[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత్రి జి.ఎస్. సుబ్బలక్ష్మిగారు వ్రాసిన 13 కథల సంపుటి ‘ఇంటింటికొక పూవు‘.
“సాధారణంగా మనిషి మనసులోనూ, పరిసరాలలోనూ అతనికి అంతుపట్టని సమస్యలు ఎన్నో ఉంటాయి. కొన్ని సమస్యలను వింటున్నా, చూస్తున్నా మనసు కలతపడుతుంది. కలతపడిన మనసు లోంచి వచ్చిన కదలికే కథ అవుతుంది. ఆ కదలిక మరో మనసుని కదిలించినప్పుడే ఆ కథకు సార్థకత. అటువంటి కథల సమాహారమే ఈ ‘ఇంటింటికొక పూవు’ ” అని రచయిత్రి అన్నారు.
***
జీవితంలో ఆస్తీ, అంతస్తు, చక్కని కుటుంబం… అన్నీ వున్న గురుమూర్తికి ఓ విషయంలో సమస్య ఎదురవుతుంది. వైద్యుడు కూడా సరైన పరిష్కారం కనుగొనలేకపోతాడు. పిల్లలు ఇంటర్నెట్ కూడా తెగ వెతుకుతారు, పరిష్కారం కోసం. చివరగా ఓ మానసికవైద్యుడు ఈ జబ్బుకి పరిష్కారం చూపిస్తాడు ‘మనసు పొరల్లో‘ కథలో.
అనారోగ్యం పాలయిన తల్లిదండ్రులని చూద్దామని ఊరుకి వెళ్ళిన తన భార్యని… ఆ గ్రామంలోని విచిత్రమైన ఆచారం కారణంగా తిరిగి తన ఇంటికి రప్పించుకోలేకపోతాడు గురుమూర్తి. ఏళ్ళు గడిచిపోతాయి. కొడుకు పెద్దవాడవుతాడు. వివరాలు తెలుసుకున్న కొడుకు మధు తల్లిని తీసుకొస్తానని ఆ ఊరు వెళతాడు. అక్కడతనికి ఓ రహస్యం తెలిసి నివ్వెరపోతాడు. ‘నీకోసమె నే జీవించునదీ‘ కథ ఆసక్తిగా చదివిస్తుంది.
జీవన విధానాలలో మార్పులు చేసుకుని వేరొకరిలా బ్రతకాలనుకున్న వ్యక్తికి, అతని భార్య అడ్డుపుల్ల వేసి జీవితం దారితప్పకుండా కాపాడిన వైనాన్ని ‘ఒకరికొకరం‘ చెబుతుంది. అదే సమయంలో వీళ్ళంటే ఎంతో అభిమానంగా ఉండే ఇంటి యజమాని కూడా సహకరించడంతో, తెరిపిన పడుతుందా కుటుంబం.
పెద్దమనిషి తరహగా నటించి ఓ చిరుద్యోగం చేస్తున్న జయని మోసం చేసిన మహిళకి తెలివిగా బుద్ధి చెప్తాడు జయ తమ్ముడు రవి ‘ఇదే తగిన శాస్తి‘ కథలో.
ఓ మూడో తరగతి చదివే బాలిక తనకి ‘రెండు నాన్నలు‘ ఉన్నారని పుస్తకంలో రాసుకుంటుంది. అది చదివిన తండ్రి పాప మనసుని తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు. తల్లిదండ్రులు నిజాయితీ జీవితం గడపడం పిల్లలకెంత భరోసానిస్తుందో ఈ కథ చెబుతుంది. కౌముది-రచన నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది.
అసంపూర్ణ చిత్రం లాంటి తన మేనత్త జీవితలంతా తన జీవితం ఉండకూడదనుకుంటుంది అల. ఓ వెబ్‌సైట్‌లో వింతగా అనిపించిన ఓ ప్రకటన పట్ల ఆకర్షితురాలై చేసుకోబోయేవాడితో సహా అమ్మా నాన్న, అత్తతో కలిసి ఆ ప్రకటన ఇచ్చిన ఆవిడని కలుస్తుంది. ‘ఎంజాయ్ మేరిటల్ బ్లిస్‘ కథలో వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడమెలాగో ఆవిడ చెబుతుంది.
ఆర్థికపరమైన లోటుతో గుట్టుగా బతుకుతున్న జానకిరామ్, సుగుణ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఎనిమిదేళ్ళ తర్వాత సుగుణ మళ్ళీ గర్భం దాల్చిందనీ, ఈసారీ పుట్టబోయేదీ ఆడపిల్లేననీ తెలిసి వాళ్ళిద్దరూ అనిశ్చితికి గురవుతారు. నగరంలోని పాత భవంతులను కొనేసి డెవెలప్‌మెంట్ చేసి ఫ్లాట్లు ఇస్తామని బిల్డర్లూ, రైతుల దగ్గరనుండి నయానో భయానో పొలాలు స్వాధీనం చేసుకునేవారు ఎక్కువైపోయి మోసపోతున్నవారిని తలచుకుని తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా దంపతులు ‘ఇంటింటికొక పూవు‘ కథలో.
కొత్తగా పెళ్ళయిన దంపతుల మధ్య ఓసారి మాటామాటా వచ్చి ఇరువైపులవారిని మాట అనుకునే పరిస్థితి వస్తుంది. కోపంలో ఇల్లు వదిలేసి వెళ్ళాలనుకున్న రమకి తన అక్క చెప్పిన మాటలు గుర్తొచ్చి ఓ పథకం వేసి భర్తను మార్చుకుంటుంది ‘ఆపరేషన్ రఘురాం‘ కథలో. భర్త కూడా ఎవరెలాంటివాళ్ళో అర్థం చేసుకుని భార్యకి సహకరిస్తాడు.
అక్కడి జీవితం అద్భుతంగా ఉంటుందనుకుంటూ అమెరికాకి వలసవెళ్ళే వాళ్ళ భార్యల జీవితంలోని అసంతృప్తులను ప్రస్తావిస్తుంది ‘త్రిశంకుస్వర్గం‘ కథ. మనసుని ఎన్నో విధాలుగా సమాధానపరుచుకోవడమే కాబోలు జీవితమంటే అంటుందీ కథ.
ఇండియాలో తాము పెరిగిన విధానానికీ, అమెరికాలో ఇప్పటి తరం ఆలోచనా విధానానికి మధ్య వైవిధ్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆమెకన్నీ ప్రశ్నార్థకాలే ఎదురైన వైనాన్ని ‘క్వశ్చన్ మార్క్‘ కథ చెబుతుంది.
కొత్త వ్యాపారం పేరుతో వాయు కాలుష్యాన్ని సొమ్ము చేసుకోవాలనే ప్రతిపాదనతో మేనల్లుడు వస్తే, మేనమామ నేర్పుగా సర్దిచెప్పి ఆ వ్యాపారపు ఆలోచన విరమింపజేస్తాడు ‘మేల్కొలుపు‘ కథలో.
గృహస్థు ధర్మాలలో ఒకటైన ఆతిథ్యాన్ని చక్కగా నిర్వహించే ముందు, దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఒక్కో బంధువు ఇంటికి వెళ్ళిన ప్రభాకరం దంపతులు ఏం తెలుసుకున్నారో ‘అతిథిదేవోభవ‘ కథ వెల్లడిస్తుంది.
***
ఇవన్నీ మంచి చేయాలనుకునే కథలు… ఈ కథలలో ఉన్నవి మేలు కోరే పాత్రలు… వెరసి ఇందులోని చాలా కథలు బహుమతులు గెల్చుకోడంలో ఆశ్చర్యం లేదు.
***
ఇంటింటికొక పూవు (కథా సంపుటి)
రచయిత్రి: జి.యస్.లక్ష్మి
పేజీలు: 134, వెల: ₹130/-
ప్రతులకు: రచయిత్రి, 2-2-23/7/1,
బాగ్ అంబర్‌పేట, హైదరాబాదు, 500013
చరవాణి: 9908648068,
ప్రముఖ పుస్తక కేంద్రాలు.