[dropcap]వ[/dropcap]ర్తమాన సమాజంలోని సంఘటనలు ఇతివృత్తాలుగా తీసుకుని సిద్ధిపేట జిల్లా జక్కాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాసిన 30 కథల సంకలనం ఇది. ఆ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు శ్రీ బైతి దుర్గయ్య సంపాదకత్వం వహించారు.
***
“ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలు పిల్లలే. వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. అందమైనది, అద్భుతమైనది, విలక్షణమైనది. ఈ ‘జక్కాపూర్ బడిపిల్లల కథలు’ కథల్లో ఆ ప్రపంచాన్ని చూడొచ్చు.
కథ జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంది. జీవితంలోని వివిధాంశాలు, జీవన దృక్కోణాలను ప్రతిబింబిస్తుంది. ఈ పిల్లల కథలు వారి వారి అనుభవాలు, పరిసరాలు, కుటుంబాల్లో చూసిన, విన్నటువంటి వాటిని చూపించాయని చెప్పొచ్చు” అన్నారు డా. పత్తిపాక మోహన్ ‘ఆశీరభినందనలు’ అనే తన ముందుమాటలో.
***
“కొంతకాలంగా బాల సాహిత్య రచనల్లో పిల్లల భాగస్వామ్యం కూడా పెరుగుతున్నది. పిల్లలు రాసిన కథలు పుస్తకాలుగా వెలుగులోకి వస్తున్నాయి. అలా వస్తున్న పిల్లల కథల పుస్తకం ఈ ‘జక్కాపూర్ బడిపిల్లల కథలు’. పిల్లలు రాసిన ముప్ఫై కథలతో వస్తున్న ఈ పుస్తకంలోని కథల్లో ఎక్కడా హింసతో కూడిన ముగింపులు కనిపించవు. అన్ని కథల్లోనూ మంచిగా మారడం కనిపిస్తుంది” అని వ్యాఖ్యానించారు డా. వి.ఆర్. శర్మ.
***
“మంచి పుస్తకం పదిమంది ఉత్తమ స్నేహితులకన్నా గొప్పది. విద్యార్థులలోని సృజనాత్మకతకు అద్దం పట్టే విధంగా వారి ప్రతిభకు అక్షర రూపం కలిగించడానికి చేసిన చిరు ప్రయత్నమే ఈ ‘జక్కాపూర్ బడిపిల్లల కథలు’ పుస్తకం.
మా పిల్లలు కథారచనలో శైశవదశలో ఉన్నారు. వీరు వ్రాసిన 30 కథలలో బహుమతి గెలిచిన కథలున్నాయి. ఆలోచింపజేసే కథలున్నాయి. అతి సాధారణ కథలు కూడా ఉన్నాయి. కథావస్తువు ఎంపిక, శైలి, వాక్య నిర్మాణం, విస్తరణలో కొన్ని దోషాలుండవచ్చు. విమర్శనా కోణంలో చూడకుండా, మా పిల్లలకు చేయూతనందిస్తే వారు ఉత్సాహంగా మరొక పుస్తక రూపకల్పనలో పాల్గొనే అవకాశం కలుగుతుంది” అన్నారు బైతి దుర్గయ్య తమ ముందుమాటలో.
***
జక్కాపూర్ బడిపిల్లల కథలు
(పిల్లలు వ్రాసిన కథలు)
సంపాదకత్వం: బైతి దుర్గయ్య
ప్రచురణ: అక్షర సేద్యం ఫౌండేషన్
పేజీలు: 64, వెల: ₹ 75/-
ప్రతులకు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – జక్కాపూర్, సిద్ధిపేట (రూరల్) మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ – 502276. ఫోన్: 9959007914