[dropcap]మా[/dropcap]నవులకు దేవ కార్యాలకైనా, సామాన్యమైన పనులకైనా ముందర సంకల్పము అనేది వుండాలని పెద్దలు చెబుతూ వుంటారు.
మన దైవ్యకార్యలలో,పూజలలో ఈ సంకల్పం చేసుకోమంటూ వుంటారు.
గురువుగారు సత్‌సంకల్పముతో రమ్మంటారు.
రాజకీయనాయకులు సంకల్పించా మంటారు.
అసలు ఏమిటా సంకల్పం?
నిఘంటువు ప్రకారం సంకల్పమంటే: ఒక పని చెయ్యాలనే ఆలోచన. మనో నిశ్చయం. మనసులో ఎన్నుకోవటం. ధృడంగా ఒక పనిని చెయ్యటానికి పూనుకోవటము.
ప్రతి పనికి ముందుర ఆ పని ఎలా చెయ్యాలో నిర్ణయించుకొని, ఒక ప్రణాళిక చేసుకుంటారు. మన లెక్కలు సరైనవయితే, పని సక్రమంగా జరుగుతుంది. తప్పితే పనీ తప్పుతుందన్నది చిన్న పిల్లలైనా చెబుతారు. అంటే ప్రణాళిక అన్నది అవసరము.
ఉదాహరణకు ఇల్లు కట్టాలంటే ముందుగా చూసుకోవాల్సింది ధనము. సరి అయిన ధనము లేకపోతే ఏ బ్యాంకు నుంచి ఎంత శాతం వడ్డీకి అప్పు తెచ్చుకోవాలి? అది తీర్చే వెసలుబాటు, ఎంత కాలము ఇత్యాదివి. ఇవన్నీ సమకూర్చుకున్నాక అవసరాలకు సరిపడే ఇల్లు వెతుక్కొని దానిని కొంటారు.
ఇది మామూలు ప్రణాళికలతో వున్న వెసలుబాటు.
ప్రణాళిక అన్నది వుంటే సరిపోతుందా? ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటే పని లెక్కలకు సమాధానములా ఫలితం వస్తుంది కదా!!
అన్ని ప్రణాళికలు ఫలిస్తాయా?
ఒక వేళ తప్పితే మన కర్మ అనుకోవలసినదేనా?
మరి సంకల్పంమేమిటి అన్నది ప్రశ్న।
మనము సామాన్యమైన పనులను ప్రణాళికతో ఎలా చేసుకుంటామో, అలా ఆ పనులు చెయ్యాలన్న ఊహనే బలంగా అనుకుంటేనే అదే “సంకల్పం.”
ఇల్లు ఉదాహరణే తీసుకుందాము, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ప్రతి వారు వారి వారి బడ్జట్టు బట్టి ప్రణాళికలు చేసుకుంటారు. కాని ఇల్లు కట్టుకోవాలని మనసులో ధృడంగా ‘అనుకోవటము’ అన్నది – సంకల్పం.
ఆ సంకల్పం ఎంత ధృడంగా వుంటే, దాని బట్టి వారి గృహము అంత త్వరగా ఏర్పాటౌతుంది. దీనిలో మంత్రం, మాయ అన్నది లేదు. కేవలం పని చెయ్యాలనుకునే బలమైన కోరిక వుంటుంది. సాధించాలనే పట్టుదల వుంటుంది. ఆ ఆలోచనలు ఎంత బలంగా వుంటే, కోరిక అంత త్వరగా తీరుతుంది. కాని తన మీద తనకు అనుమానము లేని బలమైన కోరిక వుండడము మూలము. అలా వుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. అదే సంకల్పబలం.
దీనిని కొంత శాస్త్ర పద్ధతిలో విశ్లేషిస్తే, ఆలోచన అన్నది ఒక అయస్కాంతము లాంటిది. మెదడులో లేదా మనసులో పుట్టిన ఆలోచనకు కొంత శక్తి కలిగివుంటుంది. ఆ శక్తి తరంగాలతో ఒక క్షేత్రం ఏర్పడుతుంది. మనము ఎంత సానుకూలముగా దానికి అనునిత్యం బలమిస్తే, అంతే పాజిటివ్‌గా ఆ ఆలోచనకు స్పందిస్తూ వుంటే, అంతగా ఆ వూహ లేదా కోరిక బలము పుంజుకుంటూ వుంటుంది. మన పాజిటివ్ శక్తి ఆ ఆలోచనలను మరింత బలముగా చేస్తాయి. అప్పుడు ఒక స్థితికి వెళ్ళిన ఆ ఆలోచనలకు ఎన్ని వ్యతిరేక పవనాలు వీచినా మన కోరికున్న బలము చేత ఆ పని జరుగుతుంది.
అలాగే నెగిటివ్ వూహ కూడా అంతే. అవదేమో అన్న ఊహకు బలమిస్తే ఆ వూహకు సంబంధించిన క్షేత్రం బలవత్తరముగా తయారై, ఆ పని జరగదు. అందుకే పెద్దలు చెబుతారు మనసులోనైనా చెడు తలచవద్దని. తథాస్తు దేవతలు వుంటారని.
ఇది న్యూరాలజిస్టులు నిరూపించారు కూడా. మెదడు మీద పాజిటివ్ ఆలోచనలు నీలి తరంగాలను ఉత్పత్తి చేసి మనసును నెమ్మదింపచేస్తాయి. తద్వారా శాంతచిత్తుడైన వ్యక్తి ఆ పనిని సమర్దవంతముగా పూర్తి చేస్తాడు.
అదే నెగిటివ్ వూహలతో సతమతమౌతుంటే, ఎరుపు తరంగాలు ఉత్పత్తి జరిగి, మనసు మీద వత్తిడి తెస్తాయి. తద్వారా చాలా తేలికైన పని కూడా అతలాకుతల మౌతుంది. అందుకే శాంతచిత్తముతో వుండమనటం.
కొన్ని ప్రయోగాలలో ఒకే శరీర ధృడత్వం వున్న ఇద్దరు వ్యక్తుల మీద ఈ పాజిటివ్, నెగటివ్ సైటేషన్‌లతో వారిని హిప్నటైస్ చేసి ఒక పరుగు పందానికి పంపారు. పాజిటివ్‌గా ఆలోచించే మనసున్న వ్యక్తి ఆ రేసును అలవోకగా పూర్తి చేశారన్నది చెప్పనక్కర్లేదు.
మనము మన మనసుకు ఏం చెబితే అది ఆ పనే చేస్తుంది. ఒకరు పరీక్షకు నేను మరిచిపోతానేమో అనే భయంతో చదివినప్పుడు, వారికి మరిచిపోవటం మీదనే వారి సబ్‌కాన్షియస్ మెదడు నిలబడి పరిక్షలో మరిపోయేలా చేసింది. పరీక్ష తప్పడమన్నది ఫలితము. అందుకే మనము మన సబ్‌కాన్షియస్ మెదడుకు పాజిటివ్ విషయాలను చెప్పాలి, లేదా సదా తలుచుకుంటూ వుండాలి.
హిప్నోటిజము కూడా ఈ సిద్దాతం మీదనే పని చేస్తుంది. వ్యక్తిని నిద్రపుచ్చి వారి సబ్‌కాన్షియషస్ మెదడును మెలుకువలో వుంచి వారికి పాజిటివ్ సైటేషన్స్ పంపుతారు. దాని మూలంగా వారు తమంతట తామే ఆ పనిలో విజయం సాధిస్తారు. అదే సంకల్పమంటే కూడాను. మనము సబ్‌కాన్షియస్‌గా ధృడంగా అనుకున్న పనిని చెయ్యటము.
ఇదే హీలింగులో కూడా చెప్పేది. అందుకే అఫర్మేషన్స్ అన్నీ పాజిటివ్ శక్తి కేంద్రాలను వృద్ధి చేసేందుకు, మిణుకు మిణుకు మంటున్న పాజిటివ్ శక్తిని నీరు పోసి పెంచెందుకు పనిచేస్తాయి.
హీలింగులో ఈ శక్తి కేంద్రాలకు వున్న అయస్కాంత శక్తి మీద ఆధారపడి అఫర్మేషన్స్ పని చేస్తాయి.
మనసుకు సదా ఒక పని నీవు చేస్తావు, అని మంత్రంలా చెబుతుంటే, ఆ పని ఆటోమెటిక్‌గా చెయ్యగలనని నమ్ముతుంది. ఆ శక్తి కేంద్రాలు ఆఫర్మేషన్లు మూలంగా పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తాయి. ఇది పెరిగి, వారిని ఆ పని చేసే శక్తి చేతనా మెదడులో నిలబడి పోతుంది. తద్వారా చేసే పని వారికి తెలియకుండానే విజయం వరిస్తుంది.
దైవపూజలో కూడా సంకల్పము ఇలానే పని చేస్తుంది. మనము పూజలో సంకల్పమునకు ముందు ప్రాణాయమము చేస్తాము. ప్రాణాయమము మూలంగా ఉప-చేతనా మనసు జాగృతి పొంది సంకల్పములో చెప్పినవి ముద్రలా పడిపోతాయి. దానికి తోడు పూజ ద్వారా మనకు పని జరుగుతుందని నమ్మకము కూడా బలంగా వుంటుంది. అది ఉపచేతనా మనసుకు ధైర్యానిస్తూ తోడుగా వుంటుంది. అలాంటి సందర్భాలలో అనుకున్న పనులు జరగటం మనము చూస్తూనే వుంటాము.
న్యూరాలజిస్టులు కూడా 40 రోజులు ఏదైనా పని వదలక చేస్తే అది అలవాటు అవుతుందని చెపుతారు.
అది కూడా సంకల్పమును బలోపేతంగా చేయటానికే.
కొందరు నిరుత్సాహపరులు – ‘కర్మ’ విషయమేమిటి? మరి శివాజ్ఞ లేనిదే చీమైనా సాగదుగా? మరి నీ సంకల్పముతో మార్చేదేమిటి? అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు.
పూర్వ కర్మలు వున్న మాట నిజమైనా, మన ధృడమైన విశ్వాసముతో మార్చవచ్చును అని వేదాంతులు చెబుతారు.
అబ్దుల్ కలాం గారు మనలను “కలలు కనండి” అని చెప్పింది అందుకే. కలలు కనటమంటే ఒక విషయం గురించి బలంగా నమ్మి, దాని సాదించే దిశగా అడుగులు వెయ్యటం.
అదే సంకల్పబలమంటే.
అందుకే సంకల్పము అన్నది ఎంత బలంగా అనుకుంటే అంత తప్పక సాధిస్తారు. ఒక కవి చెప్పినట్లు సంకల్ప బలం వుంటే, అలావుద్దీన్ అద్బుత దీపం అక్కర్లేదు. పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. అందుకే సంకల్పమే బలం.