గోవు

0
3

[dropcap]పొ[/dropcap]ద్దున్నే గుడిసె ముందు వాకిలి ఊడుస్తున్న సిరిగిరి లచ్చికి దూరంగా మంచులో ఎవరో వస్తున్నట్టు మసకగా కన్పించింది. దగ్గరైన తర్వాత చూస్తే అయ్య, అమ్మ. చాలా రోజుల తర్వాత అయ్య అమ్మను చూసి చాలా సంబరపడింది లచ్చి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి గుడిసె ముందు ఈతసాప పరిచింది. తముళ్ళు, చెల్లెళ్ళు గురించి పేరు పేరునా కుశలాలు అడిగింది. గుడిసెలో నిద్రపోతున్న పిల్లల్ని లేపింది. పొయ్యిమీద గిన్నెలో అంబలికి ఎసరు పోసింది. పెనిమిటి సిరిగిరి వీరన్న ఊర్లో పెద్ద ధర్మరెడ్డి బిడ్డపెళ్ళికి ఈత సాపలు ఇచ్చిరావడానికి పొద్దున్నే ఊళ్ళోకి వెళ్ళాడు. వస్తూ వస్తూ బియ్యం తీసుకొస్తాడు మధ్యాహ్నానికి, అందుకే ఇప్పుడు జొన్నరొట్టెలు చేసింది. ఎవ్వరు చూడకుండా పక్కచేలో కెళ్ళి ఇంత కొయ్యిగూర బరుకొచ్చి కూరచేసి అమ్మ, అయ్య, పిల్లలకు జొన్నరొట్టెలు కూరపెట్టి తను ఇంత తిని పెనిమిటి కోసం ఎదురు చూస్తూ అమ్మ అయ్యతో కలిసి ఈతసాప అల్లుతూ మాటలు మొదలు పెట్టింది.

సంక్రాంతి రోజులు మొదలైనందుకు పక్కఊరిని నిద్రలేపడానికి (ధనుర్మాసంలో బుడిగె జంగాలు తమ జానపద ప్రదర్శన కళలతో ఆట పాటలతో ఇల్లిలు తిరిగి నలబై రోజులు వారిని నిద్రలేపి సంక్రాంతి రోజు ఇల్లిలు తిరిగి భిక్ష అడుగుతుంటారు). ఆ ఊర్లో దిగారట. దగ్గరేకదా అని బిడ్డను చూడడానికి వచ్చారట. ఇలా మాటలు సాగుతుండగా ఊర్లోకెళ్ళిన అల్లుడు సిరిగిరి వీరయ్య వచ్చాడు. గుడిసె ముందు కూర్చున్న అత్త కడమంచి శాంతమ్మ, మామ కడమంచి కనకయ్యను “బాగున్నారా?” అని పలకరించి గుడిసెలో కెళ్ళి భార్య లచ్చిని పిల్చి తొందరగా అన్నం వండమని చెప్పి, తమ పెంపుడు కోళ్ళలో మంచి పుంజు నొక్కదాన్ని కోసి పొతం చేసి వండమని భార్యకిచ్చి, అత్తమామల కోసం “కల్లులొట్టి” దింపడానికి దగ్గరలో ఉన్న తాటి వనంలో ఉండే గౌండ్ల మల్లయ్య ఇంటివైపు వెళ్ళాడు. భర్త ఆ వైపు వెళ్ళడం చూసి లచ్చి భయపడింది. ఆమె భయం. భర్త కల్లులొట్టి తెస్తాడని కాదు, అందరు కల్సి ఆ కల్లు తాగుతారని కాదు. ఆమె భయం అంతా కల్లు తాగిన తర్వాత తండ్రి పడే గొడవగురించే. చిన్నప్పటినుంచి చూస్తుంది. తాగనప్పుడు కనకయ్య ఎంత మంచివాడో తాగితే మాత్రం మనిషికాడు. తాగనప్పుడు ప్రాణమంటి మనిషినైనా, తప్పతాగితే ఇరగతిట్టి గొడవపెట్టుకుంటాడు.

లచ్చికి ఎందుకో చప్పున రంగడు గుర్తుకు వచ్చాడు. రంగడు తన చిన్నప్పటి నేస్తగాడు. భారతకవి అడివయ్య మామ కొడుకు. తను పుట్టి బుద్ది ఎరిగిన కాన్నుంచి అయ్య, అడివయ్య మామ ఇద్దరు మేళగాళ్ళు. అడివయ్య మామ ముగ్గురు తమ్ముళ్ళతో పాటూ అయ్యకూడా వాళ్ళ భాగోతం మేళంలో ఉండి వాళ్ళతో కలిసి భాగోతాలు ఆడేవాడు. చిన్నప్పుడు తను రంగడు కలిసి అడవికెళ్ళి కట్టెలు ఏరుకొచ్చేవాళ్ళు. ముందు పెద్ద కట్టెలమోపు ఎవరు ఎరుతారో అని ఇద్దరు పోటీ పడేవారు. ఎప్పుడు తనే ముందు పెద్ద మోపు కట్టేది. కట్టెలు ఏరడం లాంటి పనుల్లో రంగడు వెనుకబడిన భాగోతంలో మాత్రం బాలకృష్ణుని వేషం బాగా రక్తి కట్టించేవాడు. ఎర్రగా బొద్దుగా ఉండే రంగణ్ని ఆ వేషంలో చూసి చాలమంది అమ్మగార్లు ముద్దు పెట్టుకొనేవారు. అడివయ్య మామ చెయెత్తు మనిషి. రాజు వేషగాడు. ఆయన వేషం కడితే జనం మెచ్చుకునేవారు. భాగోతం తర్వాత ఊళ్ళో వాళ్ళు మామను ప్రత్యేకంగా ఇంటికి పిల్చి డబ్బో, ధాన్యమో, పాత బట్టలో ఇచ్చి పంపేవారు. అటువంటి మామ అంటే అయ్యకు కొంచెం భయం కూడా ఉండేది. ఒకనాడు మామ రంగడికి నన్ను చేసుకుంటానని అడిగేసరికి అయ్య సంతోషంగా సరేనన్నాడు. మా బుడిగె జంగాల కులాచారం ప్రకారం ఇంటిపిల్ల అని మామ నాకు ఏడు రుపాయలు ఓలికట్టి బిరాడు (బుద్ధ జంగాల ఇండ్ల సమూహం) లో ఉన్న జంగాలందరికి ఇంటికి రెండు ముంతలు చొప్పున కల్లు ఇచ్చి, తునకల బువ్వపెట్టి మాపెండ్లి చేసిండు. అడివయ్య మామ భార్య మల్లమ్మత్త. మా మంచి మనిషి. బుడిగె, తంబూర, వంతలను వెంట బెట్టుకుని ఊర్లో ఇంటింటికి తిరిగి కథలు చెప్పేది. అత్త గొంతు తీగ స్వరంలాగా సన్నగా, మధురంగా ఉండేది. ఆమె కథ చెప్తుంటే ఎంత పాపిష్టి వాడైనా అత్తకు మాత్రం పైసలిచ్చి పోయేవాడు. పెళ్ళి తర్వాత తను అత్తకు కథలు చెప్పడంలో గుమ్మెటతో వంత పాడేది. అట్లా తను అత్త దగ్గర బొబ్బిలికథ, కాంభోజరాజు కథ, ఇట్లా ఎన్నో కథలు నేర్చుకుంది. రంగడు కూడా తన్ను బాగా చూసుకునేవాడు. నాలుగేళ్ళు గడిచాయి. ఇద్దరు పిల్లలకు తల్లైంది తను. పెళ్ళి తర్వాత అయ్య బాగా మారిపోయిండు. అది వరకు మామ అంటే భయపడేవాడు. ఇప్పుడు సరికి సరిగా మాట్లాడేవాడు. ఒకరోజు బాగా తాగి మామను బాగా తిట్టి కొట్లాట పెట్టుకుండు. తెల్లారేసరికి మా పిల్లను బాగా సూస్తలేరని నన్ను తీస్కపోయి మల్లేస్కుండు. (పెళైన కూతురిని అత్తారింటికి పంపకుండా పుట్టింట్లో వుంచడం) కులపెద్దలు వాండ్రాసి అంజయ్య, మోటం ఇస్తారి. ఇప్ప దస్తగిరి వచ్చిను. పంచాయితి పెట్టిండ్రు అయ్య మామను తిట్టిండు, మామ అయ్యను తిట్టిండు చివరకు మాట మాట పెరిగి పిల్లను పంపనంటే పంపను అని అయ్య మొండికేశిండు. పంపకుంటే సరే నాకొడుక్కి రాజాలాంటి పిల్లని తెచ్చి పెళ్ళి చేస్తా అన్నాడు మామ కొపంతో. పెద్ద మనుష్యులు ఈ మాట గట్టిగా పట్టుకొని పిలగానోళ్ళు పిల్లను వద్దు అంటున్నారు కాబట్టి. పెళ్ళి రద్దు అయ్యినట్టే దండగ కింద పిల్లకు 5 వేలు కట్టాలి. ఇద్దరు పిల్లలు మాత్రం తండ్రి దగ్గర ఉండాలని నిర్ణయం చేశారు. మాట పట్టింపునకు పోయిన మామ అప్పటికప్పుడు ఐదువేలు తెచ్చి అయ్యకిచ్చిండు. నన్ను ఇడిసిపెట్టిండు. కల్లు సారలు తాగిన కులపెద్దలు పైసలు తీసుకొని వెళ్ళిపోయినారు. మొగోళ్ళంతా కల్లుకు పోయినాక మల్లమ్మత్త నన్ను అమ్మను పట్టుకుని ఒకటే ఏడిసింది. అమ్మ ఒక దిక్కు ఏడుస్తుంది. ఇక నా దుఃఖానికైతే అంతేలేదు. ఈ సంబంధం తెగిపోవడం మా ముగ్గురు ఆడోళ్ళకు ఎంత మాత్రం ఇష్టంలేదు. చివరకు అత్తమ్మ తేరుకుని ఆడోళ్ళు ఎంత చెప్పినా వినకపోయిరి. ఆ మొగోళ్ళమీద మన్నుపోయ్య, ఆ పెద్దమనుష్యుల మీద మన్నుపోయ్య తల్లికి బిడ్డలకు ఎడవాపిను అని సాపేనలు పెడూ పొర్లి పొర్లి ఏడ్చింది. ముగ్గురం ఆడోళ్ళం ఒకరినొకరు ఒదార్చుకున్నాం. కొద్దిసేపటికి రంగడొచ్చిండు. నన్ను చూసి వాడు, వాడ్ని చూసి నేను ఏడవబట్టినం. అన్ని ఒక ఎత్తుకాని నా ఇద్దరు కొడుకులు వాలి, సుగ్రీవులను వదిలి పెట్టాలంటే పొర్లి పొర్లి ఏడ్చాను. చిన్న పిల్లాడు సుగ్రీవుడు ఏడాదిన్నర పిల్లగాడు ఇంక పాలైనా మరవలేదు. వాడ్ని వదిలి పెట్టి ఉండాల్సిన కర్మ పట్టినందుకు నన్ను నేనే తిట్టుకున్నా. పంచాయితి అయిన రోజే మామ బిసాన (సామాను) సర్దుకొని, గుడిసెకట్టుకొని వేరే ఊరికి వెళ్ళి పోయిండు. రంగడు పిల్లలు వెళ్ళిపోయినాక మోడులాగ నేను మిగిలిపోయినా, పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడు పొర్లి పొర్లి గుండెలు పగిలేలా ఏడ్చేదాన్ని. చంటోడు గుర్తుకొస్తే నా చనుబాలన్నీ కన్నీళ్ళయి పోయేవి. వేరే ఊరునుంచి ఏ జంగమైనా వస్తే నా పిల్లల కుశలాల గురించి ఏమైనా కబురు తెచ్చాడేమోనని ఆరాటపడేదాన్ని. రెండు నెల్లకే రంగడు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని, ఆ వచ్చినామె నా పిల్లలను బాగా చూస్తలేదని తెల్సి ఎంత తల్లడిల్లి పోయినానో ఒక్కసారైనా నా పిల్లలను చూసి రావాలని అనిపించేది కానీ ఎట్ల వీలవుతుంది.

రోజులు గడుస్తున్నాయి, గుండెరాయి చేసుకున్నా. పొద్దున్నే లేచి ఈతకమ్మ చీరి పట్టె అల్లి సాపచేసి ఊళ్ళోకెళ్ళి అమ్ముకరావడం కమ్మలేనినాడు బుడిగె, తంబురాలను తీసుకొని చెల్లెను వెంటబెట్టుకొని ఏ బొబ్బిలికథనో చెప్పుకుంట ఇల్లిల్లు తిరిగి బిచ్చం అడుక్కురావడం నా పని. ఈ అడుక్కొచ్చిన పైసలు, సాప అమ్మిన పైసలు అణాతో సహా లెక్క చెప్పి అయ్యచేతిలో పెట్టాలి. అట్లా పెట్టకపోతే అయ్య కొట్టి సంపుతడు. నేను, అమ్మ చెల్ళెళ్ళు, తముళ్ళు తెచ్చిన పైసలు తీస్కపోయి అయ్య చిత్తుగా కల్లుతాగి నోటికి వచ్చిన తిట్లని తిట్టి అందరితో జగడాలు పెట్టుకొనేవాడు. వాళ్ళు ఈయన మీద పుల్లకట్టి పంచాయితి ఆడేవారు. కులపెద్దలు అయ్య అన్న చిన్నమాట పట్టుకొని దండగ కట్టమనేవారు. అయిన ఖర్చంతా భరించమనేవారు. సంపాదించిన డబ్బులన్ని అయ్య పంచాయితీలకే ఖర్చు అయ్యేవి.

సంచారజాతి అయిన మాకు ఒక ఇల్లు అంటూ లేదు. గడిచినన్ని రోజులు ఒక ఊరు చొప్పున, ఊర్లు తిరుగుకుంటూ పోయేవాళ్ళం. ఒక ఊరిలో మాకు సాటి జంగం పస్తం రాములు పరిచయం అయ్యిండు. భార్య సచ్చిన రాములుకు నా అన్న దిక్కేవరు లేరు. ఒక్కడే ఉండేవాడు. మగదక్షత లేని మా కుటుంబానికి రాములు సాయపడేవాడు. ఈతకమ్మకు పోతే తనకోసం ఒక మోపు, మాకోసం ఒక మోపు కోసుకొచ్చేవాడు. షికారుకు (వేట) వెళ్తే ఉడుత దొరకని, ఉడుము దొరకని, తాబేలు దొరకని ఏది దొరికిన అందులో మాకో పాలు ఇచ్చేవాడు. రాములు ఈతసాపలు అల్లడంలో మంచి పనిమంతుడు. ఎంతో శ్రద్దగా, తొందరగా సాప అల్లేవాడు. సాప అల్లడంలో బిరాడులో అతనికి పోటీ ఎవ్వరు లేరు. ఈత తోపుకెళ్ళి ఒక ముల్లు అయినా ఇరగకుండా ఈతాకు తీసుకొచ్చి దాన్ని చీరి ఎండేసి, రెబ్బి ముదురాకులన్ని వేరు చేసి తీర్లు తీర్లుగా సాపలల్లేవాడు. రాములు అల్లిన సాపలు చాలాకాలం చిరిగిపోకుండా బందోబస్తుగా ఉంటాయని ఊర్లో వాళ్ళ నమ్మకం. అందుకే రాములు సాపలకు మంచి గిరాకి ఉండేది. రాములు షికారికెళ్ళిన ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకురావడమో కాని ఉత్తి చేతులతో వచ్చేది లేదు. రాములు దగ్గర రకరకాల షికారి పనిముట్లు ఉండేవి.

ఇలాంటి రాములు ఒకరోజు కాసిపోసే ఆడ దిక్కులేదు నన్ను పెళ్ళి చేసుకుంటా అని అయ్యనడిగిండు. బాగా మందుమీదున్న అయ్య లచ్చికిది మారు మనువు కాబట్టి పదివేలిచ్చి చేసుకో, ఇంకో విషయం నా బిడ్డ నాకళ్ళముందే ఉండాలి. మేం ఏ వూరు వెళ్ళిన మీరు మాతో పాటు రావల్సిందే. పిల్లనిచ్చిన అత్తమామలకు మంచి చెడ్డలు. మాంసం, కల్లు, సారా అన్ని నువ్వే చూసుకొని నా వెంట మ్యార తిరగాలి అన్నాడు. అయ్య మాట ప్రకారం రాములు పదివేలిచ్చి కుల పెద్దల ముందు నన్ను శిరైక (రెండవ పెళ్ళి) చేసుకున్నాడు. రాములుతో పెళ్ళి తర్వాత జీవితం బాగాసాగింది. రాములు నన్ను బాగా చూసుకునేవాడు. ఎప్పుడైనా నా పిల్లలు గుర్తొచ్చి బాదపడితే ఓదార్చేవాడు. మొదట్లో పిల్లలకోసం నేను పడే బాద సూడలేక తిరిగి తిరిగి వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నారో జాడ కనుక్కొని జాతరకు నన్ను ఆ ఊరికి తీసుకపోయి అక్కడ నా పిల్లలతో కల్పించాడు. అయ్యకు కావల్సినప్పుడల్లా కల్లు సారలు పోయించి యాటకెళ్ళినప్పుడు ఆయనకో పాలు యేసి, ఈతకమ్మ కెళ్తే కమ్మతెచ్చి ఇట్లా శానా రకాలుగా అయ్యను తృప్తి చేసినాడు. తప్పతాగి అయ్యతిట్టినా పట్టించుకునేవాడు కాడు. ఐదు సంవత్సరాలు గడిచినయి. కిష్టప్ప, చుక్క ఇద్దరు పిల్లలు పుట్టినారు. ఆ పిల్లలను చూసి రాములు బాగా సంబరపడేవాడు. చుక్క ఆర్నేల పిల్లగా ఉంది. ఆరోజు రాములు ఎప్పటిలాగే యాటకెళ్ళి ఉడుము పట్టుకొచ్చిండు. అంతకుముందు రోజే అయ్య, అమ్మ, పిల్లలంతా కలిసి పక్క ఊర్లో జాతరకు పోయిండ్రు. రేపు వస్తారని యాట మాంసాన్ని మేమే వండుకున్నాం. అప్పుడే వచ్చిన అయ్య అందులో మాకు పాలేందుకు వెయ్యలేదని చిత్తుకొట్లాడిండు. ఎంత చెప్పినా వింటలేడని రాములుకు కోపం వచ్చింది. ఇద్దరికి మాట మాట పెరిగింది. అయ్య మళ్ళీ నన్ను వెనకేసుకున్నడు. కుల పెద్దలోచ్చారు. కప్పల తక్కెడ లాంటి పంచాయితి. నేను ఎంత మొత్తుకున్నా వినలేదు. మా పెళ్ళి విడాకులు చేసిండ్రు. రాములు అయ్యకు దండగ కింద పదిహేనువేలు కట్టాలని తీర్మానించి పోయిండ్రు. ఈ తీర్మానం తప్పితే మళ్ళీ దండగతో పాటు అయిన ఖర్చు కూడా భరించాలి అన్న కుల పెద్దల మాటకు కట్టుబడి, భయపడి రాములు పిల్లలను తీసుకొని ఏడుస్తూ వేరే ఊరికి వెళ్ళి పోయిండు. పక్షి చెట్టు మీద పెట్టిన గుడ్లను పాము తిని పోయినట్లు కడుపున పుట్టిన పిల్లలను కుల పెద్దలు ఎడవాపి కన్నకడుపుకు చిచ్చు పెట్టారని దొర్లి దొర్లి ఏడ్చిన. కొన్ని రోజులకు ఈ వీరన్న దగ్గర ఇరవైవేలు తీసుకొని నన్ను ఇతనికి పెండ్లి చేసిండు అయ్య. ఇక్కడ ఇద్దరు పిల్లలతో కలో గంజో తాగుతుంటే కర్మాత్ముని మాదిరిగా మళ్ళీ ఊడి పడ్డడు అయ్య ఇపుడు ఏం అవుతుందో? అని గుండెల్లో గుబులవుతుంది. గతమంతా తల్చుకునే సరికి లచ్చికి చేదు మాత్ర మింగినట్లయింది.

సాయంత్రం అయ్యింది కోడికూరతో అన్నం తిని అందరు కల్లు తాగిను. కల్లు గొంతులోకి దిగగానే లచ్చి తండ్రి కల్లు తాగిన కోతిలాగ మారిపోయి మెల్లగా కొట్లాట మొదలు పెట్టిండు. తండ్రి సంగతి బాగా తెల్సిన లచ్చి అతడేమి అన్న పట్టించుకోవద్దని భర్తకు ముందే చెప్పటం వల్ల వీరన్న మౌనంగా ఉన్నాడు. వీరన్న చర్యతో కనకయ్య మరీ రెచ్చిపోయ్యాడు. మాపిల్లను బాగా సూస్తలేవు మల్లెసుకుంటా అని తన పాతపాట మళ్ళీ మొదలు పెట్టాడు. ఎవరెంత చెప్పినా వినడంలేదు. పంచాయితీ పెట్టి నీ పరువు తీస్తా అని వీరన్నకు చెప్పి లచ్చి చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోతున్నడు. లచ్చి ఎంత మొత్తుకున్నా వింటలేడు. లచ్చికి మళ్ళీ పాతక జరగబోతుందని అర్ధమయ్యింది. ఆమె ఓర్పు నశించింది. కోపం కట్టలు తెంచుకుంది. విసురుగా చెయ్యి విడుపించుకుని దగ్గర ఉన్న కట్టె అందుకుని తండ్రిని యిరగబాదింది. “నువ్వు తండ్రివా తార్పుడు గాడివా, నాకు ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావు, ఎంతమంది పిల్లలను ఎడబాపుతావు. నీ స్వార్థం కోసం నా సంసారాన్ని నాశనం చేస్తావా. ఇక నుంచి నువ్వు నా తండ్రివి కాదు నేను నీ బిడ్డను కాను నా మానాన నన్ను బతకనివ్వు. మళ్ళీ నా ఇంటికొస్తే ప్రాణాలు తీస్తా అంటూ భద్రకాళి గుడ్లురిమి పొలిమేర దాకా తరిమికొట్టింది. కాసేపటికి ఆవేశం చల్లారాక తన ధైర్యానికి తనకే ఆశ్చర్యమేసింది లచ్చికి. ఇదే దైర్యం తెగింపు ముందే ఉంటే ఇంత మంది పిల్లలను ఎడబాయకుంటిని కదా అనుకుంది. గంగి గోవైనా తనకు హాని జరుగుతుందని తెలిస్తే పెద్దగా రంకె వేసి మనిషిపై కొమ్ము విసురుతుంది. స్త్రీ కూడా గంగి గోవులాంటిదే కానీ కోపం వస్తే, ఓర్పు నశిస్తే, భద్రకాళిలా మారి అంతుచూస్తుంది అనడానికి లచ్చి జీవితమే ఒక ఉదాహరణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here