అనుబంధ బంధాలు-8

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 8వ భాగం. [/box]

[dropcap]”మ[/dropcap]న శ్రీకర్‌ను నిన్న మధ్యాహ్నం టెర్రరిస్టులు కాల్చి చంపారట. అతగాని శవపేటికను తీసుకొని ఇవ్వాళ్ళ రాత్రి కల్లా చేరుకుంటారట” అన్న వార్త పొద్దు పొడుపున ఎండకాలపు మిట్టమధ్యాహ్నపు ఎండగా మారింది.

ధశరథం గార్కి ఈ వార్త తెలీగానే అవాక్కయ్యాడు.

“మామూలు మనుషుల రక్షణ కోసం పోలీసులలో చేరిన వీరినే చంపుతున్నారేమిటి? వీళ్ళ గతులే ఇట్టా పుట్టగతులు లేకుండా ఉంటే మామూలు జనం విషయమేమిటి?” అని ముక్కు తుడుచుకొని, “ఇట్టాంటి ఉద్యోగాలు ఎలగబెడదామనుకున్న వాళ్ళు పెళ్ళి పెటాకులు మానేయడం ఎందుకైనా మంచిది” అంది సీతమ్మ.

“అదేం మాట? నీ ముఖం! మనిషి చావు పుట్టకలకు టైమేమిటి? ఇక్కడున్న వాళ్ళు చావకుండా ఉంటున్నారా? మనిషి అన్న వానికి ‘దిన దిన గండం నూరేళ్ళు ఆయుషు’ అని మన వాళ్ళు చెప్పారు గదా.”

“మీరేదన్నా చెప్పండి. ఈ ఉద్యోగస్తులకు సంసారాలనవసరం. అందరూ చావరని కాదు. పుట్టిన వాడు గిట్టక తప్పదు. ఇది తెలిసేగదా మనం బ్రతుకుతున్నది” అంది.

“ఇక చాలు గానీ ఊర్కో” అన్నాడు దశరథం.

“ఊర్కోక నేనేం చేస్తున్నానూ? మరి ఆ శ్రీకర్ పెళ్ళాం లక్ష్మి సంగతేంటి? దానికిప్పుడు ఇరవై సంవత్సరాలకు మించి లేవు. పైగా పసి కూన వుంది. ఎప్పుడు మగడొచ్చి తీసుకెళ్తాడా? అని ఎదురు చూస్తూంది నెల నుంచి. ఇప్పుడది ఎక్కడకి పోవాల? ఈ ప్రభుత్వం విదిలంచే రాళ్ళు మనిషిని తేలేవు గదా? ఆ ఉద్యోగంలోనే చేరకపోతే ఇట్టా చావడు గదా? అసలు ఇదేం రాజ్యం? ఎవడు ఎందుకు చంపుతున్నాడో ఎందుకు చంపబడుతున్నాడో అర్థం గాకుండా పోతుంది! అర్ధరాత్రయిన ఆడపిల్ల నిర్భయంగా సంచరించ గల్గిన రాజ్యం కావాలని మన దేశానికి స్వతంత్ర్యం తెచ్చిన మహానుభావుల చెపితే, పట్టపగలు బయటకు వెళ్ళక ఇంట ఉన్నా కిడ్నాప్ ఏమిటి? దోపిడి ఏమిటి? లూటీలేమిటి? నాకు తెలీక అడుగుతాను – మా నాన్నగారి టైంలో మనకు స్వతంత్రం లేదు గదా మరి ఇట్లాంటి ఘోరాలు అప్పుడు జరిగిన జాడ లేదేం? ఒకే ఒక్క కేక మనిషిలోని పశుత్వాన్ని అణచింది. మరి ఇప్పుడో? మన సురాజ్యంలో అమ్మో. ఇట్టాంటి దాని కొరకా ఆ త్యాగధనులు ఆత్మార్పణలు చేసింది? జైళ్ళలో మగ్గింది. ఉన్నదంతా కోలుపోయింది?

ఛ నోరు విప్పుదామంటే సిగ్గు అవుతున్నది. ఇది మన దేశమా? దీనకి పాలకులు కూడా ఉన్నారా? ఏ అర్హతతో పాలకులయ్యారు? అసలు వీళ్ళకు ఈ సమాజం తెలుసా? శ్రీకర్ తండ్రి పండరి ఈ గాయాన్ని తట్టుకోనగలడా?

ఆయన వయస్సు ఇందుకు అనుకూలిస్తుందా?

అసలీ చావులెందుకు? ఎవరి కోసం?

ఏ జాతీయత కోసం? ఏ జన జీవితం కోసం?

ఈ ఉల్ఫా లెందుకు? టెర్రరిస్టులు ఎందుకు?  మావోయిస్టులెందుకు?

పంజాబు రావణ కాష్టం ఎందుకు? నాయకుల పదవులలలో తేడా వచ్చినపుడల్లా వస్తున్న ఉద్యమాలేంటి?

ముఠా దందాలేంటి?

సమాజానికి పేడ పురుగులా పట్టి పీడించే దాదాలెవరు?

బరువు బాధ్యత తెలీని ఈ సంఘాలేంటి?

టైగర్లట, ఫాంటర్సట, శక్య్తంకరులట! వీరంతా కలసి ఈ దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? దేముడా?

ఏమిటిది??

ఇక్కడ మాములు మనిషి బ్రతుకు ఏమిటి?

అతని మనుగడను గురించి ఆలోచిస్తున్నదేవరట?

మరి దాదాపు అందరూ అతని కోసమేనని వీరావేశాన్ని వారి వారి పంధాలలో జనాంతికంగా ప్రదర్సిస్తున్నారేం? వీటి వీరంగాల ముందు- పద ఘట్టనల క్రింద – మాములు మనిషి అమాయకంగా చస్తున్నాడు గదా! అసలు వాడు చనిపోయాక కూడా వారి ఆర్భాటం ఆగేలా లేదు” అంటూ ఇంకా ఏదో సణుగుతోంది.

“నీకేమైనా పిచ్చా సీతా. ఆగు” అని అన్నాడు దశరథం.

ఆగింది.

భార్య గదా! ఆగి కళ్ళు తుడుచుకుంది పైట చెంగుతో. మాష్టారి వైపు ఒకసారి చూసింది.

“పండరిగార్నయినా గుండె పగిలి చావకుండా ఆపండి” అంటూ లేచి లోనికి కెళ్ళింది సీతమ్మ.

తల్లి మాటలని పూర్తిగా విని తల కెక్కించుకున్న విజయ తండ్రి దాపుకొచ్చి ఆయన భజం పై తల ఆన్చి-

“అమ్మ భావనలో తప్పు ఉందంటావా?” అంది.

ఉలిక్కి పడ్డాడు దశరథం. బిడ్డను తెరిపార చూసాడు. దగ్గరికి తీసుకుని, ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకొని.

“అమ్మా! మనకు తెల్సిందంతా నిజం కాదు. నిజమే మనకి తెలియాలనీ లేదు.

కొన్ని కొన్ని పరిస్థితులలో వాటికి అనునయంగా అవసరమైతే ధర్మాన్ని కూడా మార్చి ఇదే న్యాయం అని చెప్పాల్సిన స్థితి.

న్యాయానికి అది ధర్మం కాదు.

అప్పటి కథ మాత్రమే.

మొన్నీ మధ్యన గూడెంలో ఒకడ్ని వాళ్ళ తోబుట్టువులే కత్తితో నిర్దాక్షిణ్యంగా పొడిచారు. నెత్తురు మడుగులో పడి కొట్టుమిట్టాడుతున్నాడతడు. క్రింద పడి ఉపిరిపోయే దశలో మనకి కనిపిస్తే ఏం చేస్తాం?

వైద్యం చేయాలి గదా! బ్రతికే అవకాశాన్ని కలిపించాలిగదా? అతన్ని అలా హతమార్చిన వారిని ప్టటుకోవడం తరువాత పని.

ధర్మం! న్యాయం!! అనేవి కాలానుగుణంగా కొన్ని మార్పులకు లోనయినా నడక స్వభావంలో విశ్లేషించుకుంటూ అడుగును కదపాలి. ఈ లోపు నెలకొని ఉన్న సమాజం మనం న్యాయం అని అమోదించిన దానికి ఆమోద ముద్ర వేయాలి. అప్పుడు మాత్రమే సమాజం మనకు నమ్మకాన్ని అందిస్తుంది.

కనుక-

దొంగని పట్టుకునే పోలీసు వానిది న్యాయామా?

పోలీసులను మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి వాడకునే వాళ్ళది న్యాయమా?

పోలీసు వాళ్ళతోనే లూటీలు చేయిస్తున్న వార్లది న్యాయమా?

పోలీసులతో అణగార్చ బడుతున్న మామూలు మనిషిది న్యాయమా?

అన్నదాన్ని-

విశ్లేషించి అవగతం చేసుకోగల్గిన సమాజాన్ని మనం ఒన కూర్చకొనగలగాలి.

ఇవ్వేవీ మనం అనుకోగానే జరిగేవి కావు.

మన జాగ్రత్తగా నడుస్తూ-

నడుస్తున్న వాళ్ళను గమనిస్తూ-

అడుగు కదపవల్సినదే-

అంతకు మించి మనం చేయగల్గింది లేదు” అన్నాడు దశరథం.

***

నిండు పౌర్ణమి ప్రొద్దు గూకుతూంది.

నెత్తురు ముద్దలా భూమిలోకి వెళ్తున్న సూర్యుడు, వెన్న ముద్దలా ఆకాశం పైపైకి ఎగబాక ప్రయత్నిస్తున్న చందమామా ఒకే సారి కనిపించింది.

మనస్సుకు ఆనంద పరవశులను చేసింది. ఎవరి అందాలు వారివే. ఎవరి స్వభావము వారిదే. ఎవరి తీరు వారిదే.

అయినా…

చరాచర వర్తనాన ఈ ఇద్దరే కనిపించే వెలుగు తరంగాలు.

గుడికి బయలుదేరి వెళ్తున్నాడు.

ఆలయంలో వెలసి ఉన్న రామభద్రుడంత తేజం దాదాపు ఈయనలోనూ ఉంది.

పట్టు వస్త్రము కట్టుకొని- బ్రతుకు బాటలో కత్తి పెట్టని గడ్డంతో- చానా చానా నిండుగ ఉంటాడు. నిగ్రహంగా కనిపిస్తాడు.

ఆయనకు అందరిలా పేరు ఉన్నా చాలా మందికి ఆయన పూజారయ్య.

ఎవ్వరు ఎన్నడు ఆయనలో విసుగును చూడలేదు.

పెదవులపై చిరునగవు చెదరదు. నెమ్మదిగా నడచి గుడిమెట్లు ఎక్కుంటే ఏ యోగి పుంగవుడో దైవ దర్శనం కోసం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఉండేటందుకు ఓ ఇల్లు ఉంది ఊళ్ళో. పాతకాలం నాటి మిద్దె అది. పాలిపోయిన ఓ జాగీర్దారుది. అందులో ఒంటరిగా ఉంటుంటాడు.

ఎక్కువ కాలం గుడిలోనే, శ్రీరాముని సన్నిధినే కనిపిస్తాడు.

ఏ అపరాత్రో గుడి తలుపులు మూసి ఇంటికెళ్ళాడు.

ఇక మధ్యాహ్నం రెండు గంటలు దాటాక గుడి నుంచి కదులుతాడు. ఓపిక ఉన్ననాడు ఇంత వండుకుంటాడు, లేనినాడు ఏం చేస్తాడో తెలీదు.

అయితే-

ఎన్నడు అన్నార్తునిలా కనిపించడు. నిండుగా ప్రశాంత వదనంతో రామనామం స్మరిస్తూ కనిపిస్తాడు.

ఆయనకే అవసరమూ ఉండదో రాదో తెలీదుగాని ఏ ఇంటి గడప సామాన్యంగా తొక్కడు.

ఇక జనం.

పూజారయ్యతో ఏ అక్కర ఉన్నా దాదపు అంతా గుడికే వస్తారు.

అక్కడే శ్రీ రామభద్రుడికి ఆయనకు మొక్కేస్తారు.

కావల్సిందేదో అడుగుతారు. చెప్పింది విని వెళ్ళిపోతారు.

పూజారయ్యకు జాలయ్య ఎదురుపడ్డాడు.

“నమస్కారం పూజారయ్య” అన్నడు ఆగి.

ఎక్కడ నుంచి? అన్నట్లుగా చూసాడు.

“ఊరికెళ్ళి వస్తున్నా.”

“ప్రయాణం శుభంగా జరిగింది గదా!”

“మా అందరి శుభం కోసం ఆ గుడిలోని రాముడ్ని అంటి పెట్టుకొని వదలక నువ్వు ఉన్నావు గదా! నిత్యం సేవ చేసే నీ కోసమైనా ఆయన మమ్మల్ని కాస్తూనే ఉంటాడు” అని నవ్వాడు.

“మంచి మనసుంటే దాదాపు నా ఎఱికలో ‘మంచి’ జరుగుతూనే ఉంది.”

“ఆ మంచికి ప్రతీకేనయ్యా గుడిలో నెలకొని ఉన్న రామచంద్రుడు, నిజంగా ఈయన ఎన్ని యుగాలనాటి వాడు? అసలీయన దేముడుగాక పోయినా! వాల్మీకి మహర్షి సృష్టించిన ఆరాధ్యుడే అయినా మనుష్య సమాజపు శ్రేయస్సు కోసం తపించిన వాడు గనుక ఆయన కథ పూర్తిగ తెలీక పోయినా సరే ఎంతటి పామరుడు ఆయన్ని దేముడనుకుంటున్నాడు.”

“ఇట్టా మీరు ఆయన్ని గురించి చెప్పి చెప్పి దేవుణ్ణి చేసారేమో?” అన్నాడు జాలయ్య.

“ఇంతటి కాలగమనంలో ఎందరెందరో వచ్చిపోయారు గదా! మరి ఈయన్ని గురిచే ఎందుకు మననము చేసుకుంటున్నాం. మంచితనమే” అంటూ సాగాడు పూజారయ్య.

“నేను గుడిదాక వస్తా” అన్నాడు జాలయ్య.

“మీ రాముడాయన. గుడి మీద, ఆయన దర్శన బాగ్యనికి ఎవరి అనుమతో అక్కరల్లేదు. అధికారం కనిపించే చోట కాదది. పైగా అన్నీ తానే అయిన ఆ రాముడే ఏమి లేని వానిగా కనిపిస్తాడు. ఆయన పేదరికం చూడలేకనే గాదా మన రామదాసుని…” నవ్వాడు చేతిలో సంచి ఉంది.

“దీన్ని ఇంటి దగ్గర పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తా’ అని ఇంటివైపుగా వెళ్ళాడు జాలయ్య

పూజారయ్య గుడి మెట్లు ఎక్కతుండగా… ‘అవధాని’ గుడిపై బాసాపెట్లేసుకొని కూర్చుని కన్పించాడు.

పూజారయ్య నమస్కరించి, ఆయన దగ్గరి కొచ్చి ‘ఏమి ఆజ్ఞ’ అన్నట్లుగా నిల్చుండిపోయడు.

పూజారయ్యను గమనించిన సాధువు – “ఊర్కే వచ్చాను. ఇక్కడ నాల్గుక్షణాలు రామనామ స్మరణం చేస్తూ కూర్చోవాలనిపించింది కూర్చున్నాను. గర్భగుడి వైపుగా చూశాను. రాముడు కనిపిస్తున్నాడు. నువ్వు ఉంటే బాగు అనుకున్నాను వచ్చావు” అని నవ్వాడు.

“అర్చన చేయించనా?” అడిగాడు.

“త్రేతాయిగం నుంచి ఇప్పటి దాక ఆయన నడకను అనుసరించ బట్టే సృష్టికి ఈ మాత్రం గతులు మిగిలినయి” అని, “నువ్వు కనిపిస్తే చాలు ఆ రామ దర్శనం అయనట్టే… ఇంకా వేరుగా అర్చనలెందుకు?” అన్నాడు స్వామికి నమస్కరించి.

ఆలయంలోనికి నడిచాడు పూజారయ్య.

అప్పటి దాకా గర్భగుడికి అటు ఇటు పూజా ద్రవ్యాలను చేతపట్టుకొని నిల్చుని ఉన్న ఆడంగులు పూజారయ్యకు అప్పగించి రామభద్రునికి నమస్కరిస్తూ నిల్చుండిపోయారు.

హారతి తీసుకొని ఎవరి పళ్ళాలు వారు చేత పుచ్చుకొని ప్రశాంతంగా గుడి వెలుపలికి వచ్చారు. ఇలా నిత్యం నడుస్తూనే ఉంటుంది.

ఒక్కోసారి రాత్రి పది గంటలు అవతది.

జాలయ్య రాత్రి తొమ్మిది దాటుతుండగా గుడిలోకి వచ్చి ఓ నమస్కారబాణం విసిరి బయటకొచ్చి ‘చప్టా’ పైన కూర్చున్నాడు.

జనం పూర్తిగా తగ్గిపోయాక పూజారయ్య రాముణ్ణి వదిలి బయటకొచ్చాడు.

అక్కడే కూర్చుని ఉన్న జాలయ్యను చూసి పక్కనే కూర్చుంటూ…

“భోం చేసే వచ్చారుగదా” అనడిగాడు.

“పూజారయ్యా నిన్నేవరూ ఈ ప్రశ్న అడగరు కదూ?” అన్నాడు నవ్వుతూ.

“నేను రాముడి దగ్గర ఉండేటి వాణ్ణి గదా! నాకు ఆకలి ఉంటుందని అనుకోరు… ఒక వేళ నేనుగా ఆకలవుతుందని అంటే నాకూ పోయేదేం లేదు… కాని ఆ రామయ్యనంటారు! ఏం దేవుడాయన! అని.”

“అందుకే పూజారయ్యా, నీతో ఎప్పుడు మాట్లాడుతూ గడపాలనిపిస్తది.”

“బ్రతుకు పరుగు వేరు. అది నిజంగా అంతులేని పరుగే…  ఆ పరుగులోనే జాగ్రత్తగా వెళ్తున్నామనుకుంటూనే ఎక్కడో ఎప్పుడో రాలిపోతాము. ఈ తంతు మనకు నిత్యం కనిపించేదే… అయినా ఈ పరుగు నుంచి మాత్రం తప్పుకోం… బొంది నుంచి గాలి పోవడంతో ఇది ఆగిపోవాల్సిందే” అని పూజారయ్య వంక చూసి “ఈ వయస్సులో – అసలు నాకు ‘ఆరాటం’ ఎందుకు చెప్పు? కాని ఆగను.”

“అది అంతే” అని నవ్వాడు పూజారయ్య…

నిజంగా రామచంద్ర ప్రభువు సీతమ్మ వారి ముందు నవ్వినంత స్వచ్ఛంగా అనిపించింది.

ఎంతో చల్లదనం కురిపించిన… పసి పాప బోసినవ్వు… మన గాంధీ తాత నవ్వు కనిపించినయి.

“పూజారయ్య నువ్వు నాకో విషయం చెప్పాలి” అన్నాడు జాలయ్య.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here