వైరస్ : మరో మంచి మళయాల చిత్రం

1
3

[box type=’note’ fontsize=’16’] “కేరళలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం చివరి దాకా మనల్ని కుర్చీ అంచుమీదే కూర్చోబెడుతుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘వైరస్’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

ఈ వారం మరో మంచి మళయాల చిత్రం “వైరస్” పరిచయం చేస్తున్నాను. మన దేశంలో, కేరళలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం చివరి దాకా మనల్ని కుర్చీ అంచుమీదే కూర్చోబెడుతుంది. యెక్కడా విసుగు అనిపించదు, యే సన్నివేశమూ అనవసరమైనది అని అనిపించదు.

కథ క్లుప్తంగా ఇదీ. కేరళలోని వో మెడికల్ కాలేజి ఆసుపత్రిలో వొక రోగి వస్తాడు: జకరియా (జకరియా ముహమ్మద్). అతనికి జ్వరం, తలనెప్పి, తో పాటు డాక్టర్ల పరిభాషలో ARDS. ఈ చిత్రంలో వైద్యపరమైన పదాలు చాలానే వున్నాయి. అయితే మానవ సంవేదనలు పునాదిగా తీసిన ఈ చిత్రంలో అవి అంతగా అర్థం కాకపోయినా మన దృష్టి చెదరదు. అతన్ని ఆబిద్ రెహ్మాన్ (శ్రీనాథ్ భాసి పోయిన వారం చూసిన కుంబళంగి నైట్స్ లో బోణి పాత్ర చేశాడు) వైద్యం అందిస్తాడు. ఆ ఆసుపత్రి అంతా రోగులతో, వాళ్ళ కూడా వచ్చిన వాళ్ళతో, డాక్టర్లతో, నర్సులతో కిటకిటలాడుతూ వుంటుంది. మామూలుగానే వున్న ఆ రద్దీ మరి కొద్ది రోజుల్లో ఇంకా యెక్కువ అవుతుంది. జకరియానికి ఇచ్చిన వైద్యం పనిచెయ్యదు, వాంతులతో అతను మరణిస్తాడు. అన్ని పరీక్షలూ చేసి, అనుమానించిన యే జబ్బూ లేదనిపించుకున్నాక ఇలా మరణించడం డాక్టర్లకు కూడా ఆశ్చర్యంగానే వుంటుంది. తర్వాత మరో రోగి అఖిల (రీమా కళ్ళింగళ్) వస్తుంది. తను వొక నర్సు, జబ్బు లక్షణాలు అవే. రావడం రావడం తనను ఇంట్యూబేట్ చెయ్యమని అంటుంది. తను తన పసికందుకి పాలు ఇచ్చి వస్తున్నట్టు చెబుతుంది. తన పాప గురించిన భయమూ బెంగా వ్యక్త పరుస్తుంది. కాని ఆమె మాటలు పట్టించుకోకుండా డాక్టర్లు తమ పధ్ధతిలో వొకటి తర్వాత వొకటిగా అనేక పరీక్షలు చేస్తారు. ఆమెకు ఊపిరి అందదు, క్షణ క్షణానికీ పాడవుతున్న ఆరోగ్యం. తనకు తన పరిస్థితి తెలుసనీ, తను బతకదనీ, తనకు ఇంక్యూబేట్ అవసరమనీ చెబుతుంది. కొయికోడ్ కు చెందిన జకరియా మొదటి రోగిగా అలాంటి జబ్బు లక్షణాలతో మరింత మంది వస్తారు ఆసుపత్రికి. ఇప్పుడిక దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించక తప్పని పరిస్థితి. డాక్టర్లందరూ కలిసి వొక టీం గా మారి రాష్ట్ర వైద్య మంత్రి సి కె ప్రమీల (రేవతి) ను కూడా కలుపుకుని సంప్రదింపులు, సంభాషణలు చేస్తుంటారు. వొకడాక్టర్ కి నిపా వైరస్ అని అనుమానం కలుగుతుంది. వేరే ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవడం, నిపా గురించిన సమాచారం ఇతర దేశాలవి పరిశీలించి ఇది అదేనని తేలుస్తారు. అయితే ఈ భయంకరమైన రోగానికి మందు లేదు, చికిత్స లేదు, రాకుండా ఆపడానికి ఎలాంటి టీకా కూడా లేదు. పైగా ఇది చాలా త్వరగా వొకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. నమ్మడానికి కష్టం అనిపించే వేగంతో, చొరవతో, చురుగ్గా ఆ డాక్టర్ల సమూహం ఈ విషమ పరిష్తితిని ఎలా ఎదుర్కొన్నారో, ఎలా అధీనంలోకి తెచ్చారో అన్నది చూసి తెలుసుకోవలసిందే. కొన్నాళ్ళ పాటు బడులు అవీ మూసేస్తారు. కర్ఫ్యూ విధిస్తారు. మనిషి మరో మనిషి సంపర్కం లోకి రాకుండా చేస్తే కాస్తైనా ఆ జబ్బు పాకకుండా వుంటుందని. మరోపక్క ఆ రోగుల గురించిన అన్ని వివరాలూ రాబడతారు. వాళ్ళ చివర్న తిరిగిన స్థలాలు, కలిసిన మనుషులు వగైరా. యెందుకంటే ఈ రోగి సంపర్కంలోకి వచ్చిన ఇతరులకూ ఇదే జబ్బు వచ్చి తీరుతుంది. వాళ్ళు మరింతమందికి జబ్బు అంటించకుండా వుండేలా చూడటం అవసరం apoteksv.se. చివరికి వీళ్ళందరి సమిష్టి కృషితో ఆ జబ్బును అదుపులోకి తెచ్చి కేరళలో మళ్ళీ పూర్వపు స్థితిని తేగలుగుతుంది ఈ సమూహం. ఈ లోగా యెన్నో పాత్రలు, యెన్నో ఉపకథలు, యెంతో సమాచారం. అంతా వ్రాస్తే వొక నవలకు, క్లుప్తంగా వ్రాసినా వొక దీర్ఘ కథకు తగ్గదు.

గత యేడాది కేరళ చూసిన ఈ దురదృష్ట సంఘటన ఆధారంగా దర్శకుడు ఆషిక్ అబు దీన్ని చాలా బాగా తీశాడు. ఈ సినెమా నడక హాలీవుడ్ చిత్రం కంటేజియన్ కు పోలి వుంటుంది అంటారు. నేనైతే ఆ చిత్రం చూడలేదు. అయినప్పటికీ నేను అబుని అభినందించకుండా వుండలేను. అతను చేసిన విస్తార పరిశోధనలో వెలికి తీసిన అనేక అంశాలు, కథనాలు; వాటిలోంచి జాగ్రత్తగా ముఖ్యమైనవి యేరి (అన్నీ ముఖ్యమైనవే, అప్పటికే చిత్రం రెండున్నర గంటల నిడివి అయ్యింది), వాటిని చాలా చక్కగా కూర్చి, ప్రతి పాత్ర గురించీ చిన్న చిన్న కథలు చాలా క్లుప్తంగా, నేర్పుగా చెబుతూ కథ అల్లాడు. సామాన్యమైన విషయం కాదు. చాలా పాత్రలు నిజ జీవితంలోని మనుషుల కథ మీద ఆధారపడి మలచినవే. మనుషులు యెన్ని రకాలో, వాళ్ళ వెతలు అన్ని రకాలు. వొక స్త్రీ తను పాలు పట్టిన బిడ్డ గురించి బెంగపడటం, చాలా కాలం పాటు పిల్లలు కలగని జంట అప్పుడే తమ కలల పంట పండింది అని తెలుసుకుని కూడా సంతోషించలేని క్షణాలు, తమ వ్యక్తిగత జీవితం, కుటుంబం ఇవన్నీ పక్కకు నెట్టి అహర్నిశం ఆసుపత్రిలోనే సేవలందించిన డాక్టర్ల సమూహం, ఇలా చాలా కాథనాలు నేర్పుగా అల్లాడు. జబ్బు సోకిన మనిషినే కాదు అది అతని కుటుంబాన్ని, అతని చుట్టూ వున్న సమాజాన్ని కూడా వదలదు. ఇన్సినరేటర్లలో శవాలను దహనం చేస్తే ఆ పొగలు మళ్ళీ ప్రమాదకారి అవుతాయని, దూరంగా వున్న వో స్మశానంలో ఖననం చెయ్యాలని చూస్తారు. మొదట్లో అక్కడి ప్రజలు తమ ప్రాణ భయంతో అడ్డు నిలిచినా, మానవత్వం గెలిచి సహకరిస్తారు. వొక పక్క చర్చించక తప్పని గుణాలు చర్చించాలని, మరో పక్క చదువరికి సినెమా చూసేటప్పుడు యేమీ మిగలకుండా చెయ్యడం కూడా సరి కాదు అని అనిపిస్తోంది. చివర్లో రేవతి అన్నట్టు, మనిషి మనిషిని సాయపడటానికి చేసిన ప్రయత్నంలోనే ఈ వ్యాధి వ్యాపించింది. అలాగే మనిషి మనిషిని సాయపడటానికి సంసిధ్ధుడై, ప్రాణభయాన్ని పక్కకు నెట్టి సహకరించినందువల్లే తాము ఈ మహమ్మారిని అదుపులో తేగలిగాము అన్నది నిజం. కేరళలో సంభవించిన ఈ ఉత్పాతాన్ని ఎరిగిన వారు ఇందులోని ప్రతి పాత్ర వెనుకా నిజ జీవితంలో ఎవరు ఎవరో పోల్చుకోగలుగుతారు. మనకి సినెమా సినెమాగా నచ్చినా, ఆయా పాత్రల వెనుక నిజంగా మనుషులున్నారు అని తెలిస్తే ఇంకా నచ్చుతుంది.

ఇక నటన విషయానికి వస్తే, ఇందులో వొక్క నాయకుడు లేదు. అందరూ నాయకులే (gender neutral). అందరి పాత్రా సమానంగా విలువైనదే. నటన కూడా అందరివీ బాగున్నాయి. శ్రీనాథ్ కాకుండా సౌబిన్ సాహిర్ ని పోయినవారం కుంబళంగి నైట్స్ లో చూశాము. చాలా మంది నటీనటులు మళయాళంలో పేరున్నవారే. నేను పోల్చుకోలేకపోయినా వాళ్ళ నటన కారణంగా గుర్తుండిపోతారు. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకుడి మదిలో నిలిపేసే పనిలో చాయాగ్రాహకుడు రాజీవ్ రవి, సంగీతం అందించిన సుషిన్ శ్యాం లు అందించిన తోడ్పాటు గొప్పది. ముషిన్ పరారి, శరాఫు, సుహాస్ లు కలిసి వ్రాసిన స్క్రిప్ట్ పకడ్బందీ గా వుంది. నిజంగానే అధ్యయనం చేయతగ్గ స్థాయిలో వుంది.

ఇన్ని కారణాలుగా వైరస్ వొక తప్పక చూడాల్సిన చిత్రంగా చెప్పడానికి సంకోచించను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here