[box type=’note’ fontsize=’16’] అటవీ అధికారిగా పనిచేసే స్నేహలత అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ కథ ఈ ‘ఆమని‘ నవలిక. దాసరి శివకుమారి రచించిన ఈ నవలికలో ఇది 11వ భాగం. [/box]
[dropcap]త[/dropcap]న పరిధిలో తాను ఏమేం చేయాలనుకుంటున్నదో చెప్పింది. ఆ తర్వాత తన దగ్గరకొచ్చిన సంచార జాతి వారి సమస్యను సి.యమ్. గారి దృష్టికి తీసుకొచ్చింది.
“ఈ సమస్య నా దృష్టికీ వచ్చింది. అయితే కొన్ని కుటుంబాల వాళ్ళు ఈ జిల్లాలో కూడా వున్నారన్న మాట. అన్ని ప్రాంతాల నుండి రిపోర్టులు తెప్పించుకుని సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాను. వాళ్ళ ప్రతినిధుల్నీ పిలిపించి వాళ్ళ డిమాండ్స్ ఏమిటో తెలుసుకోవాలి. అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. వాళ్ళను ఏ కేటగిరీలో చేర్చటానికి వీలవుతుందో తెలుసుకోవాలి. వీలైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరిద్దాం. గిరిజన రైతులతో ఔషధ మొక్కల సాగూ, దానికి సేకరించిన విధానం చాలా బాగా వున్నది. మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి. ఇంకా అవసరమైతే ప్రభుత్వ సాయం ఎప్పుడూ వుంటుంది” అంటూ హామీ ఇచ్చారు.
విశాఖ ఏజన్సీ ఐటిడిఏ పీవో తను బాధ్యత వహించే ఏజన్సీ ప్రాంతాన్ని గురించి మాట్లాడాడు. ఆ ఏజన్సీలో గిరిజనులెక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళకింకా విద్యా, వైద్య సౌకర్యాలు పెంచాలి. అక్కడి గిరిజనులతో తన అనుభవాలు, వాళ్ళ ఇబ్బందులు తను ఎలా సాల్వ్ చేస్తున్నాడో వివరించాడు.
స్నేహలత సి.యమ్.గారికి ప్రెజెంట్ చేసిన విషయాలను అతను ఆసక్తిగా విన్నాడు. ఆమె మాటల్లో కనబడిన అంకితభావ మతనికి బాగా నచ్చింది.
కాన్ఫరెన్స్ పూర్తయ్యాక, స్నేహలతతో పరిచయం చేసుకుని వివరాలడిగాడు. ఆ తర్వాత తన వివరాలు చెప్పాడు.
“నేను ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన వాణ్ణండీ. ఖరగ్‌పూర్ ఐఐటీలో బి.టెక్, యం.టెక్‌లు పూర్తి చేశాను. కొన్నాళ్ళు యూనివర్సిటీలో ఫాకల్టీగా పనిచేశాను. అలా పని చేస్తూనే నా కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. అందుకని రెండవ ప్రయత్నంలోగాని ఐఎఎస్‌కు ఎంపిక కాలేకపొయ్యాను. మీకు తెలియంది ఏముంది? ఐఎఎస్ లందరిలాగానే నేను ముస్సోరీలో శిక్షణ పొందాను. భారత్ దర్శన్ టూర్‍లో ఎన్నో ముఖ్యమైన ప్రాంతాలను చూట్టమే కాకుండా ప్రజల జీవన విధానాన్నీ తెలుసుకునే అవకాశమూ కలిగింది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనీ ఐఎఎస్‌గా వున్నాను. ఆ టైమ్‌లో నా సీనియర్ కలెక్టర్ పని చేసే విధానం చూసి నేను ముగ్ధుణ్ణయ్యాను. ఆయనన్ను చూసి చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఆయనెంతో గొప్ప మనిషంటే నమ్మండి. అలా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత విశాఖ ఏజన్సీలో సబ్ కలెక్టరుగాను ఆ తర్వాత ఐటిడిఎ ప్రాజెక్టు నాకప్పగించారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే – ఇందాక సి.యమ్. గారితో మీరు మాట్లాడిన ప్రతీ మాటా ఎంతో బాధ్యతగా, ఎంతో సిన్సియర్‍గా, పైగా మరెంతో ఉత్సాహంగా కూడా మాట్లాడారు. పని చేయాలి, గిరిజనులకు మేలు చెయ్యాలి, ఔషధ మొక్కల ఉత్పత్తిని ఎక్కువగా సాధించాలి అన్న తపన మీ ప్రతి మాటలోనూ కనబడింది. మీరు మాట్లాడినంత సేపు సి.యమ్.గారు కూడా చిరునవ్వుతో, మెచ్చుకోలుగా విన్నారు. అదంతా చూసి నాకు, నా పాత సంగతులు, నా ప్రేరణా అన్నీ గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకున్నాను. అంతకంటే ఇంకేం లేదు. ఇద్దరం ఒకే దారిలో ప్రయాణించే వాళ్ళం కాబట్టి మీతో మాట్లాడాలనిపించింది” అన్నాడు ఎంతో పరిచయం ఉన్నవాడిలా.
దగ్గరదగ్గర నలభై ఏళ్ళ వయసుండొచ్చు. తనకంటే కాస్త పెద్దవాడే. తన పేరు మురళీధర మహంతి అని తెలిసింది. మహంతి మాటల్లో వృత్తికి సంబంధించిన విషయాలే గాని, పర్సనల్ విషయాలేవి దొర్లలేదు.
“మీ ఫామిలీ ఎక్కడుంటారు స్నేహలతా?” అంటూ మహంతి సడన్‌గా అడిగాడు.
“ఇక్కడే గుంటూర్లోనే. అమ్మానాన్నల్తో ఉంటాను. మరలా ఎప్పుడన్నా అవకాశముంటే కలుద్దాం. వస్తాను” అంటూ బై చెప్పి వచ్చేసింది.
తనకందిన భూసార పరీక్షల వివరాల ప్రకారం ఏయే ప్రాంతాలలో ఏయే మొక్కలని నాటించాలో ఛార్టు తయారు చేయించింది. ఆయా ప్రాంతాల గిరిజనుల్ని మోటివేట్ చేసే పని డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించింది. వారిలో స్పందన బాగానే వుందని వారు రిపోర్టులు పంపుతున్నారు. తననుకున్న పన్లను ఒకదాని తర్వాత ఒక అమలులో పెట్టసాగింది. మనసుకు తృప్తిగా వున్నది.
***
“స్నేహలతా! నేను మన ఝార్ఖండ్ పోయొస్తాను. తెలిసిన బంధువులను స్వయంగా కలిసి, మాట్లాడితే పెళ్ళి కాని మగవాళ్ళ వివరాలు తెలుస్తాయి. నీకు తగ్గ సంబంధం చూసి ఖాయం చేసుకొస్తాను. మీ నాన్నగారు వస్తే ఇద్దరం వెళ్ళొస్తాం. లేకపోతే నేనొక్కదాన్నయినా వెళ్ళొస్తాను. టికెట్ రిజర్వేషన్ చేయించు” అన్నది కుంజలత హఠాత్తుగా.
“ఇప్పుడింత సడన్‌గా ఈ నిర్ణయమేంటమ్మా! ఒక్కదానివీ ప్రయాణం చేయొద్దు. నాన్నగారి బుక్ అయిపోవస్తున్నదన్నారు. వీలున్నప్పుడూ ఇద్దరూ వెళ్ళి తమ్ముడ్నీ, పిల్లల్నీ కూడా చూసి రావచ్చు.”
“ఇలా మీనమేషాలు లెక్కిస్తూ ఏళ్ళకేళ్ళు గడిపేస్తున్నావు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు? ట్రెయినింగ్‌లో చేరినప్పటి నుండీ పెళ్ళి సంగతి తెస్తూనే వున్నాను. ‘కొన్నాళ్ళు ఆగండి, నాక్కాబోయే భర్తను నేనే పరిచయం చేస్తాను’ అన్నావు. మీ నాన్నేమో ‘అమ్మాయినేం అడగొద్దు, తను చెప్పిన తర్వాత విషయాన్ని ఆలోచిద్దాం’ అన్నారు. అంతే మాటైతే అన్నావు, ఎవర్నీ తీసుకొచ్చిందీ లేదు, మాకు చూపించిందీ లేదు. అవతలను పెళ్ళి చేసుకుని బాగానే వుండి వుంటాడు. నువ్వు మాత్రం అప్పటి నుండీ ‘ఇప్పుడప్పుడే నాకు పెళ్ళొద్దు’ అంటూ పాట మొదలుపెట్టావు. ఏమయిందో ఏమో తెలియక కొట్టుకు చస్తున్నాం. మీ నాన్న పైకి ఏం మాట్లాడరు. నువ్వు వులకవు, పలకవు. నేనసలు కన్నతల్లిలాగా కనబడుతున్నానా నీకు?” అంది కుంజలత ఆవేశంగా.
“అనవసర విషయాలు తలుచుకుని బాధ పడటమెందుకమ్మా? నేనే మరచిపోతున్నాను.”
“ఏం మరిచిపోతున్నావు? మర్చిపోతే మరొకరితో పెళ్ళికి ఒప్పుకొనేదావివిగా. మీ నాన్నకన్నీ తెలుసు. నాదాకా ఏ విషయాన్నీ రానివ్వరు.”
“కుంజలతా! ఈ రోజు ఏమయింది నీకు? అనవసరంగా బి.పి. పెంచుకుంటున్నావేమో అనిపిస్తోంది. మనమ్మాయి చిన్నపిల్ల కాదు. తన నిర్ణయాలు తను తీసుకోగలదు. ఏదైనా చెయ్యదలచుకున్నప్పుడు మనకు చెప్పే చేస్తుంది. వేచి చూద్దాం” అన్నాడు భర్త అనునయంగా.
“కూతురు సంపాదన కోసమే పెళ్ళి చేయకుండా ఉంచారని మనల్ని అంటారండీ అందరూ. ఈరోజు ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సిందే నాకు” అంటూ పట్టు పట్టి కూర్చున్నది కుంజలత.
“ప్రత్యేకించి చెప్పటానికేం లేదమ్మా. మనం అనుకున్నవన్నీ కావుగా. ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఒకతన్ని ఇష్టపడ్డాను. పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నాం. అది జరగలేదు. నీకూ తెలుసుగా, వేరొకరితో అతనికి పెళ్ళి జరిగిపోయింది. నేను ఆశించింది నాకు దక్కలేదు. దక్కిన దానితో అతను రాజీ పడిపోయాడు. నేను రాజీ పడలేకపోతున్నాను. అతనిలాగా నా మనసుకు మరెవరూ నచ్చడం లేదు. నచ్చనివాళ్ళను ఎలా చేసుకోమంటావు? ఎవరైనా నచ్చితే చేసుకుంటాను. సరేనా?”
“ఒకసారి నచ్చినవాడితో పెళ్ళి కాకుండా పోయిందని నీకు గిల్టీగా వున్నట్లున్నదనే నేననుకుంటున్నాను. ఈసారి ఆ విషయం మాకొదిలేయ్. అన్ని విధాలుగా తగినవాడిని తీసుకొస్తామ్. ఏదైనా మరీ ఆలీశెం చేసుకోగూడదు. నువ్వింకా చిన్నపిల్లననుకుంటున్నావా? ఏదో ఒకటి తేల్చి చెప్పేదాకా ఇవ్వాళ నేను భోజనం చెయ్యను.”
“పగలంతా పని చేసి అలసిపోయొచ్చింది. టైమ్‌కు భోజనం పెట్టకుండా ఏమిటీ మాటలు కుంజలతా? కావాలంటే భోజనాలయ్యాక మాట్లాడుకుందాం. నువ్వు కూర్చో ముందు. వడ్దించుకు తిందాం” అంటూ భర్త సమాధాన పరిచేసరికి ఆమె కూడా భోజనానికి కూర్చున్నది.
కూతురు మనసును కాస్త మంచి మూడ్‍లోకి తేవాలని “ఏమ్మా! నీ ఐడియాస్ చాలా చెప్తున్నావు? ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నావ్?” అనడిగారు వాళ్ళ నాన్నగారు.
“ఫర్వాలేదు నాన్నగారూ! ఒక్కో ఏరియా సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. రిజల్ట్ బాగానే వుంటున్నది. కొన్ని విషయాలలో సి.యమ్.గారిని కూడా ఒప్పించగలుగుతున్నాను. మిగతా జిల్లాల ఆఫీసర్లతోను టచ్‌లో వుంటున్నాను. ఇవాళొక ఐఎఎస్ ఆఫీసర్ పరిచయమయ్యారు. విశాఖ ఏజన్సీ నుంచి వచ్చారు. మహంతి గారని ఒరిస్సా ఆయన. ఆయనక్కూడా పని పట్ల చాలా శ్రద్ధ వున్నది. ఎంతో పరిచయమున్నవారిలా కష్టసుఖాలు మాట్లాడుతూ తన వివరాలు చెప్పుకొచ్చారు.”
“వర్క్ పట్ల ఎంత శ్రద్ధ వున్నవాళ్ళైనా కుటుంబాలను వదిలెసుకుని పని చెయ్యరు. పెళ్ళాం పిల్లల్ని గాలి కొదిలేసో, లేకపోతే పెళ్ళి చేసుకోకుండానో ఎవరూ వుండరు” అన్నది కుంజలత.
“మేం ఏం మాట్లాడినా పెళ్ళితో ముడిపెట్టకుండా వుండవు కదా!” అని తండ్రీకూతుళ్ళిద్దరూ నవ్వారు.
“ఏ బ్యాచ్ వాడయి వుంటాడో?”
“నా కంటే వయస్సులో కాస్త పెద్దే నాన్నా.”
“ఏజన్సీ ఏరియా అంటే కాస్త టిపికలే. ఆ ఏరియాలో వున్న రాజకీయ నాయకుల ఒత్తిడీ వుంటుంది. గిరిజనులతోనూ నెగ్గుకురావాలి. మధ్యమధ్యలో విప్లవకారుల ఆగాడాలుంటాయి.”
“ఇప్పటి ఆఫీసర్స్ అన్ని రకాల పరిస్థితులకూ అలవాటు పడుతున్నారులే నాన్నా. పరిస్థితులే మాలాంటి వారికి అనుభవాలు నేర్పుతాయి. బాగానే డీల్ చేయగలుగుతున్నాం.”
“సరేనమ్మా. అదంతా నీ వృత్తికి సంబంధించినది. నీ పర్సనల్ లైఫ్ గురించి కూడా అలోచించు. జీవితానికి రెండూ ముఖ్యమే. మీ అమ్మ పైకి అంటున్నాది, నేను లోపల్లోపలే వర్రీ అవుతున్నాను. మేమెల్ల కాలం నీకు తోడుంటామా? అదీ కాక ఈ వయసులో నీకు భర్త తోడు ముఖ్యం. నీకంటూ స్వంత కుటుంబం, భర్తా, పిల్లలూ వుండాలి. అమ్మ ఝార్ఖండ్ వెళ్ళదు, ఎవర్నీ ఎంపిక చేయదు. నీకు నచ్చిన వాణ్ణే సెలక్ట్ చేసుకో. భాగస్వామి ఎవరైనా చనిపోతేనే వాళ్ళ స్మృతుల్ని పక్కనబెట్టి మరొకరితో జీవితాన్ని పంచుకొమ్మని చెప్తాం. అలాంటిది ఎప్పుడో, ఎవర్నో కావాలనుకున్నావు. అతను పక్కకు వెళ్ళిపోయాడు. అతడి మానాన అతడు హాయిగానే వుంటూ వుండొచ్చు. నువ్వెందుకమ్మా ఆ జ్ఞాపకాలనే శాశ్వతమనుకుంటూ ఆ మనిషి తప్పితే ప్రపంచంలో మరెవరూ లేనట్టూ ఇలా ఎందుకుండిపోతున్నావో నా కర్థం కావట్లేదు. ఒక రకంగా ఇది అర్థం లేని పని కూడా. స్నేహలత లాంటి బ్రిలియంట్ ఇలాంటి తెలివితక్కువ పని చేస్తుండంటే అది ఊహక్కూడా అందని విషయం. దేశంలో చాలా భాగం చూసొచ్చావు. లోకం పోకడ తెలిసినదానివి. మన వాళ్ళు కానీ, మరెవర్నైనా కాని మమ్మల్ని చూడమంటే మేమే చూస్తాం. ఎందుకంటే నువ్వు ఎటూ తేల్చుకోలేకపోతున్నావు కాబట్టి. ఇప్పటికైనా మనసు మార్చుకుని నువ్వెవర్ని ఎన్నుకున్నా మాకు సంతోషమే. మాక్కావలసిందల్లా నువ్వొక ఇంటిదానివి కావటమే.”
“ప్రస్తుతమయితే ఏ ఆలోచనా లేదు నాన్నా. ఎందుకనో కాని నేనొక నిర్ణయానికి రాలేకపోతున్నాను. నాకేమైనా అనిపిస్తే వెంటనే మీకు చెప్తాను. ప్రస్తుతానికి అమ్మకు మీరే నచ్చజెప్పండి. గుడ్ నైట్ నాన్నగారూ!” అంటూ లేచి తన గదిలోకి వచ్చేసింది.
“మీరేమో ఇంతసేపు కంఠశోష వచ్చేటట్టు మాట్లాడారు. అదేమో విని దాని మానాన అది పోయింది గుడ్ నైట్ నాన్నగారూ అంటూ. మీరేమిటండీ ఎవర్ని చేసుకున్నా అభ్యంతరం లేదంటారు? మనవాళ్ళల్లో దీనికి తగ్గవాడు దొరక్కుండా పోతాడా?” అన్నది కుంజలత.
“తన ఫీలింగ్స్‌నూ అర్థం చేసుకోవాలిగా. అది చిన్న పిల్ల కాదు. ఎంత బలమైన గాయం తన మనసుకు కలగకపోతే అంత గట్టి నిర్ణయం తీసుకుంటుంది? ఇది వరకు ససేమిరా వద్దనేది. ఇప్పుడు ఆలోచిస్తానంటోంది. ముళ్ళ కంప మిద పడ్డ పట్టుబట్ట లాగుంది తన మనసు. చినుగు పడకుండా జాగ్రత్తగా ఇవతలికి తీసుకోవాలి.”
“దీనికంటే చిన్నవాడు, చదువుకున్నాడు. ఉద్యోగస్థుడయ్యాడు. మనం చూసిన పిల్ల మెళ్ళో తాళి కట్టాడు. పెళ్ళాంతో, ఇద్దరు పిల్లలతో లక్షణంగా కాపురం చేసుకుంటున్నాడు. వాడు సంతోషంగా ఉండి మనల్నీ సంతోషపెడుతున్నాడు. ఆడపిల్ల, ఇంటికి పెద్దదీ అయివుండి మన మాట వినటం లేదు. మనకీ సంతోషం లేదు, తనకీ ఏ అచ్చటా ముచ్చటా లేదు. తన ఈడు వాళ్ళందరి పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళి చదువుకునే వయసుకొచ్చారు. వయసు మీరిన తర్వాత పెళ్ళంటే సరైనవాడు దొరకడు. ఆ తర్వాత పిల్లలంటే లేనిపోని సమస్యలొస్తాయి” అంటూ కొన్నాళ్ళపాటు ఒక యూనివర్సిటీ వి.సి.గా పనిచేసిన భర్తకు తాను లోకజ్ఞానం వివరించినట్లుగా చెప్పుకుపోసాగింది కుంజలత.
“చూద్దాం, ఏం జరుగుతుందో” అంటూ ఆయన తలపంకిస్తూ లోపలికెళ్ళారు.
అలా నాలుగు రోజులు గడిచాయి. ఒకరోజు స్నేహలత ఇంటికొచ్చేసరికి ఇల్లంతా సందడిగా వున్నది. తమ్ముడు వర్ధన్, అతని కుటుంబమూ వచ్చారు. వాళ్ళ రాకకు సంతోషం కలిగినా, ఇప్పుడు వీడు చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చినట్టో అన్న ఆలోచనలో పడ్డది. అమ్మే ఏదో ప్లానుతో పిలిపించి ఉంటుందన్న ఉద్దేశం కలిగింది. తమ్ముడి కూతురు యమున నాలుగేళ్ళ పిల్ల, తరువాతి వాడికి రెండేళ్ళు. వచ్చీ రాని మాటలు చెప్తూ ఇద్దరూ ఇల్లంతా కలయదిరిగేస్తున్నారు. మధ్యమధ్యలో వచ్చి తాతగారి ఒడి యెక్కి కూర్చోవాలని ఇద్దరూ పోటీ పడుతున్నారు. కుంజలత ఒకళ్ళను తన వళ్ళో కూర్చోబెట్టుకుని, ఎంతో మురిపెంగా ముద్దులాడుతున్నది. మధ్యమధ్యలో పనివాళ్ళకు పనులు పురమాయిస్తూ హడావిడి పడుతున్నది.
“ఉద్యోగానికీ, ఈ ఏరియాకు బాగా అలవాటు పడినట్లున్నావక్కా. అమ్మా నాన్న కూడా ఇక్కడ బాగానే వున్నదంటున్నారు” అన్నాడు వర్ధన్.
“ఆ… వేసవి వచ్చేదాకా బాగానే వున్నదంటారు. వేసవి రాగానే బాబోయ్ ఎండలంటున్నారు” అన్నది నవ్వుతూ. “ఏంటి విశేషం? ఎప్పుడు రమ్మని ఫోన్ చేసినా ఏదో వంకల మీద వంకలు చెప్పేవాడివి. అలాంటిది ఈసారి హఠాత్తుగా వచ్చేశావు?” అంది.
“యముననూ, భరత్‌నూ చూపించమని అమ్మ పదే పదే అంటున్నది. మనమంతా కలుసుకుని కూడా చాలా రోజులైంది. మా అత్తగారి తరఫు బంధువు ఒకాయన ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్ సెంటర్‌లో పని చేస్తారు. వాళ్ళమ్మాయి పెండ్లి మన ఝార్ఖండ్‌లోనే చేశారు. రిసెప్షన్ మాత్రమ్ ఇక్కడ యూనివర్సిటీలోనే పెట్టుకున్నారు. పెళ్ళికి వెళ్ళడానికి మాకు కుదరలేదు. మీరు ఈ దగ్గరలోనే వున్నారు, మిమ్మల్నీ చూడొచ్చు, ఆ ఫంక్షన్‌కూ అటెండవ్వచ్చు అన్న ఉద్దేశంతో బయలుదేరి వచ్చాం” అన్నాడు.
తమ్ముడి భార్య మాత్రం గుంభనగా నవ్వింది. విషయమింకా ఏదో వున్నదనిపించింది. నిదానంగా అదే తెలుస్తుందిలే అని అప్పటికి ఊరుకున్నది. భరత్‌ను ఎత్తుకుని, యమునను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆటలు మొదలుపెట్టింది స్నేహలత. నిజంగా పసిపిల్లలు ఎంత నిష్కల్మషంగా వుంటారు! విరిసిన పువ్వుల్లాంటి వాళ్ళ ముఖాలు, చిన్నారి చిలిపి చేష్టలూ చూసి మురిసిపోని మనసుంటుందా? అనిపించింది. తనూ ఓ పాపని పెంచుకుంటే అనిపించింది. అమ్మ గోల పెట్టేస్తుంది. ఎక్కువ టైం తనింట్లో వుండదు. మళ్ళీ పసిపిల్లను తెచ్చి పెంచుకుంటే తన ఆలనాపాలనా అంతా అమ్మే పనివాళ్ళ సాయంతో చూడాల్సి వుంటుంది. అమ్మ ఇప్పుడసలే కోపంగా వున్నది. తరువాత కొన్నాళ్ళు పోయాకా ఆలోచిద్దాంలే అనుకున్నది.
మర్నాడు ఆదివారం. స్నేహలత ఇంట్లోనే వున్నది.
“అక్కా! ఈ రోజే రిసెప్షన్. మాతో పాటు నువ్వూ రా. నాన్నగారికి కూడా ఇన్విటేషన్ వున్నది. మనకి దగ్గరి బంధువులే కదా వాళ్ళు. అమ్మా నాన్నగారు ఎలాగూ మాతో పాటు వస్తున్నారు. పిల్లల్నీ తీసుకెళదాం. ఒక్కదానివీ నువ్వింట్లో వుండి ఏం చేస్తావ్? ఏదో ఫార్మాలిటీగా కనిపించి వచ్చేద్దాం” అంటూ బలవంతానా స్నేహలతను బయల్దేరదీశాడు.
ఏర్పాట్లు బాగా చేశారు. అక్కడంత ఎక్కువగా యూనివర్సిటీ స్టాఫ్ కనబడుతున్నారు. వాళ్ళ కోసమే ఈ రిసెప్షన్ ఎరేంజ్ చేసినట్లుంది. బౌద్ధ స్టడీ సెంటర్ స్కాలర్స్‌లో కొంతమంది థాయ్‌ల్యాండ్ వాళ్ళూ, శ్రీలంక వాళ్ళూ వున్నారు. వాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఏర్పాట్లు చూస్తున్నారు.
పెళ్ళికూతురు తండ్రి బాగా రిసీవ్ చేసుకుంటూ అతిథుల్ని తానే స్వయంగా తీసుకెళ్ళి మరీ కూర్చోబెడుతున్నారు. పిల్లలతో సహా మరదలు చుట్టాల మధ్యలో కెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నది. ఇంతలో ఒకతను యమున నెత్తుకుని, వర్ధన్ భార్యతో కలిసి మాట్లాడుతూ వీళ్ళ దగ్గరకొచ్చాడు. వర్ధన్ భార్యే తనవాళ్ళను పరిచయం చేయడానికి తీసుకువచ్చినట్లుంది. పెళ్ళికూతురుకు పెదనాన్న కొడుకవుతాడట. తనకీ అన్నయ్యే అవుతాడని చెప్తున్నది. పెద్ద పెద్ద మీసాలు, ఎత్తుగా బొద్దుగా వుండి ప్రతీదీ నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా వున్నాయి అతని చూపులు.
“నాన్నగారూ! ఈయన అశోక్ గారు. ఐ.జి.గా మన ఏరియాలో పని చేస్తున్నారు. యమునకు మామయ్య అవుతారు. ట్రాన్స్‌ఫర్ మీద మన జిల్లాకొచ్చారు. అక్కడికొచ్చిన దగ్గర నుండీ బాగా పరిచయంగా వుంటున్నాం” అని వర్ధన్ తన తల్లిదండ్రులనూ, అక్కనూ పరిచయం చేశాడు. అతడి ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదు. స్నేహలతా, అశోక్ ఇద్దరూ తమ తమ ఉద్యోగ విషయాల గురించి రెండు నిముషాలు మాట్లాడుకున్నారు.
ఇంతలో ఎటువైపు నుంచి వచ్చాడో గాని మహంతి “హలో మేడమ్” అంటు వీళ్ళున్న దగ్గరకు వచ్చాడు.
(సశేషం)