[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది మొదటి ఖండిక ‘అంజలి’. [/box]
అంజలి – ‘నవమి’ ఖండకావ్యంలోని మొదటి ఖండిక.
***
అంజలి
సీ॥
శ్రీయుత మూర్తివై చెన్నొందుచున్ సదా
భక్త కోటినిగాచు పరమపురుష!
శ్రీ గుణంబులనొప్పి చిన్మయాంగుడవౌచు
వార్థికల్లుడవైన వారిజాక్ష!
శ్రీనాధుడవనంగ చిత్ప్రకాశుండవై
భువనాల బ్రోచెడి పూతచరిత!
శ్రీకరుండనుపేర చిరకీర్తిగాంచియు
జగతిమమతబెంచు జలజనయన!
హరి! హరీయంచు కీర్తించు ధరణిజనుల
న్రహరహంబును నండయై మహితరీతి
కిల్బిషంబుల పోగొట్టు కేశవాఖ్య!
నీకు! కేల్మోడ్తు దేవ! నన్ సాకుమయ్య! 1
సీ॥
తల్లి యశోదకు దన్మయత్వమునిచ్చి
గోగణంబుకు రక్షగూర్మినిచ్చి
అష్టపత్నులకిడ్చి అమలానురాగమున్
రమణిరాధకునిచ్చిరాసహేల
గంగాసుతునకిచ్చి ఘన ముక్తిపదమును
ఆ కుబ్బకిచ్చి యానందగరిమ
ఇల కుచేలునకిచ్చి యిష్టార్థ సౌఖ్యముల్
పరగద్రోవదికిచ్చి వస్త్రతతిని
వేణుగానంపు రవళితో వింతరీతి
జగతినంతను సమ్మోహజలధి దేల్చి
గీత సంగీతములకును నేతయైన
ద్వారకానాధుకొనరింతు వందనములు. 2
సీ॥
పదునాల్గు భువనాలు బొజ్జలో నిడుకొని
వటపత్రశాయివై వరలు దేవ!
దుష్టుల బరిమార్చి దుర్మార్గమును మాపి
శిష్టాళిబ్రోచు విశిష్టరూప!
అణగారిపోయెడియా ధర్మమును నిల్పి
మహిని మంచిని నించు మహిత భాష
అమృతమంబు నమరుల కందించి కరముగ
అదితి సంతతిగాచు నమలతేజ.
కలిని భక్తుల సాకెడి కాంక్షతోడ
భూతలంబున నున్నట్టి పూతమైన
శేషగిరియందు నిల్చిన శ్రీనివాస!
అంజలింతును నీకునే నందుకొనుమ. 3
సీ॥
పాపరేనిపయిని పవ్వళించెడి నీవు
పాషాణగిరులపై వరలుచుంట
పాలకడలి కల్లు వాడవునౌచును
గొల్లయిండ్లను పాలుగోరుచుంట
వీరాధివీరుడై వెలుగుచుండెడి నీవు
ద్వారకాపురిలోన దాగియుంట
సిరికినాథుండవౌచు శ్రీమించువాడవు
అవని మూడడుగుల నడిగియుంట
లోని, మర్మంబు దెలియక జ్ఞానసాంద్ర
అమిరమందునదారాడు నమితప్రజకు
జ్ఞానదీప్తులనందించు జలజనాభ!
వందనంబులు నీకివే యందుకొనుమ. 4
సీ॥
ఆ యశోదకు కోర్కె నవనిలో దీర్చగ
కలిని దైవమవౌచు మలను నిలచి
భక్తుడౌ భద్రుని వాంఛితార్థంబుకై
గౌతమీ తటిగిరిన్ కరుణ వెలిసి
బాలు ప్రహ్లాదుని ప్రార్థన మన్నించి
కంభంబు జీల్చుక కానుపించి
లావొకింతయు లేక రక్షింపుమని వేడు
కరిరాజు కడకును పరుగునెత్తి
వరదుడీవంచు కరముగ వాసిగాంచి
ధర్మసంస్థాపనము జేయ ధాత్రియందు
పదియు నవతారములు దాల్చి పరగునట్టి
పద్మనాభున కొనరింతు వందనంబు. 5