వ్యర్థాల నిర్వహణ “0” చేద్దామా?

2
4

[dropcap]వా[/dropcap]డేసిన పాల ప్యాకెట్ చెత్త డబ్బాలోకి, బిస్కట్ల చాకోలెట్ల రాపర్స్ చెత్తేగా తోసెయ్ చెత్త డబ్బాలోకి, కూరగాయలు పళ్ల తొక్కలు తోసెయ్ చెత్త డబ్బాలోకి, పిల్లల డైపర్లు ఎక్స్‌పైర్ అయిన మందులు వాడేసిన మందుల ఖాళీ సీసాలు, నీళ్ల బాటిల్స్, కూల్‌డ్రింక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు తోసెయ్ డస్ట్ బిన్లోకి. ఇంట్లో సందడి… ఇలా ప్రతి కుటుంబం నుంచి ప్రతి రోజు ఎంతో చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇలా ఇంటి మటుకు స్వచ్ఛత పాటించి, ఇంట్లోంచి చెత్త డబ్బాలోకి పంపుతున్న చెత్త ఏమవుతుందో తెలుసా? ల్యాండ్ ఫిల్స్‌కి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. కొన్ని ఎకరాల కొద్దీ స్థలం గుట్టలుగా పేరుకుపోయే చెత్త వల్ల వృథా అవుతోంది.

భూమి, భూగర్భ జలాలు, గాలి ప్రతిదీ కలుషితమవుతోంది….. దాని పర్యవసానమే గత వేసవిలో ఎన్నడూ లేని విధంగా మనం అనుభవించిన అతి ఉష్ణోగ్రత, దోమల సమస్య అనేక రోగాలు.

మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్ సంచులు డీకంపోజ్ అవటానికి 10-20 సంవత్సరాలు, ప్లాస్టిక్ బాటిల్ అయితే 450 సంవత్సరాలు, ఇతర ప్లాస్టిక్ వేస్టేజ్ 1000 సంవత్సరాలు తీసుకుంటాయి. ల్యాండ్ ఫిల్స్‌కి చేరిన ప్లాస్టిక్, మందులు మరియు ఇతర వ్యర్థాలు చాలా భూమిని ఆక్రమించి టాక్సిన్స్ విడుదల చేస్తాయి. మందులు భూమిలో కరిగి భూజాలలను, పరిసరాలలోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.

ల్యాండ్ ఫిల్స్ ప్రధాన సమస్య వ్యర్థాలు కుళ్ళే క్రమంలో విడుదల చేసే హైడ్రోజన్ సల్ఫయిడ్. దీని వల్ల లంగ్ కాన్సర్, శ్వాస కోశ సంబంధిత వ్యాధులు మరియు ఇతర రోగాలు ప్రబలుతాయి అని పరిశోధనలలో తేలింది. ల్యాండ్ ఫిల్స్ విడుదల చేసే నైట్రోజన్ డయాక్సయిడ్ వల్ల ఆ పరిసర ప్రాంతాలలో జన్మించే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడంతో పాటు, జనన లోపాలకు కూడా గురవుతుంటారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

నేడు ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ కాలుష్యం నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారయి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 73వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రతి భారతీయుడు ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని, ప్లాస్టిక్ బదులు జూట్, కాటన్ సంచులు ఉపయోగించాలని, దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని, వ్యాపారులు కూడా సహకరించాలని అన్నారు. జాతి పిత గాంధీ గారి పుట్టినరోజు అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం పిలుపునిచ్చారు. స్వచ్ఛ్ భారత్ తరహాలో ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా మహోద్యమం చేపట్టాలని ఇందులో ప్రతి భారతీయుడు పాలు పంచుకోవాలని అన్నారు.

మన ఒక్క ఇంటి వ్యర్థాల వల్ల ఏం కాదులే అనుకోవద్దు. గణాంకాల ప్రకారం హైదరాబాద్ (గ్రేటర్ పరిధి కాకుండా) లో మొత్తం 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కలిసి ఒక రోజుకి ల్యాండ్ ఫిల్స్‌కి చేర్చే వ్యర్థాలు అక్షరాలా 5,50,000 కిలోలు…. వీటిలో పేపర్ వెయ్యి టన్నులు ఉంటుంది. ఒక టన్ను పేపర్ తయారు చేయాలంటే 22 నుంచి 25 చెట్లు కొట్టేయాల్సి ఉంటుంది. మరి వెయ్యి టన్నుల పేపర్ తయారీకి 22,000 నుంచి 25,000 చెట్లు కొట్టేయబడతాయి. అంతటి విలువైన పేపర్‌ని మనం వృథాగా ల్యాండ్ ఫిల్స్‌కి పంపుతున్నాము. మిగిలిన వ్యర్థాలలో సగం తడి చెత్త కాగా మిగిలిన సగం పొడి చెత్త.

ఈ గణాంకాలు కేవలం హైదరాబాద్ నగరానివే, మరి మొత్తం భారత దేశ జనాభా ఉత్పత్తి చేసే వ్యర్థాలు ఎంత ఉంటాయో ఊహకందనిది. దీనికి పరిష్కారం “రెడ్యూస్, రీ యూజ్ మరియు రీ సైకిల్ ” మంత్రం. అవును మనమంతా మొదట ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, అలాగే మరల మరలా వాడాలి చివరికి రీ-సైక్లింగ్‌కి పంపాలి. ఉదాహరణకి హైదరాబాద్‌లో ఉన్న 20 లక్షల కుటుంబాలలో 10 లక్షల కుటుంబాలు మాంసాహారులు అనుకుందాం. వీరంతా వారానికి ఒకసారి మాంసం తింటారనుకుంటే, మాంసం కొనుగోలు చేయడానికి ప్రతి కుటుంబం వారానికి ఒకసారి రెండు ప్లాస్టిక్ సంచులు వాడుతుంది. అంటే వారానికి 20 లక్షల ప్లాస్టిక్ కవర్లు, నెలకు 80 లక్షలు సంవత్సరానికి 9,60,00,000 ప్లాస్టిక్ సంచుల వాడకం, వీటికి రక్తం అంటి ఉంటుంది కాబట్టి రీసైకిల్ కూడా వీలవదు. దీనికి ప్రత్యామ్నాయం మన అమ్మమ్మల కాలంలో లాగ టిఫిన్ బాక్స్ లేదా శుభ్రం చేయడానికి వీలుగా కొంచం పెద్ద డబ్బా లేదా డిష్ వాడవచ్చు.

ఒకసారి వాడిన ప్లాస్టిక్ బాటిల్స్‌ని పారేయకుండా, ప్రయాణాలు చేసినప్పుడు మరల వాడి రీయూజ్ చేయొచ్చు. ఐ.టి సంస్థలు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సంస్థలు తమ సంస్థల వ్యర్థాలకు తామే బాధ్యత వహించి రీసైక్లింగ్‌కి పంపుతాయి. అలాగే వ్యక్తులు, కుటుంబాలు తమ వల్ల ఉత్పత్తి అయిన వ్యర్థాలకు తామే బాధ్యత వహించాలి.

               

స్వీడన్, జపాన్ వంటి దేశాలు 0% వేస్ట్ మేనేజిమెంట్ సాధించాయి. 0% వ్యర్థాల నిర్వహణ అంటే “వ్యర్థాల నివారణ ద్వారా వనరుల పునః రూపకల్పన చేసి వనరుల పునర్వినియగం”. దీని లక్ష్యం చెత్త ల్యాండ్ ఫిల్స్, మరియు చెరువులకు పంపబడకూడదు, కాల్చబడకూడదు.

స్వీడన్‌లో అసలు డంప్ యార్డ్ అనేదే లేదు. ప్రతి ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు పూర్తిగా రీసైకిల్‌కు పంపబడతాయి. జపాన్ లో ప్రతి ఇంటిలో వ్యర్థాలు వేరు చేసి వాటి రకాన్ని బట్టి ఆ యా బ్యాగ్ లో వేస్తారు. ఇందుకు వారు ఉపయోగించే బీన్ బ్యాగుల సంఖ్య అక్షరాలా పదహారు. ఇళ్ల వద్ద వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే దశలోనే వాటి రీసైక్లింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది.

ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు మొత్తం ప్రారంభ దశలోనే వేరు చేయబడి, రీసైక్లింగ్ చేయబడితే మన భారత దేశం కూడా స్వీడన్ జపాన్ లాగే 0% వేస్ట్ మేనేజిమెంట్ సాధించవచ్చు. పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడవచ్చు.

ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి కొంత కాలం క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు తడి, పొడి చెత్తలను వేరు చేయాల్సిందిగా ప్రజలను నిర్దేశించారు. ఇది సరిగ్గా జరిగి ఉంటే పొడి చెత్తలో ఉండే ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలు రీ సైక్లింగ్ చేయబడి, తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేయబడే అవకాశం ఉండేది. కానీ మున్సిపల్ కార్మికులు, ప్రజల అవగాహనా లోపం వల్ల ఇది ముందుకు వెళ్ళలేదు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు అర్బన్ రీబాక్స్ ఐ టి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సమస్య పరిష్కారం దిశగా పని చేస్తున్నాయి. అర్బన్ రీబాక్స్ ఐ టి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు మన తెలుగు యువతరం సాయి కృష్ణ డీకొండ, సాయి ప్రతీక్ మరియు భరత్ బల్ల. ఇంజనీరింగ్ చదివి, అయిదు అంకెల జీతంతో పేరున్న మల్టీనేషనల్ సంస్థలో పని చేస్తున్న సాయి ప్రతీక్ వంగరి మరియు భరత్‌లకు ఉద్యోగాలు తృప్తినివ్వలేకపోయాయి. తమ సాంకేతిక విజ్ఞానాన్ని వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించాలనుకున్నారు. ఫలితమే అర్బన్ రీబాక్స్ ఐ టి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంకురార్పణ. వీరికి తోడుగా నిలిచింది ఐ టి సి సంస్థ. డబ్బుల చెల్లింపులకు, అకౌంట్‌లో డబ్బులు వేయడానికి సులువైన విధానముగా క్యూ ఆర్ బార్ కోడ్ అందరికీ తెలుసు. జి.హెచ్.ఎం.సి. సూచనలకు అనుగుణంగా ఐ. టి .సి సంస్థ సహకారంతో అర్బన్ రీబాక్స్ సంస్థ ప్రతి ఇంటికి క్యూ.ఆర్ కోడ్ లను, స్వచ్ఛ్ గృహ ఆప్ అనే అతి సులువైన అప్లికేషన్‌ను రూపొందించి, ఈ రెంటినీ అనుసంధానించారు.

వ్యర్థాల నిర్వహణకు క్యూ ఆర్ బార్ కోడ్ లను వాడటం దేశంలోనే మొదటి సారి.

ఏప్రిల్, 2019 లో రాజేంద్రనగర్ జనప్రియ అపార్టుమెంట్‌లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. కార్పొరేషన్ రీబాక్స్ సంస్థకు కావలసిన డేటా అందించడంతో పాటు ప్రజలకు మరియు స్వచ్ఛ్ ఆటో డ్రైవర్‌లకు అవగాహన కల్పించడానికి 30 NGO లను నియమించారు.

NGOలు తడి పొడి చెత్తను వేరు చేయవలసిన ఆవశ్యకతను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసాయి. తడి పొడి చెత్తలు కలిసినప్పుడు అవి కలుషితం అయి రీసైకిల్ సాధ్యం కాదు, ఒక వేళ రీసైకిల్ చేసినా కష్టమయి నాణ్యమైన ప్రోడక్ట్ రాదు. అందుకే ఇళ్ల వద్ద వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న ప్రారంభ దశలోనే వాటిని వేరు చేసే ప్రక్రియ మొదలవ్వాలి. దీనివల్ల కలుషితం తగ్గి దుర్గంధం కూడా తగ్గుతుంది.

అన్ని సేంద్రియ పదార్థాలు అనగా మనం తినే అన్ని పదార్థాలు, పూలు, ఆకులు తడి చెత్త అయితే మిగిలిన ప్లాస్టిక్, పేపర్, మెటల్స్, ఇల్లు శుభ్రం చేయగా వచ్చే డస్ట్, ఇతర వ్యర్థాలు పొడి చెత్త. ఆగండాగండి ఇంతటితో ఈ విభజన పూర్తవలేదు. తడి పొడి మాత్రమే కాకుండా ప్రమాదకరమైన వ్యర్థాలు కూడా ఉన్నాయి మొత్తం వ్యర్థాలలో హజార్దస్ వేస్ట్ శాతం 5%. అవేమిటంటే ఎక్స్‌పైర్ అయిన మందులు, వాడేసిన మందుల ప్యాకింగ్ (పన్నీలు), ఖాళీ అయిన, ఇళ్లల్లో రక్త పరీక్షలకు వాడే సిరంజీలు, దూది, ఇతర వైద్య సంబంధ వ్యర్థాలు, మరియు పిల్లలకు వాడే డైపర్లు మరో రకం. వీటన్నిటిని ఒక పేపర్‌లో చుట్టి లేదా కవర్‌లో వేసి “X” గుర్తు పెట్టాలి. ఇలాంటి వ్యర్థాలను డీల్ చేసే ఏకైక సర్టిఫైడ్ సంస్థ రాంకీ. వ్యర్థాలను మనం ఉత్పత్తి చేసే ప్రారంభ దశలోనే మన ఇళ్ల వద్దనే వేరు చేసినప్పుడు, వ్యర్థాలను 100 % రీసైకిల్ చేసే వీలుంటుంది.

చెత్త సేకరించే కార్మికుడు ప్రతిరోజూ ఆయా ఇళ్లకు వెళ్లి తన మొబైల్ ఫోన్ లోని స్వచ్ఛ్ గృహ ఆప్ ను ఆయా ఇళ్లకు ఉన్న క్యూఆర్ బార్ కోడ్ స్టిక్కర్‌ను స్కాన్ చేయడం ద్వారా ఓపెన్ చేస్తారు. స్వచ్ఛ్ గృహ ఆప్ లో ఇంటి యజమాని పేరుతో పాటు తడి పొడి చెత్త వేరు చేసారా లేదా, ఇంటికి తాళం వేసి ఉందా, చెత్తను ఇచ్చేందుకు నిరాకరించారా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారా, నెలవారీ డబ్బు చెల్లించారా లేదా వంటి ఆరు ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు. దీంతో దీనికి సంబందించిన పూర్తి డేటా నిక్షిప్తం అవుతుంది. దీని వల్ల ఇంటి యజమానితో పాటు కార్యాలయంలోని అధికారులకు వివరాలు అందుతాయి.

చాలా ప్రాంతాలలో స్వచ్ఛ్ ఆటో డ్రైవర్లు ప్రతి రోజు రావటం లేదు. ఈ యాప్ ద్వారా వారు ప్రతి రోజు వెళ్ళిందీ లేనిదీ అధికారులకు రిపోర్ట్ అందుతుంది. దానికి అనుగుణంగా వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ పద్దతిలో వ్యర్థాలు 100% రీసైకిల్ చేయబడతాయి.

పైలట్ ప్రాజెక్ట్‌లో మొదట రెండు, మూడు ఇళ్లు మాత్రమే ఆసక్తి కనబరచగా, రెండు నెలలు తిరిగేసరికి 1300 కుటుంబాలు ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నాయి. కొందరు తాము పాటించడమే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహించారు. వీరికి జి.హెచ్.ఎం.సి వారు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చారు.

కిచెన్ గార్డెనింగ్ హాబీ ఉన్నవారు చాలామంది, తడి చెత్తను ల్యాండ్ ఫిల్స్‌కి పంపకుండా తమ ఇళ్లల్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే గ్రేటర్ కమ్యూనిటీస్ విల్లాస్‌లో కూడా కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ మరియు కాంటీన్‌లో రోజుకి 500 కిలోల కట్టెలు మరియు 5 నుంచి 6 సీలిండర్లు వంట కోసం వాడేవారు. వీళ్ళు ఇప్పుడు తమకంటూ సొంత బయో గ్యాస్ యూనిట్ తయారు చేసుకొని, ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా కట్టెలు కాల్చడం వల్ల వచ్చే గాలి కాలుష్యాన్ని తగ్గించారు.

కంపోస్ట్ యూనిట్ల ద్వారా తయారు చేసే కంపోస్ట్‌ని అమ్మవచ్చు కూడా. అలాగే సూపర్ మార్కెట్‌లలో కూడా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని పాడైపోయిన కూరగాయలు, పళ్లతో కంపోస్ట్ తయారు చేస్తున్నారు.

ఐ టి సి సంస్థ తమ సామాజిక బాధ్యతలో భాగంగా చిన్నారులలో పేపర్ రీసైక్లింగ్ మీద అవగాహన కల్పించడం కోసం 2016 నుంచి పేపర్ రీసైక్లింగ్ లో చిన్నారులని భాగస్వాముల్ని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐ టి సి సంస్థ కొన్ని పాఠశాలల్లో చిన్నారులకు రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పించి, చిన్నారుల నుంచి వేస్ట్ పేపర్, ప్లాస్టిక్ మొదలగునవి సేకరించిపిల్లలకు క్రేయాన్స్, బుక్స్ వంటి ఆసక్తికరమైన బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందిస్తు బాల్యం నుంచే రీసైక్లింగ్ పట్ల ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అర్బన్ రీబాక్స్ సంస్థతో పాటు, పలువురు కార్పొరేట్ ఉద్యోగులు తమ సామాజిక బాధ్యతగా వారాంతాలలో ఉచితంగా పని చేస్తున్నారు. 2019 సంవత్సరానికి గాను జూన్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది.

వ్యర్థాలు ఇళ్లనుంచి సేకరించి రీసైకిల్‌కు పంపే ప్రక్రియలో మరో బాధాకరమైన కోణం స్వచ్ఛ్ ఆటో డ్రైవర్లు మరియు డంప్ యార్డ్స్ వద్ద చెత్త ఏరే శ్రామికులు. రాజేంద్రనగర్ డంప్ యార్డ్ వద్ద మొత్తం 20 మంది చెత్త ఏరే శ్రామికులు ఉన్నారు. వీరికి ఇదే జీవనాదారం. ఈ ప్రాజెక్ట్‌కి ముందు సామాన్యులు ఒక గంట కూడా ఉండలేని డంప్ యార్డుల వద్ద రోజంతా గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో నుంచి రీసైకిల్‌కు అనుగుణమైన వ్యర్థాలు వేరు చేస్తారు. ఈ పరిస్థితి గమనించిన అర్బన్ రీబాక్స్ వీరికి నాణ్యమైన మాస్క్, గ్లోవ్స్ మరియు షూస్ అందించారు. కార్పొరేషన్ వారు వీరి శ్రమ తగ్గించి కలుషితమైన వ్యర్థాలను డస్టింగ్ చేయడానికి డస్టింగ్ మెషిన్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు వాళ్లు తడి పొడి చెత్తలు ముందే వేరు చేయబడి రావడం వల్ల , చెత్త గుట్టల్లో కాకుండా ఒక హాల్‌లో ఫ్యాన్ గాలికి పని చేసుకోగలుగుతున్నారు. తడి పొడి చెత్తలు కలవటం వల్ల వచ్చే దుర్గందం నిరోధించబడింది. వీరి ఆదాయం కూడా పెరిగింది.

రాజేంద్ర నగర్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ రీబాక్స్, ఐ టి సి మరియు NGO ల సమిష్టి కృషి వల్ల ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయింది. ఈ ఫలితాల ఆధారంగా కార్పొరేషన్ ఎల్ బి నగర్ సర్కిల్ లోని 256 రిటైల్ షాపులకు క్యూ ఆర్ బార్ కోడ్స్ ఏర్పాటు చేసి, రిటైల్ వ్యాపారస్తులను కూడా 0% వ్యర్థాల నిర్వహణ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట్రమంతా ఈ పద్ధతిని ప్రవేశపెట్టబోతున్నారు.

అర్బన్ రీబాక్స్ ఐ టి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లక్ష్యం రానున్న రెండు సంవత్సరాలలో 0% వ్యర్థాల నిర్వహణ. చెత్త ల్యాండ్ ఫిల్స్‌కి పంపబడకుండా, రీసైకిల్ చేయబడి మరల ఉపయోగించబడాలి. దీనికోసం వీరిని సంప్రదించాలనుకునేవారు సంస్థ వెబ్‌సైట్ www.reboxit.in మరియు urbanreboxit@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

133 కోట్ల భారత జనాభా కలిసి కట్టుగా ముందుకు సాగితే సాధించలేనిదేముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here