ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః – 8

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

రాక్షసః:

(సోద్వేగమ్) న ఖలు వ్యాపాదితః?

అర్థం:

(స+ఉద్వేగమ్=ఆందోళనగా), వ్యాపాదితః+న+ఖలు= చంపలేదు కద! (చంపబడలేదు కద).

విరాధ:

న హి. గృహీతగృహసారః సపుత్ర కళత్రో బన్ధనాగారే నిక్షిప్తః॥

అర్థం:

న+హి=లేదు, (చన్దనదాసః)గృహీత+గృహసారః=ఇంటిలో వున్న వస్తువులన్నీ జప్తు చేసి, చందనదాసు(ను), స+పుత్ర+కళత్రః=భార్యాబిడ్డలతో సహా, బన్ధనాగారే+నిక్షిప్తః=చెరసాలలో పెట్టాడు (చందనదాసు చెరసాల పాలయ్యాడు).

రాక్షసః:

త త్కిం పరితుష్టః కథయసి అపవాహితం రాక్షకళత్రమితి. నను వక్తవ్యం సంయమితః సపుత్ర కళత్రో రాక్షసఇతి.

అర్థం:

తత్=అటువంటప్పుడు, ‘అపవాహితం+రాక్షకళత్రమ్’+ఇతి=’రాక్షసమంత్రి భార్యను తప్పించడమైనది’ అని – కిమ్+పరితుష్టః+కథయసి=ఎందుకు సంతృప్తి పడుతూ చెబుతున్నావు? ‘సంయమితః+స+పుత్ర+కళత్రం+రాక్షసః’+ఇతి=’భార్యాబిడ్డలతో సహా రాక్షసమంత్రి బందీ అయ్యాడు’ అని, వక్తవ్యం+నను=చెప్పవలసి ఉంది కదా.

పురుషః:

(ప్రవిశ్య) జేదు అమచ్చో! ఏసో ఖు సఅడదాసో పడిహార భూమి మువట్ఠిదో, (జయ త్వమాత్యః! ఏష ఖలు శకటదాసః ప్రతిహార భూమి ముపస్థితః)

అర్థం:

(ప్రవిశ్య=వచ్చి) అమాత్యః+జయతు=అమాత్యుల వారికి జయమగుగాక! ఏష+శకటదాసః=ఈ శకటదాసనే వ్యక్తి, ప్రతిహార+భూమిం=ఇంటి సింహద్వారం దగ్గరకు వచ్చి, ఉపస్థితః=నిలిచిఉన్నాడు.

రాక్షసః:

భద్ర, ఆపి సత్యమ్?

అర్థం:

భద్ర=నాయనా, ఆపి+సత్యమ్=నిజమేనా?

పురుషః:

కిం అలిఅం అమచ్చపాదేసు విణివేదేమి? (కిం అళీక మమాత్యపాదేషు వినివేదయామి?)

అర్థం:

అమాత్యపాదేషు=పూజ్యమంత్రివర్యునికి, కిం+అళీకం+వినివేదయామి=అబద్ధం చెపుతానా ఏమి!

రాక్షసః:

సఖే విరాధగుప్త, కథ మేతత్?

అర్థం:

సఖే+విరాధగుప్త=మిత్రమా విరాధగుప్తా, కథం+ఏతత్=ఇదేమిటి? (ఇది ఎలా సాధ్యం?)

విరాధ:

అమాత్య, స్యా దేత దేవం, యతో భవ్యం రక్షతి భవితవ్యతా॥

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, ఏతత్+ఏవం+స్యాత్=ఇది ఇలాగ అయి ఉంటుంది, యతః=ఎలాగంటే, భవితవ్యతా+భవ్యం+రక్షతి=జరగవలసి ఉన్న దానిని, జరగబోయే విధి కాపాడుతుంది.

రాక్షసః:

ప్రియంవదక, కి మద్యాపి చిరయసి? క్షిప్రం ప్రవేశ యైనమ్॥

అర్థం:

ప్రియంవదక!, అద్య+అపి+కిమ్+చిరయసి=ఇప్పటికీ ఇంకా ఆలస్యం చేస్తావెందుకు? ఏనం=వీనిని, క్షిప్రం+ప్రవేశయ=వెంటనే రప్పించు.

పురుషః:

తథా – (ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

తథా=అలాగే, (ఇతి+నిష్క్రాన్తః=అని, వెళ్ళాడు)

(ప్రవిష్టః సిద్ధార్థకః, శకటదాసశ్చ)

(సిద్ధార్థకః+ప్రవిష్టః+శకటదాసః+చ=సిద్ధార్థకుడు శకటదాసుతో కూడా పంపబడ్డాడు)

శకటదాసః:

(స్వగతమ్)

శ్లోకం:

దృష్ట్వా మౌర్య మివ ప్రతిష్ఠితపదం

శూలం ధరిత్ర్యాః స్థలే,

త ల్లక్ష్మీ మివ చేతనా ప్రమథినీం

మూర్ధావబద్ధస్రజమ్

శ్రుత్వా స్వామ్యపరోప రౌద్ర విషమా

నాఘాతతూర్యస్వనాన్

న ధ్వస్తం ప్రథమాభిఘాతకఠినం

యత్తన్మదీయం మనః     21

అర్థం:

(స్వగతమ్=తనలో), యత్+మదీయం+మనః=ఏ నా మనస్సు, ధరిత్ర్యాఃస్థలే=(వధ్యస్థలంలో) నేల మీద, మౌర్యం+ఇవ=చంద్రగుప్తుని మాదిరిగా, శూలం= (శిక్ష కోసం ఉంచిన) శూలాయుధాన్ని, ప్రతిష్ఠిత+పదం=బాగా నిలదొక్కుకున్న దానిని, దృష్ట్వా=చూసి – (పాతి ఉన్న శూలం, రాజ్యంలో పాదుకొని స్థిరంగా నిలిచిన చంద్రగుప్తుని మాదిరిగా తోచింది).

చేతనా+ప్రమథినీమ్=అంతరంగాన్ని కల్లోలపరిచే, తత్+లక్ష్మీం+ఇవ=అతగాడి వైభవం వలె ఉన్న, మూర్ఖ+అవబద్ధ+స్రజమ్=తలకు చుట్టి వున్న పూలదండను, దృష్ట్వా=చూసి (తన తలకు చుట్టి వున్న పూలదండ, మనస్సును కల్లోలపరిచే చంద్రగుప్త వైభవంలాగ తోచింది), స్వామి+అపరోప+రౌద్ర+విషమాన్=ప్రభువును పదవి నుంచి దించే భయంకరమై వ్యతిరేకంగా (వినిపించే), ఆఘాత+తూర్య+స్వరాన్=(డప్పు) దెబ్బలు, తూర్యధ్వనులూ, శ్రుత్వా=విని (డప్పు దెబ్బలూ, తూర్యధ్వనులూ – ప్రభువును పదవి నుంచి తప్పించే ప్రయత్నంలో కటువుగా వినిపించే ధ్వనుల మాదిరిగా ఉన్నాయి). ప్రథమ+అభిఘాత+కఠినం=మొదటిదెబ్బకే మొద్దువారిపోయిన, (మదీయం+మనః=నా మనస్సును), న+ధ్వస్తం=చెదిరిపోలేదు.

వ్యాఖ్య:

వధ్యస్థానంలో పాతి వున్న శూలమూ, వధ్యుడైన తన తలకు చుట్టి వున్న పూలదండ, ఆ సందర్భంగా మోగించే డప్పులూ, తూర్యాల ధ్వనులూ శకటదాసుకు (భయం కారణంగా) మనస్సును మొద్దుబారజేయలేకపోయాయని సారాంశం.

అలంకారం:

‘మౌర్యమివ’, ‘తల్లక్ష్మీమివ’ – అనే ఉపమావాచకాలు ఉండడం వల్ల ఉపమాలంకారం.

‘ఆఘాతతూర్యస్వనా’లను ‘స్వామ్యపరోప రౌద్ర విషయాలు’గా రూపించడం వల్ల – రూపకాలంకారము కూడ.

వృత్తం:

శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.

శకటదాసః:

(ఉపసృ త్యావలోక్య చ, సహర్షమ్) అయ మమాత్య రాక్షస స్తిష్ఠతి, య ఏషః

శ్లోకం:

అక్షీణభక్తిః క్షీణేఽపి నన్దే స్వామ్యర్థ ముద్వహన్

పృథివ్యాం స్వామిభక్తానాం ప్రమాణే పరమే స్థితః॥      22

(ఉపసృత్య ప్రకాశమ్) జయ త్వమాత్యః॥

అర్థం:

(ఉపసృత్య=సమీపించి, అవలోక్య+చ= చూచి (కూడ), యం+ఏషః+అయం+అమాత్యరాక్షసః+ తిష్ఠతి=ఎవరైతే (ఈ చెప్పబోయే విధమైన వాడో) ఆ, యీ, రాక్షసమంత్రి కూర్చుని ఉన్నాడు.

నన్దే+క్షీణే+అపి=నందరాజు నశించినప్పటికి, అక్షీణ+భక్తిః+స్వామి+అర్థం+ఉద్వహన్=తరిగిపోని రాజభక్తిని తన ప్రభువు కోసం వహిస్తూ (ప్రకటించుకొంటూ), పృథివ్యాం+స్వామిభక్తానాం=ఈ భూమిపై ఉండే స్వామి భక్తిపరాయణులలో, పరమే+ప్రమాణే=అనితరంగా గణింపబడుతూ, స్థితః=నిలిచి ఉన్నాడు. (ఉపసృత్య=ఇంకా సమీపించ వచ్చి, ప్రకాశమ్=పైకి), అమాత్యః+జయతు=మంత్రిగారికి జయమగుగాక!

రాక్షసః:

(విలోక్య, సహర్షమ్) సఖే, శకటదాస, దిష్ట్యా కౌటిల్యగోచరగతోఽపి త్వం దృష్టోఽసి. త త్పరిష్వజస్వ మామ్

(శకటదాస స్తథా కరోతి)

అర్థం:

(విలోక్య=చూసి, స+హర్షమ్=సంతోషంగా) సఖే+శకటదాస=మిత్రమా! శకటదసా!, కౌటిల్య+గోచరగతః+అపి=కౌటిల్యుడి దృష్టిలో పడి కూడా, దిష్ట్యా=అదృష్టవశాత్తు, త్వం+ దృష్టః+అసి=నిన్ను చూడడం జరిగింది (నువ్వు చూడబడ్డావు). తత్=అందువల్ల, మామ్+పరిష్వజస్వ=నన్ను కౌగిలించుకోవయ్యా.

(శకటదాస+తథా+కరోతి=శకటదాసు ఆ విధంగా చేశాడు)

రాక్షసః:

(చిరం పరిష్వజ్య) ఇద మాసనమ్, ఆస్యతామ్

అర్థం:

(చిరం+పరిష్వజ్య=చాలాసేపు కౌగిలించుకుని ఉండి) ఇదం+ఆసనమ్=ఇదిగో యీ పీఠం, ఆస్యతామ్=కూర్చో.

(శకటదాసో నాట్యే నోపవిష్టః)

(శకటదాసః=శకటదాసు, నాట్యేన+ఉపవిష్టః=అభినయపూర్వకంగా కూర్చున్నాడు).

రాక్షసః:

సఖే శకటదాస, అథ కోఽయం మే ఈదృశస్య హృదయానన్దస్య హేతుః?

అర్థం:

సఖే+శకటదాస=మిత్రమా, శకటదాసా!, అథ=ఇక, మే+అయం+ఈదృశస్య+హృదయ+ఆనన్దస్య+హేతుః=ఈ నా హృదయానందానికి కారణం ఏమిటి (అంటావు?).

శకటదాసః:

(సిద్దార్థకం నిర్దిశ్య) అనేన ప్రియసుహృదా సిద్ధార్థకేన ఘాతకాన్ విద్రావ్య వధ్యస్థానా దపహృతోఽస్మి।

అర్థం:

(సిద్దార్థకం+నిర్దిశ్య=సిద్ధార్థకుణ్ణి చూపించి) అనేన+ప్రియసుహృదా+సిద్ధార్థకేన=ఈ ఆప్తమిత్రుడు సిద్ధార్థకుడు (చేత), ఘాతకాన్+విద్రావ్య=తలవరులను తరిమివేసి (వేయబడి), వధ్యస్థానాత్=మరణదండన విధించే స్థానం నుంచి, అపహృతః+అస్మి=(నన్ను) అపరిహించి (అపరించబడ్డాను) తెచ్చాడు.

రాక్షసః:

(సహర్షమ్) భద్ర సిద్ధార్థక, కిం పర్యాప్త మిద మస్య ప్రియస్య? తథాపి గృహ్యతామ్.

(స్వగాత్రా దవతార్య భూషణాని ప్రయచ్ఛతి.)

అర్థం:

(స+హర్షమ్=సంతోషంగా) భద్ర+సిద్ధార్థక=నాయనా సిద్ధార్థక, అస్య+ప్రియస్య=ఈ మంచిపనికి, పర్యాప్తం+ఇదం+కిం=ఇది సరిపోతుందా (సరిపోదు), తథా+అపి=అయినా, గృహ్యతామ్=తీసుకో (బడుగాక).

(స్వ+గాత్రాత్=తన శరీరం నుంచి, అవతార్య=తీసి, భూషణాని=నగలను (ఇంతకు పూర్వమే చంద్రకేతుడు కంచుకి ద్వారా పంపి, అలంకరింపజేసిన వాటిని), ప్రయచ్ఛతి=ఇచ్చాడు.).

సిద్ధార్థకః:

(గృహీత్వా, పాదయో ర్నిపత్య స్వగతమ్) అఖం ఖు అజ్జస్సోవ దేసో, హోదు. తహ కరిస్సమ్. (ప్రకాశమ్) అమచ్చ ఎత్థ పఢమపవిట్ఠస్స ణ త్తి కేవి పరిచిదో, జత్థ ఏదం అమచ్చస్స పసాదం ణిక్ఖివిఅ ణివ్వుదో భవిస్సమ్, తా ఇచ్ఛామి అహం ఇమాఏ ముద్దాఏముద్దిదం అమచ్చస్స ఎవ్వ భణ్డాఆరే ఠావిదుమ్, జదా మే పఓఅణం తదా గేహ్ణిస్సమ్॥

(అయం ఖలు ఆర్యోపదేశః, భవతు, తథా కరిష్యామి) (ప్రకాశమ్) అమాత్య, అత్ర ప్రథమ ప్రవిష్టస్య నా స్తి కోఽపి పరిచితః; యత్ర ఇమ మమాత్యస్య ప్రసాదం నిక్షిప్య నిర్వృతో భవామి। తస్మా దిచ్ఛా మ్యహ మేతయా ముద్రయా ముద్రితం అమాత్య స్యైవ భాణ్డాగారే స్థాపయితుమ్, యదా మే ప్రయోజనం తదా గ్రహీష్యామి॥)

అర్థం:

(గృహీత్వా=తీసుకుని, పాదయోః+నిపత్య=పాదాలపై పడి, స్వగతమ్=తనలో), అయం+ఆర్యః+ఉపదేశః+ఖలు=ఇది అయ్య (చాణక్యుడు) చెప్పినది కదా! (ఇలాగ చెయ్యమని), భవతు=కానియ్యి, తథా+కరిష్యామి=ఆయన చెప్పినట్టే చేస్తాను. (ప్రకాశమ్=పైకి), అమాత్య=మంత్రివర్యా, అథ+ప్రథమ+ప్రవిష్టస్య+కః+అపి+పరిచితః+న+అస్తి=ఇప్పుడే తొలిసారిగా ఇక్కడకు వచ్చిన (నాకు) పరిచయమైనవారెవరూ లేదు; యత్ర=ఎక్కడైతే, అమాత్యస్య+ఇమ+ప్రసాదం=మంత్రివర్యులిచ్చిన యీ నగలనే ప్రసాదాన్ని, నిక్షిప్య=ఉంచి (దాచి), నిర్వృతః+భవామి=తిరిగిపోదామంటే… (ఇక్కడ పరిచితులెవరూ లేరని వాక్యక్రమం). తస్మాత్ (కారణాత్)=అందువల్ల, ఏతత్+అహం+ఇచ్ఛామి=నేను ఇలాగ కోరుకుంటున్నాను – ఏమంటే, ఏతయా+ముద్రయా+ముద్రితం (ప్రసాదం)=ఇదిగో యీ (మంత్రిగారి) ఉంగరంతో ముద్రవేసిన తర్వాత, అమాత్యస్య+ఏవ+భాణ్డాగారే=మంత్రిగారి నిధిలోనే (ఖజానాలోనే), స్థాపయితుమ్=ఉంచడానికి, (ఇచ్ఛామి) కోరుకుంటున్నాను, యదా+మే+ప్రయోజనం=ఎప్పుడు నాకు అవసరమవుతుందో, తదా+గ్రహీష్యామి=అప్పుడు తీసుకుంటాను.

రాక్షసః:

భద్ర! కో దోష! శకటదాస, ఏవం క్రియతామ్।

అర్థం:

భద్ర=నాయనా, దోషః+కః=తప్పేమీ లేదు, శకటదాస – ఏవం+క్రియతామ్=అలాగే చెయ్యి (చేయబడుగాక).

శకటదాసః:

యదాజ్ఞాపయత్యమాత్యకః, (ముద్రాం విలోక్య జనాన్తికమ్) అమాత్య, భవన్నామాఙ్కి తేయం ముద్రా

అర్థం:

అమాత్యః+యత్+ఆజ్ఞాపయతి=మంత్రివర్యులు ఆజ్ఞాపించినట్టే (చేస్తాను), (ముద్రాం=ఉంగరాన్ని, విలోక్య=చూసి, జనాన్తికమ్=బాహటంగా), ఇయం+ముద్రా+భవత్+నామాఙ్కితమ్=ఈ ఉంగరం మీద మీ పేరున్నది.

* జనాన్తికమ్ అంటే:-

త్రిపతాకా కరే ణాన్యా నపవా ర్యాన్తరా కథామ్

అన్యో న్యామన్త్రణం య త్స్యాత్ జనాన్తేత జ్జనాన్తికమ్.

రాక్షసః:

(విలోక్య ఆత్మగతమ్) సత్యం. నగరాన్నిష్క్రామతో మమ హస్తాత్ బ్రాహ్మణ్యా ఉత్కణ్ఠావినోదార్థం గృహీతా। త త్కథ మస్య హస్తముపాగతా? (ప్రకాశమ్) భద్ర, సిద్ధార్థక, కుతస్త్వ యేయ మధిగతా?

అర్థం:

(విలోక్య=చూసి, ఆత్మగతమ్=తనలో) సత్యం=నిజం. నగరాత్+నిష్క్రామతః=పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సందర్భంలో, ఉత్కణ్ఠావినోదార్థం=తన లోని ఉత్సుకతతో కూడిన వినోదం కోసం, బ్రాహ్మణ్యా=ఇల్లాలు (చేత), మమ+హస్తాత్=నా చేతి నుంచి, గృహీతా=తీసుకున్నది (తీసుకోబడినది). తత్+కథమ్+ అస్య+హస్తం+ఉపాగతా=అది ఎట్లాగ ఇతడి చేతికి చేరిందీ? (ప్రకాశమ్=పైకి), భద్ర+సిద్ధార్థక=నాయనా సిద్ధార్థకా!, కుతః+త్వయా+ఇయం+అధిగతా=నీది దగ్గరకు ఇది ఎలాగ వచ్చింది (నీ చేత పొందబడింది)?

సిద్దార్ధకః:

అత్థి కుసుమపురే మణిఆరసెట్టి చందనదాసో ణామ, తస్స గేహ దుఆర పడిసరే పడిదా. మఏ ఆసాదిదా (అస్తి కుసుమపురే మణికారశ్రేష్ఠీ చన్దనదాసో నామ। తస్య గేహద్వార పరిసరే పతితా, మయా ఆసాదీతా)॥

అర్థం:

కుసుమపురే=పాటలీపుత్రంలో, మణికారశ్రేష్ఠీ+చన్దనదాసః+నామ=చందనదాసు అనే రత్నవర్తక శ్రేష్ఠి, అస్తి=ఉన్నాడు. తస్య+గేహద్వార+పరిసరే=అతడి ఇంటి (ముఖ) ద్వారం సమీపంలో, పతితా=పడి ఉండి, మయా+ఆసాదీతా=నాకు దక్కింది (నా చేత పొందబడింది).

రాక్షసః:

యుజ్యతే.

అర్థం:

యుజ్యతే=తగినట్టుగానే ఉంది (ఇలా పడిపోవడం).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here