[dropcap]శా[/dropcap]పమా స్నేహమా
కోపమా వరమా
అటు ఇటు కాని స్థితి
ఏది తోచని పయనం
ఎందుకు ఎందుకిలా
ఏమిటి కారణం కనపడదేమి
మనసు వెతుకులాటకిది ఆరంభమా ముగింపా
కానరాని కలలను కంటున్న కనులను
మూయలేని మాయాజాలమాగదేమి
మౌనం మింగిన మాటలు
లీలగ మది వినపడినవదేమి
ముకుళిత హస్తములని మరచి
ఆహ్వానమందెనని యద భ్రమించినదేమి
ఎందుకు ఎందుకిలా
కారణం కనపడదేమి
ఆత్రం ఆగదదేమి
శాపమును స్నేహముగనెంచి
ఆపై వరముగ వరించి
మూర్ఖముగ మర్కటముగ
చిందులు వేయగ ముగింపు పలకదదేమి
మనసా……ఓ మనసా
నిగ్రహించిన నీ ధ్యాస
నిలుపునేమో నీ శ్వాస
వగలు వదిలిన వగచగలేవు
మోహమొదలిన మోసపోవగలేవు
కదలి కదలి కన్నీరవగ కన్ను కాయవే
వలదిది వదలి పోదాము రావే
మాయయిది మర్మమెరుగగ మెలగవే
వెదుకుట మాని వెనుదిరుగదమనవే
అజ్ఞానమనలేను ఆగ్రహించగలేను
రణమోపగలేను రక్షించలేను
నీ చేతులలో నీ చేతలలో చక్కుకుని
నీవు నీవన్నది నీవే
మదిరోయక మేలుకొమ్మా
వేనవేయి కాంతులందుకొమ్మా