తమిళనాడులో తెలుగు తేజం కే.ఎస్.కోదండరామయ్య గారు

0
3

[dropcap]ఈ[/dropcap] రోజున తమిళనాట అందులోనూ హోసురు ప్రాంతంలో తెలుగు వుందంటే దానికి కారణము శ్రీ కే.ఎస్. కోదండరామయ్య గారు.

శివరామదాసు, రామాంబ దంపతులకు 1909 ఆగష్టు నెలలో 6వ తేదీన కే.ఎస్. కోదండరామయ్యగారు  జన్మించారు. శివరామదాసుగారు సంస్కృతాంధ్ర తమిళ కన్నడ భాషలలో నిష్ణాతులు. ఆయన ‘ఆనంద చంద్రిక’ అను పత్రికను, ‘రాజహంస’ అనే పత్రికను కూడ ప్రచురించేవారు.

శివరామదాసుగారి కుమారుడి పాండిత్యమును గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

1932 నుండి చాగలూరు ప్రాథమిక పాఠశాలలో 10 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా, 1942 నుండి 1952 వరకు హోసూరులోను, 1952 నుండి వేపనపల్లిలోను ఉపాధ్యాయుడిగా వుండేవారు.

భాషాప్రయుక్త రాష్ట్రముల ఏర్పాటు తర్వాత హోసూరుని ఆంద్రప్రదేశ్‌లో చేర్చాలని కృషి చేశారు. 1967 ఆయన ఉద్దనపల్లి నుండి   స్వతంత్ర అభ్యర్ధిగాతమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు.   తమిళనాడు అసెంబ్లీలో తెలుగులో ప్రమాణస్వీకారం చేసారు. మళ్ళీ రెండవసారి 1971లోను ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

కోదండరామయ్యగారి రాజకీయ జీవితానికి ముఖ్యపాత్ర వహించిన వారు కుందుమారనపల్లి శ్రీ వెంకటస్వామిగౌడు . రామయ్యగారిని ముఖ్యస్థానంలో కూర్చోబెట్టిన ఒక చారిత్రాత్మక సంఘటనకు వెంకటస్వామిగారు బాధ్యులు.

ఆయన ఎం.ఎల్.ఎ.గా వున్నప్పుడు రైతుల సంక్షేమానికి 9 ఆనకట్టల నిర్మాణానికి పూనుకొని విజయం సాధించారు. ఈ రోజు హోసూరు, శూళగిరి ప్రాంతాలకి నీటి సౌకర్యం కల్పించే కెలవరపల్లి రిజర్వాయరు ఆయన చలువే.కోదండరామయ్యగారు శాసన ప్రతినిధులయిన తరువాత తమిళనాడులోని తెలుగుపాఠశాలల్లో తెలుగుచదివిన వారినే ప్రధానోపాధ్యాయులుగా నియమించేట్టు చేశారు. తెలుగు పాఠశాలల సంఖ్యను పెంచారు.

అప్పటి తమిళనాట ముఖ్యమంత్రి అన్నాదురై కోదండరామయ్యగారి పట్ల గౌరవం చూపించేవారు.

తెలుగు భాష పరిరక్షణ కోసం కోదండరామయ్యగారు 1970లో హోసూరు తాలుకా ‘ఆంధ్ర సాంస్కృతిక సమితి’ని స్థాపించారు. ‘ఆంధ్ర కోసం ప్రకాశం’ పేరిట ఒక గ్రంధాలయాన్ని సమతిలో ఏర్పాటు చేశారు.  ఎన్నో కష్టాలకోర్చి ఆయన సమితికి ఒక భవనాన్ని నిర్మింపచేశారు. కానీ, ఆయనకు అప్పటికి తనదంటూ స్వంత గ్రుహం కూడాలేదు. ప్రకాశం పంతులు గారి శతజయంతి ఉత్సవాన్ని 1973లో బ్రహ్మండంగా జరిపారు. వరుసగా జరిగిన పలు కార్యక్రమాల్లో శ్రయుతులు మండలి వెంకట కృష్ణారావు, వావిలాల గోపాలకృష్ణయ్య, ఆవుల సాంబశివరావు, డా. సి.నారాయణరెడ్డి, దాశరథి, శ్రీశ్రీ వంటి దిగ్గజాలు హోసురుకు వచ్చేవారు.

తెలుగు వారి సొత్తుగా భావింపబడే అష్టావదానం కార్యక్రమాన్ని సమితిలో రామయ్యగారు జీవితాంతం నడిపారు. అన్నమాచార్య ప్రాజెక్టును హోసూరుకు పరిచయం చేసారు.

దక్షిణ రాష్ట్రాలలో తెలుగు వారి సంరక్షణ కోసం దక్షిణాంద్ర భాషా రక్షణ సంఘమును స్థాపించారు.

తరువాతి 1981లో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకోత్సవాలను ప్రారంబించారు. ఈనాటికి కూడ ఈ ఉత్సవాలు హోసూరులో జరుగుతున్నది.

శ్రీకృష్ణదేవరాయలపై కోదండరామయ్యగారు చేసినంత పరిశోధన మరెవ్వరూ చేసి వుండరు. “అష్టదిగ్గజకవి సమాజంలో రాయలాశ్రయించిన తొలి కవి ఎవరు?” శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్రను 6 భాగాలుగా రచించిరి. ఇందులో మొదట భాగం ఆయన మరణానంతరం ఆయన పెద్దకుమారుడు శ్రీ విశ్వనాథయ్యగారి యొక్క కృషితో ప్రచురింపబడెను. ఆయన రెండవ కుమారుడు గోపాలకృష్ణయ్య ఈనాటికి కూడ తన చేతనయిన పని చేస్తున్నారు..

ఆంధ్రత్వం నరనరానా జీర్ణించుకుని జీవించినవారు స్వర్గీయ కే యస్ కోదండరామయ్యగారు. తన దేహం, తన గేహం, తన ధనం తెలుగుజాతి ప్రభావానికి సమర్పించిన సత్పురుషుడాయన. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, స్థిర నివాసాంధ్రులకు-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలచిన ఏకైక నాయకుడు కోదండరామయ్యగారు. నమస్కరింపచేసే మూర్తియత్వం, నిస్స్వార్ధ సేవాపరాయణత, నిరాడంబరతలకు వారు పెట్టింది పేరు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో రాష్ట్రతాంధ్రులు, స్థిరనివాసాంధ్రుల పక్షాన కుడిభుజంగా నిలిచారు. అనేక అమూల్యమైన సలహాలు ఇచ్చి సభలు విజయవంతంగా జరగటానికి తోడ్పడ్డారు. ఆయన్ అంతర్జాతీయ పాలక తెలుగు సంస్థ పాలక మండలి సభ్యులయ్యారు. జూన్ 4వ తేది 1984 న  అంతర్జాతీయ తెలుగు సంస్థ సమావేశాలకు ఆయన హైదరాబాదు వచ్చారు. ఆయన ప్రతి సమావేశానికి తప్పకుండా హాజరయ్యేవారు. అలాగే, ఆ సమావేశానికీ హాజరయ్యారు. ఆయన ఎవరితోనో మాట్లాడాలని  ఫోను కలిపి గుండెనొప్పివచ్చి తెలుగు తెలుగు తెలుగు అంటూ తుదిశ్వాసను విడిచారు. భారతప్రభుత్వం తమిళానికి ప్రాచీనహోదానిచ్చి తెలుగును విస్మరించటం వారిని చాలా బాధించింది. 1970లో తెలుగుదేశం పత్రికలో కడు ప్రాచీన భాషే అది? తెలుగా? తమిళమా? అన్న వ్యాసం తరువాత తెలుగు ప్రాచీనభాషగా నిర్ణయించేందుకు పోరాటం చేయటంలో తనకు మార్గదర్శకంగా నిలచిందని శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు పేర్కొన్నారు. ఆయనపై ఉన్న మక్కువతో 2000వ సంవత్సరమున హోసురు మాజీ శాసనసభ్యులు శ్రీ.కే.ఎ.మనోహరన్‌గారి కృషితో కోదండరామయ్యగారి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కే.ఎన్.మనోహరన్ గారు మక్కువ తీరేలా 2010లో కోదండరామయ్యగారి శతజయంతి అద్వితీయంగా జరిపారు.
తెలుగువారు ఇరుగుపొరుగు రాష్ట్రాలలో భాషాల్పసంఖ్యాకులుగా పరిగణకు గురవటం కోదండరామయ్యగారిని ఎంతో బాధించింది. ఆనాటి ఆంధ్రనాయకులు రాజకీయ చాకచక్యం, పట్టుదలలు ఈ ప్రాంతాలపై చూపకపోవటంవల్ల మైసూరు రాజ్యంలోని తెలుగు ప్రాంతాలు తమిళనాడులోని ఆనాడు 90% పైగా తెలుగువారున్న హోసురు, డెంకణీకోట, వేపనపల్లి, గుడియాతం వంటి ప్రాంతాలలోని తెలుగువారికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం తెలుగువారిని తెలుగును నిర్లక్ష్యం చేసి తమిళాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించటంవల్ల, తమిళమంటే తెలియని తెలుగుప్రాంతాలలో తెలుగువారు అల్పసంఖ్యాకులయ్యారు. తెలుగు చదివేవారు దిక్కులేనివారయ్యారు. పాఠశాలలనుంచి తెలుగు అదృశ్యమవుతోంది. ఈ ప్రాంతాలలో తెలుగు దీపం పూర్తిగా కొడిగట్టే పరిస్థితి ఏర్పడింది. కోదండరామయ్యగారి మరణంతో ఈ ప్రాంతాలలో తెలుగు పరిరక్షణపోరాటాలు దిశ దిక్కుల్లేనివయ్యాయి. ప్రస్తుతపరిస్థితులకు వారి ఆత్మ ఎంతగానో క్షోభిస్తూంటుంది. ఇది గమనించి ఇకనైనా, ఉభయ రాష్ట్రాలలోని తెలుగువారు అనాధల్లా నిలచిన తెలుగేతర రాష్ట్రాలలోని తెలుగువారిని, అంతరించిపోతున్న తెలుగు భాషను పట్టించుకోవాలని, నిరంతరం తెలుగు పరిరక్షణకోసం పోరాటం జరుపుతూ చివరి శ్వాసలోవున్న తెలుగుభాషా ప్రేమికులకు అండగా నిలవాలని ప్రార్ధిస్తున్నాము. హోసూరు గాంధిగా మన్ననలందుకున్న కోదండరామయ్యగారి త్యాగాన్ని విస్మరించి ఆయనను మరచినా తెలుగుభాషను మాత్రం విస్మరించవద్దని విన్నపం.

సేవాతత్పరులను నిర్లక్ష్యపరచడం ఈ కర్మభూమిలో జరుగుతున్న ఖండించతగిన ఒక ప్రహసనం.

కోదండరామయ్యగారి కార్యక్రమ సరళిని వారి మనవడు శ్రీ.వి.మంజునాథశర్మ, ఉపాధ్యాయులు సాంఘిక కోణంలో చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here