[dropcap]’భ[/dropcap]క్తి’ అన్నది మనం రోజువారీగా వాడే పదాలలో ఒకటి. కానీ ఆ మాటకు అర్థము లోతైనది. గంభీరమైనది.
మనకు భక్తి అన్నది దేవుని యందే కాకుండా, మన గురువు యందు, పెద్దలయందు, తల్లితండ్రులయందు ఉంటుంది, ఉండాలి. అలాని మనకు చిన్ననాటి నుంచి నేర్పుతారు కదా!!
‘భక్తి’ అన్న మాటకు నిఘంటువు అర్థం చూచినట్లైతే ‘సేవ’, ‘గౌరవంతో గూడిన స్నేహము, నమ్మకము, శ్రద్ధ’ అని చెబుతుంది.
భగవంతుని మీద అవ్యాజమైన, అవధులు లేని, అనంతమైన అనురాగం భక్తి. నిజమైన, నిష్కళంకమైన, నిరుపమానమైన, నిర్మోహిత, నిజ నిరామయమైన, నిర్వికల్పమైన,నిర్మలమైన ప్రేమను భక్తి అనవచ్చును.
భక్తి అన్నమాట వేదాలలో లేదని చెబుతారు కానీ, వేద పరిభాషలో, అర్థములో భక్తి అన్నది ధ్వనిస్తున్నదని పండితులు వివరిస్తారు. మొట్టమొదట ఈ మాట మనకు ‘శ్వేతాశ్వతరోపనిషత్’ లో కనపడుతుంది.
“స తన్మయో హ్యమృత ఈశసంస్థో జ్ఞః సర్వగో భువనస్యాస్య గోప్తా।
య ఈశేఽస్య జగతో నిత్యమేవ నాన్యో హేతుర్విద్యత ఈశనాయ ॥
యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై।
తం హ దేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే॥”
అంటే – ‘అతను ఈ లోకానికి అంతరాత్మ, అమృత స్వరూపం, ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వ వ్యాప్తి, లోకరక్షకుడు, శాశ్వత ప్రభువు. శాశ్వత జగత్నియామకుడు మరి లేడు.
“బ్రహ్మకు వెడలు ఎవరు ఒసగరో, ఇవ్వన్నీ బుద్ధి ఆత్మాభిముఖం గావిస్తుందో ఆ దేవదేవుని మోక్షార్థినై శరణు వెడుతున్నాను” (6-17-18).
భక్తి అన్న మాట ‘భజ్’ అన్న ధాతువు నుంచి వచ్చింది. భజించటము, కలుపుకోవటం, కోరుకోవటం, ఇత్యాదివి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతున్నవి.
భక్తి మార్గం గురించి చెప్పిన ఉద్గ్రంథములలో ‘భగవద్గీత’ చాలా ప్రాముఖ్యమైనది. భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ, భక్తి యోగం అన్న అనుకరణలో భక్తి గురించి చాలా వివరిస్తాడు.
నారద భక్తి సూత్రాలు భక్తి గురించి, భక్తుని గురించి, భక్తునికి ఉండవలసిన లక్షణం గురించి కూలంకుషంగా మాట్లాడుతుంది.
ఈ రకముగా చూస్తే భక్తి నానారకాలు అని మనకు అర్థమవుతుంది.
అవి అనన్య భక్తి, సకామ భక్తి, నిష్కామ భక్తి, ఇత్యాదివి. భక్తిని నవ విధ భక్తిగా కూడా చెబుతారు.
అవధులు లేని భక్తిని అనన్య భక్తిగా, కొరికలతో కూడిన భక్తిని సకామ భక్తిగా, కోరికలన్నవి లేని భక్తిని నిష్కామ భక్తిగా టూకీగా చెప్పవచ్చు.
మానవుడుగా జన్మించిన వారు, తమ జన్మ సాఫల్యంకై, సత్యంకై, మోక్షంకై వెతికే వెతుకులాటలో, భక్తి అన్నది అత్యంత ప్రాముఖ్యమైనది.
ఎన్ని విధాలా ప్రయత్నం ఉన్నా, భక్తి లేనిచో, రుచిలేని వంటకము వంటిది.
భక్తి అన్నది మోక్షకామికి ప్రాణవాయువు వంటిది.
ఈ భక్తి మార్గం అనాదిగా ఉన్నది. పరమ సహజమైనది. సులభమైనది.
సామాన్యులు కూడా అనన్యమైన నిష్కళంక భక్తితో పరమాత్మను సేవించి మోక్షము అందుకున్నారని పరమ భక్తుల చరిత్ర చెబుతున్నది.
జ్ఞాన మార్గం, విచార మార్గం, కర్మ మార్గం ఇత్యాదివి ఉన్నా, అన్ని మార్గములకు భక్తి తప్పని సరి లక్షణము.
ఏ విధంగా చేసినా రోజులో అధికసమయం దైవనామస్మరణ చేయడం, ప్రతీదానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం.
ఆ భక్తి అనేది కొందరు భజనలు చేస్తారు, కొందరు జపం చేస్తూంటారు, మరికొందరు ధ్యానం చేస్తారు. ఆ విధంగా పలురకాలుగా దేవుడిని ఆరాధించే మార్గాలు తొమ్మిది. వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు.
భక్తి మార్గంలోని గొప్ప లాభం ప్రయోజనం ఏమంటే అది పరమావధిని పొందటానికి ఎంతో సహజమైన, సులభమైన మార్గమని ‘నారద భక్తి సూత్రాలు’ చెబుతున్నవి.
“అన్యస్మాత్ సౌలభ్యం భక్తా” (నారద సూత్రాలు – 58).
నవవిధ భక్తి అంటే “శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము , ఆత్మ నివేదనం”.
మూల సంస్కృత భాగవతంలో నవవిధ భక్తులను ఈ శ్లోకంలో వర్ణించారు
శ్లో.
“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం,
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం”.
బమ్మెర పోతన ఈ నవవిధ భక్తులను గురించి భాగవతములో ప్రహ్లాద ఉపాఖ్యానంలో ఇలా వర్ణించారు.
7-167-మ..
“తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!”
భావము:
రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం; ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణసుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.
ఈ తొమ్మిందింటినీ నవవిధ భక్తులు అని అంటారు. ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం పరమాత్మను మొక్షమును పొంది పునరావ్రుత్తి రహిత స్థితిని పొందవచ్చు.
- భగవంతుని లీలలను వినడం -శ్రవణము. దీనికి ఉదాహరణగాపరీక్షిన్మహారాజు గురించి చెబుతారు.తనకు ఇంక 7 రోజులు మాత్రమే జీవించి వుండే అవకాశ మున్నదని తెలుసుకొని ఆయన భాగవతాన్ని (భగవంతుని భక్తుల కధలను) విని తరించాడు.
- రెండవది – కీర్తనము. ఆయన లీలలను కీర్తించటము.కీర్తనముతో పరమాత్మ గుణములను గానము చేసిన త్యాగయ్య, అన్నమయ్య, బద్రాద్రి రామదాసు, శ్యామశాస్త్రి మున్నగు వారు ముక్తిని పొందినట్లుగా మనకు చరిత్రలో కనపడుతుంది. వారు కీర్తనముతో భగవంతుని కొలచిన పూజ్యులు. ఆ మార్గము మనకు అందించి తరించిన మహనీయులు.
- స్మరణము. నిరంతరం భగవంతుని నామం తలస్తూ ఉండడం -స్మరణము. భాగవతములో ప్రహ్లాదుడు, నారదముని మున్నగు వారు. ‘యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్, విముచ్యతే…’ అని విష్ణుసహస్రనామం ఆరంభంలోనే కనిపిస్తుంది. స్మరిస్తే చాలు ఈ భవసాగరం నుంచి శాశ్వతంగా విముక్తిని ప్రసాదిస్తాడు అని దీని అర్థం. భగవంతుని సదా స్మరిస్తూ ఉంటే, కొన్నాళ్లకి ఆ స్మరణ అసంకల్పితంగానే మన మనసులో మెదులుతూ ఉంటుందని పెద్దల అనుభవం. మనం దేనినైతే నిరంతరం తల్చుకుంటూ ఉంటామో దాన్ని తప్పక పొందగలం అని కొత్తగా వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా చెబుతున్నాయి. భక్తులకి కావల్సింది కూడా అదే కదా!
- పాదసేవనము, స్వామివారి పాదములు ఒత్తుట మున్నగు సేవలు చేయడం.పాదసేవనము. పూర్వము శిష్యులు గురువులకు సేవించి విద్యను పొందేవారు. అలాంటి సేవలలో పాద సేవనము కూడా ఒకటి.
- స్వామిని నిత్యం పూజించడం. అర్చనము. పాండురంగడిని అర్చించే విప్రనారాయణుడు ఇందుకు ఉదాహరణము.
- భక్తితో నమస్కారములు చేయడం. వందనము. వందనం అంటే నమస్కరించటం… ఉన్నతమైన వారికి మన శిరస్సు వంచి నమస్కరిస్తాం. శిరస్సు వంచటం అంటే పెద్దల గొప్పతనాన్ని గుర్తించి మన అహాన్ని ఒదలి వారి పట్ల వినయ, విధేయతలు ప్రకటించటం…. ఈ వినయ, విధేయతలు వారి సమక్షంలోనే కాదు సుమా..వారికి దూరంగా ఉన్నప్పటికీ వారి పట్ల మనం అదే గౌరవభావాన్ని ప్రదర్శిస్తాం… అదే విధంగా భగవంతుడి గొప్పతనాన్ని, ఆయన సమస్త జీవులలోను ఉన్నారని గుర్తించి సకల జీవరాసుల పట్ల కరుణ, దయ, ఇతరులతో సోదరభావం కలిగివుండటమే అసలైన వందన సమర్పణ. అక్రూరుడు ఇందుకు ఉదాహరణగా తీసుకోవాలి.. భాగవతంలో దశమస్కంధంలో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు, శ్రీ కృష్ణుని పరమ భక్తుడు, ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుడు ఎంతగా పొంగిపోయాడంటే, ఈయన ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి.
- దాసభక్తి. స్వామికి దాసుడననే భావముతో సేవించడం. దాస్య భక్తికి హనుమంతుల వారిని ఉదాహరణగా చెబుతారు. హనుమ యొక్క దాస్య భక్తి, వారు శ్రీ రామచంద్రమూర్తిని సేవించిన తీరు తెలియని వారు ఉండరు. లక్ష్మణడు కూడా దాస్యభక్తికి ఉదాహరణ. సోదరుడైన రామునికి సర్వము వదలి లక్ష్మణుడు చేసిన సేవ అత్యుత్తమమైనదిగా రామాయణము చెబుతుంది. విదురునిది కూడా దాస్య భక్తిగా ఉదహరిస్తారు.
- స్వామి నా చెలికాడు అనే భావనతో మెలగుట – సఖ్యము. మీరాబాయి, మొల్ల, మెదలయినవారి భక్తి ఇదే. అర్జునుని భక్తి కూడా సఖ్యమే. భగవంతుని తన చెలిగాడుగా మిత్రునిగా భావించి సేవించటము.
- స్వామీ నీవే నా సర్వస్వము, ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావనతో ఆత్మార్పణం చేయడం. ఆత్మ నివేదనము. బలి చక్రవర్తి. వామనావతరములో స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు.
వీటన్నిటిలో ఉత్తమమైనదిగా మధురభక్తిని చెబుతారు.
భక్తులలో గోపికలది ఉత్తమొత్తమైన మార్గము. వారిది మధురభక్తి. పరమాత్మ వారికి సర్వము. వారు పరమాత్మకు తమ ఆత్మనివేదన చేసుకున్నారు.
నవవిధ భక్తికి తార్కాణాలు మనకు నమ్మాళ్వార్లు, ఆళ్వరులు, చైతన్య మహాప్రభువు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, తుకారాము, భక్త కన్నప్ప,కబీరుదాసు వంటి వివిధ భక్తుల చరిత్రలో కనపడుతారు.
నేటి కలియుగములో నామ పారాయణం నేటికీ అత్యుత్తమమైన మార్గమని షిరిడిబాబా చెప్పివున్నారు. ఇలాంటి సందర్భాలలో మాట్లాడుతూ షిరిడి సాయి, షిర్డీ నుంచి కూడా ఒక మార్గం ఉందని చెబుతారు.
పరమాత్మను తనవాడిగా తన పిల్లవానిగా కూడా కొలుస్తారు భక్తులు.
ఎన్ని విధముల కొలచినా, భక్తిగా పిలచిన పరుగున వస్తానని స్వామి గజేంద్రమోక్షములో నిరూపించారు.
ప్రేమగా ఒక పండు గానీ, పువ్వు కానీ, లేదా నీరు ఇచ్చినా స్వీకరిస్తానని గీతలో చెప్పారు కదా!
“సర్వేశ్వరుండగు శౌరిఁ కింకరు సేయు ధన మున్నదే – భక్తి ధనము గాక?
సర్వోపగతుఁడగు చక్రి బంధించెడు బల మున్నదే భక్తి బలముగాక?
సర్వభోక్తను జలజాతాక్షుఁ డనియించు ఫల మున్నదే భక్తి ఫలము గాక?
సర్వజ్ఞుఁడైన కేశవుని మెప్పించెడు విద్య యున్నదే భక్తి విద్య గాక?
సర్వ వరదుడైన శాజ్గిన్ సన్నిధిఁ జేర్చు పథమున్నదే భక్తి పథము గాక?
కాన నితఁడు భక్తిగలవారకె గాని పరుల కగ్గమగునే? పడతులారా!”
(కృష్ణతులాభారము)
ఆ అవ్యాజమైన ప్రేమతో పరమాత్మను సతతము తలచి, మోక్షము పొందుటకు అత్యంత సహజమైన, సరళమైన మార్గమీ భక్తి మార్గము. కాబట్టి మానవులుగా పుట్టినవారు సహజమైన ప్రేమతో పరమాత్మను తలచి తరించుటకు “భక్తి” సులభమైన మార్గము అనటములో ఎలాంటి సందేహాములేదు.