బంధాలు

2
2

[dropcap]సె[/dropcap]ల్ రింగవడంతో బద్దకంగా కళ్ళు తెరిచాను. పొద్దునే ఫోన్ ఎవర్రా బాబు అనుకుని చూస్తే మా అక్క.

“హలో, చెప్పక్కా” అన్నాను ఏంటబ్బా పొద్దునే చేసింది అని ఆలోచిస్తూ.

“తమ్ముడు, నాకొక ఉపకారం చేసిపెట్టాలి రా.”

‘ఏం అడుగుతుందో ఏంటో? కొంపదీసి అప్పు అడగదు కదా’ మనసులోని మాట బైట పడకుండా, “చెప్పక్కా, నా దగ్గర మోహమాటం ఎందుకు?” అన్నాను.

“నేనా మధ్య డబ్బులు అవసరం పడి నా బంగారం అంతా ఒకరి దగ్గర తనఖా పెట్టానురా. వడ్డీ కూడా ప్రతి నెలా ఇచ్చేస్తున్నాను. వాళ్లకిప్పుడు డబ్బులు అవసరం అటరా. పీక మీద కూర్చున్నారు. లక్ష రూపాయలు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి.”

గొంతులో వెలక్కాయి పడినట్లయ్యింది నాకు. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎప్పుడు ఇస్తుందో తెలియదు. అసలు ఇస్తుందో లేదో కూడా తెలియదు. అసలు అనవసరంగా ఫోన్ ఎత్తాను నన్ను నేను తిట్టుకోసాగాను.

“అంత డబ్బంటే.. ఇప్పటికిప్పుడు….” నసిగాను.

“అదికాదురా, నాకు తెలుసు నీకు డబ్బులుకి ఇబ్బంది అని. నా బంగారం మొత్తం ఎనిమిది తులాలు. ఏదో బాధ పడి ఆ లక్ష ఇచ్చి, ఆ బంగారం విడిపించి నీ దగ్గరే ఉంచుకో. ఆ వడ్డీ ఏదో నీకే ఇచ్చేస్తా. మెల్లగా నీ దగ్గర నుండి విడిపించుకుంటా. అవతల వాళ్ళ కన్న నీ దగ్గరే ఉంటే మేలు కదా. కాస్తా సాయం చేసి పుణ్యం కట్టుకోరా.”

“నాకు ఒక గంట టైమ్ ఇవ్వు. ఎక్కడైనా వ్యాపగిస్తాను” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

 ఎప్పుడొచ్చిందో గాని నా శ్రీమతి నా ఫోన్ వినినట్లుంది. కానీ విననట్లుగా ‘ఏంటంట’ని అడిగితే విషయం చెప్పాను.

“ఏమండీ! మనం ఆ బంగారం విడిపించుకుందాం. ఆవిడ మరలా మన దగ్గర విడిపించడం కల్ల. ఆ బంగారం మనకు మిగిలి పోతుంది. ఎనిమిది తులాలు అంటే సుమారు ఎలా లేదన్న రెండు లక్షలు ఉంటుంది. మనం ఇచ్చేదీ ఒక లక్ష కదా. ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే మనకు లక్ష మిగులు. ఇస్తే నెల నెలా వడ్డీ వస్తుంది. ఎలాగైనా మనకు లాభమే.”

నా శ్రీమతి మాటలు వింటే నిజమే కదా అనిపించింది. అక్క అంటే సొంత అక్క కాదు. ఏదో దూరపు బంధువు. వాళ్ళాయన ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకుంటున్నడని, లేదు లేదు ఈవిడ పెట్టె బాధలు పడలేక ఎటో వెళ్లిపోయాడని మరికొందరు అంటారు. పిల్లా జెల్లా ఎవరు లేరు. ఒంటరిగా వైజాగ్‌లో ఉంటుంది. ఒంటరి కాబట్టి ఎలాగైనా ఆ నగలు సొంతం చేసుకోవచ్చని పాచిక వేసాను.

అక్కకు ఫోన్ చేసి డబ్బులు పట్టుకొని నేను మా ఆవిడ వైజాగ్ వస్తున్నామని చెప్పాను.

మేము వెళ్ళిన తరవాత అక్క అవతల వాళ్ళకి ఫోన్ చేసి, డబ్బులు ఇచ్చేస్తాం బంగారం తెమ్మని చెప్పింది.

ఒక అరగంట తర్వాత ఒకతను నల్లని బాగ్‌తో వచ్చాడు. పరస్పర పరిచయాలు అయ్యాకా బాగ్ ఓపెన్ చేశాడు.

రెండు జతల గాజులు, ఒక లక్ష్మి దేవి ఉంగరం, మూడు పేటల గొలుసు ఉన్నాయి. వాటిని చూడగానే నా శ్రీమతి కళ్ళు మెరిసాయి. అక్క అన్నీ చెక్ చేసుకొని అన్నీ సరిపోయాయి అన్న తర్వాత లక్ష ఆయనకి ఇచ్చి, నగలు తీసుకున్నాం. ఆయన వెళ్లిపోయాక అక్క వంట చేస్తే భోజనం చేసి, బయర్దేరబోతుంటే “తమ్ముడు, సమయానికి ఆదుకున్నావు రా, నీ మేలు ఎలా మర్చిపోగలను” అంది అక్క.

“అందేంటి అక్క, ఎంతైనా నేను నీ తమ్మున్ని కాదా” అన్నాన్నేను.

“తమ్ముడు! నాదొక కోరికరా. ఆ లక్ష్మి దేవి ఉంగరం నాకు సెంటిమెంట్‌రా. ఆ ఉంగరం నాకిచ్చి మిగతావి మీరు తీసుకెళ్ళండి రా” అని ప్రాధేయపడింది. నాకు తెలుసు అది అక్క పెళ్ళికి మా పెద్దమ్మ పెట్టిన ఉంగరం. నా శ్రీమతి కనుల అనుమతితో “ఎంత మాట అక్కా, ఇంద తీసుకో” అంటూ ఉంగరం ఇచ్చి, మా వూరు బయల్దేరాము.

ఓ నెల తర్వాత అక్క ఫోన్ చేసింది. “తమ్ముడు ఏమనుకోవద్దు. డబ్బులు లేక వడ్డీ ఇవ్వలేక పోతున్నాను. మీ బావ కేరళలో ఉన్నాడని తెలిసింది. నేను కూడా మీ బావ దగ్గర కు వెళ్లిపోతున్నాను. నీకు ఇవ్వాల్సిన లక్ష మరి ఇవ్వలేను. నువ్వా బంగారం ఉంచేసుకో. అక్కగా నా కానుక అనుకో. బై” అని ఫోన్ పెట్టేసింది.

విషయం విన్న నా శ్రీమతి ఆనందం పట్టలేకపోయింది. “ఎలా లేదన్న ఎనభై, తొంభై వేలు మిగులు మనకి” అంది.

“ఏమండీ! మీ అక్క ఇచ్చిన నగలు ఇచ్చేసి లేటెస్ట్ మోడెల్ నగలు తీస్కుందాం” అన్న ప్రోపోజల్‌కి సరేనని బంగారం షాప్ కు వెళ్ళాం. వాళ్ళు అక్క నగలు పరీక్షించి ఇవన్నీ గిల్ట్ నగలని తేల్చిచెప్పారు. మిన్ను విరిగి మీద పడినట్లయ్యింది. తర్వాత తెలిసింది అక్క, ఆ నగలు తనఖా పెట్టికున్నట్లు నటించిన అతను కలిసి విసిరిన వలలో నేను చిక్కుకున్నానని.

అసలైన ఉంగరం అక్క తీసేసుకొని గిల్ట్ నగలు మాకు అంటగలిపిందని. మోసం చేసిన అక్కది తప్పా? ఒంటరి కాబట్టి నగలు చవకగా కొట్టేద్దాము అనుకున్న నాది తప్పా అనే ప్రశ్న నాలో కలిగింది. ఎప్పుడో చదివిన వాక్యం గుర్తుకువచ్చింది ‘మానవ సంబధాలన్నీ ఆర్ధిక బంధాలే’ అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here