గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 58: మాచర్ల

0
4

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 58” వ్యాసంలో మాచర్ల లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

సత్రశాలనుంచి మాచర్ల బయల్దేరాము. పల్నాటి వీరుల చరిత్రతో ముడిపడిన మాచర్లలో సుప్రసిధ్ధ చెన్నకేశవస్వామి ఆలయం వున్నది. ఈ దేవాలయం ముందు శైవ దేవాలయంగా నిర్మించబడి, తర్వాత కాలంలో వైష్ణవ దేవాలయంగా మార్చబడిందంటారు. ఆ కాలంలో శైవ, వైష్ణవ మతాల ప్రభావం ప్రబలంగా వుండేది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రధాన దేవతామూర్తులు చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు.. ఈ విష్ణ్వాలయం 13 వ శతాబ్దంలో నిర్మించబడింది.

ఈ దేవాలయం చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 11వ శతాబ్దంలో కార్తవీర్యార్జుని వంశీకులు నిర్మించారు. తర్వాత హైహయ వంశీకుల్లో ఒకరైన సాగిపేట అనుగురాజు పునర్నిర్మించారు. దేవాలయం వద్ద లభించిన శాసనాల ప్రకారం హైహయ వంశీకులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తోంది.

చరిత్ర

క్రీ.శ. 1182లో పల్నాటి యుధ్ధంగా పేరుపొందిన దాయాదుల పోరు మాచర్ల, గురజాల పట్టణాల మధ్య జరిగింది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు తీరాంధ్రలోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు వుండేదనీ, అది వాడుకలో మాచర్లగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల కథనం. తరువాత కాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంత భాగమిప్పించి, గురజాలనుండి విడిపోయి మాచర్ల రాజధానిగా పాలింపజేశాడు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. ఇంకొక కథనం ప్రకారం బ్రహ్మనాయుడు మజిలీ చేసిన స్ధలం మాచర్ల అనీ… తన స్వస్థలమైన మాచపురానికి బదులుగా బ్రహ్మనాయుడు మాచర్లను నిర్మించినట్లు పద్మనాభ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. కాలక్రమాన ఈ దేవాలయం అనేక సార్లు పునరుధ్ధరించబడింది.

ఈ ప్రాంతంలో చంద్రవంక నది తన ప్రవాహదిశను మార్చుకుని ఉత్తర వాహిని అయ్యింది. అందువల్ల ఈ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీనాధుని పల్నాటి చరిత్ర ఇక్కడి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఆయన ఆ గ్రంథాన్ని ఈ ఆలయం నుండే రచించడం ప్రారంభించాడట.

ఆలయ చరిత్ర

చెన్న కేశవాలయం గర్భ గృహం, అంతరాళం, రంగ మండపం, ముఖ మండపం, రాజ గోపురాలతో అలరారుతున్నది. రంగ మంటపములోని నాలుగు స్తంభాలపైన చోళ రాజుల నాటి శిల్పకళను ప్రతిబింబిస్తూ భారత, భాగవత, రామాయణ గాథలు అద్భుతంగా చెక్కబడ్డాయి.

ఈ ఆలయం ముందు శివాలయమని, ఆదిత్యేశ్వరాలయమనీ, తర్వాత చెన్నకేశవాలయంగా రూపొందిందనీ చెబుతారు. దానికి సంబంధించిన కధలు కొన్ని…

చెన్నకేశవస్వామి గర్భాలయం ఉత్తరంవైపు గోడకి పానవట్టం వుంటుంది. అందుకనే ముందు ఇది శివాలయమని చెబుతారు. క్రీ.శ. 1111నాటి మాచర్ల నాగస్తంభ శాసనం ఆదిత్యేశ్వరాలయ నిర్మాణం గురించి తెలియజేస్తున్నది. ఈ శాసన కాలంనాటికి ఈ దేవాలయ ప్రాంగణంలో చెన్నకేశవ ఆలయం ప్రసక్తి లేదు. ఆ విధంగానే ఇప్పుడు ఆదిత్యేశ్వరాలయం కనబడదు. ఆదిత్యేశ్వరాలయం నిర్మించిన ఆదిత్యుడు పశ్చిమ చాళుక్యుడు. చెన్నకేశవాలయంలో గర్భాలయం, అంతరాళము, దాని విమాన గోపురం, పశ్చిమ చాళుక్య శైలిలో నిర్మించారు. కనుక క్రీ.శ. 1111లో ఆదిత్యుడు నిర్మించిన ఆదిత్యేశ్వరాలయమే నేటి చెన్న కేశవాలయమని అంటారు. ఆదిత్యేశ్వరాలయం నిర్మాణ శిల్పులు నావోజు, తిప్పోజు.

మరికొన్ని వివరాల ప్రకారం క్రీ.శ. 1138లో చాగిబేతరాజు కుమారుడు అనుంగుగామరాజు రెండవ గొంకరాజు కుమార్తె మైలమదేవిని వివాహమాడి పలనాటి సీమను అరణ రాజ్యంగా పొందాడు. అనుగురాజు విష్ణు భక్తుడు. గురజాల రాజధానిగా పల్నాటిని పాలించిన అనుగురాజు సుమారు క్రీ.శ. 1140 ప్రాంతంలో మాచర్ల ఆదిత్యేశ్వరాలయాన్ని చెన్నకేశవాలయంగా మార్చియుండచ్చని అంటారు. అనుగురాజు, యూరియ కామిశెట్టి క్రీ.శ. 1142లో మాచెర్ల చెన్నకేశవునకు పూలతోట దానమిచ్చారు. అంటే అప్పటికే ఆ ఆలయం వున్నదనీ, అనుగురాజు అంతకు కొద్దికాలంముందు ఆదిత్యాశ్వరాలయాన్ని చెన్నకేశవాలయంగా మార్చివుంటాడనీ విజ్ఞుల అభిప్రాయం.

క్రీ.శ. 1560లో సూరపరాజు వెంకటరాముడు దక్షిణాభిముఖంగా లక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించాడు.

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయానికి పక్కనే శ్రీ ఇష్ట కామేశ్వర, వీరభద్ర, నాగేంద్రస్వామివార్ల ఆలయాలు వున్నాయి.

శ్రీ చెన్నకేశవస్వామి స్వామి చతుర్భుజుడు. పైన ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం, కింద ఎడమ చేతిలో గద, కుడి చేతిలో అభయహస్తంతో దర్శనమిస్తారు.

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం చైత్రశుధ్ధ త్రయోదశినాడు మాచర్ల చెన్నకేశవుని ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. చతుర్దశినాడు ధ్వజారోహణ, పౌర్ణమినాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి హనుమ, గరుడ, సూర్య, పొన్నమాను, రథ వాహనాలున్నాయ. ఉత్సవాల సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామి నగర సంచారం చేస్తారు.

రథోత్సవం

ఇక్కడి రధోత్సవం ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్రంలో రెండో అతి పెద్ద రథంగా చెన్నకేశవస్వామి రథాన్ని చెబుతారు. 1879లో దుర్గి వాస్తవ్యుడు కుచనపల్లి నారాయణ పంతులు 60 అడుగుల ఎత్తు, ఆరు అంతస్తులతో రూ.10 వేలు ఖర్చుపెట్టి చెన్నకేశవ రథం చేయించారు. 1880 ఏప్రిల్ 29న మొట్టమొదటిసారిగా రథోత్సవం నిర్వహించారు. అప్పటినుంచీ ఈ ఉత్సవం కన్నులపండుగగా సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here