[box type=’note’ fontsize=’16’] ‘5 సెప్టెంబరు – ఉపాధ్యాయ దినోత్సవం’ సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. మాజీ ఉపాధ్యాయులైన వారు, ఉపాధ్యాయవృత్తికి పూర్వవైభవం ఎలా వస్తుందో ఈ వ్యాసంలో సూచిస్తున్నారు. [/box]
[dropcap]నే[/dropcap]టి సమాజములో ఉపాధ్యాయులు ఎందుకు హేళనకు గురి అవుతున్నారు?
ఒకప్పుడు రాజులైన చక్రవర్తులైన ఎవరైనా గురువులను ఆరాధించేవారు, గౌరవించేవారు. రాజులు తమ కుమారులను గురుకులాలకు పంపి సామాన్య వ్యక్తులుగా విద్యాభ్యాసము చేయించేవారు. శ్రీకృష్ణుడు అంతటివాడే సాందీపుని దగ్గర గురుకులంలో ఉండి విద్యాభ్యాసము చేసినవాడే. గురువు సర్వత్రా పూజ్యనీయుడు కాబట్టి గురువును సాక్షాత్తు పరబ్రహ్మ అనేవారు.
ఇవన్నీ పాతకాలము, ఇంకా చెప్పాలంటే పురాణకాలం నాటి మాటలు. ఆ రోజుల్లో గురువుల బాధ్యత సమాజము అంటే రాజులు తీసుకొనేవారు, వారికి కావలసిన సౌకర్యాలు రాజులే సమకూర్చేవారు. నేటి పరిస్థితి పూర్తిగా భిన్నముగాఉంది. ఈ రోజుల్లో ఉపాధ్యాయుడు ఒక ఉద్యోగి, జీతము తీసుకుంటున్నాడు కాబట్టి మిగతా గౌరవ మర్యాదలు అనవసరం అని నేటి సమాజములో చాలా మంది అభిప్రాయము.
పూర్వము జీతాలు తక్కువగా ఉన్నరోజుల్లో బ్రతకలేక బడిపంతులు అనేవారు. దసరా టైంలో ఉపాధ్యాయుడు పిల్లలతో ఇంటింటికి తిరిగేవాడు. ఊర్లో వాళ్ళు ఆ ఉపాధ్యాయుడి మీద గౌరవము లేదా సానుభూతితో త్రుణమో పణమో ఇచ్చేవారు. ఇప్పుడు ఉపాధ్యాయులకు మంచి జీతాలు వస్తు ఉండటం వల్ల ఆర్ధిక పరిస్థితి మెరుగయింది. కానీ సామాజిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి
దీనికి కారణాలు గనుక విశ్లేషిస్తే ముఖ్యముగా సినిమాలు హాస్యము పేరుతో టీచర్‌ను అపహాస్యము చేసే ధోరణి ఎక్కువ అయింది. ఆశ్చర్యము ఏమిటి అంటే ఉపాధ్యాయ వృత్తి నుండి హాస్యనటులుగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు ఈ రకమైన అపహాస్యానికి ప్రసిద్ధి చెందారు. ఈ సినిమాలు చూసిన ఎవ్వరు ఉపాధ్యాయుడికి చచ్చినా ఏ మాత్రము గౌరవము ఇవ్వరు. ఇది నేటి పరిస్థితి.
ఉపాధ్యాయుడికి గౌరవము ఇవ్వవలసిన విద్యార్థి ఈ సినిమాల ప్రభావము వలన విద్యాలయాల ప్రాంగణాలలో ఎక్కువ భాగము ఉపాధ్యాయులను హేళన చేస్తున్నారు ఉపాద్యాయుడు కూడా వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి నా జీతము నాకు వస్తుంది అన్న ధోరణిలో ఉంటున్నాడు. తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ విద్యార్థులను మందలించి ఇది తప్పు అనే చెప్పే సాహసము చేయరు.
విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్య వాతావరణము సక్రమముగా లేదు. చదువుకోవాల్సిన సిలబస్‌తో విద్యార్థి, ఆ సిలబస్‌ను అధిక సంఖ్యలో ఉన్నవిద్యార్థులకు తక్కువ సమయములో భోధించవలసి రావటము ఇద్దరు ఒక రకమైన ఉద్రిక్త వాతావరణములో ఉన్నారు. ఇటువంటి పరిస్తుతులలో ఇద్దరి మధ్య ఉండవలసిన ప్రేమ ఉండటం లేదు. ప్రేమ లేకుండా జ్ఞానము వృద్ధి చెందదు, కాబట్టి ఇద్దరి మధ్య సత్సంబంధము పెంపొందించాలి. అప్పుడు మాత్రమే ఈ రకమైన రుగ్మతలు తగ్గుతాయి. ముందు విద్యార్థిని “నీవు ఉపాధ్యాయుడిని ఎందుకు అవహేళన చేస్తున్నావు” అని విద్యార్థి వైపు నుండి కారణాలు తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. వాళ్ళు చెప్పే కారణాలు తమాషాగా ఉంటాయి. టీచర్ సరిగా పాఠము చెప్పటం లేదని, అందరు హేళన చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అని, ఆడపిల్లల ముందు హీరోగా అనిపించాలని చేస్తున్నానని రకరకాల కారణాలు చెపుతారు. ఉపాధ్యాయులను హేళన చేయటము వల్ల నష్టం వాటిల్లేది విద్యార్థులకే గాని ఉపాధ్యాయుడి కాదు అన్న విషయాన్ని విద్యార్థుల స్పష్టముగా గుర్తించాలి లేదా సమాజము అంటే విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము నేటి తరానికి మన సాంప్రదాయాలు సంస్కృతీ పట్ల అవగాహన లేకపోవటము.
ఇంకా నాణానికి రెండో వైపు చూద్దాము. ఈ పరిస్థితికి ఉపాధ్యాయులు ఎంత వరకు భాద్యులు అంటే నిజాయితీగా ఒప్పుకుంటే ఎక్కువ భాగము ఉపాద్యాయులే కారణము అన్నది నిజము. ఈ మాట దాదాపు నలభై ఏళ్ళు పైగా ఉపాద్యాయ వృత్తిలో ఉన్న నేను ఎంతో బాధతో చెపుతున్నాను ఎందుకంటే అధిక భాగము ఉపాధ్యాయులు విద్యాబోధన అనేది చాలా మెకానికల్‌గా, జీతము తీసుకుంటున్నాము కాబట్టి క్లాసుకు వెళ్లి మొక్కబడిగా పాఠాలు చెపుతున్నారు. విద్యార్థి అర్ధము చేసుకుంటున్నాడా లేదా అనేది వారికి అక్కరలేదు. ఎక్కడైతే ఉపాధ్యాయుడు పూర్తిగా విద్యాబోధనలో లీనమై విద్యార్థి మనస్సుకు హత్తుకొనేటట్లు బోధిస్తే విద్యార్ద్ అట్టి ఉపాధ్యాయుడిని జీవితాంతము గుర్తు పెట్టుకుంటాడు, గౌరవిస్తాడు. అటువంటి ఉపాధ్యాయులు అవహేళనకు గురికారు, గౌరవింపబడతారు. అటువంటి ఉపాధాయ్యులను నేను నా సర్వీస్‌లో చూసాను. నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయినాక కూడా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాడని తెలుసుకొని పూర్వ విద్యార్థులు ఆయనకు చెప్పకుండా సన్మానము పేరుతో ఐదు లక్షల పర్స్ ప్రెజంట్ చేశారు. ఈ మధ్య బదిలీపై వెళుతున్న ఒక జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడిని విద్యార్థులు స్వయముగా బండి లాగుతూ ఊరిలో ఊరేగించారు. అలాగే టైపు, షార్ట్‌హ్యాండ్ నేర్పిన గురువుకు హైదరాబాద్‌లో పూర్వ శిష్యులు సన్మానము చేసి బంగారు కడియాన్ని బహుమతిగా ఇచ్చి వారి అభిమానాన్ని చూపించుకున్నారు. ఇవన్నీ పేపర్లలో వచ్చిన వార్తలే. ఇక్కడ ఏ సందర్భములో ఉపాద్యాయుడు తనకు ఇది కావాలని అడిగినవి కావు, పై పెచ్చు ఈ రకమైన సన్మానాలను తిరస్కరించినవారే.
అంటే ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల నిబద్దత కలిగి ఉంటాడో విద్యార్థులను ప్రేమగా సొంత బిడ్డలల్లే చూస్తూ విద్యాబోధన చేస్తాడో అటువంటి గురువుకు నాడు నేడు ఎప్పుడైనా గౌరవము ప్రేమాభిమానాలు లభిస్తాయి. కానీ నేటి సమాజములో ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారు విద్యార్థులతో కలిసి మద్యపానము చేయటము, తన దగ్గర చదువుకుంటున్న కూతురుతో సమానమైన విద్యార్థినులతో అసభ్యముగా ప్రవర్తించటం, కొన్ని సందర్భాలలో విద్యార్ధినులను మానభంగము చేయటము తప్పని పరిస్థితులలో వివాహము చేసుకోవటం తరచూ వార్తలలో వింటున్నాము. ఇటువంటివి కొన్నే అవవచ్చు కానీ వీటి వల్ల మొత్తము ఉపాధ్యాయ వర్గము అవమానాల పాలవుతుంది సమాజములో గౌరవాన్ని కోల్పోయి అవహేళన పాలవుతున్నారు.
ఉపాధాయుడి ప్రవర్తన విద్యార్థుల మనస్సుపై ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడు పిల్లలకు ఆదర్శవంతముగా ఉండాలి. ఆతను తప్పుడు పనులు చేస్తూ పిల్లలకు నీతివాక్యాలు బోధిస్తే పిల్లలు వినరు సరికదా ఉపాధాయ్యుడిని అనుసరిస్తారు. కాబట్టి ఉపాధ్యాయుడు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజములో ఇతరులకు ఆదర్శవంతముగా వుంటే ఈనాడు అవహేళనకు గురి అవడు. నా జీవితము నా ఇష్టము అనుకోవటానికి ఉపాధ్యాయుడికి అవకాశము లేదు. ఎందుకంటే ఇతర ఉద్యోగాల లాంటిది కాదు ఉపాధ్యాయ వృత్తి. ఇవి గమనించి ఉపాధ్యాయుడు సమాజములో మెలిగితే ఉపాధ్యాయవృత్తికి పూర్వవైభవం వస్తుంది.