[dropcap]ఆ[/dropcap]ది ప్రణవ నాదంతో పరమేశ్వరుడు
కొత్త నల్ల మట్టి పలకపై
తనచేత చిక్కిన చిట్టిచెయ్యి గుప్పిట్లో
ఒడిసిపట్టిన తెల్లసుద్దముక్క ప్రవాహంలో
ఓం నమః శివాయ అని ప్రతిష్టించాక
ఒడిలోని బ్రహ్మకమలపు శిశువు నాలుకపై
తొలి బీజాక్షరం స్వర్ణ కమలమై వికశిస్తుంది.
అప్పటినించి అతను శివుని చితా భస్మం లా
ప్రతి విద్యార్థి నుదుట
ప్రకాశిస్తూనే ఉంటాడు …
తాను నేర్చిన విద్య భావితరాల పూబాటగా
పరచుకుంటూ నిర్మల నిశ్చల మనస్సుతో
వారి జీవన చిత్రాలను చిత్రిస్తూనే ఉంటాడు.
కల్మషం,మాలిన్యం,కాఠిన్యం,సంకుచితత్వం
అతని బోధనా విధానంలో ఎండమావులై
కారుణ్యం,దేశభక్తి,మానవీయత,మమతా కలువపూలు
విద్యార్థి జీవనసరోవరంలో మొగ్గలు తొడుగుతాయి.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
పరోపకారం ఇదం శరీరం…లు
త్రివర్ణాలై విద్యార్థి మనో పతాకంపై
అతను స్వేదచక్రమై రెపరెపలాడుతుంటాడు…
తాను నమ్ముకున్న తెల్లసుద్దముక్కకు
ప్రతిరూపమై జీవన చరమాంకం వరకు
అరిగి అరిగి అక్షరమై మిగిలిపోతూనే ఉంటాడు.
భావి పౌరుల జీవన నిఘంటువై
జీవన పరమార్ధాన్ని ప్రవచిస్తూన్న వేళ
తమకాళ్ళమీద తాను నిలబడిన
పచ్చని చెట్టు యై విద్యార్థి ప్రణమిల్లినపుడు
అతని హృదయాంతరంగంలో ఆశీసుల
పారిజాతం పాలపుంతయై పుష్పిస్తుంది.
సన్మానాలు సత్కారాలు దేవుని
మాలిన్యాలై మిగిలి వెల వెల బోతాయి.
చితిలో శవమై కాలుతున్నా
అతని కుడిచేయి తెల్లసుద్దముక్కతో
మరో జీవన శ్రీకారం కోసం పైకి లేచే ఉంటుంది…!!!