గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 57: సత్రశాల

0
3

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 57” వ్యాసంలో సత్రశాల లోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]దై[/dropcap]దనుంచి గురజాల వచ్చి అక్కడ భోజనం చేశాం. తర్వాత అక్కడికి దగ్గరలోనే వున్న సత్రశాల మా మజిలీ. ఇది దైదకి కేవలం 10 కి.మీ.ల దూరంలోనే వున్నా, దైదనుంచి సరాసరి వెళ్ళటానికి లేదు. గురజాల వచ్చి వెళ్ళాలి. ఇది కూడా ముందు అనుకోలేదు కాని, చాలా ప్రఖ్యాతి చెందింది అంటే అక్కడిదాకా వెళ్ళాము కదా, చేతిలో కారుందని బయల్దేరాము. ఒక ఊరునుంచి ఇంకొక ఊరు అప్పటికప్పుడు అనుకుని కారులో వెళ్ళటంవల్ల నేను అన్నింటికీ సాధారణ బస్సు మార్గాలివ్వలేక పోతున్నాను. అయినా ఇలాంటి ప్రయాణాలకి మన వాహనాల్లో వెళ్ళటమే మంచిది. ఆహార పానీయాలు తీసుకు వెళ్ళవచ్చు, సమయం మన చేతిలో వుంటుంది.

సత్రశాల పల్నాడులో వీరభాగవత క్షేత్రమని పేరు పొందింది. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం మాచర్లకి సుమారు 25 కిలోమీటర్లదూరంలో కృష్ణానది ఒడ్డున వుంది.

ఇది కూడా ఆలయాల సమూహం. పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానది అందాలు… ఈ ఆలయంలో ఎంత సేపు వున్నా తనివి తీరదు. మేము వెళ్ళేసరికి సాయంత్రం 4-15 అయింది. ఆలయంలో ఎవరూ లేరు. బయట గేటు, కొన్ని ఆలయాలు తెరిచి వున్నాయి. అవే చూసొచ్చాం. తర్వాత సేకరించిన సమాచారం కృష్ణానది అవతల ఒడ్డున లక్ష్మి నరసింహస్వామి గుడి వున్నదిట. కృష్ణ దాటి అటు వెళ్ళి రావటానికి పడవలు వుంటాయట. మాకు ముందు తెలియదు. అక్కడ పడవలు కూడా లేవు. బహుశా రద్దీ సమయాల్లో వుంటాయేమో.

సత్రశాలకి ఆ పేరు రావటానికి కారణం పూర్వం ఇక్కడ మహర్షులు సత్రయాగాదులు చేస్తూ ఈశ్వరారాధన చేశారుట. అందుకనే ఆ పేరు వచ్చిందంటారు. ఇంకొక కధనం ప్రకారం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటం కోసం ఇక్కడ సత్రయాగం చెయ్యటం వల్ల ఆ పేరు అని. ఒక పుణ్యక్షేత్రముందంటే అనేక కధలుంటాయి కదండీ. అలాగే ఇంకొక కధనం ప్రకారం శ్రీరాముడు తన అస్త్రాలతో ఇక్కడ ఛత్రాకారం నిర్మించాడని అందుకే శస్త్రశాల అనే పేరు వచ్చి, అది కాలక్రమేణా సత్రశాల అయిందంటారు. ఏది ఏమైనా, మన పుణ్య భూమిలో అనేక చోట్ల పూర్వం మహాఋషులు తపస్సు చేశారనేది మాత్రం మనం నమ్మవచ్చు.

ఈ క్షేత్రం ఎక్కువగా విశ్వామిత్రుడి కథనంతో ముడిపడి వుంది. ఆయన గురించి చెప్పే ఒక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు వాలవట. దానికి చెప్పే కధ .. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటానికి ఇక్కడ యాగం చేశాడన్నారు కదా. ఆ సమయంలో దైదా అనే రాక్షసుడి కొడుకైన కాకాసురుడు తోటి రాక్షసులతో వచ్చి విశ్వామిత్రుడి దీక్ష భంగం చెయ్యాలని కావ్ కావ్ అని అరవటం మొదలు పెట్టాడుట. దానికి ఆగ్రహించిన విశ్వామిత్రుడు అవి నిజమైమ కాకులని భ్రమించి ఈ నీచ కాకులు ఈ ప్రాంగణంలో ఎక్కడ వాలినా జీవము పోవుగాక అని శపించాడుట. అప్పటినుంచి ఇక్కడ కాకులు వాలవని స్ధల పురాణం.

దీనివల్ల భక్తులలో వచ్చిన ఇంకో నమ్మకం శని వాహనమైన కాకి ఈ ప్రదేశంలో వాలదు గనుక ఇక్కడ శని ప్రభావం కూడా వుండదు, ఈ స్వామిని సేవిస్తే శని దోషాలు పోతాయని. అంతేకాదు, ఇక్కడ శని దోష పరిహార పూజలు చెయ్యటంవల్ల కుటుంబ కలహాలు వుండవని, వ్యాపారం బాగా అభివృధ్ధి చెందుతుందని కూడా నమ్ముతారు. అందుకే ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ పూజలు చేయిస్తారు.

          

సత్రశాలలో మల్లేశ్వరలింగాన్ని విశ్వామిత్రుడు తను యాగం చేసే సమయంలో ప్రతిష్ఠించాడంటారు. తర్వాత క్రీ.శ.1244లో కాకతీయ సామంతుడు మహామండలేశ్వర కాయస్థ అంబదేవుడు సత్రశాలలోని స్వయంభూ శ్రీమహాదేవుని ఆలయానికి మార్గళి ఉత్సవం జరపడానికి ఏర్పాట్లు చేశాడు. దానికోసం ఆ ప్రాంతంలో వసూలైన సుంకాలను దేవాలయ ధూప, దీప, నైవేద్యాలకు ఉపయోగించాలని శాసనం చేశాడు. పాల్కురికి సోమనాథులకు సమకాలికుడైన గోదావరి మండలం పట్టస గ్రామానికి చెందిన యధావాక్కుల అన్నమయ్య ఈ పుణ్యభూమికి వచ్చి మల్లేశ్వరస్వామివారిని సేవించుచు క్రీ.శ 1164లో సర్వేశ్వర శతకము రచించి యిక్కడే సిద్ధి పొందినట్లు చెబుతారు.

ఉపాలయాలు

ఇది ఆలయాల సమూహమన్నాను కదా. ఈ క్షేత్రంలో భ్రమరాంబ, మల్లిఖార్జునుడేకాక, శివకేశవ బేధం లేదన్నట్లుగా కుమారస్వామి, వేంకటేశ్వరస్వామి, అన్నపూర్ణ, కాశీ విశ్వేశ్వరుడు, కాలభైరవుడు, చీకటి మల్లయ్యస్వామి, ఆంజనేయస్వామి, అమరలింగేశ్వరుడు, సంతానమల్లిఖార్జునుడు, చెన్నకేశవస్వామి, ఉత్తరేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి.

విశేషాలు

అతి పురాతనమైన ఈ ఆలయంలో కొన్ని విశేషాలు కూడా వున్నాయి. అవేమిటంటే….

ఇక్కడ వున్న పెద్ద ఏక శిలా నందిని కూడా ఒక విశేషంగా చెబుతారు. ఆంధ్ర ప్రదేశ్లో వున్న పెద్ద ఏక శిలా నందుల్లో ఇది ఒకటి.

ఎక్కడా లేని విధంగా ఇక్కడ బ్రహ్మ దేవుడికి కూడా ఆలయం వుండటం చూడవచ్చు.

ఇక్కడ రాములవారి గుడి ఇంకొక విశేషం. ఈ గుళ్ళో సీత వుండదు. రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వివాహం కాలేదు.

అందుకే ఇక్కడ సీత లేకుండా రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుల విగ్రహాలు మాత్రమే వుంటాయి.

ఇక్కడ నాగ శాసనాలు వున్నాయి.

 

తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పుట్టి, లాంచీల ద్వారా కృష్ణానది దాటి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో శ్రీశైలంలోలాగానే కులాల ప్రాతిపదికన సత్రాలు ఉన్నాయి. ఈ సత్రాలలో వసతి, బోజన సదుపాయాలు ఉంటాయి.

ఉత్సవాలు

ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి వ్యాస పూర్ణిమ, మహా శివరాత్రి పర్వదినాలలో ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. శివరాత్రి రోజున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకొని వచ్చి, ఇక్కడ జాగరణ చేస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.

మార్గం

గుంటూరుకు 125కిమీ మాచర్లకు 20కిమీ దూరంలో వున్న ఈ క్షేత్రానికి గుంటూరు, మాచర్ల నుంచి మాచర్ల వెళ్ళే బస్సులో పాల్వాయి జంక్షన్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోలో 6 కీమీ దూరంలో ఉన్న సత్రశాలకు చేరుకోవచ్చును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here