్ డిజైన్ కుదిరినట్టుగా సినిమా కుదిరేట్టు లేదు. అందుకని ఈ లోటుని కథతో మరిపిద్దామనుకున్నారు. ప్రేక్షకులు గ్రాఫిక్స్‌ని చూసి నవ్వుకోకుండా దృష్టి మరల్చడానికి, కథనే నవ్వొచ్చేట్టు తయారు చేశారు. ఎలుగుబంటితో నమ్మశక్యంగాని విద్యలు, సెంటిమెంట్లు, పగా ప్రతీకారాలు సృష్టించారు. సీడీల కాలంలో మొట్ట మొదటి హర్యాన్వీ మూవీ ‘ధడక్ ఛోరా’ హీరో, తర్వాత మాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఉత్తర కుమార్ ఈ కథ రాశాడు. తనే హీరో. హీరోయిన్‌గా లవ్లీ జోషీ నటించింది. సంజీవ్ వేద్వాన్ దర్శకత్వం వహించాడు.
ఇందులో జాలీ బాబా (ఉత్తర కుమార్) పల్లెటూరి కుర్రాడు. ఏనీ (లవ్లీ జోషీ) ఢిల్లీ అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకుంటూ ఒక అడవికి పోతారు. అక్కడున్న ఎలుగుబంటి ఏనీ మీద మనసుపడి వెంటపడుతుంది. ఇక ఇద్దరూ ఈ ఎలుగుబంటి బారినుంచి ఎలా తప్పించుకుని బయట పడ్డారనేది కథ.
ఎలుగుబంటి దృష్టి ఏనీ మీద నుంచి మళ్ళించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు జాలీబాబా. దాంతో ఫుట్‌బాల్ కూడా ఆడతాడు. అది ఫుట్‌బాల్‌లో అతన్నే ఓడించేసి రక్కి గాయాలు చేస్తుంది. కొండ మీంచి నెట్టేస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రకరకాల పోరాటాల ఎపిసోడ్స్ నడుస్తాయి. సమాచారం అందుకుని పోలీసులూ వచ్చేస్తారు. ఏనీ తల్లిదండ్రులూ వచ్చేస్తారు. కూతురి ప్రేమ వ్యవహరం బయటపడి గొడవ పెట్టుకుంటారు. చివరికి ప్రేమలోపడ్డ ఎలుగుబంటి కంటే జాలీబాబా నయమనుకుని శాంతిస్తారు. ఫాదర్ సెంటిమెంటుతో, మదర్ సెంటిమెంటుతో ఎలుగుబంటికి నచ్చజెప్తారు. ఎలుగుబంటి అర్థం జేసుకుని పచ్చ జెండా వూపడంతో సుఖాంతమవుతుంది.
ఎక్కడా లాజిక్ అనేది వుండదు. నవ్వించడం, థ్రిల్ చేయడం ఈ రెండే దర్శకుడు, రచయితా పెట్టుకున్న లక్ష్యాలు. ఒక విధంగా ఇది పిల్లల్ని వినోదపరుస్తుంది. మీరట్ సినిమాలు మొదట్నుంచీ వ్యాపారాత్మకంగానే ఉంటున్నాయి. సీడీల నుంచి ఫిలింకి, ఫిలిం నుంచి డిజిటల్‌కి సాగించిన ప్రయాణంలో వ్యాపారానికి ఏది కొత్త అన్పిస్తే దాన్ని భాగం చేసుకుంటూ వచ్చి, గ్రాఫిక్స్‌కి చేరుకున్నారు.