[box type=’note’ fontsize=’16’] “ఈ చిత్రంలో రంగును కూడా వొక ప్రత్యేక పాత్రలాగా ప్రవేశ పెట్టాడు దర్శకుడు. ఆ యెరుపు, నీలం, పసుపు అన్నీ కథను అవసరమైన బలాన్నిస్తూ, కొత్త రకమైన అనుభూతినిస్తాయి” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘సూపర్ డీలక్స్‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఈ[/dropcap] చిత్రం అప్పట్లో హైదరాబాదులోని సినెమా హాల్లో ప్రదర్శించారు. నాకు వీలు పడలేదు చూడడం. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో పెట్టారు కాబట్టి చూడగలిగాను. మరో మంచి చిత్రం చూసిన సంతృప్తి.
తన మొదటి చిత్రం “అరణ్య కాండం” తోనే జాతీయ పురస్కారాన్ని గ్రహించిన త్యాగరాజన్ కుమారరాజా రెండవ చిత్రం ఇది. కథ తనదే, కానీ స్క్రీన్‌ప్లే వ్రాయడంలో మరో ముగ్గురి సహకారం తీసుకున్నాడు : మైస్కిన్, నళన్ కుమారస్వామి, నీలన్ కె శేఖర్ లు.
ఈ మధ్య వస్తున్న కథామాలిక లాంటి చిత్రమే ఇదీనూ. అయితే చివరికి ఎలాగోలా అన్ని కథలూ కృత్రిమంగా కలపాలన్న్ ప్రయత్నం లేదు. జీవితాన్ని, మనిషి ప్రకృతిని అన్ని కోణాలనుంచీ చూసే వెసులుబాటు కోసం. వో కథలో నలుగురు కుర్రాళ్ళు పోర్న్ సినెమా చూడడానికి ప్లాన్ వేస్తారు. సీడీ ని అద్దెకు తీసుకోవడం అదీ నాటకీయంగా నవ్వించేలా వుంది. అది సంపాదించాక వొకడి ఇంట్లో టీవీ-సీడీ ప్లేయర్ లో చూద్దామని కూర్చుంటారు. వొక స్త్రీ తలారా స్నానం చేసి జుత్తు సరిచేసుకుంటూ తిరిగినపుడు వీపుమీద పెద్ద పుట్టుమచ్చ కనిపిస్తుంది. ఆమెలో తన తల్లిని లీల (రమ్య కృష్ణ) పోల్చుకున్న సూరి కోపంతో టీవీ పగలగొడతాడు, యేడుస్తూ బయటకు పరిగెడుతాడు. ఎవరి బాధ వాడిది. ఆ ఇంటి అబ్బాయి భయం తండ్రి వచ్చాక పగిలిన టీవీ చూసి తన తాట తీస్తాడని. సాయంత్రం లోపు కొత్త టీవీ యెలాగైనా తెచ్చి పెట్టెయ్యాలి. దానికోసం రకరకాల వేషాలు వేస్తారు. దొంగతనం చేస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారు వొకటేంటి ఆ వొక్క రోజులో అన్నీ చేస్తారు. ఆ సూరి తన తల్లిని చంపడానికి చేతికి దొరికిన స్క్రూ డ్రైవెర్ తీసుకుని వెళ్తాడు. మెట్ల మీద కాలు జారి పడి ఆ స్క్రూ డ్రైవెర్ తనకే తగిలి ప్రాణాపాయంలో వుంటాడు.
అక్కడి నుంచి రెండో కథ అందుకుంటుంది. లీల తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఆందోళన పడుతుంది. ఆసుపత్రికి తీసుకెళ్తుంది. కాని వైద్యం కోసం డబ్బు లేదు. ఈ ఆందోళనలో వుండగానే కొడుకు ఆమె చిత్రం చూశాడనీ, అసహ్యించుకుంటున్నాడనీ తెలుసుకుంటుంది. తన భర్త అర్పుతం గా మారిన ధనశేఖరానికి కబురు చేస్తుంది, తమ కొడుక్కి వైద్యం కోసం డబ్బు యేర్పాటు చేయాలని.
ఇక మూడో కథ అర్పుతానిది. చెన్నై లో వచ్హిన సునామీ లో అంత మంది చనిపోతే తను మాత్రం వొక క్రీస్తు లేదా మేరీమాత విగ్రహం పట్టుకుని వుండడంతో బతికిపోతాడు. దేవుడు తనని ప్రత్యేకంగా బతికించాడు అని యేవో భరమ్మో కూరుకుపోయి పేరు మార్చుకుని బాబా లాంటి అవతారం ఎత్తుతాడు. ఇప్పుడు కొడుకు కోసం కూడా వైద్యం కాకుండా దైవ ప్రార్థనతో బతికించుకోవాలని చూస్తాడు. అతనికి జ్ఞానోదయం అయ్యే దాకా ఆ సంఘర్షణ.
సాయంత్రానికి ఎలాగోలా డబ్బు సంపాదించి పిల్లలు టీవీ కొనుక్కొస్తారు. కొత్తది అమర్చాక పాతది డాబా మీదకు తీసుకెళ్ళి విసిరి అవతల పడేస్తారు. అది అక్కడ వొక జంటను వేధిస్తున్న సబిన్స్పెక్టర్ బెర్లిన్ (బగవతి పెరుమాళ్) మీద పడి అతను కుప్పకూలిపోతాడు. ఆ జంట ముగిల్ (ఫహాద్ ఫాజిల్), వేంబు (సమంత). ముగిల్ నటనలో శిక్షణ పొందుతూ వుంటాడు. వొక రోజు అతను ఇంట్లో లేనప్పుడు వేంబు తన కాలేజినాటి ప్రేమికుడిని ఇంటికి పిలుస్తుంది. వాళ్ళిద్దరూ శృంగారంలో వుండగా అతను చనిపోతాడు. ఇప్పుడు ఆ శవాన్ని వదిలించుకోవడం ఆ జంటకు వొక సమస్య అయితే, తామిద్దరి మధ్య వున్న నమ్మకం పోవడం, తన అహానికి దెబ్బతగలడం తో ముగిల్ ఆమెతో గొడవ పడతాడు. చాలా నాటకీయ సంగటనల అనంతరం వాళ్ళు వో సబిన్స్పెక్టర్ చేతికి చిక్కుతారు. శవంతో పాటు వాళ్ళ వీడియో తీసి అది చాలు వాళ్ళిద్దరినీ జైలు పాలు చెయ్యడానికి, అది తప్పించుకోవాలంటే తనకు వేంబు పొందు దొరకాలంటాడు.
ఈ బెర్లినే మరో కథలో కూడా భాగం. అది శిల్పగా మారిన మానిక్కం కథ. మానిక్కం (విజయ్ సేతుపతి) పెళ్ళి అయిన కొన్నాళ్ళకే భార్య జ్యోతి (గాయత్రి), కొడుకు రాసుకుట్టి (అశ్వంత్ అశోక్ కుమార్) లను వదిలి పారిపోతాడు. ఇన్నేళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇల్లంతా సందడి. ముఖ్యంగా రాసుకుట్టి కి కాళ్ళు వొక చోట నిలవట్లేదు. తన క్లాస్మేట్స్ కి తన తండ్రిని చూపించి, వాళ్ళు వెక్కిరిస్తున్నట్టు తను టెస్ట్ ట్యూబ్ బేబి కాదని చెప్పాలనుకుంటాడు. అందరి కలలను కూల్చేస్తూ శిల్పగా మారిన మానిక్కం దిగుతాడు. అందరూ కోపం, నిరాశలలో వుంటే వొక్క కొడుకే సంతోషిస్తాడు. శిల్ప సంజాయిషీ ఇచ్చుకుంటుంది. తనకి మొదటి నుంచి స్త్రీగా వుండడమే తప్ప పురుషుడిగా వుండడం ఇష్టం లేదని, అందుకే ముంబై కి పారిపోయి ఆపరేషంతో ఇలా మారిపోయానని అంటుంది. ఈ సమాజంలో వొక ట్రాన్స్జెండర్ మనిషికి ఎన్ని విధాల అణిచివేత, వివక్షతలున్నాయో తెలుస్తుంది. కొడుకు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులిస్తూ చాలా విషయాలు తెలియపరుస్తుంది ఆ పాత్ర. అంతే కాకుండా అందరూ తిట్టడం, స్కూల్లోకి రాకుండా వాచ్మన్ అడ్డుపడడం, ప్రిన్సిపాల్ కూడా వ్యతిరేకించడం వీటన్నిటితో పాటు కాముకుడైన బెర్లిన్ శిల్పను బలవంతం చేసి సెక్సు కు వొప్పిస్తాడు. తప్పిపోయిన తన కొడుకు గురించి వెళ్ళి వుంటుంది శిల్ప. గతంలో తాను ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్ళడం, తర్వాత వారే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వికలాంగుల రూపంలో అడుక్కుంటూ కనిపిస్తారు. అప్పుడు చేసిన పాపమే ఇప్పుడు తనకు జరుగుతున్న పరిణామాలకు కారణం అనుకుంటుంది. చివరికి తల్లీ కొడుకులు శిల్పను శిల్పగానే స్వీకరించడంతో వాళ్ళ కథ సుఖాంతమవుతుంది.
ఇన్ని కథలలో మరో బుల్లి కథ ఏలియన్ ది. నేనైతే దాన్ని పట్టించుకోలేదు. నాకు ఇది అతకలేదనిపించింది. అనవసరమని కూడా అనిపించింది.
మనిషికి వుండే అరిషడ్వర్గాలు ఆడించే నాటకం మనకు వివిధ పాత్రలతో చెబుతాడు. అన్నిటికంటే గొప్ప విషయం వొక ట్రాంజెండర్ కథను చెప్పడం. ఆ పాత్రను విజయ్ అద్భుతంగా పోషించాడు. వున్న కథలన్నిటిలో ఈ కథకు సంపూర్ణ న్యాయం జరిగింది. ఆ బుడ్డోడు కూడా చాలా బాగా చేశాడు. వొక గృహిణి ఇష్టపూర్వకంగా సాఫ్ట్ పోర్న్ లో నటిస్తుంది, యెందుకంటే తనకు నటన మీద ఆసక్తి యెక్కువ. చేసిన ఆ పనికి ఆమెలో అపరాధ భావన కూడా వుండదు. కాని అది కొడుకు మీద యెలాంటి ప్రభావం చూపిస్తుందో చెబుతాడు. లక్షల మంది అలాంటి సినెమాలు చూసే వాళ్ళుంటే కనీస పదుల సంఖ్యలో అయినా నటులు వుండాలిగా, చూస్తే లేని తప్పు చేస్తేనే వచ్చిందా? రమ్యకృష్ణ పాత్ర తీర్చిదిద్దిన పధ్ధతి, ఆమె నటనా చాలా నాటకీయంగా వున్నాయి, అయితే ఆమెద్వారా వొక విషయాన్నైతే బలంగా చెప్పగలిగాడు. సమాజంలో వున్న సమస్త అణచివేతలకు ప్రతీకగా బెర్లిన్ పాత్రను పెరుమాళ్ చాలా బాగా పోషించాడు. ఆ జంటలో ఫాసిల్ నటన బాగుంది, పెద్ద పెద్ద కళ్ళతో వొక్క ఫ్రేములో కూడా వట్టి వైఖరి (blank expression) వుండదు. అహం దెబ్బతిన్న ఆ మనిషి ఆ రోజంతా జరిగిన విచిత్ర పరిణామాలతో మొదటిసారి భార్యతో దగ్గరవడం బాగుంది. అయితే వేంబు పాత్రనే కొంచెం నమ్మబుధ్ధి కాదు. తన కాలేజి నాటి స్నేహితుడు ఆమెను మరచిపోలేక పోవడం, చాక్లెట్ ఇచ్చి నచ్చచెప్పే బాలుడు కాదు కాబట్టి అతన్ని సంతోషపరుస్తాను అని పిలిపిస్తుంది. చేసిన దానికి అపరాధ భావన వుండదు. ఎలాగూ భార్యాభర్తల మధ్య దగ్గరితనం లేకపోగా మానసిక దూరమే ఎక్కువ. అతను విడాకులిస్తానంటే వొప్పుకుంటుంది. పెళ్ళికి ముందు ముగ్గురు ప్రేమికులు వున్న ఆమె ఈ కారణంతో కాకుండా చాపల్యమో, చపలచిత్తతోనో ఆ పని చేసినట్టు చూపిస్తే నమ్మబుధ్ధి అయ్యేది.
పి ఎస్ వినోద్, నీరవ్ షా లను చాయాగ్రాహకులుగా తీసుకుని చాలా సమర్థవంతంగా కథను చెప్పాడు దర్శకుడు. అదనంగా ఈ చిత్రంలో రంగును కూడా వొక ప్రత్యేక పాత్రలాగా ప్రవేశ పెట్టాడు. ఆ యెరుపు, నీలం, పసుపు అన్నీ కథను అవసరమైన బలాన్నిస్తూ, కొత్త రకమైన అనుభూతినిస్తాయి.
ఇన్ని మంచి విషయాలున్నప్పుడు కొన్నిటిని పట్టించుకోకుండా వుంటే సరి. ఆ ఏలియన్ పాత్ర కథలో ఇమడలేదు. సినెమా నిడివి మూడు గంటలు, అది కనీసం అరగంట వరకూ కుదించినా సరిపొయ్యేది. కొన్ని సన్నివేశాలు (పోలీసు స్టేషన్ లో, సబ్ వే లో, బడిలో వగైరా) చాలా బాగుంటే మరికొన్ని చప్పగా వున్నాయి. తన మనస్సు మాట విని నడచుకున్న శిల్ప, లీల పాత్రలు. ప్రతి పాత్రలోనూ మార్పు రావడం. అర్పుతంగా మారిన మానిక్కం తన వలెనే శిల్ప కూడా సునామి నుంచి తప్పిచుకుంది, అయితే వొక మామూలు రాతిని పట్టుకుని అని తెలిసి విచికిత్సలో పడతాడు. మరోసారి అతనిలో మార్పు వస్తుంది. తన స్వార్థం కోసం కుటుంబాన్ని వీడినా చివరికి తను చేసిన పొరపాట్లకు పశ్చాత్తాప పడి కుటుంబానికి చేరువవుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలున్నాయి.
ప్రత్యేకంగా విజయ్ సేతుపతి కోసమన్నా మరోసారి చూడతగ్గ చిత్రం.