భీమవరం భీమరాజు

0
3

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన కేశవరాజు సుబ్బారావు. [/box]

[dropcap]అ[/dropcap]న్నీ మనమనుకున్నట్లే జరగాలంటే జరగవు. బ్రహ్మ ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. దాన్నే మనం ‘విధి’ యని, ‘తలరాత’ యని రకరకాలుగా చెప్పుకుంటాం. లేకపోతే భీమరాజు చదివిందేంటి? చేయాలనుకున్నదేంటి? చేస్తున్నదేంటి? మనిషి జీవితం విధి చేతిలో కీలుబొమ్మ. అది ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతూ సాగిపోతుంటుంది.

భీమరాజుది భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో వున్న ఒక పల్లె. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. బుద్ధిమంతుడు. మంచి తెలివికలవాడు, భీమవరంలో ఇంటరు, విశాఖపట్నంలో బీటెక్ చదివాడు. చదువుకునే రోజుల్లో ఓ గది అద్దెకు తీసుకొని ఇద్దరు స్నేహితులతో కలసి వుండేవాడు. ఖర్చు కలిసొస్తుందని హోటళ్ళలో తినకుండా లక్షణంగా వండుకొని తింటూ చదువుకునేవాడు.

భీమరాజు వంట బాగా రుచిగా చేసేవాడు. నలభీమ పాకం అంటారే అలా ఈ కలియుగ భీమరాజు చేయిపడితే చాలు వంటలు బాగా రుచిగా తయారయ్యేవి. అందుకనే మిగతా స్నేహితులిద్దరూ పైపై పనులు చేస్తూ భీమరాజుకు వంటపని అప్పజెప్పేవారు.

భీమరాజులో ఓ సుగుణముంది. ఏ పనైనా సరే మనసుపెట్టి శ్రద్ధగా చేసేవాడు. స్వయంగా వంట చేసుకొని తింటూ కష్టపడి చదివి బీటెక్ కంప్యూటర్స్ ఫస్టు క్లాసులో పాసయ్యాడు.

చదువైపోగానే ఉద్యోగం కోసం అన్ని చోట్లకూ అప్లయ్ చేస్తుండేవాడు. మూణెల్లు గడిచినా ఏ ఉద్యోగానికి పిలుపు రాకపోయేసరికి పల్లెలో వుంటే లాభం లేదని, తన క్వాలిఫికేషన్‌కి తగ్గ ఉద్యోగం ఏదో ఒక ఐటీ కంపెనీలో దొరక్కపోతుందా యనే ఆశతో ఒక బ్యాగులో రెండు జతల బట్టలు పెట్టుకుని, వెయ్యి రూపాయలు జేబులో వేసుకొని హైదరాబాదు చేరుకున్నాడు.

ఐటీ రంగం హైదరాబాదులో కొత్తగా వేళ్ళూనుకునే రోజులవి. అప్పుడప్పుడే ఒక్కో ఐటీ కంపెనీ హైదరాబాద్‌కు తరలి వస్తుండేది. ప్రతి కంపెనీ అనుభవమున్న వాళ్ళను మాత్రమే ఉద్యోగాల్లో తీసుకుంటుండేది. భీమరాజుకు అనుభవం లేదు. రాజకీయ నాయకుల అండలేదు. ఐనా ఆశ చావక నెల రోజులు అన్ని రకాల ఐటీ కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. తిరిగి వట్టి చేతులతో వెళ్ళడానికి మనసొప్పలేదు. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయి చేతిలో వంద రూపాయలు మాత్రమే మిగిలాయి. వాటిని ఖర్చు పెట్టకుండా భద్రంగా దాచుకున్నాడు. ఒక వేళ వెనక్కి వెళ్ళాల్సి వస్తే ఛార్జీల కన్నా వుంటాయని.

పొద్దుట్నుంచీ తిండి లేదు. ఆకలి దంచేస్తోంది. సాయంత్రం ఐదు గంటలు కావొస్తుంటే ఆకలికి తాళలేక రెండు ఇడ్లీలన్నా తిందామని అమీర్‌పేటలో ఒక హోటల్ కెళ్ళాడు. రెండు ఇడ్లీలు తిని టీ తాగుతూ ఆలోచిస్తూ కూర్చున్నాడు.

‘తన చదువు కోసం అమ్మానాన్నలు ఊళ్ళో వున్న అయిదెకరాలలో మూడెకరాలు అమ్మేశారు. ఇక మిగిలింది రెండెకరాలు మాత్రమే! ఉద్యోగం దొరక్కపోతే ఆ రెండెకరాలలో వ్యవసాయం చేసుకుంటూ బతకాలి. రెండెకరాలలో బ్రతకడానికి కావలసిన ఆదాయం రాదు కాబట్టి తప్పని సరిగా అప్పుడప్పుడు కూలీ పని కూడా చేయాల్సుంటుంది. ఇంత చదువు చదివి ఊళ్ళో కూలీ పని చేసుకుంటూ బ్రతికే బదులు ఇక్కడే ఏదైనా ఒక చిన్న పనైనా సరే చేసుకుంటూ బ్రతకడం మంచిదేమో!’ యని అనుకుంటుండగా వంట గదిలోంచి ఒక పనివాడు కాష్ కౌంటర్లో కూర్చున్న ప్రొప్రయిటర్ దగ్గరకొచ్చి “వంటవాడు ఏదో అర్జెంటు పనుందని మధ్యాహ్నం మీరు లేనప్పుడు నాకు చెప్పి వెళ్ళాడు. ‘ఊరెళ్తున్నాను నెల వరకు రావడం కుదరదు’ అని మీకు చెప్పమన్నాడు. రాత్రికి వంట చేసే వాళ్ళెవ్వరూ లేరు. ఎలా?” అని అడుగుతుంటే భీమరాజు విన్నాడు. వెంటనే లేచి కాష్ కౌంటర్ దగ్గరికెళ్ళి ప్రొప్రయిటర్‌తో “నాకు వంట చేయడం వచ్చు. నేను చేస్తాను వంట. నన్ను పనిలో పెట్టుకోండి” అని అడిగాడు..

ప్రొప్రయిటరు భీమరాజును పైనుంచి క్రిందికి ఎగాదిగా చూసి, ఏవో కొన్ని వంటకు సంబంధించిన ప్రశ్నలు అడిగి, సమాధానాలు విని సంతృప్తి చెంది, “సరే! జీతం ఎంత కావాలి?” అని అడిగాడు. “మీ ఇష్టం” అన్నాడు భీమరాజు. “ఐతే ముందు పనిలో చేరిపో… తర్వాత జీతం సంగతి చూద్దాం!’ అన్నాడు ప్రొప్రయిటర్.

అలా భీమరాజు తప్పని పరిస్థితులలో ‘విధి’ ఆడిన వింత నాటకంలో పావై, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావలసినవాడు వంటలవాడయ్యాడు! ‘అలనాడు ఆ భీమునికే తప్పలేదు వంట పని. ఇంక ఈ భీముడెంత?’ అనుకున్నాడు మనసులో.

ఆ రాత్రికి శ్రద్ధగా వంట చేసి, తృప్తిగా భోం చేసి, కస్టమర్లకు తన వంట రుచి చూపించాడు.

వారం రోజుల తర్వాత రెగ్యులర్ కస్టమర్లు కొందరు “వంట బావుంటోంది. కుక్‌నేమయినా మార్చారా?” అంటూ ప్రొప్రయిటర్‌ని అడిగితే ఔనని తర్వాత అందరూ వంటని మెచ్చుకుంటుంటే ప్రొప్రయిటర్ సంతోషించి ఓ పూట తనూ భీమరాజు చేతి వంట రుచి చూశాడు. భీమరాజు వంట బాగా చేసాడని గ్రహించి, అతడొచ్చాక హోటల్‌కు మంచి పేరు రావడంతో భీమరాజును వదులుకోకూడదని నిర్ణయించుకుని “ఎక్కడికీ పోకుండా నా దగ్గరే పని చేసుకుంటూ వున్నావంటే భోజనం పెట్టి, వసతి సౌకర్యం ఇచ్చి నెలకు ఐదువేల రూపాయలు ఇస్తాను” అన్నాడు,

భీమరాజు సంతోషానికి అవధులు లేవు. మనసులో దేవునికి దండం పెటుకున్నాడు, ఐటీ కంపెనీలో నెలకు రెండు మూడు వేలిచ్చినా చాలు చేరిపోదాసుసుకుని వచ్చిన వాటికి ఏకంగా తిండీ, వసతీ ప్రీగా దొరికి ఐదు వేల రూపాయల జీతమంటే ఇంకేం కావాలి యసుకొని సంతోషంగా ‘సరే!’ యని ఒసేసుకున్నాడు.

ఆ మర్నాడే ఉద్యోగం దొరికిందని, నెలకు ఐదు వేలు జీతమని తల్లిదండ్రులకు ఉత్తరం రాసాడు. కానీ అందులో తనేం ఉద్యోగం చేస్తున్నది మాత్రం తెలుపలేదు.

ఆరు నెలలలోనే భీమరాజు జీవితంలో ఇంకో పెద్ద మార్పు చోటు చేసుకుంది. భీమరాజు పని చేసే హోటలు ప్రొప్రయిటరు ఇంకో కొత్త హోటలు తెరిచాడు. భీమరాజు బాగా చదువుకున్నవాడని, నమ్మకంగా శ్రద్ధగా పనిచేస్తాడని తెలిసి మూడేళ్ళకు అగ్రిమెంటు రాయించుకుని అతన్ని కొత్త హోటల్‌కి మేనేజర్ చేసి మొత్తం బరువు బాధ్యతలు అప్పజెప్పి జీతం ఏకంగా పది వేలు చేశాడు.

నమ్మకంగా పని చేస్తూ యజమానికి నుంచి లాభాలు ఆర్జించి పెట్టసాగాడు భీమరాజు.

ప్రతి నెలా తల్లిదండ్రులకు కొంత డబ్బు పంపిస్తూ అప్పుడప్పుడు ఊరికెళ్ళి వాళ్ళను చూసి వస్తుండేవాడు. డబ్బు దుబారాగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా కూడబెడుతూ మూడేళ్ళలో రెండు లక్షలకు పైగా పొదుపు చేయగలిగాడు. స్వతహాగా తెలివితేటలు కలవాడు కావడంతో హోటలు బిజినెస్‌లోని కిటుకులు గ్రహిస్తుండేవాడు.

ఆ రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్ళ స్థలాలు చాలా చౌకగా దొరికేవి. లక్ష రూపాయలు పెట్టి హైవేకి పక్కనే కూకట్‌పల్లిలో వెయ్యి చదరపు గజాల స్థలం కొన్నాడు.

మూడేళ్ళ కాంట్రాక్ట్ పూర్తవగానే లక్ష రూపాయల పెట్టుబడితో కూకట్‌పల్లి ఏరియాలో సొంతంగా ఓ హోటల్ పెట్టాడు.

హోటల్ బిజినెస్‌లో మంచి లాభాలు రావడంతో సొంత డబ్బుకు తోడు కొంత బ్యాంక్ లోన్ తీసుకొని కూకట్‌పల్లిలో తాను కొన్న వెయ్యి గజాల స్థలంలో నుంచి హోటల్ కట్టిచ్చాడు. గ్రౌండ్ ఫ్లోరులో టిఫిన్లు, భోజనాలు, ఫస్టు ఫ్లోరులో లాడ్జింగ్‌కు ఏర్పాట్లు చేశాడు. భీమవరం నుంచి బంధువుల్ని, స్నేహితులను పిలిపించి వాళ్ళకు తన హోటల్లో ఉద్యోగాలిచ్చాడు.

పెద్దలు కుదిర్చిన మంచి అమ్మాయిని పెండ్లి చేసుకొని తల్లిదండ్రులను హైదరాబాద్‌కు రప్పించి తన దగ్గరే పెట్టుకున్నాడు.

హోటల్ బిజినెస్‌లో వచ్చే లాభాలను ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టు చేస్తూ హైదరాబాదులోని మంచి మంచి ఏరియాల్లో ఇళ్ళ స్థలాలు కొంటూండేవాడు.

పదేళ్ళు గడిచేసరికి హైదరాబాద్లో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో తాను కొన్న స్థలాలు లక్షలు, కోట్లు పలకసాగాయి. వాటిల్లో కొన్ని అమ్మి బ్యాంకు లోన్లు తీసుకొంటూ రెండేళ్ళకో హోటలు చొప్పున విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలలో మంచి మంచి స్టారు హోటళ్ళు కట్టిచ్చాడు. వచ్చిన ఆదాయాన్ని తెలివిగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, హోటల్ బిజినెస్‌లోను ఇన్వెస్ట్ చేస్తుండేవాడు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుదామనుకున్న భీమరాజు వంటలవాడై, తర్వాత హాటల్ బిజినెస్‌లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోను రాణించి కోట్లకు పడగలెత్తాడు.

పాతికేళ్ళ జీవన ప్రస్థానంలో దాదాపు వెయ్యిమందికి ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పించాడు. పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఎంబిఎ, ఇంకొకర్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ముసలి తల్లిదండ్రులను తన దగ్గరే పెట్టుకొని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కట్టుకున్న భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆమె కోరిన కోరికలు తీరుస్తున్నాడు.

‘ఏ చదివాం? ఏం చేస్తున్నాం’ అని అన్నది కాదు ముఖ్యం ఉన్న పనిని ఎంత శ్రద్దగా చేస్తున్నాం అదే ముఖ్యం. ఏ పనైనా సరే మనసు పెట్టి శ్రద్ధగా చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుందని నమ్మేవాడు భీమరాజు. అతని నమ్మకం ఎప్పుడూ వమ్ముకాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here