ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః – 6

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

రాక్షసః:

(సోద్వేగమ్) సఖే, కుత శ్చాణక్య వటోః పరితోషః? అఫల మనిష్టఫలం వా దారువర్మణః ప్రయత్న మవగచ్ఛామి; యదనేవ బుద్ధిమోహ దథవా రాజభక్తి ప్రకర్షా న్నియోగకాల మప్రతీక్ష మాణేన జనిత శ్చాణక్యవటో శ్చేతసి బలవా న్వికల్పః। తత స్తతః…

అర్థం:

(స+ఉద్వేగమ్=ఉద్వేగంతో) సఖే=మిత్రమా, చాణక్యవటోః+పరితోషః=చాణక్య చిన్నవాడి సంతోషం, కుతః=ఎందుకు? (ఎక్కడిదీ?), దారువర్మణః+ప్రయత్నం=దారువర్మ సంకల్పం, అఫలం+అనిష్టఫలం+వా=ఫలించలేదనో, కీడు మూడిందనో, అవగచ్ఛామి=అనుకుంటున్నాను. యత్=ఎందుకంటే, అనేవ=దారువర్మ చేత, బుద్ధిమోహత్=తెలివితక్కువతనం వల్లనో, అథవా=కాకపోతే, రాజభక్తి+ప్రకర్షాత్=రాజభక్తి ఎక్కువ కావడం వల్లనో, చాణక్యవటోః+చేతసి= చాణక్య పిల్లవాడి మనస్సులో, బలవాన్+వికల్పః+జనిత=పెద్ద అనుమానం పుట్టింబపబడినట్టుంది…, తతః+తతః=ఆ మీదట ఏమైంది?

విరాధ:      

తతశ్చాణక్యహతకే నానుకూల లగ్నవశా దర్ధరాత్రసమయే చన్ద్రగుప్తస్య నన్దభవనప్రవేశో భవిష్య తీతి శిల్పినః పౌరాంశ్చ గృహీతార్థాన్ కృత్వా, తస్మి న్నేవ క్షణే పర్వతేశ్వర భ్రాతరం వైరోచక మేకాసనే చన్ద్రగుప్తేన స హోప వేశ్య కృతః పృథ్వీ రాజ్యవిభాగః

అర్థం:

తతః=ఆ పైన, అనుకూల+లగ్నవశాత్=ముహూర్తం అనుకూలంగా ఉండడం వల్ల, అర్ధరాత్రసమయే=సగం రాత్రివేళ, చన్ద్రగుప్తస్య+నన్దభవన+ప్రవేశః+భవిష్యత్+ఇతి=చంద్రగుప్తుడి (యొక్క) నందభవన ప్రవేశోత్సవం జరుగుతుందని, శిల్పినః+పౌరాన్+చ+గృహీత+అర్థాన్+కృత్వా=పనివారికి (నిర్మాణ కార్మికులకి), నగరవాసులకు తోచేలాగా చేసి (అనిపింపజేసి), చ్వాణక్యహతకేన=చాణక్య చచ్చినాడు (వాని చేత), తస్మిన్+ఏవ+క్షణే=అదే సమయంలో, పర్వతేశ్వర+భ్రాతరం+వైరోచకం=పర్వతేశ్వరుడి తమ్ముడైన వైరోచనుణ్ణి, చన్ద్రగుప్తేన+సహ+ఏకాసనే+ఉపవేశ్య=చంద్రగుప్తునితో బాటు ఒకే సింహాసనంపై కూర్చుండజేసి, పృథ్వీరాజ్య+విభాగః+కృతః=(జయించుకున్న) రాజ్యంలో భాగం పెట్టాడు (పెట్టబడింది).

రాక్షసః:

కిం వాతిసృష్టః పర్వతభ్రాత్రే వైరోచకాయ పూర్వ ప్రతిశ్రుతః రాజ్యార్ధ విభాగః?

అర్థం:

కిం+వా=ఏమేమి! పర్వతభ్రాత్రే+వైరోచకాయ=పర్వతేశ్వర సోదరుడు వైరోచనునికి (కొరకు), పూర్వ ప్రతిశ్రుతః=ముందుగా మాట ఇచ్చిన ప్రకారం, రాజ్యార్ధ+విభాగః+అతిసృష్టః=రాజ్యంలో సగం భాగం ఇచ్చేశాడా (పంపకం జరిగిందా)?

విరాధ:     

అథ కిమ్.

అర్థం:

అథ కిమ్=అవును!

రాక్షసః:

(స్వగతమ్) నియత మతిధూర్తేన చాణక్య వటునా తస్యాపి తపస్వినః కిమ ప్యుపాంశువధ మాకలయ్య పర్వతేశ్వర వినాశేన జనిత మయశః ప్రమార్ ష్టు మేషా లోకప్రసిద్ధి రుపరిచితా॥ (ప్రకాశమ్) తత స్తతః…

అర్థం:

(స్వగతమ్=తనలో), నియతం=తప్పనిసరిగా, అతిధూర్తేన+ చాణక్య వటునా= అతి టక్కరి అయిన యీ చాణక్య కుఱ్ఱగాడు (వాని చేత), కిమ్+అపి=ఏదో విధంగా, తస్య+తపస్వినః+అపి=పాపం, అతడి విషయంలో కూడా, ఉపాంశు+వధం+అకలయ్య=రహస్యంగా చంపాలనే విషయం కూడా ఆలోచించుకుని, పర్వతేశ్వర+వినాశేన+జనితం+అయశః=పర్వతేశ్వర నాశం ద్వారా పుట్టిన అపఖ్యాతిని, ప్రమార్‌ష్టుం=తుడిచివేసుకోవడానికి, ఏషాం+లోక+ప్రసిద్ధి=ఇట్టి లోకసమ్మతి, ఉపరిచితా=కూడగట్టుకున్నాడు (కట్టుకోబడింది); (ప్రకాశమ్=పైకి) తతః+తతః= ఆ తరువాత… (ఏమైంది?)

విరాధ: 

తతః ప్రథమ మేవ ప్రకాశితే రాత్రౌ చన్ద్రగుప్తస్య నన్దభవన ప్రవేశే, కృతాభిషేకే కిల వైరోచకే, విమల ముక్తామణి పరిక్షేప విరచిత చిత్రపటమయ వారవాణ ప్రచ్ఛాదిత శరీరే, మణిమయముకుట నిబిడ నియమిత రుచిరతర మౌళా, సురభి కుసుమదామ వైకక్ష్యావభాసిత విపులవక్షస్థలే, పరిచితతమై రప్యనభిజ్ఞాయమానాకృతౌ, చాణక్య హత కాదేశాత్ చన్ద్రగు ప్తోపవ్యాం చన్ద్రలేఖాం నామ గజవశా మారుహ్య చన్ద్రగుప్తానుయాయినా రాజలోకే నానుగమ్యమానే దేవస్య నన్దస్య భవనం ప్రవిశతి వైరోచకే, యుష్మత్ప్రయుక్తేన దారువర్మణా సూత్రధారేణ చన్ద్రగుప్తోఽయ మితి మత్వా తస్యోపరిపాతనాయ సజ్జీకృతం యన్త్రతోరణమ్। అత్రాన్తరే బహిర్నిగృహీతవాహనేషు స్థితేషు చన్ద్రగుప్తానుయాయిషు నృపేషు, యుష్మత్ప్రయుక్తేనైవ చన్ద్రగుప్తనిషాదినా బర్బరకేణ కనకదన్డికా న్తర్నిహితా మసి పుత్రికా మాక్రష్టుకామేన అవలమ్బితా కరేణ కనకశృఙ్కలా వలమ్బినీ కనకదణ్డికా॥

అర్థం:

తతః=ఆ మీదట, ప్రథమం+ఏవ+ప్రకాశితే=తొలుత ప్రకటించిన విధంగా, రాత్రౌ=రాత్రివేళ, చన్ద్రగుప్తస్య+నన్దభవన+ప్రవేశే=చంద్రగుప్తుడి నందభనవన ప్రవేశం (జరగవలసి ఉండగా), వైరోచకే+కృత+అభిషేకే=అర్ధరాజ్యభిషేకం పొందిన వైరోచనుని, విమలముక్తామణి+పరిక్షేప+విరచిత+చిత్రపటమయ+వారవాణ+ప్రచ్ఛాదిత+శరీరే=తెల్లని ముత్యాలు పొదిగిన రంగురంగుల వస్త్రాలు కప్పిన శరీరంతో – మణిమయ+మౌళా=రత్మాలు పొదిగిన (కిరీటం గల) శిఖతో, సురభి+కుసుమదామ+వైకక్ష్య+అవభాసిత+విపులవక్షస్థలే=పరిమళించే పూలదండలు (జంధ్యం వలె ధరించగా) (అవి) చెదురుముదురై నిండుగాలితో వక్షస్థలంతో, పరిచితతమై+అపి=బాగా ఎరిగినవారికి కూడా, అనభిజ్ఞాయమానా+కృతౌ=పోలిక పట్టజాలని రూపంతో -చాణక్యహతక+ఆదేశాత్=చాణక్య చచ్చినాడి ఆజ్ఞతో (ఆజ్ఞ అంది పుచ్చుకుని),  చన్ద్రగుప్త+ఉపవ్యాం+చన్ద్రలేఖాం+నామ+గజవశం+ఆరుహ్య=చంద్రగుప్తుడు అధిరోహించే చంద్రలేఖ అనే పిడియేనుగు నధిష్టించ – చన్ద్రగుప్త+అనుయాయినా+రాజలోకేన+అనుగమ్యమానే (సతి)=చంద్రగుప్తుడి వెంటనుండే రాజసమూహం తన వెంట అనుసరించి నడుస్తుండగా, వైరోచకే+నన్దస్య భవనం+ప్రవిశతి(సతి)=వైరోచనుని నందభవన ప్రవేశం చేసే వేళ – యుష్మత్+ప్రయుక్తేన=మీచే నియమింపబడిన, సూత్రధారేణ+దారువర్మణా=నిర్మాణశిల్పి దారువర్మ (చేత), అయం+చన్ద్రగుప్త+ఇతి+మత్వా=ఇతడే (వైరోచనుడే) చంద్రగుప్తుడని భావించి, తస్య+ఉపరి+పాతనాయ=అతనిపై పడడానికి, యన్త్రతోరణమ్+సజ్జీకృతం=కీలు తోరణాన్ని అమర్చి పెట్టాడు (పెట్టబడింది).

అత్రాన్తరే=అంతలో, బహిర్+నిగృహిత+వాహనేషు=బయట నిలుపబడి వాహనాలలో, చన్ద్రగుప్త+అనుయాయిషు+నృపేషు=చంద్రగుప్తుడి అనునాయులైన రాజులు, స్థితేషు=నిలిచి ఉండగా (చంద్రుగుప్తుడి అనునాయులైన రాజులు తమ వాహనాలలో ద్వారం బయట వేచి ఉండగా), చన్ద్రగుప్త+నిషాదినా+బర్బరకేణ=చంద్రగుప్తుడి ఏనుగును నడిపే బర్బరీకుడనే మావటీడు (వాని చేత), కనకదన్డికా+అన్తర్నిహితాం+అసిపుత్రికాం+ఆక్రష్టుకామేన=బంగారు దండంలో ఉన్న చిరుకటారుని బయటకు లాగడం కోసం, కనకశృఙ్కలా+అవలమ్బినీ=తన నడుముకున్న బంగారు గొలుసుకు వ్రేలాడే, కనక+దణ్డికా=బంగారు కఱ్ఱ, అవలమ్బితా+కరేణ= చేతిలో పట్టుకున్నాడు (వాని చేత పట్టుకొనబడినది).

రాక్షసః:

ఉభయోర ప్యస్థానే యత్నః!

అర్థం:

ఉభయోః+అపి+యత్నం=దారువర్మ, బర్బరీకుడుల ఇద్దరి ప్రయత్నాలు, అస్థానే=చేయకూడని చోట చేయడమైనది!

విరాధ:  

అథ జఘనాభిఘాత ముత్ప్రేక్షమాణా గజవధూ రతిజవనతయా గత్యన్తర మారూఢవతీ। ప్రథమగ త్యనురోధ ప్రత్యాకలిత ముక్తేన ప్రభ్రష్టలక్ష్యం పతతా యన్త్రతోరణేన ఆకృష్టకృపాణీవ్యగ్రపాణి రనాసాదయ న్నేవ చన్ద్రగుప్తాశయా వైరోచకం హత స్తపస్వీ బర్బరకః। తతో దారువర్మణా యన్త్రతోరణస్థల మారూఢేన యన్త్రఘట్టనబీజం లోహకీలక మాదాయ హస్తినీగత ఏవ హత స్తపస్వీ వైరోచకః॥

అర్థం:

అథః= ఆ తరువాత, జఘన+అభిఘాతం+ఉత్ప్రేక్షమానా=తన తొడమీద చరుపు పడబోతున్నదని ఊహించుకున్న, గజవధూః=ఆడఏనుగు, అతి+జవనతయా=మిక్కిలి వేగంగా, గతి+అన్తరం+ఆరూఢవతీ=తన నడక తీరు మార్చుకున్నది (పరుగెత్తింది).  ప్రథమగతి+అనురోధ+ప్రత్యాకలిత+ముక్తేన=తొలుత ఊహించుకున్న ఏనుగు నడక లెక్క ప్రకారం విడువబడిన, పతతా+యన్త్రతోరణేన=పడిపోతున్న యంత్రపు కమాను కారణంగా, ఆకృష్టకృపాణీ+వ్యగ్రపాణి=అప్పటికీ చిరుకటారి దూసి తొందరపాటుగా ఉన్న, తపస్వీ+బర్బరకః=దురదృష్టవంతుడైన మావటి బర్బరీకుడు, చన్ద్రగుప్తాశయా+వైరోచకం+అనాసాదయన్+ఏవ=చంద్రగుప్తుడనుకొంటూ వైరోచనుని దరి చేరకుండానే (పొందకుండానే), హతః=చంపబడ్డాడు (ఆ తోరణపు దూలం వాడిపై పడి చనిపోయాడు). తతః=ఆ మీదట, యన్త్రతోరణస్థలం+ఆరూఢేన+దారువర్మణా=అప్పటికే ఆ యంత్ర తోరణంపై కూర్చుని ఉన్న దారువర్మ (చేత), యన్త్ర+ఘట్టనబీజం+లోహకీలకం+ ఆదాయ=యంత్ర తోరణం నిలబడడానికి కారణమైన ఇనుపమేకును తీసుకుని, హస్తినీగత+ఏవ=పిడి ఏనుగు మీద ఉండగానే, తపస్వీ+ వైరోచకః=దురదృష్టవంతుడు వైరోచనుడిని (వైరోచనుడు), హతః=చంపేశాడు (దారువర్మ చేత వైరోచనుడు చంపబడ్డాడు).

రాక్షసః:

కష్టం! అనర్థద్వయ మాపతితమ్, న హత శ్చన్ద్రగుప్తో హతౌ వైరోచక బర్బరకౌ దైవేన అథ సూత్రధారో దారువర్మా కథమ్?

అర్థం:

కష్టం=అయ్యో!, అనర్థద్వయం+ఆపతితమ్= (ఒక్కమారు) రెండు అనర్థాలు వచ్చిపడ్డాయి, చన్ద్రగుప్తః+న+హతః=చంద్రగుప్తుడు చావలేదు (చంపబడలేదు), దైవేన+వైరోచక+బర్బరకౌ+హతౌ=దురదృష్టవశాత్తు విధి (చేత) వైరోచనుడు, బర్బరకుడు అంతమైపోయారు. అథః=ఆ తరువాత, సూత్రధారో+దారువర్మా+కథమ్?=నిర్మాణశిల్పి దారువర్మ ఏమయ్యాడు?

విరాధ:    

వైరోచకపురఃసరేణ పదాతిలోకే నైవ లోష్టఘాతం హతః।

అర్థం:

వైరోచక+పురఃసరేణ+పదాతిలోకేన+ఏవ=వైరోచనునికి మొదటగా నడుస్తున్న కాలిబంట్లే (వారి చేతనే), లోష్టఘాతం+హతః=మట్టిబెడ్డలతో కొట్టి చంపేశారు (చంపబడ్డాడు).

రాక్షసః:

(సాస్రమ్) కష్టమ్! అహో వత్సలేన సుహృదా దారువర్మణా వియుక్తాః స్మః। అథ తత్ర త్యేన భిషజా అభయదత్తేన కి మనుష్ఠితం?

అర్థం:

(స+అస్రమ్=కన్నీటితో) కష్టమ్=అయ్యో! వత్సలేన+సుహృదా+దారువర్మణా+వియుక్తాః+స్మః=ప్రియస్నేహితుడు దారువర్మ మనలను (ఒంటరి చేసి) విడిచిపోయాడు (ఏకాకుకులం చేయబడ్డాం), అథః= ఇక, తత్రత్యేన+భిషజా+అభయదత్తేన=పాటలీపుత్రంలో (మనం నియమించిన వైద్యుడు అభయదత్తుడు), కిమ్+అనుష్ఠితం=ఏమి వ్యవహారం నడిపాడు? (వ్యవహారం నడుపబడింది)

విరాధ:   

సర్వ మనుష్ఠితమ్.

అర్థం:

సర్వమ్ +అనుష్ఠితమ్=అనుకున్నదంతగా చేశాడు.

రాక్షసః:

కిం హతో దురాత్మా చన్ద్రగుప్తః?

అర్థం:

దురాత్మా+చన్ద్రగుప్తః+కిం+హతో=దుర్మార్గుడు చంద్రగుప్తుణ్ణి హతమార్చడమైందా?

విరాధ:   

అమాత్య, దైవాన్న హతః

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, దైవాత్+న+హతః=దురదృష్టం (విధి) కొద్దీ అది (చంపడం) జరగలేదు.

రాక్షసః:

(సవిషాదమ్) త త్కిమిదానీం కథయసి సర్వ మనుష్ఠితమిత మితి?

అర్థం:

(స+విషాదమ్=విచారంగా), తత్+కిమ్+ఇదానీం+సర్వం+అనుష్ఠితమితం+ఇతి+కథయసి=అయితే అంతా సవ్యంగా జరిగిందని ఇప్పుడెందుకు చెప్పావు?

విరాధ:        

అమాత్య, కల్పిత మనేన యోగచూర్ణ మిశ్రిత మౌషధం చన్ద్రగుప్తాయ. తత్ప్రత్యక్షీకుకుర్వతా చాణక్య హతకేన కనక భాజనే వర్ణాన్తర ముపలభ్య అభిహిత శ్చన్ద్రగుప్తః వృషల, సవిష మిద మౌషధమ్, న పాతవ్యమ్!ఇతి.

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, చన్ద్రగుప్తాయ=చంద్రగుప్తుడి కోసం, అనేన+యోగచూర్ణం+మిశ్రితం=ఆ వైద్యుడు (అభయదత్తుడిచే) యోగచూర్ణం కలిపిన మిశ్రమాన్ని, కల్పితం=తయారుచేశాడు (చేయబడినది). తత్=దానిని, ప్రత్యక్షీకుర్వతా=చూపిస్తూ (కనబరుస్తూ), చాణక్యహతకేన=చాణక్య చచ్చినాడు, కనక+భాజనే+వర్ణాన్తరం+ఉపలభ్య=బంగారు గిన్నెలో రంగు మారడం గమనించి, చన్ద్రగుప్తః+అభిహితః=చంద్రగుప్తుణ్ణి హెచ్చరించాడు (చాణక్యుడిచే చంద్రగుప్తుడు హెచ్చరించబడ్డాడు) – ‘వృషల=చంద్రగుప్తా, ఇదం+ఔషధమ్+స+విషమ్=ఈ మందులో విషం కలిసింది, న+పాతవ్యమ్=తాగవద్దు!’ ఇతి=అని.

రాక్షసః:

శఠః ఖ ల్వసౌ వటుః, అథ స వైద్యః కథమ్?

అర్థం:

అసౌ+వటుః+శఠః+ఖలు=ఈ కుఱ్ఱవాడు ఎంత మోసగాడో కదా (మొండివాడో కదా), స+వైద్యః+కథమ్?=ఆ వైద్యుడు (అభయదత్తుడు) ఎలా ఉన్నాడు?

విరాధ:       

త దేవౌషధం పాయితో మృతశ్చ।

అర్థం:

తత్+ఏవ+ఔషధం=అదే మందు (ను), పాయితః=త్రాగించి, మృతః+చ=చంపబడ్డాడు కూడా.

రాక్షసః:

(సవిషాదమ్) అహో! మహాన్ విజ్ఞాన రాశి రుపరతః! అథ తస్య శయనాధికృతస్య ప్రమోదకస్య కిం వృత్తాన్తమ్?

అర్థం:

(స+విషాదమ్=విచారంగా) అహో= ఆహా! (అయ్యో), మహాన్+విజ్ఞానరాశిః=గొప్ప పండితుడు, ఉపరతః=కనుమరుగైపోయాడు. అథః=తరువాత సంగతి (చెప్పు), తస్య+శయన+అధికృతస్య+ప్రమోదకస్య=ఆ చంద్రగుప్తుడి పడకగది విషయం చూడమని నియమించిన ప్రమోదకుడి, కిం+వృత్తాన్తమ్=సంగతేమిటి?

విరాధ:  

య దిత రేషామ్

అర్థం:

యత్+ఇతరేషామ్=మిగతావారికేమి జరిగిందో అదే…

రాక్షసః:

(సోద్వేగమ్) కథ మివః?

అర్థం:

(స+ఉద్వేగమ్=ఆందోళనగా) కథం+ఇవః=అదెలాగ?

విరాధ:     

స ఖలు మూర్ఖః తం యుష్మాభి రతిసృష్టం మహాన్త మర్థరాశి మవాప్య మహతా వ్యయే నోపభోక్తు మారబ్ధవాన్. తతః కుతోఽయం భూయాన్ ధనాగమఇతి పృచ్ఛ్యమానో యదా వాక్యభేదా న్బహూ నవదత్। తదా చాణక్య హతకేన విచిత్రవధేన వ్యాపాదితః।

అర్థం:

సః+ఖలు+మూర్ఖః=వాడు మూర్ఖుడు కద! యుష్మాభిః+తం+అతిసృష్టం=మీరు (మీ చేత) వాడికిచ్చిన (వాడికి కల్పించిన), మహాన్+అర్థరాశిం+అవాప్య=చాలా ధనరాశిని పొంది, మహతా+వ్యయేన+ఉపభోక్తుమ్=గొప్పగా ఖర్చు చేసి అనుభవించడం, ఆరబ్ధవాన్=ప్రారంభించాడు. తతః=దానిని చూసిన మీదట, ‘అయం+భూయాన్+ధనాగమ+కుతః=వీడికింత ఎక్కువ ధనం ఎలావచ్చింది?’, ఇతి=అని, పృచ్ఛ్యమానః=(రాజాధికారులచే) ప్రశ్నింపబడినవాడై, బహున్+వాక్యభేదాన్+అవదత్=అనేక విధాలైన తేడా మాటలు మాట్లాడాడు. తదా=దానితో, చాణక్య హతకేన=చాణక్య చచ్చినాడు (వాడిచేత) విచిత్రవధేన+వ్యాపాదితః=చిత్రహింసలతో చంపబడ్డాడు.

రాక్షసః:

(సోద్వేగమ్) కథం! అత్రాపి దైవే నోపహతా వయమ్। అథ శయితస్య చన్ద్రగుప్తస్య శరీరే ప్రహర్త మస్మత్ర్పయుక్తానాం రాజగృహ స్యాన్తర్భిత్తి సురఙ్గా మేత్య ప్రథమ మేవ నివసతాం బీభత్సకాదీనాం కో వృత్తాన్తః?

అర్థం:

(స+ఉద్వేగమ్=ఆందోళనగా) కథం=ఎంత పని జరిగింది! అత్ర+అపి=ఇక్కడ కూడా (ఈ విషయంలో కూడా), వయమ్+దైవేన+ఉపహతాః=మనం విధి చేతిలో దెబ్బతిన్నాం. అథ=ఇక – శయితస్య+చన్ద్రగుప్తస్య+శరీరే=పడుకొని ఉన్న చంద్రగుప్తుడి శరీరం మీద (పై), ప్రహర్తం=దెబ్బ తీయడానికి, రాజగృహస్య+అన్తర్భిత్తి+సురఙ్గామ్+ఏత్య=రాజనివాసపు గోడలోపలి సొరంగంలో ఉండి, ప్రథమం+ఏవ+నివసతాం=మొదటే చేరుకున్న, అస్మత్+ప్రయుక్తానాం+బీభత్సకాదీనాం=మనం ఏర్పాటు చేసిన బీభత్సకుడు మొదలైనవారి, వృత్తాన్తః+కః= సమాచారం ఏమిటి?

విరాధ:   

అమాత్య, దారుణో వృత్తాన్తః।

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, వృత్తాన్తః+దారుణః=ఆ సంగతి దారుణమైనది.

రాక్షసః:

(సావేగమ్) కథం! దారుణో వృత్తాన్తః! న ఖలు విదితాస్తే తత్ర నివసన్త శ్చాణక్య హతకేన?

అర్థం:

కథం=ఎలాగ! వృత్తాన్తః+దారుణః= దారుణమైన సంగతా! (అదెలాగ), తత్ర+నివసన్త+తే= ఆ సొరంగంలో ఉండేవారు, చాణక్య హతకేన+న+విదితాః+ఖలు=చాణక్య చచ్చినాడికి తెలియరు కద! (చాణక్యుడికి వారు అక్కడ ఉన్నట్టు తెలియదు కద!)

విరాధ:   

అమాత్య, అధ కిమ్, ప్రాక్ చన్ద్రగుప్త ప్రవేశా చ్ఛయనగృహం ప్రవిష్టమాత్రే ణైవ నిపుణ మవలోక యతా దురాత్మనా చాణక్య హతకేన కస్మాచ్చి ద్ఛిత్తి ఛిద్రాద్ గృహీతభక్తావయవాం నిష్క్రామన్తీం పిపీలికాపఙ్క్తి మవలోక్య పురుషగర్భ మేత ద్గృహ మితి గృహీతార్థన దాహితం త చ్ఛయనగృహమ్। తస్మింశ్చ దహ్యమానే ధూమావరుద్ధ దృష్టయః ప్రథమ మభిహిత నిర్గమన మార్గం అనధిగమ్య ద్వారం। సర్వ ఏవ బీభత్సాదయో జ్వలన ముపగమ్య తత్రైవ నష్టాః॥

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, అధకిమ్=అవును, ప్రాక్+చన్ద్రగుప్త+ప్రవేశాత్=చంద్రగుప్తుడు (పడకటింటిని) ప్రవేశించక ముందే, శయనగృహం+ప్రవిష్టమాత్రేణ+ఇవ=ఆ పడకటింట్లో అడుగుపెడుతూనే, నిపుణం+అవలోకయతా+దురాత్మనా+చాణక్య హతకేన=నిశితంగా పరిశీలిస్తున్న చాణక్యుడు (చాణక్యుడి చేత), కస్మాచ్చిత్+భిత్తి+ఛిద్రాద్=ఒకానొక గోడ పగులు నుంచి, గృహీత+భక్తావయవాం=బియ్యపు (అన్నపు) తునకలను తీసుకుని, నిష్క్రామన్తీం=బయటకు వస్తున్న, పిపీలికా+పఙ్క్తిమ్+అవలోక్య=చీమల బారును చూసి – ఏతత్+గృహం+పురుష+గర్భం+ఇతి=’ఈ గదిలో మనుషులు దాగి ఉన్నారు’ అని – గృహీతార్థన=గ్రహించుకున్నవాడై (వాని చేత), తత్+శయనగృహమ్+దాహితం=ఆ పడకటింటిని తగలబెట్టించేశాడు (అది తగలబెట్టబడింది), తస్మిన్+చ+దహ్యమానే+ధూమావరుద్ధదృష్టయః+బీభత్సాదయః=ఆ గది తగలబడిపోతున్న కారణంగా కమ్మిన పొగ కారణంగా కళ్ళు కనబడని బీభత్సకుడు మొదలైన వారు, ప్రథమమ్+అభిహిత+నిర్గమన+మార్గం+ద్వారం+అనధిగమ్య=మొదటగా నిర్దేశించుకున్న బయటపడే మార్గ ద్వారం చేరుకోజాలక, జ్వలనం+ఉపగమ్య=మంటలపాలై, సర్వః+ఏవ+తత్రైవ+నష్టాః=మొత్తం అందరూ అక్కడే అంతమైపోయారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here