జీవన రమణీయం-71

1
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]మా[/dropcap] పెద్దమ్మ కూతురు లక్ష్మక్కకి పుస్తకాల పిచ్చి. అది చదవని నవల వుండేది కాదు! ఏ ఇంటికి మారినా మొదట అక్కడ దగ్గరగా లైబ్రరీ వుందా లేదా అని చూసుకునేది! మా అక్క మొదటిసారి శేషు ఫస్ట్ డెలివరీకి యూ.ఎస్. వెళ్ళినప్పుడు నాకు అక్కడి నుండి వుత్తరాలు రాసేది. వాటిలో మొత్తం అమెరికాలో జీవన విధానాలనీ, తాముండే ఇంటినీ, ఆ ఇంట్లో తమ స్టౌ మొదలైనవి వాడే తీరునీ, బజారుకి వెళ్తే ఏమేం దొరుకుతాయో అవీ, అన్నీ విపులంగా రాసేది! వాటిలో ‘సెంథిల్ చాలా సహాయాలు చేస్తాడు, మంచి అబ్బాయి కానీ, మన వంటలు పెద్దగా నచ్చవు, మితభాషీ’ అని రాసింది. సో… నేను వెళ్ళే చోట్ల గురించి, బంధువులు కాబట్టి నాకు నాకు కొంత సమాచారం వుంది. కానీ మిగతా వాళ్ళు అందరూ కొత్తవాళ్ళు… ఎలా అనుకున్నాను!

జూన్ 25న ఇంట్లోంచి, నేను చుడీదార్ వేసుకుని బయల్దేరాను. నా నడుముకి పెట్టుకునే బెల్టు, మందులూ, ఒక డ్రెస్సూ ఎందుకేనా మంచిదని హేండ్ లగేజ్‌లో పెట్టుకున్నాను. మా వారూ, మా అబ్బాయీ, మేనల్లుళ్ళూ వచ్చి రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఫ్లయిట్ ఎక్కించారు. బయల్దేరే ముందు అరవింద్ గారికీ, అక్కినేని నాగేశ్వరరావు గారికీ, రామానాయుడు గారికి కూడా ఫోన్స్ చేసి చెప్పాను… నాగేశ్వరరావు గారు “నేను నెవార్క్‌లో మా వాళ్ళకి చెప్తాన్లే అమ్మా… They will take care of you” అన్నారు. నిజంగా చెప్తారని అనుకోలేదు! అలాగే అరవింద్ గారు “ఏ ప్రాబ్లెమ్ వచ్చినా నాతో చెప్పండి” అన్నారు. ప్రాబ్లెమ్ వస్తుందని అప్పుడు అనుకోలేదు!

ఎయిర్‌పోర్ట్‌లోనే కొంతమంది అమ్మాయిలు నాకన్నా బిక్కుబిక్కుమంటూ, పెళ్ళి అయి మొదటిసారి భర్త దగ్గరకి కాపురాలకి వెళ్తున్నవాళ్ళు పరిచయం అయ్యారు. నా సూట్‌కేస్ మీద తడి చాక్‍పీస్‌తో మా శేష శైలజ అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి పెట్టాను. ఎడ్రస్ కూడా కాయితం మీద రాసి, హేండ్ బాగ్‌లో పెట్టుకున్నాను. ఇంక పాస్‌పోర్టూ, టికెట్, డాలర్సూ మొదలైనవి ఒక లెదర్ పౌచ్‌లో పెట్టి హేండ్‌బేగ్‌లో పెడుతూ వంద జాగ్రత్తలు చెప్పారు మావారు.

ఒక్కదాన్నీ అంత దూరం వెళ్తున్నాను కాబట్టి నేను మాత్రం మహా వుత్సాహంగా వున్నాను. ట్రావెలాగ్ రాయాలన్న కోర్కె కూడా మనసులో ప్రబలంగా వుండేది. కానీ ఎందుకనో రాయలేదు.. ఆ కోర్కె ఇన్నేళ్ళకి తీర్తోంది! శిరీష అనే అమ్మాయి, ఇంకో అమ్మాయీ నాతో బాటు బోస్టన్ వస్తారని తెల్సింది. మిగతా వాళ్ళు వేరే ఫ్లయిట్స్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు. అది చాలా లాంగ్ ఫ్లయిట్… తర్వాత చాలాసార్లు వెళ్ళాను గానీ అన్ని గంటలు కూర్చోలేదు… నాకు అసలే ఆపరేషన్ అవడం వలన వెన్నునొప్పి!… నాది కిటికీ సీట్… తర్వాతెప్పుడూ ఐల్ సీట్ తప్ప తీసుకోలేదు మళ్ళీ… ఎందుకంటే నా పక్కనో ఫారినర్, ఓ ఇండియన్. వీళ్ళు లేస్తే గాని నేను వాష్ రూమ్‌కి వెళ్ళలేను. వాళ్ళు మధ్యలో కూర్చుని మంచి నిద్రలో వున్నారు. లేవలేను, చాలా అవస్థపడ్డాను. ఎయిర్ హోస్టెస్‌లు మాత్రం ఠంచనుగా జ్యూస్‌లు, మిగతా ద్రవాలు (త్రాగేవారికీ) భోజనాలూ అందజేస్తున్నారు. నాకున్న ఒకే ఒక కాలక్షేపం, ఎదురుగా మానిటర్ మీద వచ్చే అమెరికా మేప్, ఎందాకా ప్రయాణం చేసాం అన్న వివరాలూ… ఇంకా ఎన్ని గంటల పాటు ఎన్ని వేళ కిలోమీటర్లు వెళ్ళాలో వివరాలూనూ! మిగతా వాళ్ళు సినిమా చూస్తున్నా, నాకు ఇంట్రెస్ట్ లేక, ఇదే చూస్తూ కూర్చున్నాను. చాలా బాగుంది ఆ ఎయిర్‌లైన్స్, ఎందుకనో తర్వాత మూసేసారు!

ఆమ్‌స్టర్‌డామ్‌లో దిగేటప్పటికీ నా కాళ్ళూ, పాదాలు బూరెల్లా పొంగి వున్నాయి. నేను దిగాకా, ఆరు గంటలు వెయిట్ చెయ్యాలన్నారు బోస్టన్ ఫ్లయిట్‌కి. నా పక్కనున్న అమ్మాయిలతో “కాఫీ తాగుదాం” అన్నాను. “పౌండ్స్‌లో ఇవ్వాలేమో” అన్నారు. “ప్రయత్నిద్దాం” అని నేను కాఫీ షాప్ దగ్గరకి వెళ్తుండగానే, ఆమ్‌స్టర్‌డామ్‍లో ఆ ఎయిర్‌లైన్స్ వుద్యోగులు “కమ్ ఇన్ ఎ లైన్” అని కొట్టినట్టు చెప్పారు. నేను బెదిరిపోయి, వెనక్కి వెళ్ళి నిలబడ్డాను. కౌంటర్‍లో ఒక నల్లజాతి స్త్రీ, చాలా పెద్ద గొంతుతో మాట్లాడ్తోంది. నేను “కాఫీ” అనగానే, “హాఫ్ ఎ పౌండ్” అని అరిచినట్టు అంది. నేను పది డాలర్ల నోటు తీసి ఇచ్చాను. చిల్లర యూకె కరెన్సీలో ఇచ్చింది… “ఐ వాంట్ ఇన్ డాలర్స్” అనబోయా… అంతే కాఫీ నా చేతిలోంచి గుంజుకుని, నా టెన్ డాలర్స్ విసిరి కొట్టింది. “వీ డోంట్ గివ్ ఇన్ డాలర్స్” అని. అంత తిరస్కారానికి, అదీ అడుగుపెట్టీ పెట్టగానే విదేశీ గడ్డ మీద… కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“Excuse me, excuse me mam… You want coffee?”అని ఓ తెల్లని కుర్రవాడు, బహుశా మా పెద్దాడి వయసు వుంటుందేమో, నన్ను అడుగుతూ దగ్గరకొచ్చి, “నాకు డబ్బులిస్తే, నేను తెచ్చిస్తా” అని సైగలు చేశాడు. నేను అతనికి డబ్బులిస్తే, కాఫీతో బాటు ఏడు డాలర్ల దాకా డాలర్లు ఇచ్చాడు. అతను అమెరికన్ అని తెల్సింది!

ఇది జరిగిన తర్వాత దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమా చూస్తుంటే, శ్రీదేవికి అచ్చు ఇలాంటి ఇన్సిడెంటే, దర్శకురాలు పెడ్తే ఆశ్చర్యపోయను ఆ తర్వాత. యూరప్‌లో కొంచెం పొగరుగానే వుంటారేమో, అందరికీ మొదటిసారి ఇలాంటి అనుభవాలే అవుతాయేమో అని సరిపెట్టుకున్నాను! అదీ మొదటి మెట్టులో నా అనుభవం.

నడుము నొప్పితో, అలాగే ఏదో పుస్తకం చదువుతూ, జరిగిన అవమానాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాను. ఎవరో నాకు కాస్త దూరంలో కూర్చుని, క్యారేజ్‌లోంచి పులిహోర తీసుకుని ప్లేట్‌లో తింటున్నారు… ఆ వాసనకి, ఒక్కరోజుకే, జిహ్వ చచ్చిపోయినట్లు అనిపించి, నాకు కొంచెం పెడ్తే బావుండ్ను! అనిపించింది. అంతలోనే ఆ ఎయిర్‌పోర్టు వాళ్లు ‘ఇలాంటివి ఇక్కడ తినకూడదు’ అని వచ్చి నిర్దయగా తీసి చెత్తడబ్బాలో వేసేస్తారేమో… వీళ్ళు తెలియక తింటున్నారు పాపం… అనిపించింది! ఏమీ కాలేదు. వాళ్ళు శుభ్రంగా తినేసారు. నాకైతే, పర్స్‌లో డబ్బులున్నా ఏదీ కొనుక్కోలేని పరిస్థితి! అలాగే ఆకలితో కూర్చున్నాను. లక్ష్మక్క ‘పెరుగన్నమో, పూరీలో తీసుకెళ్ళు… ఇమ్మిగ్రేషన్ దాకా ఫరవాలేదు’ అని చెప్పింది కూడానూ!

తెల్లవారు ఝామున మా ఫ్లయిట్ వచ్చింది. అసలు ఏది తెల్లవారుఝామో, ఏది పొద్దున్నో తెలీడంలేదు నాకు… మొత్తం ఆ 23 గంటలలో మూడు డిఫరెంట్ కంట్రీల్లో మూడు తెల్లవారు ఝాములు చూసాను!

సాయంత్రం లోకల్ టైం ప్రకారం ఆరున్నర అవుతుండగా బోస్టన్‍లో దిగాను. ఇమ్మిగ్రేషన్‌లో “ఎందుకొచ్చావ్ యూ.ఎస్.?” అని అడిగాడు. “నేను రైటర్‌ని, లిటరరీ మీట్‌కొచ్చాను…” అనీ నా ఇన్విటేషన్ లెటర్ చూపిస్తుంటే, మరి అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోవడం? ఇక్కడ ఓ ఆరు నెలలుండి, ఒ పుస్తకం రాసుకుని వెళ్ళొచ్చుగా?” అన్నాడు. “హమ్మయ్యా… అమెరికన్లు యూరోపియన్లలా కాదు అన్నమాట” అని ప్రాణం వచ్చింది.

నేను బయలుదేరేముందు శ్రేయోభిలాషులు అనబడే పెద్దలు కొందరు నన్ను భయపెట్టాలని చూసారు. “సూట్‌కేసులు పోతాయి… జాగ్రత్త!” అన్నాడొకాయన. ‘పోతాయి’… తీసేసి జాగ్రత్త అనచ్చుగా. అలాగే, “నీ పాస్‌పోర్ట్‌లో ఒక పేరుందీ, నీ ఇన్విటేషన్‌లో ఒక పేరుందీ” అని భయపెట్టారు. “ఏం కాదు” అని నేను దృఢంగా, నమ్మకంగా తలెగరేసి, ఏమీ అనుభవం లేకపోయినా, నా కుటుంబంలో అమెరికా అంత దూరదేశం వెళ్తున్న మొదటిదాన్ని అయినా, తలెగరేసి “ఫరవాలేదు… ఏం కాదు” అని చెప్పేదాన్ని! మొదటి నుండి చెయ్యదలచింది చేసేయడమే తప్ప, నెగటివ్‌గా ఆలోచించడం నాకు అలవాటు లేదు.

సూట్‌కేసులు తీసుకుని ట్రాలీలో పెట్టుకుంటే, అవి సినిమాల్లో చూపించినట్లు డబ్బులెయ్యమనలేదు! బోస్టన్‌లో ఫ్రీ అన్న మాట. సూట్‌కేసులూ, హాండ్‌లగేజ్ ట్రాలీలో పెట్టుకుని బయటకి వస్తుంటే – “రమణి పిన్నీ” అన్న మా శేషు పిలుపు వినిపించింది. పక్కన ముద్దుగా వున్న దాని మూడేళ్ళ కొడుకు అభీ “అమ్మమ్మా… అమ్మమ్మా” అని పిలుస్తున్నాడు. సెంథిల్ కూడా చెయ్యి వూపాడు.

నాకెంతో రిలీఫ్‌గా, ఆనందం నా వాళ్ళని చూడగానే కలిగింది. శేషు వచ్చి కౌగలించుకుంది. దానికి రెండవసారి ఎనిమిది నెలల గర్భం. దాని కొడుకు నన్ను చుడీదార్‌లో చూసి “షీ ఈజ్ నాట్ అమ్మమ్మా… డోంట్ లుక్ లైక్ దట్” అన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here