[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 11వ భాగం. [/box]
[dropcap]గు[/dropcap]డి నుంచి అన్నమయ్య పాట వినిపిస్తుంది ‘బ్రహ్మ కడిగిన పాదమూ’ అని. ఎవరు పాడారో గానీ చాలా మధురంగా ఉంది.
కప్పర కప్పరగా తెల్లవారుతుంది. మబ్బులున్నట్లుంది, ఎండ పొడ అంతగా కనిపించడం లేదు.
పాట వినిపించుతున్నవైపు దీక్షితులు మనసు నడచింది.
ఏవేవో ఆలోచనలు ముసిరినయి.
ఆయన పదకవితలలో ఉన్న తియ్యదనమేమో గానీ… ఎన్ని సార్లు ఏ స్థితిలో విన్నా తనివి తీరినట్టుగా అనిపించదు. అన్నమయ్య వాగ్గేయకారుడేగాక… హరికీర్తనాచార్యుడు గూడా…
తన పాటలకు తానే బాణీలు కట్టి అడుతూ పాడుతూ నడిచాడు. జనంలో ఉన్నప్పుడు భజన సంప్రాదాయం కూడా.
ఆ తరువాత అన్నమయ్యలోని సంగీతపు పట్టును, త్యాగయ్య నాట్య సంగతులను, క్షేత్రయ్య భజన సాంప్రదాయపు రీతులను ‘రామదాసు’ అనుసరించారేమోననిపిస్తుంది.
నా వల్ల నీ కీర్తి…
నీ వల్ల నా కీర్తి…
విశ్వమంతా వ్యాపించాలని, భావించక ఏడుకొండల దేవుడు అన్నమయ్యను స్వయంగా అడిగి వ్రాయించుకున్నాడనే నానుడి ఉంది. అంటే ఆ కీర్తనలలోని స్పందన ఏమిటో అర్థమవుతది.
గుడి నుంచి వస్తున్న పాట ఆగిపోయింది.
అన్నమయ్య పైన నడుస్తున్న భావనా తెగిపోయింది.
ఓ హరిదాసు ముందు నుంచి హరి లో రంగహరి అని చిందులేసుకుంటూ వెళ్ళడం కనిపించింది.
ఇలాటి కళారీతుల కన్నింటికి ఆధ్యుడు ఈ మహానుభావుడేనేమో? అనిపించింది. మనసులోనే ఆయన పాదలకు మనసారా నమస్కరించుకున్నాడు.
***
“కాఫీ అక్కడ పెట్టి ఎన్ని సార్లని పిలచేది? చల్లారిపోతుంది!” అని విసుగుకుంటూ గుమ్మంలో కొచ్చింది ఇల్లాలు.
‘పిలిచావా?’ అడిగాడు దీక్షితులు.
‘ఉహు! మీరు పిలిస్తే వచ్చాను. ఏం చేయాలో చెప్పిండి? పిలిచావా? అట’ అంది రుసరుసలాడుతూ.
‘పరధ్యాహ్నంగా ఉన్నాను లేవోయ్! ఇంతి చిన్న విషయానికి నిప్పులు చెరిగితే ఎలా? ఎంత నువ్వు కసరుకున్నా తాళి కట్టిన మగడ్ని గదా! చూసి చూడనట్టుగా పోవాలి’ అన్నాడు నవుతూ…
“మళ్ళీ ఇదొకటా! కాఫీ పెట్టనా అని అడిగానా? తల ఊపితిరి….. కాచి అక్కడ పెట్టాను గదా! అవెమో చల్లారిపోయే… మీరు కాఫీ చల్లారితే త్రాగరు గదా!”
“చల్లారిన కాఫీ ఇప్పుడు త్రాగిసున్నట్లేగదా! పైగా…”
“ఈ నిర్వాకమంతా చూసి చూడనట్టుగా పోతే… దొడ్డ ఇల్లాలినైనట్టూ లేకపోతే కానట్టూ….” అని లోనికి వెళ్ళిపోయింది.
మరు నిమిషంలో సెగలు గక్కుతున్న కాఫీ చేతికిచ్చింది.
“చల్లారితే మానె త్రాగుతున్నాను గదా!” అన్నాడు.
“మళ్ళీ అదను చూసి ఏదో అనడానికా?” అని, “మాటలు ఆపి కాఫీ కానివ్వండి” అంది ఎదురుగా నిల్చునే.
కాఫీ సీప్ చేస్తూ “ఓహ్, కాఫీ అంటే ఇలా ఉండాలి. చాలా బావుందోయ్… దేవతలకు గానీ, ఇలాంటి ‘కాఫీ’ ఇచ్చావంటే అసలు వాళ్ళు ‘అమృతం’ జోలికి పోరు” అన్నాడు.
‘బాగుంది సంబండం’ అనుకుంది శాంతమ్మ.
దశరథం లోనికి రావడం కనిపించింది.
‘రా! రావోయ్!’ అంటూ ఎదురెళ్ళాడు.
తీసుకొని వచ్చి కూర్చుండ బెట్టి. తను ఎదురుగా కూర్చున్నాడు. మొన్నటి దశరథం ప్రవర్తన మనస్సులో శాంతమ్మకు మెదిలినా లోనికెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి ఇచ్చింది. తీసుకన్నాడు.
శాంతమ్మ వైపుగా తలెత్తి చూడలేదు.
‘మంచి నీళ్లిచ్చేదా?’ అడిగింది.
తల అడ్డంగా ఊపి… కాఫీ త్రాగాడు.
ఆ తరువాత నాల్గయిదు నిముషాలు కూర్చుని ఇద్దరూ లేచారు. లేచాక ‘అలా బయటకు వెళ్ళి వద్దామేం?’ అడిగాడు దశరథం.
‘పదా’ అన్నాడు దీక్షితులు.
దశరథంలో కొత్తగా కనిపిస్తున్న ఏమిటో వెతికి పట్టుకోలేకపోయాడు దీక్షితులు.
తోవలో కొచ్చాక “మన ఇంట్లో ఇంకా ఎవరున్నారని ఇలా బయటకు వచ్చినట్లు? అక్కడే మాటాడుకుందము గదా!” అన్నాడు.
“ఇలా మనం తోవల నడుస్తుంటే మనకు తెల్సిన ఏ ముఖాన్ని పలకరించకుండా ఉండగలం?” అని నవ్వి, “వారి పలకరింపులలో పడి మనం వచ్చిన పనిని మరచిపోతామేమోనని నా భయం” అన్నాడు దీక్షితులు.
“నువ్వు అన్నది నిజం, కానీ ఎందుకో ఇలా నడవాలనిపించింది.”
“మంచిది. అనిపించాక, బయలుదేరాక ఇక ఆగడమెందుకు?” అని, “విషయంమేమిటో చెప్పు?” అని అడిగాడు.
‘అమ్మాయిని అదే మన విజయను పెళ్ళి విషయం కదిపి చూసాను. ‘సీటు రాలేదు’ గదా అంచేత మీ ఇష్టం అన్నది. అది అలా అన్నాక మనం మంచి సంభంధం వెదకి పెళ్ళి చేయడం మంచిది గదా” అన్నాడు.
“ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నాక పెండ్లి ఎలా చేయాలో అనే ఆలోచన రాకుండా ఇంక వచ్చేదేముంది గానీ…”
“దీక్షితులూ నేనుగా బాగా కోరుకున్న సంబంధం నాల్గునెలల క్రితం దాకా ఉంది. ఇప్పుడది పోయింది. పాపం వాళ్ళు మనకు బాగా కావాలని కోరుకునేవాళ్ళు. అలాంటి చోట మనం మన పిల్లనివ్వగల్గితే సుఖపడేది. అందుకే విజయను రెండు మూడు సార్లు అడిగి చూసాను. అప్పుడు అమ్మాయి ‘సరే’ అనలేదు ఇప్పుడు…”
‘ఒకటి ఉంది…’
‘ఎవరతను?…’
‘మొన్ననే స్కూలు మాష్టారు ఉద్యోగం దొరికింది కూడా…’
‘ఏం చదివాడేంటి…’
‘M.A. లిటరీచర్ చదివాడు.’
‘పిల్లవాడు చూపరేనా?…’
‘ఫర్వాలేదు…’
‘అలవాట్లు విషయం ఏమైనా ఆరా తీసావా…?’
“ప్రయత్నించాను…”
‘ఎంతలో ఉన్నాడట? అన్నట్లు అన్న తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నారా?’
‘ఆఁ ముగ్గురు వాళ్ళు. ఫాన్సీ దుకాణం ఉంది సెంటరులో…’
‘ఉద్యోగం కూడా ఉందంటున్నావుగదా…’
‘అవును వచ్చింది…’
‘ఆస్తిపాస్తులు కొద్దిగా ఉన్నవన్నారు…’
‘రెండు లక్షల దాకా అడుగుతున్నారట…’
‘మరి నువ్వు అంత ఇవ్వగలవా? వేరే ఆలోచన ఏమైనా ఉందా? ’
‘లక్షా ఏభై వేలు ఇవ్వగలం…’
‘వాళ్ళ కివ్వగానే సరిపోదు గదా! మన దగ్గర పెండ్లి ఖర్చులుండాలి గదా!’
‘చూద్దాం..’
‘అయితే ఆలస్యం దేనికి పెండ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే..’
‘రెండు లక్షలు వప్పుకొని ఒకటిన్నర, మొదట ఇచ్చాక లగ్నాలు పెట్టుకుంటారట, మిగిలిన ఏభైవేలు లగ్నకాలం ముందే కావాలట.’
“ఉంటే ఒకటిన్నరేం ఖర్మ అంతా ఇచ్చెద్దుము గదా. ఇదిగాక లాంఛనాలున్నాయి. గడియారం, ఉంగరం, మనం ఎలాగు పెడతాము. కాని T.V సెట్టూ, సెకండ్ హేండు దైనా సరే చేతక్ స్కూటరూ, గ్యాసు పొయ్యి, మంచం, పరుపు, వంటసామాను, వెండి చెంబు, గ్లాసు, పళ్ళెం ఇవ్వన్నీ ఇచ్చే పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా?…”
“ఆ ఆడబిడ్డ కట్నం ఎనిమిది వేలు… మొదటే ఇవ్వాలట…”
‘మగపెండ్లి వారు కదా మర్యాదలకులోటు రాకుండా చూడాలట…’
‘చేరిన ఉద్యోగం పరిమినెంటుదేనా?’
అది కనుక్కునే వ్యవధి చిక్కలేదు.
‘పిల్లనిద్దామని వెళ్ళావా? జనాభా లెక్కలు వ్రాయడానికా?’ అని నవ్వి ‘దశరథా! నువ్వు చెప్పింది విన్నాక నాకు ఒకటినిపిస్తుందిరా! మొట్ట మొదటే వీళ్ళు ఇలా ఉంటే ఆ తరువాత మనకున్న ఆధారం? ఇంకా కొత్త కోరికలు పెళ్ళిలోపు గుర్తుకు రావనే గ్యారంటీ ఏమిటి? అందు చేత మన బోటి వాళ్ళు వేగలేము.’
“బండను చూస్తున్నప్పుడు బరువు తెలీదు. మొస్తున్నప్పుడు తెలుస్తుంది. నడుం విరిగిపోయే బండనైతే ఎత్తుకొని పనికిరాకుండా పోముగదా.”
“అయితే ఇతగాడ్ని చివర్న ఉంచు” అన్నాడు దశరథం పసివానిలా..
“ఇంకా ఉన్నారా నీ దృష్టిలో? ఉన్న వాళ్ళను చూసీ – “
“చూద్దాం…”
“పిల్లదానికీ విషయాలు అర్థం కానివ్వవద్దు. దానికిలాంటివంటే మహా చిరాకు” అని, “రేపు మంచిదేనా?” అని అడిగాడు దీక్షితులు.
“ఆఁ దశమి. మంచిదే” అని, “ఎందుకూ?” అన్నాడు
“ప్రొద్దుటేరా! ఒకచోటికి వెళ్దాం! పెళ్ళి తల పెట్టాంగదా! వెళ్ళగానే అయిపోతుందనుకునేవు? ఎన్ని చెప్పులరగాలో? ఎంచేతనంటే ఇది అకస్మాత్తుగా చేసుకునే నిర్ణయం కాదు… మనకు వాళ్ళు నచ్చాలి…. వాళ్ళకు మనం నచ్చాలి… ఆ తరువాత మన పెట్టుపోతలు నచ్చాలి…. సాంప్రదాయం, మంచి చెడులు అంతా క్షుణ్ణంగా వాకబు చేసుకోవాలి గదా!”
“ఉఁ” అన్నాడు.
“ఇప్పుడేమయిందని? ముందుంటుంది గానీ, నువ్వు రేపు వస్తున్నావు?” అన్నాడు.
తల ఊపాడు…
‘మంచిది’ అని, “ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్లు?” అని ఆగాడు.
‘ఎక్కడికి లేదు…’
‘ఆ గ్రంథాలయం దాకా వెళ్దాం పద…’
‘ఇప్పుడెందుకు?’
‘ఊర్కే…’
‘నేను ఇంటికి వెళ్తానేం? ’
“మంచిది.”
“పొద్దుటే వస్తాను, ఆఁ” అని ఇంటి వైపు బయలుదేరాడు దశరథం.
తోవలో శీతాఫలాల్ని అమ్ముతున్న రంగమ్మ కనిపించింది.
ఆగాడు రంగమ్మను చూసి… మనసంతా ఏదోలాగయింది.
ఇంకా రంగమ్మ పండ్ల గంప నెత్తిన పెట్టుకొని అమ్ముతుండడం విచిత్రమనిపించింది.
మనిషి సంతోషానికి బాధకూ వివశుడవుతాడు. సంతోషపు వివశతకు తీపిగుర్తులు మిగులుతాయి. బాధల వివశత వేసిన ముద్రలు చెరగవు, చెదరవు.
“బాబయ్యా మనంటికే పోయివత్తన్న. అమ్మ ఈ పొద్దు పండ్లు అక్కరలేదన్నది” అంది. అంటూ రెండు పండిన పళ్ళు చేతిలో పెట్టి… “ఆకులలో మాగేసినవి కావు బాబయ్యా, చెట్టు మీద పండినవి. చాలా రుచిగ ఉంటాయి” అంది.
మనిషికి తోటి మనిషి పైన ప్రేమ వాత్సల్యం కలగడానికి అనేక కారణాలు ఉండి ఉండొచ్చు, ఎప్పుడో చేసిన చిన్న మాట సాయానికి, ఇంతలా అభిమానించడం ఎదుటి మనస్సు యొక్క ఉన్నతిని చూపెడుతుంది.
ఎంతో సంహయం పొంది మరచిపోవడమే గాక, మోసగించుతున్న కాలం ఇది. అయినా ఇలాంటి వాళ్ళు ఉన్నారు.. ఉంటారు… ఎప్పుడూ ఉంటారు.
రాముడు రావణుడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఇప్పుడు ఉన్నారు.
కాలం మారడం కాదిది, మనిషి బావన.
మంచి మంచే, చెడు చెడే…
ఈ రంగమ్మకో కూతురుంది. చదివించాలనిపించింది. బాగా చదివింది. ఇక్కడ చదువు అయిపోయాక పట్నం పంపింది. పై చదువులకు… ఈ పిల్లకో డబ్బు బాగా ఉన్న స్నేహితులొకరు అక్కడ …
కలసి మెలసి తిరుగుతుండేది. కానీ ఈ పిల్లకు అలా తిరగాలని కోరిక లేదు. స్నేహితురాలి కోసం …. వెళ్తుండేది.
Final year కొచ్చారు… పరీక్షలు వస్తున్నాయిని శ్రద్దగా చదువుసాగింది…
ఒకనాడు ఇద్దరూ కాలేజి నుంచి కారులో తిరిగి వస్తూ నగల షాపు దగ్గర ఒకనాడు చిన్న పని ఉందని కారున్న స్నేహితురాలు నగల షాపులోకెళ్ళింది. ఈ పిల్ల మాత్రం కారులోనే ఉంది. ఆకస్మాత్తుగా కారులోకి ఇద్దురు దృడమైన వ్యక్తులు ఎక్కారు. దీన్ని గమనించి ‘కేక’ వేయబోయింది కానీ నోరు నొక్కాడొకడు. కారు కదిలిపోతూనే ఉంది, పెనుగులాడింది పిల్ల, ఉడుంలా పట్టుకొని వదలలేదు వాడు. కారు మంచి వేగాన్ని పుంజుకుంది. కారు అద్దాలు పూర్తిగా మూసుకున్నాయి…
అయితే ఈ కారు కదలటాన్నిలోపల నుంచి చూసిన అమ్మాయి బయటకు పరుగున వచ్చి కేకలేసింది. ఆ వెంటనే కొట్లోకి వచ్చి పోలీస్టేషన్‌కు ఫోను చేసి చెప్పింది. ఈ కారు పదిహేను నిముషాలు వేగంగా పరుగెత్తింది. అక్కడ నాలుగు మలుపులు తిరిగాక ఈ పిల్లను క్రిందికి నెట్టి కారు తలుపులు మూసుకున్నారు. అయితే కర్మవశాత్తు ముంచేతి వెళ్ళు డోరుకు మధ్యన ఇరుక్కున్నాయి. చేయి ఊడిరాలేదు. క్రింద ఈడ్చుకంటూ కారు నడిచాక డోరు తెరచి అకస్మాత్తుగా మూసారు. ఆ విసురుకి దూరంగా పడి మోరీకి తల గుద్దుకుంది. అక్కడే సృహ కోల్పోయింది. ఒళ్ళంతా రక్త సిక్తమయింది. దాదాపు రెండు గంటలు గడచాక పోలీసు జీపు అక్కడకొచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. ఈ లోపు మెడనున్న గొలుసు ఎక్కడో పోయింది. ధనవంతుల అమ్మయిని కిడ్నాపు చేయాలని వచ్చిన వారు ఈ పిల్ల కాదని తెల్సుకొని, వాళ్ళ ప్లాను పాడయి పోయిందన్న కోపంతో చేసిన రాక్షస కృత్యం వల్ల ఆమె ఆసుపత్రిలోనే చనిపోయింది. ఆ స్నేహితురాలే రంగమ్మనక్కడికి తీసుకెళ్ళి శవాన్నిచ్చి… ఇంటికి చేర్చి వెళ్ళిపోయింది.
ఆ పిల్లపైన పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకీడుస్తున్న రంగమ్మకు మతి స్థిమితం తప్పింది.
ఈ పిల్ల చనిపోయాక, పోలీసులు, రాజకీయపు వాళ్ళు ఓ మంత్రి పేపర్లు వారితో అది చేస్తాం… ఇది చేస్తాం… నేరస్థులు డొక్కచించి డోలు కడ్తాం… అని వారం రోజులు జోరు చేసారు. ప్రసంగాలు చేస్తూ పేపర్లలో ఫోటోలు వేయించుకున్నారు. టీ.విలలో కనిపించారు. కానీ ఆనక రంగమ్మ సంగతి పట్టించుకున్నవాడు లేడు.
దాదాపు నెల రోజులు అదోలా గడిపింది రంగమ్మ…
ఏం తిన్నదో ఎలా ఉందో ఆ భగవంతునికే ఎఱుక …
తను పంపగా ఒక నాడు సీతమ్మ వెళ్ళి స్థితి చూసి ఇంటి కొచ్చి చెప్పింది…
మనింటికి తీసుకొద్దాం…. ధైర్యం చెపుదాము అన్నాడు దశరథం… తలాడించి తీసుకొచ్చారు. మతి కుదురుకున్నాక ఆదరంగా చూసారు…
బాధను పూర్తిగా మరచి పోయేలా చేయలేకపోయినా…
“ఈ బ్రతుకులో ఇలాంటివి తప్పవు. వాళ్ళతో పాటు మనం పోలేం. మనమూ పోతాము ఎలాగూ….” అనే భావనను కల్గజేయడంతో తిరిగి నెమ్మదిగా ఇంటికి చేరింది.
తన బ్రతుకు తాను ప్రారంభించింది. అయితే రంగమ్మ కనిపిస్తే చాలు ఎదిగిన పిల్లలంటే గుబులు వేస్తుంది. భయం వదలకపోయేది. “బావున్నావా?” అడిగాడు పండ్లను చూస్తూ…
“బాగు….” అని నవ్వి అదోలా ఆవిడ కళ్ళ నిండా నీరు నిండి కనిపించింది వాటిని తుడుచుకుని…
“ఇంత తినేందుకు కావాలి గదా, అందుకే ఈ జెఱ్ఱిపోతులాట. నా పిల్లతో నన్ను పోనీక ఎందుకు బతికించినవు బాబూ… ఇది బతుకా? మన చుట్టూరా ఉన్నది మనుషులా? ఆళ్ళు మనుషులైతే…” అని తట్ట కిందికి దింపి… ధశరథం కాళ్ళకు మొక్కేసి “బాబూ పిచ్చిదానిగా ఉంచకపోతివి తెలీకుండానన్నా ఉండేది. గుండె పగిలి పోతుందయ్యా…” అంటుండగా… కళ్ళు తుడుచుకుంటూ దశరథం పరుగులాంటి నడకతో… దోవన పడ్డాడు.
తలలోని నరాలు చిట్లిపోతాయేమోననిపించింది…
డబ్బు కోసం… పిన్నదాన్ని…
ఎందుకీ డబ్బు…
డబ్బంటే ఏమిటి…
అన్ని అనర్థాలకు మూలమైనదా…
అన్ని సుఖాలు దొరుకుతాయని భ్రమలు…
అరేయ్ మనిషీ…
ఎందుకురా దీన్ని సృష్టించావు…
అది నిన్ను ఇప్పుడు ఎదవను చేసి ఆడిస్తున్నదిరా…
సుఖంగా బ్రతుకీడుస్తున్న ఈ సమాజాన్ని చిద్రం చేస్తున్నది.
నిన్ను నువ్వు చంపుకునేలా చేస్తుందిరా…
“బాబయ్యా అటేడికి ఆగు” అంటూ ఎట్టోళ్ళ రాములు ఆపాడు…
“ఏమిటి?” అని ఆగి తేరుకొని ఇంటి తోవను వెతుక్కుని నడిచాడు…
దశరథం ఇంటి గడప ఎక్కాక విజయ కనిపించాక ఆగాడు…
అప్పుడు గుర్తుకొచ్చింది. దీక్షితులు ప్రొద్దుటే రమ్మన్నాడని…
కూర్చోవాలనుకున్నాడు కూర్చోలేదు. కూర్చున్నానుకున్నట్లుది
“నాన్నగారు కాఫీ” అంది …
ఉలిక్కిపడి విజయను తేరిపార జూచి… కాఫీ అందుకొని చచ్చేంత వేడిగా ఉన్నా రెండుప గుక్కలలో మ్రింగి… “అమ్మా విజయా ఏం చేస్తున్నావు?” అనడిగాడు.
“ఏం కావాలి నాన్నా?” అంటూ దగ్గిరి కొచ్చింది.
“అమ్మేది…”
“ఇంట్లోనే ఉంది” అని “పిలవనా…” అంది.
“ఏం లేదు. ఇదిగో ఈ కప్పు తీసుకెళ్ళు” అని గడప దాటాడు.
“మళ్ళీ ఎక్కడికి? అంది విజయ.
“నేనా! ఎటూ లేదమ్మా ఎక్కడికీ వెళ్ళను…”
“వెళ్తున్నారుగదా…
“అదే పూజరయ్యా వెళ్తున్నట్లుగా అనిపిస్తే… పలకరించుదామనిపించి నడచాను అంతే…”
“వచ్చి స్నానం చేయరాదు పెందలకడ భోంచేద్దాం…”
“అలాగే..”
“వేణ్ణీళ్ళున్నాయి తోడనా…”
“నీ యిష్టం…”
“అయితే రా…” అంటూ లోనకు నడిచింది.
(ఇంకా ఉంది)