[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 23వ భాగం. [/box]
[dropcap]వా[/dropcap]సుదేవ్ చెప్పింది విని షాకైంది నీలవేణి.
“రాస్కెల్, దుర్మార్గుడు. వాడి అకృత్యాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయన్న మాట… వాసుదేవ్!… ఇన్నాళ్ళూ మాకు ఎంతో సహాయం చేసావనుకునేదానిని… కాని ఇప్పుడు ఆ దుర్మార్గుడిని చట్టానికి అప్పగించడం పట్టలేని సంతోషాన్నిస్తోంది. సమాజంలో అమ్మని భర్త లేకుండా తల్లయిన పతితగా, తండ్రి లేకుండా పుట్టిన నా పుట్టుక చూసి నవ్వుకునే, చీదరించుకునే మనుషుల మధ్య ఎంతో మానసిక క్షోభ అనుభవించిన నేను… ఆ దుర్మార్గుడు ఎవరో, ఎక్కడుంటాడో తెలియక బాధపడ్డాను… ఇప్పుడా బాధను కూడా పోగొట్టావు. థాంక్యూ వాసుదేవ్” అంది నీలవేణి.
“నీలూ! ముందు మనం చేయవలసింది అమ్మను తీసుకుని స్టేషనుకి వెడదాం. డి.ఐ.జి. అంకుల్‌తో మాట్లాడాను, పరిస్థితి వివరించాను. అమ్మ ఇన్నాళ్ళూ భయంతో, ఆందోళనతో బ్రతుకుతూ వచ్చించని, ఆవిడను భయం నుండి విముక్తి చేయాలని… వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్… బోలెడు సెక్యూరిటీ పెట్టారు. అమ్మను తీసుకువెళదాం… మన ప్రయత్నం సక్సెస్ అయితే ఓకే, లేకపోతే ఏ నష్టం జరగదు.”
“త్వరగా బయలుదేరుదాం… వాడిని వేరే జైలుకి పంపించే అవకాశం ఉంది.”
“సారీ! ఐ యామ్ వెరీ వెరీ సారీ వాసుదేవ్! నేను ఆ రాస్కెల్ ముఖం చూడను. ఒకవేళ వచ్చినా వాడిని చంపితీరుతాను. అమ్మను… తీసుకువెళ్ళు” అని అంటుంటగానే జానకి గదిలోండి తొంగి చూసి, “దేవ్! వచ్చావా…” అని గబగబా వాసుదేవ్ దగ్గరకు వచ్చి… “పవిత్రకి ఏం కాలేదు కదా…. వాడు…” అని కళ్ళు భయంగా పెట్టి, “వాడిని చంపేయ్” అని గభాలున లోపలికి వెళ్ళి కర్ర తెచ్చి వాసుదేవ్ చేతిలో పెట్టి… “ఈ కర్రతో చంపేయ్” అంది.
వాసుదేవ్, నీలవేణి ఆశ్చర్యంగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
“వాసుదేవ్! నువ్వు అనుకున్నదే నిజం అవుతుందేమో అనిపిస్తోంది… అమ్మ మనసులో ఆ భయం అలానే ఉంది… తీసుకువెళ్ళు వాసుదేవ్” అంది.
“ఆంటీ.. మనం ఒక చోటికి వెళదాం వస్తారా” అన్నాడు వాసుదేవ్.
సంతోషంగా చూసి… “పద… ఎక్కడికి? గుడి కా?” అంది.
“ముందు నాతో రండి” జానకి చెయ్యి పట్టుకొని అడుగులు వేశాడు.
కారులో పోలీసు స్టేషన్ కి వెళ్ళాడు వాసుదేవ్.
స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ గబగబా వాసుదేవ్ కి ఎదురు వచ్చి “గుడ్ మార్నింగ్ సార్… డిఐజీ విజయకాంత్ గారు ఫోన్ చేసి చెప్పారు… రామ్‌లాల్ చాలా క్రూరుడు… బలవంతుడు… highly influenced man… చాలా గట్టి బందోబస్తు ఉంది. తీసుకువస్తాం” అని కానిస్టేబుల్స్ వైపు చూసాడు.
ఆశ్చర్యంగా పోలీస్ స్టేషన్ నలువైపులా చూడసాగింది జానకి.
చేతులకు బేడీలు వేసి, చుట్టూ పోలీస్ బందోబస్తుతో రామ్‌లాల్‌ని తీసుకువచ్చారు.
ఎదురుగా వాసుదేవ్‌నీ, ప్రక్కనే జానకిని చూసి ఒక్క నిమిషం ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా…
చివ్వున తల ఎత్తి తీక్షణంగా రామ్‌లాల్ వైపు చూసి ఆవేశంతో చప్పున ఎస్‌ఐ చేతిలోనుండి లాఠీ తీసుకుని “రాస్కెల్… నువ్వు… నువ్వు… ఇక్కడున్నావా?” అని గొడ్డును బాదినట్లు లాఠీతో రామ్‌లాల్‌ను కొట్టసాగింది.
“మేడమ్! మీరలా కొట్టకూడదు… చట్టం వీడికి కఠినమైన శిక్ష వేస్తుంది…” అని ఎస్‌ఐ అనగానే…
“లేదు ఎస్‌ఐ గారు! ఇరవై ఏళ్ళ పైనే ఈవిడ… వీడి వలన… నరకం అనుభవిస్తూ బ్రతికింది. ఆవిడ మనసులో ఉన్న బాధ… కోపం… ఆవేశం… అన్నీ పోవాలంటే ఆవిడకేమనిపిస్తే అది చేయనివ్వండి… అప్పుడే ఆవిడ మనసు శాంతించి మామూలువుతుంది.”
“ఏయ్! ఆఫ్టరాల్ బచ్చాగాడివి… నా నెట్‌వర్క్ తెలిస్తే నోట మాట రాకుండా నోరెళ్ళబెడతావు… ఛ… ఛ! ఏమిటీ పిచ్చిదానితో కొట్టిస్తున్నావ్ ఎస్‌ఐ? నేను బయటకు రానీ, నిన్ను ఇంటికి పంపిస్తాను” అన్నాడు రామ్‌లాల్ గంభీరంగా.
“ఏంటిరా నన్ను పిచ్చిదాన్నంటున్నావా?” అని తిరిగి లాఠీతో కొడుతూ… “అసలు వీడిని కొట్టి నా చేతులు నొప్పి పుడుతున్నాయి” అని గభాలున ఎస్‌ఐ జేబులోనున్న రివాల్వర్ తీసుకోబోయింది.
ఎస్‌ఐ శ్రీనివాస్ చప్పున రివాల్వర్‍ని గట్టిగా పట్టుకుని… “మేడమ్! వీడిని చట్టం వదిలిపెట్టదు…. ఇలాంటి నరరూప రాక్షసుల కోసమే కేంద్రప్రభుత్వం ఇటీవల అత్యవసరాదేశం… ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. నిర్భయ చట్టం… ఇలాంటి చట్టాలు కాకుండా పోక్సో-2012 చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం నుండీ ఎటువంటీ క్రిమినల్ కూడా తప్పించుకోలేడు” అని అన్నాడు.
పోలీసులు రామ్‌లాల్‌ని ఇరువైపులా గట్టిగా పట్టుకుని ఉండడంతో ఆవేశంతో ఊగిపోసాగాడు.
“రండి ఆంటీ! వెళదాం” అని జానకి చెయ్యి పట్టుకొని బయటకు అడుగులు వేసాడు.
***
అందరూ కూర్చుని భోంచేస్తున్నారు…. వార్తలు ప్రారంభమయ్యాయి.
“ఎన్నో ఏళ్ళుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ రామ్‌లాల్ అరెస్ట్… ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతూ… ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తూ, ఎన్నో ఆశ్రమాలను దత్తత తీసుకుని, ఎంతో మర్యాదస్తుడిగా, గౌరవప్రదమైన వ్యక్తిగా, దైవభక్తుడిగా నటిస్తూ ఇన్నాళ్ళు ముసుగులో దాక్కుని ఎన్నో అకృత్యాలు చేశాడు. ఈ క్రిమినల్ మెయిన్ టార్గెట్ ఆడవాళ్ళు… పసిపిల్లల దగ్గర నుండి నడివయసు ఉన్న ఆడవాళ్ళను కూడా కిడ్నాప్ చేసి గల్ఫ్ దేశాలకు అమ్మేస్తాడు. ఈ క్రిమినల్‌కి విదేశాలలో బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. వయసు అరవై ఏళ్ళు దాటుతున్నా ఈ దుర్మార్గుడికి స్త్రీల పట్ల వ్యామోహం తగ్గలేదు. తన కన్ను పడిన అమ్మాయిలను ఎన్నో రకాల పన్నాగాలు పన్ని బ్లాక్‌మెయిల్ చేసి తన కోరిక తీర్చుకుంటాడు. కాలం ఎప్పుడూ వాడికి అనుకులంగా ఉంటుందనుకున్నాడు…. కానీ ఉన్నత భావాలు, సమాజ సేవ పట్ల ఆసక్తి ఉండి, ప్రాణం మీద తీపి లేని ధైర్యవంతుడైన ఉడుకు రక్తం గల యువకుడు ధైర్యసాహసాలు చూపి ఈ పెద్ద క్రిమినల్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టి చట్టానికి అప్పగించాడు. ఈ క్రిమినల్ గురించి వివరాలు తెలుసుకొని పోలీసు ఆఫీసర్లే నివ్వెర పోతున్నారు…. ఇంకా రామ్‌లాల్ గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఇటువంటి చీడపురుగును పట్టుకొని పోలీసులకు అప్పగించిన వాసుదేవ్‌ని ముఖ్యమంత్రిగారు ప్రశంసించారు. అంతేకాదు, ఆ యువకుడు వాసుదేవ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు… వాసుదేవ్‌కి సమాజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తించి, ప్రత్యేకంగా అభినందించాలనుకున్నట్లు తెలిపారు. ఇలాంటి యువత సమాజానికి ఎంతో అవసరమనీ, స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు – కోటా ప్రకారం ఎలా ఇస్తున్నారో, అలాగే ప్రాణాలకు తెగించి సమాజ సేవ చేస్తున్న వాసుదేవ్‌కి ఉన్నతమైన, బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి అన్నారు…”
వార్తలు వింటున్న పవిత్రకి కన్నీరు ఆగలేదు.
అందరూ నిశ్చేష్టులయ్యారు.
గభాలున భోజనం దగ్గర నుండి లేచి, చెయ్యి కడుక్కొని, “పవిత్రా! ఏమిటమ్మా ఇదంతా… నీకేం ప్రమాదం జరగలేదు కదా” అంది సుమిత్ర.
పవిత్ర తల్లి వైపు చూసి… “అమ్మా! నాకేం కాలేదమ్మా… తమ్ముడు నా జీవితం కాపాడాడు…” అంది.
“దేవ్! నా కళ్ళు తెరిపించావు బాబూ! నువ్వు లేనిపోని విషయాల్లో కలగజేసుకుంటున్నావు అనుకున్నాను కాని… ఈ రోజు మీ అక్క జీవితాన్నే రక్షించావు. యూ ఆర్ గ్రేట్ దేవ్… నీలాంటి కొడుకు ఉన్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది” అన్నాడు నిరంజనరావు.
“వాడి మనసు బంగారం అని ఎప్పటి నుండో చెబుతున్నాను… అయినా నా మాట ఎప్పుడు పట్టించుకోలేదు… ఇప్పుడైనా అర్థం అయిందా?”
“సుమిత్రా!… నాకో విషయం అర్థం అయింది”
“పిల్లలు ప్రయోజకులుగా ఎదగాలన్నా, ఎందుకు పనికిరాని జులాయి వాళ్ళుగా తయారయినా, తల్లి పెంపకంలో తీసుకునే జాగ్రత్తల్లోనే ఉంటుంది. ఫాస్ట్ యుగంలో పేరెంట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటూ, జాలీ లైఫ్‌కి ఆకర్షితులై పిల్లల నడవడికపై శ్రద్ధ పెట్టకుండా కొందరు పేరెంట్స్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో చెదుకే యువత ఆకర్షితులవుతున్నారు. అందుకే సమాజానికి కొందరు యువత వలన చెడు సంఘటనలు జరుగుతున్నాయి… పట్టపగలే తప్పతాగి డ్రైవింగ్ చేస్తూ ఎందరో తల్లితండ్రుల కడుపుకోతకు కారణం అవుతున్నారు. ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. నీ పెంపకం వలనే వాసుదేవ్ సమాజనికి పనికి వచ్చే వ్యక్తి అయ్యాడు.”
“హమ్మయ్య!… నిజాన్ని ఒప్పుకున్నారు… వీడికి భవిష్యత్ మీద అవగాహన లేదు… ప్రతీదీ కేర్‌లెస్, జానేదేవ్ అంటాదు… ఇలా అయితే ఎలా అనేవారు.”
చప్పున అన్నాడు వాసుదేవ్ – “అమ్మా! మీరే కాదు అందరూ నన్ను ఎందుకు మెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికీ చెబుతున్నాను…. అమ్మా! నాకేదైతే చేయాలనిపిస్తుందో ఒక్క నిమిషం ఆలోచించకుండా అదే చేస్తాను… అది చేసేడప్పుడు నా గురించి నేను ఆలోచించను… ఇది నా బలహీనత కావచ్చు లేదా బలం కావచ్చు… ప్లీజ్ అందరితో పాటు మీరందరూ నన్ను ఏదో గొప్ప పని చేసానని అనుకోకండి…”
“అయినా మనం మనుషులం అమ్మా… నోరు లేని జంతువులు కూడా వాటిల్లో ఒకదానికి ఆపద కలిగితే తక్కినవన్నీ ఒక్కటై దానిని రక్షించాలని చూస్తాయి…”
“చాలా సంతోషం బాబూ! ఇప్పుడే న్యూస్ చూశాను… స్వయంగా ముఖ్యమంత్రిగారే నిన్ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. అన్నట్టు నీకు బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు… ఎలాగూ సివిల్స్ వ్రాసావు… త్వరలో నిన్ను ఐఎఎస్ ఆఫీసర్ గానో, ఐపిఎస్ ఆఫీసర్ గానో చూస్తాం అన్న మాట” అని హాల్లోకి వస్తూ సంతోషంగా అన్నాడు గుర్నాధం.
“మీరనుకున్నట్లు, ముఖ్యమంత్రి గారన్నట్లు అలాంటి ఉద్యోగం నేను చేయలేను అంకుల్!… పాపం మెరిట్‌లో ఎవరికో రావలసిన జాబ్ నేనెలా చేస్తాను… సివిల్స్ వ్రాసాను, మంచి ర్యాంక్ వస్తే ఓకే… లేకపోతే వేరే ఇంకేదైనా చేస్తాను. నాకు సివిల్స్ లోనే జాబ్ రావాలని లేదంకుల్!… జానేదేవ్!”
ఆశ్చర్యంగా చూశాడు గుర్నాధం.
***
హాలులో కూర్చుని టీవీ చూస్తున్నారు వాసుదేవ్, పవిత్ర.
వంటింటిలో నుండి బజ్జీలు ప్లేటు నిండా పెట్టుకుని వచ్చింది సుమిత్ర.
“అమ్మా! ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తావు? తిని తిని కదలలేకుండా తయారవుతాం” అంది నవ్వుతూ పవిత్ర.
“చాల్లే!… రోజూ ఎక్కడ చేస్తున్నాను… చెట్టు నుండి అరటికాయలు కోయగానే బజ్జీలు చేయాలనిపించింది. బజ్జీలంటే నీకెంతో ఇష్టం… పెళ్ళయి వెళ్ళాక ఎవారు నీకు చేసి పెడతారు?” అంది సుమిత్ర బాధగా.
తల్లి కళ్ళల్లో కనబడుతున్న ప్రేమను చూసి అదోలా అయింది పవిత్ర….
నవ్వుతూ అంది “నాకు బజ్జీలు తినాలనిపించినప్పుడల్లా నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా… ఒకవేళ నాకు కుదరలేదనుకో, ప్రదీప్‌ని పంపిస్తాను… బాక్సులో పెట్టి ఇవ్వు.”
“అయ్యో! అల్లుడు గారు ఎందుకమ్మా… దేవ్ తెచ్చి ఇస్తాడులే” అంది కంగారుగా.
“అమ్మా! నా జోకు అర్థం కానందుకు నవ్వు వస్తోంది… యూ.ఎస్.ఎ.లో నా ఫ్రెండ్స్‌కి బజ్జీలు చేసిపెట్టేదానిని తెలుసా?” అంది.
“అయితే ఒక పని చెయ్యి అక్కా… ఈ సన్‍డే బజ్జీలు నువ్వు చెయ్యి… నీలూకి కూడా ఇష్టం” అన్నాడు వాసుదేవ్.
“ఒరేయ్! నాకు బజ్జీలు చేయడం వచ్చో రాదో అని టెస్ట్ పెడుతున్నావా? నిజం చెప్పనా? బజ్జీలు చేస్తాను కాని అమ్మ అంత టేస్ట్‌గా చేయలేను” అంది పవిత్ర.
అందరూ నవ్వుకోసాగారు.
వసుంధర, అమ్మ, నాన్నగారు గబగబా హాలులోకి వచ్చారు.
“మీరందరూ చాలా సంతోషంగా వున్నారు. మా గురించి ఆలోచించండి… ఇదేమైనా బాగుందాండీ?” అంది డాక్టర్ ప్రమీల.
“బాగుంది, మన బాధ వాళ్ళకేం తెలుసు? దేవ్ చేసిన పని వాళ్ళకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి వెధవ పని చేసానని ఇంట్లో చెప్పడుగా…” అన్నాడు డాక్టరు రమేష్.
ఆశ్చర్యంగా చూశాడు వాసుదేవ్.
సుమిత్ర ఏం మాట్లాడాలో తెలియనిదానిలా కంగారుగా “ఒకసారి నర్సింగ్‌హోమ్ ఇనాగ్యురేషన్‌కి వచ్చాను. నమస్కారం… రండి కూర్చోండి…” అంది.
“వసూ చిన్ననాటి స్నేహితుడు, ఎంతో మంచోడు అని వసు మీ వాడితో క్లోజ్‌గా ఉన్నా మేము పట్టించుకోలేదు. మా వసుకి ఎంబిబిఎస్ సీటు వచ్చి వేరే కాలేజీకి వెళ్ళింది, దారులు వేరయ్యాయి, ఫ్రండ్స్ కాబట్టి మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం… ఇంత పని చేస్తాడనుకోలేదు…” అంది డాక్టర్ ప్రమీల.
పవిత్రా, వాసుదేవ్ ఆశ్చర్యంగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
కంగారుగా అంది సుమిత్ర – “మా దేవ్ ఏం చేసాడండీ?… నా కొడుకని చెప్పుకోవడం కాదు కాని నా కొడుకు బంగారం…”
“చాల్లెండి… విషయం తెలియక కొడుకు బంగారం అంటున్నారు” అంది కోపంగా డాక్టర్ ప్రమీల.
“ఉండు ప్రమీలా… నన్ను చెప్పనీ! చూడమ్మా… మా పెద్దమ్మాయి డెలివరీ అని మేము యూ.ఎస్.ఎ. వెళ్ళాం. అయినా చిన్ననాటి ఫ్రెండ్ కదా? ఇలా చేయడానికి ప్రాణం ఎలా ఒప్పింది మీ అబ్బాయికి? ఇదేం బాగుండలేదు” అన్నాడు డాక్టర్ రమేష్.
“ఏంటమ్మా వసూ! మీ అమ్మ, నాన్నగారు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు…. దేవ్ ఎలాంటివాడో నీకు తెలుసు… వాడికి నచ్చనిది… ఎవరు ఎంత చెప్పినా చెయ్యడు…”
“ఏంటండీ, ఇంకా కొడుకుని వెనకేసుకుని వస్తున్నారు. మా వసూ నచ్చింది కాబట్టే తల్లిని చేశాడు…. ఇటు చూడండి… She is pregnant… అప్పుడే పొట్ట ఎలా కనబడుతోందో?… ఇది చూసి కూడా మీవాడు తప్పు చేయలేదంటారా?” అంది డాక్టర్ ప్రమీల.
షాకై… పిచ్చిదానిలా చూస్తోంది సుమిత్ర.
(ఇంకా ఉంది)