అపురూప బంధం

0
3

[dropcap]“ని[/dropcap]న్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో…”

ఆహా!!! ఏమి సినిమా, ఏమి పాటలు, ఎంతటి ప్రేమ ఒకటా!! అందుకే ఈ సినిమా ఇప్పటికీ ఒక దృశ్య కావ్యం. నేను ఇష్టంగా సినిమా చూస్తున్నాను అమ్మోచ్చి టీవీ కట్టేసింది. తనకెందుకో ఈ సినిమా అస్సలు నచ్చదు. ఎందుకో అర్థం కాదు. అడిగే ధైర్యమూ లేదు. ఎంత చనువున్నా అమ్మంటే నాకెందుకో కొద్దిగా భయం.

కాలం గడిచేకొద్దీ అర్థం అయ్యింది. అమ్మకు ఈ సినిమా ఎందుకు నచ్చదో. అమ్మను నిజంగా మెచ్చుకోవాలి. నాకు ఇంత వయసు వచ్చేవరకు అసలు విషయం తెలియలేదు. అసలు ఇన్నాళ్లు ఎలా భరించిందా అనిపించింది. ఇప్పటివరకు నాన్న గారు ఎక్కువగా ఊర్లు తిరిగే ఉద్యోగం అని పైగా తను గవర్నమెంట్ టీచర్ కాబట్టి నాన్న మేము వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాము అని చెప్పింది. నిజమే కాబోలు అని నమ్మడానికి నాన్నగారు నెలకు రెండు సార్లు రెండేసి రోజులు ఉండి వెళ్లేవారు. వచ్చినప్పుడు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ముగ్గురం చాలా సంతోషంగా గడిపే వాళ్ళము. నాన్న వచ్చాడంటే నాకు పండగే.

ఇవాళ అనుకోకుండా నాన్నగారి సెల్ ఫోన్ ను ఓపెన్ చేసాను. అప్పుడప్పుడే సెల్ఫోన్లు రావడం. అందులోనూ నాన్నది కెమెరా ఫోను. ఇందాక నాన్న నావి చాలా ఫొటోలు తీశారు అవి చూద్దాం అని ఫోను ఓపెన్ చేశా… వారి వాల్ పేపర్ ఫోటో చూసి ఖంగు తిన్నాను. ఒక అందమైన ఆవిడ నాన్న పక్కన. వుండపట్టలేక ఎవరు చూడకుండా ఫోటో గాలరీ ఓపెన్ చేశా. ఆవిడతో నాన్నగారి ఫోటోలు. అవన్నీ చూడగానే మనసు మొద్దుబారిపోయింది. ఎవరో నా కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టైంది. వారిముందు ఏడ్వలేక ఫోను అక్కడే పెట్టి డాబా పైకి ఎక్కి ఎంతసేపు ఏడుస్తూ వుండిపోయానో తెలీలేదు. నాన్నగారి పిలుపుతో కిందికి వచ్చాను. ఇంటర్లో మంచి మార్కులు వచ్చినందుకు నాకో బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చారు. ఎంసెట్ బాగా రాయాలని చెప్పి వెళ్లిపోయారు. ప్రతిసారి నాన్న వెళ్లిపోతుంటే ఏదో బెంగ ఉండేది. ఈ సారి నాన్న ఎప్పుడు వెళ్తారా అని కాచుకున్నాను. ఎప్పుడూ ఫోన్లు చేసేదాన్ని. ల్యాండ్‌లైన్ నుంచి సెల్ ఫోన్లు వచ్చేదాకా. చాలా చక్కగా మాట్లాడేవారు. ఎప్పుడూ అనుమానం రాలేదు. అమ్మ నాన్న చాలా ఒద్దికగా ఉండేవారు. మరి నాకోసం నటిస్తున్నారో లేక నాన్న ఇద్దరిని సమానంగా చూస్తున్నారో తెలీదు.

ఈ ఆలోచనలతో పిచ్చెక్కి టీవీ ఆన్ చేస్తే ‘మేఘసందేశం’. ఇప్పుడు నేనే కట్టేసా టీవీ. ఎప్పుడు ఈ సినిమా చూసినా నాకు జయప్రద నాగేశ్వరావు అజరామర ప్రేమ కనిపించేది. మొదటిసారి జయసుధ పాత్ర కనపడుతోంది. అవును ఇంతవరకు ఆలోచించలేదు. తను చేసిన తప్పేంటి. భర్తకు తగ్గ ఇల్లాలే కదా. జగడాలమారో లేక కురూపో కాదుగా. మరి ఎందుకు నిర్దాక్షిణ్యంగా భార్యను వదిలి వెళ్ళిపోయాడు. ఏమో ఇన్నాళ్ల ఇటువైపుగా ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నకొద్ది అమ్మపైన ప్రేమ గౌరవం బాగా పెరిగాయి. తను మితభాషి అనుకున్నా!! కాదు ఘనీభవించిన బాధకు ప్రతిరూపం అని అర్థం అయ్యింది. నాన్న తనను వదిలి వెళ్లిన రోజు తను అనుభవించిన బాధ తలుచుకుంటుంటే గుండె చెరువవుతోంది. అమ్మను చూస్తుంటే తెలియకుండానే గుండెల్లో తడి కన్నుల్లోకొస్తోంది. అమ్మను చూసినప్పుడల్లా అనిపిస్తుంది అమ్మ ఎందుకు నాన్నను నిలదీయలేదు అని. మరి తీసిందేమో. అసలు నాన్న ఎందుకు ఇలా చేశారు. ఏంటో అన్ని ప్రశ్నలే. అడుగుదాం అంటే జవాబులు ఇచ్చేవారు ఎవరు.

ఇంటికి ఎప్పుడు నాన్న వైపు బంధువులు రాలేదు. అమ్మ వైపు మామయ్య అమ్మమ్మ వచ్చేవారు. అమ్మమ్మ పోయాక మామయ్య కూడా రావడం తగ్గించేశారు. నాన్నకు ఎవరున్నారో కూడా తెలీదు. ఎప్పుడు అడిగినా సమాధానం దాటవేత, ఇప్పుడు కనీసం తెలుసుకోవాలని కూడా లేదు. ఉన్నా చెప్పేవారు ఎవరు.. నాన్న మాత్రం ఎప్పటిలానే వచ్చి వెళ్తున్నారు. ఇది మామీద జాలో లేక తన అపరాధభావమో అర్థం కాలేదు. ఈ విషయం నాలో చాలా మార్పును తెచ్చింది. స్నేహితులు వాళ్ళు వీళ్ళు అని ఒకటే వాగుడుకాయ స్థానే తెలియని పెద్దరికం వచ్చింది. వీలైనంత ఇంటి పట్టునే వుండసాగాను అమ్మకు తోడుగా. బహుశా అమ్మకు అర్థం అయిందనుకుంటా నాకు విషయం తెలిసిపోయిందని… దాంతో మా ఇద్దరిమధ్య ఒక అపురూప బంధం ఏర్పడింది. తల్లీ కూతుర్లకు మించి ఓ అనుబంధం ఏర్పడ్డది.

ఎంసెట్‌లో మంచి రాంక్ వచ్చింది. హైద్రాబాద్‌లో మంచి కాలేజీలో సీట్ వచ్చింది. అందరు చేరమని. నాన్నైతే చాల సంతోషపడ్డారు. అమ్మ ఎప్పటిలానే ఒక నవ్వు. ఒకప్పుడు అమ్మది అందమైన నవ్వు అనుకునేదాన్ని. ఇప్పుడు అందులో జీవం లేదని తెలుసుకున్నాను. తన అభిప్రాయం చెప్పమని అడిగా. ఇప్పుడు నీవు పెద్దపిల్లవి మనసుకు నచ్చింది చెయ్యి అని చెప్పింది. నా నిర్ణయం విని అందరూ ఆశ్చర్యపోయారు కానీ అమ్మ సంతోషపడ్డదని తెలుసు. ఉన్న వూర్లోనే ఇంజనీరింగ్ చేరాను. అమ్మను ఒంటరిగా వదిలి వెళ్లబుద్ధి కాలేదు. తను ఎటు ఒంటరితనంతో సహజీవనం చేస్తోంది. కనీసం నేనైనా ఒక చిన్న తోడు అనిపించింది. మామూలే బయటకు చెప్పలేదు కానీ సంతోషపడింది తెలుసు.

చూస్తూవుండగానే నా చదువు మూడో ఏడు లోకి అడుగుపెట్టింది. అంతా మామూలుగానే నాన్న రావటం వెళ్ళటం. ఆయన మీద కోపం వున్నా తను చూపించే ప్రేమముందు ఆ కోపం ఎటుపోయేదో. చాలా సార్లు అడగాలనిపించేది మాతోనే ఉండిపో నాన్నా అని. ఒకసారి ఆడిగాకూడా… రిటైర్డ్ అయ్యాక తప్పకుండా ఇక్కడే వుంటాను అని అన్నారు.  బహుశా నాకు విషయం తెలీదు అనుకున్నారు కాబోలు…

***

ఒక ఉదయాన ఫోను. అమ్మ నేను ఆ ఊరేళ్ళము.. ఆసుపత్రి  కోన ఊపిరితో ఉన్న నాన్న క్షమించమని అమ్మను అడిగి నన్ను చూస్తూ అనంత విశ్వము లోకి వెళ్లిపోయారు. అమ్మ, నాన్న కళ్ళు మూస్తూ ఆపుకుందామన్న ఆగని కన్నీళ్లతో అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయింది. నేను మాత్రం నాన్నను పట్టుకొని చాలా ఏడ్చేశాను. నిజంగా చాలా మంచివారు. అమ్మ ఎవరి గురించో అడుగుతోంది బహుశా ఆవిడేమో. నాకు కుతూహలం వేసింది ఆవిడని చూడాలని అమ్మ వెనకే వెళ్ళాను. అప్పటికే ఆవిడ అనంతాకాశంలో నాన్నకోసం ఎదురుచూస్తూ. మరణంలో కూడా కలిసే… ఆక్సిడెంట్ ఇద్దరిని కలిపి తీసుకెళ్లింది. మేఘ సందేశంలో జయప్రద నాగేశ్వరావు మరణంలా ఒకేసారి. మరణం కూడా విడదీయలేదంటూ. ఆశ్చర్యం వేసింది. నిజంగా అజరామరమైన ప్రేమా!! ఏంటో. ఇప్పుడు కొత్తగా అదే సినిమా.

కర్మకాండలు ఎవరు చేస్తారా అని చూసా. ఈలోపు వదిన అన్న పిలుపుతో వెన్నక్కి చూసాను.. “మన కావ్యనా” అని నా వైపు చూసాడు. ఓహో చిన్నాన్న కాబోలు అని ఒక నవ్వు నవ్వాను. మొదటిసారి చూస్తున్నా! చిన్నాన్న అనబడే అతనిని. కర్మకాండలు అవి నిర్వహించారు. అమ్మ వారిస్తున్నా వినకుండా నాన్న ఇంటికి పిల్చుకెళ్లాడు బాబాయ్. మొదటిసారి నాన్న ఇంటికి. నాకే ఏమీ అర్థం కానీ భావన మరి అమ్మకెలావుందో. తను గడిచిన ఇన్ని ఏండ్లలో మనసులోని భావాలను బయటకు కనిపించుండా దాయడంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది తన మనసుని చదవడం బ్రహ్మ తరం కూడా కాదు. ఇంట్లో అడుగుపెడ్తుంటే ఎదో తడబాటు అమ్మలో… ఇల్లు చాల అందంగా వుంది. ఒక నందనవనం అనొచ్చు. ఎక్కడ చూడు ఆవిడతో నాన్న వున్న ఫోటోలు. నాకు అమ్మకు స్థానం లేదనిపించింది. అమ్మ వాళ్ళ పడక గదిలోకి వెళ్ళడానికి ఇష్ట పడలేదు. నేనైతే వెళ్ళాను. చాల అందంగా అమర్చబడివున్నాయి అన్ని వస్తువులు. ఆవిడకి మంచి అభిరుచి ఉన్నట్టుంది కాబోలు అనిపించింది. వెళ్ళబోతున్న దానిని ఒక టేబుల్ మీద నా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు వున్న అన్ని ఫోటోలు వున్నాయి. అంటే నాన్న నన్ను ఇష్టపడ్డారుకదా అని ఎక్కడో కొద్దిగా సంతోషం వేసింది.

ఈలోపు చిన్నాన్న అమ్మతో అంటున్న మాటలు వినపడి ఈ సంతోషం కూడా నీరు కారిపోయింది. అర్థం అయ్యిందేమిటంటే నాన్నతో ఆవిడకి పిల్లలు లేరు. ఒకవేళ ఉండి ఉండింటే నాన్న ఇంటికి అసలు వచ్చేవారు కాదేమో అనిపించింది. ఈ ఆలోచనతో గుండెల్లో కెలికినట్టయింది. బయలుదేరుదామని అమ్మ పిలుపు. అమ్మ వద్దని వారిస్తున్నా నాన్న ఆస్తికి వారసురాలిని నేనేనంటు ఏవో కాగితాలు అమ్మ చేతిలో పెట్టారు. ఒక్క వస్తువు కూడా తనకు వద్దని కేవలం ఇంటి తాలూకు దస్తావేజులు మాత్రం తీసుకుంది. బాబాయ్ అమ్మతో ఇంకా ఏవేవో విషయాలు చెబుతున్నాడు. అమ్మా కేవలం వింటోంది. నాకేమో ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా మా ఇంటికి ఎందుకు రాలేదు అని అడగాలనిపించింది. చిన్నపిల్లనైతే అడిగేదాన్ని కానీ తెలీని పెద్దరికం అడ్డొచ్చింది. అమ్మని జాగ్రత్తగా చూసుకొమ్మని ఆర్ద్రత నిండిన మనసుతో అమ్మను చూస్తూ చెప్పారు బాబాయ్. ఎక్కడో వారి కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్ల అన్నవాళ్లు. …. అమ్మవైపు చూసా, అదే నవ్వు నా వైపు అతని వైపు చూస్తూ. చూపులతోనే వెళ్ళొస్తాను అని బాబాయ్‌కి చెప్పి వడి వడిగా బయటకు వెళ్లిపోయింది అమ్మ… నన్ను రమ్మని సైగ చేస్తూ. ఇద్దరమే ఉన్నాము. అమ్మ జాగ్రత్త అని చెప్తున్న బాబాయ్‌ను ఇన్నాళ్లు ఎందుకు రాలేదు అని అడిగా. మీ అమ్మ అభిమానం అని ఒక బాధ్యతప్త హృదయపు నవ్వు నవ్వి తన అభిమానము ఎంతటిదంటే ఈ ఇల్లు తీసుకోవడానికి కారణం ఈ స్థలం తన తండ్రిది. పసుపుకుంకుమల కింద ఇచ్చారు అని.. చెప్పి వెళ్ళిపోయాడు.

ఒక్క మాటలో ఎన్నో భావాలు. ఇందాక నాన్నగారి పడకగదిలో కాలుమోపని తన అభిమానం ఇవాళ మనసు చూసింది. అవును నాకు తెలిసినంత వరకు తన ఎప్పుడు ఇంకొకరి జాలి దయ కోరలేదు. అమ్మ మీద మరింత ప్రేమ పెరిగింది. చాలా కఠినమైన శిల లాంటి జీవనం. అమ్మలాంటి వారికి మాత్రమే సాధ్యం. వయసులో ఉంది, అందంగాను ఉంటుంది. ఎంతోమంది చిన్న చూపుల నుంచి నేర్పుగా, ఇంత హుందాగా జీవించడం నిజంగా ఓ తపస్సు..

***

ఏంటో మొదటిసారి ఏదో కోల్పోయిన భావన. నాన్న వస్తూ వెళ్తూ ఉంటే నిజంగా సందడే. మరి అమ్మ నాన్న ఎలా వుండేవారో తెలీదు. ఇప్పుడు అమ్మ ఎలా ఫీల్ అవుతుందో కూడా తెలీదు. తెలుసుకోవాలని కూడా అనిపించలేదు. అడగడం అంటే అనవసరంగా అమ్మను బాధ పెట్టడమే.

కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. ఇవాళ చాలా శుభదినం నాకు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో చాలా మంచి ఉద్యోగం వచ్చింది. అది కాదు సంతోషం, అమ్మను ఒప్పించగలిగాను, తన ఉద్యోగానికి రాజీనామా చేసి నాతోపాటు బెంగళూరుకు రావడానికి. మొదట నేనెళ్లి ఇల్లు చూసి అమ్మను పిల్చుకెళ్లడమే. ఊర్లో అందరికీ చెప్పేసాము. అమ్మ వాలంటరీ రిటైర్మెంట్ కు అర్జీ కూడా పెట్టుకుంది. ఇక జాయినింగ్ లెటర్ రావడమే తరువాయి.

నేటికి నాన్న పోయి ఏడాది. వారి ఆబ్దికం బ్రాహ్మలతో చాలా బాగా చేయించింది నాన్నతో పాటు ఆవిడకు కూడా. కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికొచ్చామో లేదు కంపెనీ నుండి ఇమెయిల్‌లో జాయినింగ్ లెటర్ వచ్చింది.. ప్రింట్ తీసి అమ్మకు చూపాను. అంతా చదివి నన్ను హత్తుకొని ముద్దాడింది. మొదటిసారి ఘనీభవించిన హృదయం కరిగి కన్నీరయ్యింది. నాకు ఏడుపు ఆగలేదు. అమ్మ ముఖంలో ఏదో ప్రశాంతత. అలసిపోయా కాస్త పడుకుంటానంటే సరే అని నేను నా ఫ్రెండ్స్‌తో చాట్లో మునిగిపోయా. రాత్రి 8 అవుతున్నా అమ్మ లేవకపోవటంతో లేపుదామని వెళ్ళాను. అమ్మ ఎంతో ప్రశాంతంగా, ఏదో సంతృప్తి నిండిన ముఖంతో నిద్రపోతోంది. నాకు లేపాలని కూడా అనిపించలేదు. లేపినా లేవదని తెలుసు. ఇప్పటివరకు ఎంతో బరువు మోసిన గుండె ఇక మోయలేనంటూ మొరాయించింది కాబోలు శాశ్వత నిద్రలోకి జారుకుంది. అదీ నాన్న ఆబ్దికం రోజే. ఏడుపు రాలేదు. నన్ను ఒంటరిని చేసి వెళ్లిందని బాధ వున్నా అమ్మ ఇక ఏ బరువు మోయక్కర్లేదు కదా. ఈ మాట కాస్త సాంత్వనను ఇచ్చింది.

వచ్చిన బంధువులు అంతా వెళ్లిపోయారు. తోడుగా నా స్నేహితులు ఉంటామన్నారు, వద్దని వారించా. ఇకపై ఎటూ ఒంటరి ప్రయాణం. కనీసం నా మొదటి సంపాదన చూసి పోయింటే బాగుండుకదా. ఎవరిని అడిగను. చిత్రంగా నాకు ఏడుపు రావట్లేదు.. మొదటి సారి అమ్మ గది తరచి తరచి చూసా. ఇంతవరకు ఎప్పుడూ ఒకసారి కూడా తన బీరువా తెరచి చూడలేదు. బరువెక్కిన హృదయంతో మొదటిసారి ఎందుకో చూడాలనిపించింది, డైరీ లాంటివి వుంటాయేమో అని… కానీ డైరీ లాంటివి ఏమిలేవు. నాకు తెలుసు తన మనసు ఎవ్వరితో పంచుకోదని ఆఖరికి తనతో కూడా. కానీ ఒకటి మాత్రం ఆశ్చర్య పరచింది. ఒక చోట రెండువరసలుగా అందమైన గిఫ్ట్ ప్యాక్స్ కనపడ్డాయి. వాటిని తెరచి చూసిన ఆనవాలు కూడా లేదు. అందులో ఒకవరసలో ఒకటి తీసి చూసా. నాన్న అమ్మ పుట్టినరోజు నాడు పంపిన కానుకలవి. దాదాపు పదహేనుదాక ఉన్నాయి అంటే విడిపోయాక కూడా నాన్న ఇచ్చేవారు. అమ్మ భద్రంగా దాచుకుందే కానీ తెరచి చూడలేదు. ఇటువైపు వరస చూసా. అమ్మ నాన్నకు తన పుట్టిన రోజు నాడు ఇవ్వాలనుకొని ఇవ్వని బహుమతులు. నాన్న ప్యాక్ మీద సారీ అని నాన్న దస్తూరి. అమ్మ ప్యాక్ మీద ప్రేమతో అని అమ్మ దస్తూరి. ఇంతగా ఇష్టపడ్డదా అమ్మ నాన్నను అనిపించింది. ఇద్దరి ప్యాక్స్ తెరిచి చూసా… దాదాపుగా ఇద్దరివి ఒకటే. రాధ కృష్ణులు, అందమైన బొమ్మలు, అమ్మ నాన్నకు కొన్న వాచ్ నాన్న అమ్మకు కొన్న వాచ్. ఇన్ని కలిసినా వారు మాత్రం ఎప్పుడూ కలిసిలేరు. చాలా బాధగా అనిపించింది. ఎంటో కొన్ని అనుబంధాలు నిర్వచనానికి దొరకవు.

***

ఊరు వదిలి వెళ్తుంటే చెప్పలేనంత బాధేసింది. అనంత జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని బాబాయ్ సహాయంతో బెంగళూరులో కొత్త జీవితం మొదలు పెట్టాను.

కొత్త స్నేహాలు కొత్త ఉద్యోగం కొత్త ఊరు… కొత్త ఎప్పుడైనా ఉత్సాహాన్ని నింపుతుంది. నేను మినహాయింపు కాదు. ఇంటికన్నా ఆఫీసులోనే ఎక్కువ గడుపుతాను. ఎందుకంటే ఇంట్లో ఏకాంతంతో సహవాసం, వీడిపోని విడదీయలేని జ్ఞాపకాలను హత్తుకొని పడుకోవడమే. ఒక్కోసారి నవ్విస్తాయి, ఒక్కోసారి ఓదారుస్తాయి ,ఒక్కోసారి ఏకధాటిగా ఏడిపిస్తాయి. బాబాయ్ మాత్రం నన్ను చాలా కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఇది కేవలం ఆయనకు అమ్మ మీదున్న గౌరవం అని అర్థం అయ్యింది. బహుశా అమ్మకు మనసున ఉన్న ధైర్యం బాబయ్ పిన్ని అనుకుంటా. నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి బంధువుల ఇంటికి వెళ్లడం. కాస్త ఇష్టంగా కాస్త కష్టంగా బెంగళూరులో ఉంటున్న బాబాయ్ ఇంటికి కొన్ని వేలసార్లు అడిగించుకున్నాక వచ్చాను. కానీ ఇంత బాగా ఆదరిస్తారని తెలీదు. వారి అమ్మాయి అదే నా చెల్లి ఎంతో ప్రేమగా చూసుకుంది. బాబయ్ వాళ్ళ కుటుంబం నాకుపెద్ద ఓదార్పునే ఇచ్చి ఒక బంధంగా నన్ను కలుపుకుంది. ఒక్కదాన్నే ఉండటం ఎందుకు కూడా వుండమన్నారు. ఏకాంతంతో సహవాసం అంత త్వరగా మనల్ని వదలదు అందుకే సున్నితంగా తిరస్కరించా.

ఇలా సాగిపోతున్న నా జీవితంలో ఒక రోజు… ఎప్పటిలానే బాబాయ్ వాళ్ళింటికి వెళ్ళాను. నేను కొత్త కారు కొన్నందుకు నా చెల్లి పార్టీ అడిగితేను అందరం కలిసి బయటకు వెల్దామనుకున్నాము. బాబాయ్ ఇంట్లోకి వస్తున్న నాకు ఏదో కొత్త కంఠం వినిపించింది. కొద్దిగా మొహమాటం పడుతూనే వెళ్ళాను. ఇంకా అంత కలుపుగోలుతనం రాలేదు. ఎవరో అబ్బాయ్ ఇంచుమించు నా వయసే ఉంటుంది మాటల జలపాతం అనుకుంటా ఒకటే మాటలు మధ్యమధ్యలో యాక్షన్ కలగలిపి. నాకు తెలీకుండానే నేను అతను పేల్చిన జోక్‌కు నవ్వేసా. అప్పుడు మాటల ప్రవాహానికి అడ్డుకట్టవేసి వచ్చిందెవరా అని నన్ను చూసి కరుణ అదే నా చెల్లి వైపు చిలిపిగా కళ్ళెగరేశాడు. ఆ చిలిపితనం నన్ను భలే ఆకట్టుకుంది. పరస్పర పరిచయాలు ముగిసాయి. కరుణకు వరుసకు బావ. పేరు శశాంక్. నాకు మాదిరే ఓ సాఫ్టువేరు ఉద్యోగి. ప్రవృత్తి కామెడీ షోలు చేయడం. ఇలాంటి ప్రవృత్తి కూడా ఉంటుందా అని మనసులో అనుకుంటున్నట్టుగా పైకే అనేసాను. అదిగో ఇక తన కామెడీకి నేను వస్తువు. చిరుకోపం వచ్చింది అంతలోనే నవ్వు ఆపై కడుపుబ్బా నవ్వు వచ్చింది. ఎన్నాళ్ళయింది మనసారా నవ్వి. నామీదే జోకుల బాణాలు సంధిస్తున్నా కోపం స్థానే మనసైన నవ్వు విరబూయించాడు. పార్టీ అనుకున్నదానికంటే బాగా జరిగింది. ఇంటికోస్తుంటే బాబాయ్ తలనిమిరి ఎప్పుడూ ఇలానే ఉండు అన్నారు చెమ్మగిల్లిన కళ్ళతో. మనసుకు ఎంతో సాంత్వన కలిగించింది. వీరే లేకపోతే అమ్మో ఆ ఊహే భయంగా ఉంది. నేను అమ్మంత స్ట్రాంగ్ కాదు.

ఇంటికొచ్చాక అతగాడి గురించి గూగుల్ మాతను అడిగా. మంచి పేరున్న స్టాండప్ కమెడియన్ అని అర్థం అయింది. మొదటిసారి కరుణ ఇంటికెళ్తూ అందంగా ముస్తాబయ్యాను. తను వస్తాడేమో అని.. అదే శశాంక్.. వస్తే బాగుండు కదా అనిపించింది. నాలోని ఈ మార్పు నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది. అది తన హాస్యమో లేక వయసు ఆకర్షణనో తెలీదు. ఇంటి బయటే తన హస్యవల్లరి వినిపించింది. మనసుకు ఇదమిత్థంగా అర్థం కాని ఒక భావన. తన మాటల వరద మనసులో ఎక్కడో గిలిగింతలు పెడుతున్నాయి. తను కారు తెలేదని నాతో నా కార్లో వచ్చాడు. ఇంటికి వెళ్ళేవరకు ఏవేవో కబుర్లు. వాగుడుకాయలు అంటే నాకు పరమ చికాకు. కానీ ఇప్పుడు ఇల్లు అప్పుడే వచ్చిందా అని బాధేసింది. ఇంకాసేపు తను చెప్పే కబుర్ల ప్రవాహంలో కొట్టుకోపోవాలని ఉంది. కానీ ఏంచేద్దాం… నా ఇంటికి ముందు వీధిలోనే శశి వుండేది. రోజు అప్రయత్నంగానో లేక మనసు చేసే మాయో నేను ఆఫీస్ వెళ్లే దారి శశి ఇంటి మీదుగా మళ్లింది. అప్పుడప్పుడు కనిపించేవాడు. ఒకటి రెండు సార్లు కరుణతో కలిసి శశి ఇంటికి కూడా వెళ్ళాను. అందరూ నన్ను చాలా బాగా ఆదరించారు. ఎంతో సంతోషం వేసింది. రోజు రోజుకి నేను శశివైపు ఆకర్షించబడుతున్నాను. ఇది ప్రేమా!!! లేక మనసుకు సాంత్వనా అర్థం కాలేదు. ఒకటైతే నిజం నాలోని మౌనం కూడా విస్ఫోటనం చెందుతోంది శశి మాటల వెల్లువలో.

ఒకరోజు అనుకోని అతిధులుగా ప్రొద్దుటే పిన్ని బాబాయ్ వచ్చారు ఎన్నడులేనిది. మాములుగా నన్నే రమ్మంటారు. వాళ్లు రావడం ఒకింత ఆశ్చర్యం ఒకింత భయం కూడా వేసింది. కుశల ప్రశ్నలు, ఉపచారాలు అయ్యాక పిన్ని నన్ను అడిగింది శశి అంటే నీకు ఇష్టమేనా అని. నేను అసలు ఉహించని ప్రశ్న అది. భయం వేసింది నేను తనవైపు ఆకర్షించబడ్డాను అని తెలుసుకున్నారా. నాగురించి చెడుగా అనుకున్నారేమో. ఏమి చెప్పాలో అర్థం కాక తలొంచుకున్నాను. బాబాయ్ నా పక్కన కూర్చొని

“అమ్మా కావ్య శశి నిన్ను ఇష్ట పడుతున్నాడు అని నాకర్థమయ్యి నేనే వాడిని అడిగాను. నిన్నుచాలా ఇష్టపడ్తున్నట్టు ఇవాళ రేపో నీకు చెప్పాలనుకుంటున్నట్టు చెప్పాడు. నాకు తెలుసు నీవు ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నావో అవన్నీ శశికి చెప్పాను. నిన్ను బంగారంలాగా చూసుకుంటాను అన్నాడు. వారి తల్లి తండ్రులతో కూడా మాట్లాడాను. అందరికి నీవు నచ్చావు. కావ్యా, శశి నాకు చిన్నప్పటినుంచి తెలుసు. చాలా మంచి పిల్లవాడు. వాడు నిన్ను ఇష్టపడ్తున్నాడు అంటే అందరికన్నా నేనే ఎక్కువ సంతోషపడ్డాను. నీకు ఒక మంచి జీవిత భాగస్వామి కాగలడని నా నమ్మకం. నీ అభిప్రాయం ఇప్పుడే చెప్పొద్దూ. బాగా ఆలోచించుకొని కావాలంటే ఒకసారి శశితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకో. నీమనసుకు ఏమాత్రం ఇష్టంలేకపోయిన వద్దని నిరభ్యంతరంగా చెప్పు. ఇందులో అటువంటి ఒత్తిడి లేదు” అని శశి గురించి చాల విషయాలు చెప్పి వసంతాన్ని నా ముంగిట్లో దించి ఆహ్వానిస్తావో తిరస్కరిస్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోయారు. వసంత సమీరం తాకితే శిశిరo కూడా చిగురించదా. నాకు వసంతాన్ని ఆహ్వానించాలనే ఉంది. తను నన్ను ఇష్టపడుతున్నట్టు తెలియగానే నిజానికి మేఘాల్లో తెలిపోయాను. ఆ మాట తల్చుకుంటుంటే మనసును ఏదో కొత్త అనుభూతి తాకుతోంది.

అంతే తెలీని భయం ఆవహించింది. నా మనసు పెళ్లి మాత్రం వద్దని పట్టుపట్టింది. పెళ్లయ్యాక మోజు తీరో లేక మరొకరిపై మోజు పెరిగో వదిలి వెళ్లిపోతే… అమ్మో నేను అమ్మంత ధైర్యవంతురాలిని కాదే. అంతే ఇక ఆలోచనలు ముందుకు సాగితే కదా…ఇది అని తేల్చుకోలేక పోతున్నాను. అదిగో ఇదిగో అంటూ ఓ రెండు వారాలు దాటేసా. శశి ఇంటిముందునుంచి వెళ్లడం కూడా మానేసా. బాబాయ్ పిన్ని ఏమనుకున్నారో అడగటం మానేశారు. నాకు ఇష్టమే చాలా ఇష్టమే కానీ వద్దు. అమ్మవాళ్లు విడిపోవటానికి కారణం ఏదైనా కావొచ్చు కానీ వద్దు. ఇప్పుడు ఒంటరిగా బాగానే వున్నాను. అమ్మో!!!… అమ్మలా నావల్ల కాదు….

ఇక చేసేది ఏమి లేనట్టు పాపం పిన్ని వాళ్లు అడగటం మానేశారు. దాంతో మనసును ఎదో నిస్సత్తువ ఆవహించింది. రెండ్రోజుల ఆఫీసుకు లీవ్ పెట్టి ఇంటిపట్టునే ఉండిపోయా. వండుకోవాలని కూడా అనిపించలేదు అలా అని బయటకు వెళ్లాలని లేదు. స్విగ్గికి బిరియాని ఆర్డర్ చేసి ఏవో పాత జ్ఞాపకాలను మేఘసందేశం సినిమాతో కలిసి నెమరేసుకుంటున్నాను. ఏమిటో ఈ సినిమా నాకెప్పుడూ అంతుబట్టదు. ఈ సారి సినిమా నా మనసులా కల్లోలంగా ఉంది. ఈలోపు బెల్ మోగితే వేడి వేడి బిరియాని కోసం ఎన్నాళ్లనుంచో వేచిన దానిలా పరుగు పెట్టా. ఆత్రంగా తలుపుతీస్తే ఎదురుగా శశి చేతిలో బిరియాని ప్యాకెట్లతో. అసంకల్పితంగా లోపలికి రమ్మంటున్నట్టుగా తలుపుకు అడ్డంగా ఉన్న నేను పక్కకు జరిగా. మోదటిసారి శశి మా ఇంటికి రావడం. ఏదో భయం కానీ చాలా సంతోషం. మనసుకు నచ్చిన వాడితో కలిసి ఇష్టమైన బిరియాని తినటం…. తల్చుకుంటుంటేనే ఏదో ఆనందం. ఎంత ఆనందం అంటే కాలం ఇక్కడే ఆగిపోతే బావుండు అనిపించేంత. తనే చనువుగా వంట గదిలోకెళ్ళి రెండు ప్లేట్లలో బిరియాని వేసుకొని టీవీ ముందు పెట్టి అంతకన్నా చనువుగా నా చెయ్యి పట్టుకొని పిల్చుకెళ్లి నన్ను కూర్చోబెట్టి మొదటి ముద్ద తనే నా నోట్లో పెట్టాడు. విచిత్రంగా నేను కలలో కోరుకుందే జరుగుతోంది. తినడం ముగించాక లాంగ్ డ్రైవ్ వెళ్దామా అన్నాడు. సరే అని ఇద్దరు బయలుదేరాము.

ఎప్పుడు మాటలవరదా పారిస్తుండే శశి నా గాలి సోకి మౌనంగా అయిపోయాడు ఏమిటో!! కారుని నందీహిల్స్ వైపు పోనిస్తున్నాడని అర్థం అయ్యింది. కొండ మలుపుల్లో ఒకచోట కారుని పక్కకు ఆపి దిగమన్నట్టు చెప్పాడు. మొదటి సారి నేను తన కార్లో రావడం. కొండ మాటున ఒక చెట్టు నీడలో ఇద్దరం కూచున్నాము. చాలసేపటి భయంకరమైన మౌనం తర్వాత తనే అడిగాడు

“ఎందుకు పెళ్ళికి వద్దన్నావు” అని. నాకు తెలుసు ఇది అడగటానికే ఇక్కడకు పిల్చుకొచ్చాడు అని. మౌనం నా సమాధానం.

“కావ్యా నాకు తెలుసు నీవు కూడా నన్ను ఇష్టపడ్తున్నావని. నేను నిజంగా నిన్ను ఇష్టపడ్తున్నాను. నీవంటే చాలా ప్రేమ నాకు, నేవేమైన జాలి దయ అనుకుంటున్నవేమో కానీ కాదు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే క్లీన్ బౌల్డ్ అయ్యాను. లవ్ అట్ ఫస్ట్ సైట్…. నా షోస్‌కు ఎక్కువగా అమ్మాయిలే వస్తారు. నా షోస్ నచ్చి చాలా మందే ప్రపోజ్ చేశారు. కానీ నా మనసేందుకో ఎవ్వరికి కనెక్ట్ కాలేదు. ఇదేదో నేను గ్రేట్ అన్న వుద్దేశంతో చెప్పటం లేదు. నిన్ను చూసిన మొదటిసారే నీకు నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకు ఏమిటి అంటే నా దగ్గర సమాధానం లేదు. బహుశా నీ మాట్లాడే కళ్ళు కావొచ్చు. నీ మౌనం కావచ్చు,… ఏమో ఇది అని చెప్పలేను. మొత్తంగా నీవు నచ్చావు అంతే… నీ కోసమే కరుణ వాళ్ళింటికి వచ్చేవాడిని. నీతో కలిసి రావాలని కావాలని కార్ తెచ్చేవాడిని కాదు.”.. ఇంకా ఇలా ఏవేవో చెప్తున్నాడు. ఆనందం కన్నుల్లో నుంచి వరదై పొంగడానికి సిద్ధంగా ఉంది. చెప్పడం అపి మైమరచి వింటున్న నన్ను పిలిచి

“చెప్పు నీలో ఉన్న భయమేమిటో చెప్పు. నేను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు తెలుసు నీవు నన్ను ఇష్టపడ్తున్నట్టు. అదిగో నీ ప్రమేయం లేకుండా జారుతున్న ఆ కన్నీళ్లే సాక్ష్యం.” అని తను చెప్తే కానీ తెలీలేదు కళ్ళు వర్షిస్తున్నాయని. అంతగా తన ప్రేమలో తడిసి ముద్దై పోయాను. ఏమి చెప్పాలో తెలీక మాటల రాక అనంతకాసాన్ని చూస్తు ఉండిపోయా. మళ్ళీ తనే.

“నాకు తెలుసు నీ భయం ఏమిటో. చూడు కావ్యా నీకు తెలియంది కాదు రోడ్డుమీద ఆక్సిడెంట్ మూలానా ఎంతో మంది చనిపోతుంటారు. అంతమాత్రాన రోడ్డుపై నడవడం మానేస్తామా. నిజమే మనసుకు తగిలిన గాయం మానడం కొద్దిగా కష్టం భయం సహజం. అంతమాత్రాన జీవితాంతం ఇలానే ఉంటాను అంటే ఎట్లా. ఒక్కసారి నీ భయాన్ని దాటిరా. ఎప్పుడూ మనసైయింది భయానికి అవతల వైపే వుంటుంది. సరే ఒక పనిచేద్దాం. నేను ఎప్పటికి నిన్ను విడిచిపోను అని ఒక ప్రామిసరి నోటు మీద రాసిస్తా, ఒక వేళ నిన్నువదిలి వెళ్లినా, వేరొకరివైపు కన్నెత్తి చూసిన నాకు మరణశిక్ష వేసే అధికారం నీకు రాసిస్తాను. సరేనా” అని… ఇంకేదో చెప్పబోతున్నాడు.. ఇంకేమి వినలేను అని గట్టిగా కౌగిలించుకున్నాను ఎప్పటికి నీతోడు కావాలంటూ!!!. సూరీడు మా మధ్య అడ్డు ఎందుకు అనుకున్నాడేమో మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. నా నిర్ణయానికి అమ్మ అంగీకారo తెలిపినట్లు ఉంది. ఆకాశం మెరిసింది, అమ్మ దీవెన జల్లై కురిసింది….

***

అమ్మ మళ్ళీ నాకోసం నాకడుపున పురుడుపోసుకుంది ఎప్పటికీ నాతోనే వుంటానంటూ… ఒక అనుబంధానికి సాక్ష్యంగా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here