[dropcap]నా [/dropcap]కింకా రాలేదు వసంతం
ఐనా వీడనులే నా పంతం
శ్రమిస్తాను నిరంతరం
భేదిస్తాను యీ అంతరం
లేని అందాలకై వాపోవను
రాని చందాలకై తలపోయను
అరువుల కోసం పరుగులు తీయను
ఎరువుల కోసం అఱ్ఱులు చాచను
కరువును తలచుచు నీరైపోవను
శరణని ఎవ్వని చరణము తాకను
నాలో శక్తులతోనే తలబడతా
ఇలలో ఠీవిగ నిలబడతా
సంపద లన్నీ సంపాదిస్తా
విందుల నందరి కన్నుల కందిస్తా
కరువుకి చూపిస్తా నంతం
శ్రమనే ప్రేమిస్తా నాసాంతం
నాకూ వస్తుంది వసంతం
అందాకా వీడనులే నా పంతం