మానస సంచరరే-23: బొమ్మలాట.. మనసులో మాట!

9
4

[box type=’note’ fontsize=’16’] “పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేసేవి బొమ్మలే. చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే బొమ్మల్లో భిన్న వస్తువుల పరిచయం, రకరకాల ప్రాణులు, ఎన్నెన్నో వృత్తుల తీరుతెన్నులు.. వినోదంలో విజ్ఞానం” అంటున్నారు జె. శ్యామల ‘మానస సంచరరే-23: బొమ్మలాట.. మనసులో మాట!’ కాలమ్‌లో. [/box]

[dropcap]చా[/dropcap]లా రోజులుగా రాధిక, వాళ్లింటికి రమ్మని పిలుస్తోంది. ఈరోజు వెళ్లి సర్‌ప్రైజ్ చేద్దామనిపించింది. నేను వెళ్లేసరికి తలుపు తెరిచే ఉంది. ముందు హాలంతా ఎటు చూసినా బొమ్మలు. రాధికా వాళ్ల పాప ప్రతిమ బొమ్మలతో సీరియస్‌గా ఆడుకుంటోంది. అటు తిరిగి ఉంది. నన్ను చూడలేదు. నేను కూడా చప్పుడు చేయకుండా పాప ఆటను గమనించసాగాను. ఓ పది బొమ్మల్ని వరుసగా కూర్చోబెట్టింది. ఓ చేతిలో స్కేలు, ఓ చేతిలో పుస్తకం.. ‘సైలెన్స్ అని చెప్పానా..’ స్కేలుతో బెదిరిస్తూ.. ‘ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్’ గట్టిగా అరుస్తోంది. “యశ్వంత్! స్టాండప్! ఎ ఫర్ యాపిల్ చెప్పమంటే ఐస్‌క్రీమ్ అంటావా… నీకు దెబ్బలు కావాలి..” తనే బొమ్మను నిలబెట్టి స్కేలుతో కొడుతున్నట్లు యాక్షన్ చేస్తోంది. అంతలో ‘సోనీ! నవ్వుతున్నావెందుకు? యు నాటీ గర్ల్. నీక్కూడా దెబ్బలు కావాలా..’ స్కేలు అటు తిప్పింది… నేను నిశ్శబ్దంగా నవ్వుకుంటుండగానే రాధిక “పింకీ! ఎవరి మీద అరుస్తున్నావ్?’ అంటూ లోపల్నుంచి వచ్చింది. పాప “చూడు మమ్మీ” అని ఏదో చెప్పబోతున్న సమయంలోనే నన్ను చూసి “అరె! మేడమ్! మీరెప్పుడోచ్చారు? రండి రండి” అంటూ ఆహ్వానించింది. “ఇప్పుడే వచ్చాను. పాప ఆడుతుంటే చూస్తున్నాను. పాప పేరు ప్రతిమ కదూ. పేరుకు తగ్గట్టు బొమ్మల్లేనే ఉంది” నవ్వుతూ చెప్పాను.

“మీకు మా పాప పేరు బాగానే గుర్తుంది. ఇంట్లో ముద్దుగా పింకీ అంటాం. మా పింకీకి బొమ్మలుంటే చాలు. అన్నం కూడా అక్కర్లేదు. ఇల్లంతా ఇదుగో ఇలా బొమ్మలు పరిచేస్తుంది” మధ్యలో ఉన్న బొమ్మల్ని పక్కకు సర్దుతూ చెప్పింది.

“పాపా! ఇలా రా. ఇదుగో ఈ బొమ్మలు నీకోసమే.. తీసుకో” అంటూ ఆ మధ్య నేను జైపూర్ వెళ్లినప్పుడు కొనుక్కొచ్చిన తోలుబొమ్మల్ని అందించాను. పాప ఎంతో సంతోషంగా ‘థ్యాంక్యూ ఆంటీ’ అంటూ అందుకుంది. తర్వాత రాధిక, నాకు అతిథి మర్యాదలు చేయడం, ఇద్దరం కబుర్లు చెప్పుకోవడం, మధ్యమధ్యలో పాప వచ్చి “ఇదుగో టిఫిన్ తినండి, ఇదుగో ఐస్‌క్రీమ్ తినండి” అంటూ బొమ్మ ప్లేట్లు, కప్పులు అందించడం, మేం కూడా తిన్నట్లు నటించడం జరిగిపోయాయి.

“ఆటలు చాల్లేకానీ, ఆంటీకి ఓ పాట వినిపించు….” అనగానే పాప

“చిట్టిచిట్టి మిరియాలు

చెట్టుకింద పోసి

పుట్టమన్ను తెచ్చి

బొమ్మరిల్లు కట్టి

బొమ్మరింట్లో పాప పుడితే

బొమ్మ తలకి నూనే లేదు

బొమ్మ బిడ్డకి నెయ్యే లేదు

అల్ల వారింటికి మజ్జిగకు వెళితే

అల్ల వారి కుక్క భౌభౌ మన్నది

నా కాలి గజ్జెలు ఘల్లు ఘల్లు మన్నవి

చంకలోని పిల్ల కేరువేరు మన్నది”

చక్కగా పాడింది.

‘చాలా బాగా పాడావు’ అంటూ చప్పట్లు కొట్టాను.

ఇంతలో రాధిక సెల్ మోగింది. తను మాట్లాడుతుండగా నాకు టైమ్ గుర్తొచ్చింది. ‘ఇంక బయలుదేరాలి’ అనుకున్నాను. రాధిక ఫోన్ మాట్లాడటం అయిపోయింది. నేను, ‘మాటల్లో టైమ్ తెలియలేదు. నేనిక వస్తా’నంటూ లేచాను.

“థాంక్యూ మేడమ్. పింకీ! ఆంటీకి టాటా చెప్పు” అంది. పింకీ ‘టాటా’ చెప్పి, నేను తిరిగి టాటా చెపుతుండగానే మళ్లీ బొమ్మల వైపు తిరిగింది.

నేను రాధిక దగ్గర సెలవుతీసుకొని బయటకు వచ్చి నడవసాగాను. మెయిన్ రోడ్డుకు వచ్చేసరికి రోడ్డుకు ఇరువైపులా రకరకాల గణపయ్య విగ్రహాలు. చేతుల్లో కుడుములతో బాల గణపతి, శివ, పార్వతులతో ఉన్న గణపతి, అటు ఇటు సిద్ధి, బుద్ధితో గణపతి, కొన్ని కూర్చున్నవి, కొన్ని నిలుచున్నవి.. వివిధ రంగుల్లో, వివిధ రకాల సైజుల్లో చిత్ర విచిత్రంగా చిత్తానికి హత్తుకుంటూ చూపు తిప్పనివ్వటంలేదు. అలాగే నడుస్తూ బస్టాప్ చేరాను. బస్ త్వరగా రావటమే కాదు, సీటు కూడా దొరికింది. అది కూడా కిటికీ పక్క సీటు. కండక్టర్‌కి ‘పాస్’ అని చెప్పేశాక నాదిక అంతరాయం లేని లోకమే అయింది. దోవ పొడుగునా వివిధ రకాల వినాయక విగ్రహాలు. అలా వినాయకుళ్లను వీక్షిస్తుంటే.. గణపతి పుట్టుక నేపథ్యం గుర్తొచ్చింది. పార్వతీదేవి పసుపుతో బొమ్మను చేసి, ప్రాణం పోసి ద్వారానికి కాపలాగా ఉంచడం.. కథంతా రీలు తిరిగింది. బ్రహ్మదేవుడు నిరంతరం మనుషుల్ని సృష్టిస్తూ, తలరాతలు లిఖిస్తూ ఉంటాడట. ఇన్ని మిలియన్ల మానవులలో ఒకరున్నట్లు ఒకరు ఉండకుండా సృష్టించడమంటే.. కొద్దిపాటి పోలికలు ఉండవచ్చేమో కానీ ఒకేలా ఉండటం చాలా చాలా అరుదు. కవల పిల్లల్లో కూడా తేడాలు ఉండటం తెలిసిందే. ఇంక మనిషి సైతం అపరబ్రహ్మ అవతారమెత్తి నాటినుంచి నేటి వరకు రకరకాల బొమ్మలను తయారుచేస్తూనే ఉన్నాడు. మట్టిబొమ్మలు, రాతి బొమ్మలు, లక్కబొమ్మలు, కొయ్య బొమ్మలు, గాజు బొమ్మలు, మైనం బొమ్మలు, పింగాణీ బొమ్మలు, రబ్బరు బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు, రకరకాల లోహాల బొమ్మలు, గవ్వల బొమ్మలు, శంఖాల బొమ్మలు, పూసల బొమ్మలు, వైర్ల బొమ్మలు, కాగితపు బొమ్మలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు, టెర్రకోట బొమ్మలు.. ఎన్నెన్నో.. పసిపిల్లల ఉయ్యాలలకు రంగురంగుల, చక్కని బొమ్మలను కడతారు. పసికందు ఆ బొమ్మల్ని చూస్తూ సంతోషంతో బోసి నవ్వులు నవ్వుతుంది. పిల్లలు తమ ఆస్తిగా భావించేవి బొమ్మలు. ఒకప్పుడు బొమ్మలంటే ఉలుకు, పలుక లేని, కదలిక లేని బొమ్మలుగానే ఉండేవి. ఆ తర్వాత తర్వాత కీ ఇస్తే నడిచే, పరుగెత్తే, ఎగిరే, మాట్లాడే బొమ్మలు వచ్చాయి. ఇంతేనా..వాటిల్లో మళ్లీ ఎన్ని రకాలో! మనుషులు, పక్షులు, జంతువులు, వాహనాలు వస్తువులు, సందర్భాలకు సంబంధించినవి.. ఇలా ఎన్నెన్నో. ఇటీవల కాలంలో బార్బీ బొమ్మ, ఏంజిలా, టాకింగ్ టామ్ బొమ్మలు అంతర్జాతీయంగా ఎంతగానో పాపులర్ అయ్యాయి.

అంతలో బొమ్మల గురించిన ఆ ‘పాత’ మధురం ఒకటి గుర్తొచ్చింది.

“బొమ్మలమ్మా బొమ్మలు చూడండీ భలే బొమ్మలు..

రండి రండి పాపలు.. ఇలా బొమ్మల పస చూడండి..

చౌకేనండీ.. గొల్లభామ, పల్లెటూరి పిల్ల, కీలుగుర్రం, అలరాజు, చంద్రలేఖ, బాలనాగమ్మ” అంటూ పాటలో సినిమా పేర్లను ఇమిడ్చారు ఆదినారాయణరావుగారు. అంతటితో అయిపోలేదు, “అరటిపళ్లు, జామపళ్లు, ద్రాక్షగుత్తులు ఆడపిల్లలాడుకునే లక్కపిడతలు” అంటూ బొమ్మల రకాలను వివరిస్తూ “శిల్ప లక్ష్మీ జనించెను మా నాటనే శిల్ప విద్య ఫలించెను మా వీటనే..” అన్నారు.

ఈ పాట ‘సువర్ణసుందరి’ సినిమాలో అంజలీదేవిపై చిత్రీకరించారు. గతంలో పిల్లల ఆటల్లో బొమ్మల పెళ్లి ఒకటి. అందుకే ఓ సినీకవి…

“చిట్టిపొట్టి బొమ్మలూ, చిన్నారీ బొమ్మలు..

బుల్లిబుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు

పెళ్లండీ పెళ్లి.. ముచ్చటైన పెళ్లి ..

బహు ముచ్చటైన పెళ్లి..” అని ఓ గీతం అందించారు.

బొమ్మంటే అందంగా ఉండాల్సిందే. అది గీసిన బొమ్మైనా.. చేసిన బొమ్మైనా… అందుకే అందంగా ఉన్న అమ్మాయిని చూసి బొమ్మల్లే ఉందనో, బాపు బొమ్మల్లే ఉందనో కితాబులిస్తుంటారు.

“కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల వయారపు నడకతో వచ్చే పడుచుపిల్ల..” పాట గుర్తొచ్చింది.

బొమ్మల కారణంగా పేరు తెచ్చుకొన్న ఊళ్లూ ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు, నిర్మల్ బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు… ఇలా ఎన్నో. దశావతారాల బొమ్మలు, పల్లకీ ఊరేగింపు, ఏనుగు అంబారీ, రాజు, రాణి, సీతారామలక్ష్మణులు, క్షీరసాగరమథనం, చిలిపిచేతల చిన్నికృష్ణుడు, పల్లె పడుచులు.. ఇలా ఒకటా రెండా. గమనిస్తే గణించలేనన్ని. డ్యాన్సింగ్ డాల్స్‌కి పెట్టింది పేరు తంజావూరు. భరతనాట్యం, కథాకళి, మణిపురి.. వివిధ నృత్యరీతులకు చెందిన బొమ్మలు. బొమ్మల తయారీ ఎందరికో జీవనోపాధి కూడా. చేతి వృత్తులు వారు రూపొందించేవి కొన్ని రకాలైతే, ఆధునిక యంత్రాలతో తయారవుతున్న బొమ్మలు అసంఖ్యాకాలు. ఎందరో చిత్రకారులు, శిల్పులు ఈ బొమ్మలతోనే ప్రసిద్దులవటం, చిరంజీవులవటం మనకు తెలుసు. అసలు పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేసేవి బొమ్మలే. చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే బొమ్మల్లో భిన్న వస్తువుల పరిచయం, రకరకాల ప్రాణులు, ఎన్నెన్నో వృత్తుల తీరుతెన్నులు.. వినోదంలో విజ్ఞానం. మాంటిస్సోరీ స్కూల్స్‌లో విద్య ఈ తరహాగానే ఉంటుంది. పిల్లలు వాడుకునే రబ్బరు, పెన్సిళ్లు, షార్పనర్లు మొదలైనవి కూడా బొమ్మల ఆకృతుల్లో ఉండి, వారిని ఆకట్టుకోవడం తెలిసిందే. అలాగే బొమ్మల పుస్తకాలు. పిల్లల బొమ్మల రామాయణం, పిల్లల బొమ్మల భారతం వగైరాలు పిల్లలకే కాదు, పెద్దలకూ ఇష్టంగానే ఉంటాయి. పిల్లల పాఠ్యపుస్తకాలు కూడా అందమైన రంగురంగుల బొమ్మలతో ఉండటం మామూలే. ఏ పుస్తకానికైనా బొమ్మ అదనపు అందమే. ‘బొమ్మరిల్లు’ పేరుతో పిల్లల పత్రిక కూడా ఒకటి ఉండేది. పిల్లలకు బొమ్మల్ని మించిన బహుమతి ఏం ఉంటుంది? ఆ మాట కొస్తే పెద్దలకూ అవి నచ్చేవే. అందుకే ఏ యాత్రకు వెళ్లినా గుర్తుగా అక్కడి బొమ్మలు ఒకటి రెండు కొని తెచ్చుకుంటుంటాం. అవి అక్కడి సంస్కృతికి ప్రతీకలుగా కూడా ఉంటాయి. గతంలో పిల్లలు వివిధ రాష్ట్రాలను, భాషలను పరిచయం చేసే పాట ఒకటి పాడేవాళ్లు.అది..

“నేనొక తమాషా బొమ్మాను

ఆంధ్రా నుంచి వచ్చాను..

నేనొక తమాషా బొమ్మాను

మద్రాసు నుంచి వచ్చాను..

నేనొక తమాషా బొమ్మాను

ఢిల్లీనుంచి వచ్చాను…” ఇలా సాగుతుంది.

భారత, రామాయణాల్లోనూ బొమ్మల ప్రస్తావన ఉంది. అలనాడు ఏకలవ్యుడు బొమ్మనే గురువుగా చేసుకోని విలువిద్యను నేర్చుకున్నాడని భారతం చెపుతుంది. రాముడు అశ్వమేథ యాగం చేయడానికి సీత బొమ్మను పక్కన ఉంచుకున్నట్లు రామాయణం చెపుతుంది. విక్రమార్కుడి సింహాసనంలోని (బొమ్మలు) సాలభంజికలు కథలు చెప్పటం (సింహాసన ద్వాత్రింశిక) ఎంత ఆసక్తిదాయకంగా ఉంటుందో.. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన బొమ్మ నాలుగువేల ఐదువందల ఏళ్ల కిందటిది. కంచుయుగానికి చెందిన, సోప్ స్టోన్‌తో తయారుచేసిన బొమ్మ ‘ఖాకసియా’ ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో దొరికింది.

బొమ్మలు కేవలం ఆడుకోవటానికే కాదు, ఇంటి అలంకరణలో కూడా ఓ భాగమయ్యాయి. అంతేకాదు, సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలకు బొమ్మల కొలువులు ఏర్పాటుచేయడం తెలిసిందే. చాలామంది ఇళ్లల్లో కొంతకాలం కిందటివరకు బొమ్మల పెట్టే ప్రత్యేకంగా ఉండేది. పండుగకు బొమ్మలు పెట్టే సందర్భంలో వాటిని బయటకు తీయడం, మళ్లీ పండుగ అయిపోగానే వాటిని పెట్టెలో భద్రపరచడం చేసేవారు. ఆ తర్వాత తర్వాత ఇళ్లల్లో షోకేసుల ఏర్పాటు ఎక్కువయింది. దాంతో బొమ్మల్ని షోకేసుల్లోనే అమర్చుకుంటున్నారు. తెలుగువారి పెళ్లిళ్లలో వధూవరులకు ఓ కొయ్య బొమ్మ అందించి, ఉయ్యాలలో వేసి, జంటతో ఊయల ఊపించడం వగైరా తంతులు తెలిసినవే.

బొమ్మల సేకరణ ఎందరికో హాబీ. అందులోనూ కొందరు గణపతుల బొమ్మలు మాత్రమే సేకరించేవారు, మరికొందరు కృష్ణుడి బొమ్మలు సేకరించేవాళ్లు.. ఇలా ఎవరి అభిరుచి వారిది. బొమ్మలతో వినోద ప్రదర్శనలలో తోలుబొమ్మలాట, వెంట్రిలాక్విజమ్‌లు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. వెంట్రిలాక్విజమ్ అనుకోగానే “ఇది కథ కాదు’ చిత్రంలో ఆత్రేయ రాసిన పాట గుర్తుకొస్తోంది.

“జూనియర్.. జూనియర్.. జూనియర్

యస్ బాస్

అటు ఇటు కాని హృదయం తోటి

ఎందుకురా ఈ తొందర నీకు..

అటు ఇటు తానొక ఆటబొమ్మని తెలిసే

ఎందుకు వలచేవు..

రబ్బరు బొమ్మకు రాగం తెలుసు

ఆటబొమ్మకు ఆశలు తెలుసు

ఇద్దరు ఒక్కటే ఎందుకు కారాదు..

పాటపాడెను ముద్దుల బొమ్మ

పకపక నవ్వేవెందులకమ్మా

మనసున వున్నది చెప్పి నవ్వమ్మా..” ఎంతో పాపులర్ సాంగ్.

వెంటనే మరో మంచి పాత పాట మదిలో మెదిలింది.

“తాధిమి తకధిమి తోలుబొమ్మా..

దీని తమాష.. దీని తమాషా చూడవే మాయబొమ్మా..”

అన్నట్లు బొమ్మ ప్రస్తావనతో కొన్ని డ్యూయెట్లు కూడా సినీకవులు అందించారు.

“బొమ్మను గీసేవు, ముద్దుల బొమ్మను గీసేవు

బొమ్మ కన్నా అందమైన అమ్మాయినే చూసేను..”

అని హీరోహీరోయిన్లు పాడుకోవటం తెలిసిందే.

మ్యూజియంలలో బొమ్మల విభాగం ఉండటం మామూలే. కానీ ప్రత్యేకించి కేవలం బొమ్మలే ఉన్న మ్యూజియంలు కూడా ఉన్నాయి. మనదేశంలో పేరొందిన బొమ్మల మ్యూజియం ఢిల్లీలోని ‘శంకర్స్ మ్యూజియం’. పొలిటికల్ కార్టూనిస్ట్ అయిన కె.శంకర్ పిళై ఏర్పాటుచేసిన మ్యూజియం ఇది. ఇందులో దేశవిదేశాలకు చెందిన బొమ్మలు మూడువేలకు పైగా ఇక్కడ ఉన్నాయి. ఇంకా విశేషం ఏమిటంటే “సిక్ డాల్స్’ (పాడైన బొమ్మలు)కు ఓ క్లినిక్ కూడా ఉంది. ఇందులోని పాడైన బొమ్మల్ని బాగుచేస్తారు.

అంతర్జాతీయంగా అయితే మైనపు బొమ్మలకు పెట్టింది పేరు ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియం. ఇందులో అంతర్జాతీయంగా వివిధ దేశాలకు, వివిధరంగాలకు చెందిన ప్రముఖుల నిలువెత్తు మైనపు బొమ్మలను ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందట ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియం బ్రాంచి ఢిల్లీలో కూడా నెలకొల్పారు. అయితే ఎంత అందంగా ఉన్నా బొమ్మ బొమ్మే. మనిషి మనిషే. ఎందుకంటే మనిషికి జీవం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మనసు ఉంటుంది. అందువల్ల ఒక మనిషిని, బొమ్మలాగా ట్రీట్ చేయటం అనాగరికం. “మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా

ఆడించు చున్నాడు బొమ్మలాట

నిజం తెలుసుకు మసలాలి మనిషిలాగా..” అంటూ సందేశమిచ్చారు ఓ సినీకవి.

మనిషి, మట్టిబొమ్మలాగా బతకకూడదని, బతుకుకు సార్ధకత ఉండాలని చెపుతూ మరో కవి

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ

పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ..

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు

మహా పురుషులవుతారు

తరతరాలకి, తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు” అని స్ఫూర్తినిచ్చారు.

నిత్య జీవితంలో వాడే అనేకానేక వస్తువులపై బొమ్మల చిత్రాలుండటం పరిపాటి. అంతెందుకు, డబ్బులు.. నాణేల పైన, కరెన్సీనోట్ల పైన కూడా బొమ్మలు చిత్రిస్తారు. నాణేల రెండు ముఖాల్లో ఒకటి బొమ్మ, మరొకటి బొరుసు. ఊరూరా మహనీయుల విగ్రహాలు, అభిమాన నాయకుల విగ్రహాలు ఉండటం మామూలే. నా ఆలోచనల్ని ఛేదిస్తూ.. ‘బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అరుపులు వినపడటంతో ఉలిక్కిపడ్డాను. లారీలో గణపతి విగ్రహాన్ని మంటపానికి తీసుకెళుతున్నట్లున్నారు. ఈ యేడు ఖైరతాబాద్ గణపతి ద్వాదశాదిత్య గణపతిగా దర్శనమివ్వబోతున్నాడట. ఎంత చెప్పినా ఇంకా ఈ రసాయనిక రంగుల, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుల వాడకం అనుకున్నంతగా తగ్గటం లేదు. ‘మట్టి గణపతే పూజకు మేలని ఇంకా ముమ్మరంగా ప్రచారం జరగాలి’ అనుకొంటుండగా నా స్టాప్ రానే వచ్చింది. బస్ దిగి నాలుగడుగులు వేయగానే మట్టి గణపతుల బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే ఓ బొమ్మను కొన్నాను. ‘తలచితినే గణనాథుని.. తలచితినే విఘ్నపతిని..’ అనుకుంటూండగా ఇల్లు రానే వచ్చింది. ఇంకేముంది.. తలపుల తలుపులు మూసేసి, మా ఇంటి తలుపు తట్టాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here